తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టిఎస్‌ఐపాస్ ద్వారా తాజాగా మరో 14 పరిశ్రమలకు అనుమతి లభించింది.
టిఎస్‌ఐపాస్ ఐదో విడతలో 1118 కోట్ల పెట్టుబడితో ఐదు జిల్లాల్లో ఏడువేలపైచిలుకు మందికి ఉపాధిని కల్పించే 14 పరిశ్రమలను నెలకొల్పే అవకాశం కలిగింది. ఈ పరిశ్రమల యజమానులకు డిసెంబర్ 22న సచివాలయంలో పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు మంజూరీ పత్రాలను అందజేశారు.
ఇప్పటివరకు ఐదు విడతలుగా టిఎస్‌ఐపాస్ ద్వారా చిన్న తరహా కంపనీలతో కలిపి మొత్తం 1013 కొత్త పరిశ్రమలకు అనుమతులివ్వడం జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. వీటిద్వారా 25,970 కోట్ల 28 లక్షల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఈ పరిశ్రమల ద్వారా 76,314 మందికి ఉపాధిలభిస్తుందని వివరించారు. ఇంతవరకు అనుమతులు పొందిన పరిశ్రమలన్నీ కూడా స్థానిక అభ్యర్థులకే దాదాపు 80 శాతం వరకు ఉద్యోగావకాశాలు అందజేయనున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఒకవేళ పరిశ్రమలకు అవసరమైన నిపుణులు అందుబాటులో లేకపోతే ఇతర రాష్ట్రాల అభ్యర్థులను వారు నియమించు కోవచ్చని తెలిపారు. అయితే పరిశ్రమల అవసరాలు ముందే తెలియజేస్తే, అందుక నుగుణంగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి పరిశ్రమల ప్రారంభకాలం నాటికి వారందరినీ నిపుణులుగా తీర్చిదిద్ది సిద్ధం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన మానవవనరులు, ఇతర అంశాలపై అతి త్వరలో ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలియజేశారు.
పరిశ్రమలు నెలకొల్పుతామని భూములు పొంది వాటిని ఏర్పాటు చేయని వారికి ఈ పాటికే నోటీసులు అందజేశామని, కొన్ని కేటాయింపులను కూడా రద్దు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ, 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో బోయింగ్ పరిశ్రమ వచ్చిందని, ఐటీసీ, మైక్రోమాక్స్, ఎంఆర్‌ఎఫ్ సిట్రోలాంటి ఎన్నో సంస్థలు వచ్చాయని తెలియజేశారు. ఇప్పటివరకు అనుమతులు పొందిన కంపనీలెన్ని, అవి పెట్టిన పెట్టుబడుల మొత్తం ఎంత వగైరా వివరాలన్నింటినీ టిఎస్‌ఐపాస్ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించారు.