తెలంగాణ రాష్ట్రంలోని టీహబ్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర సమాచార, సాంకేతిక పరిజ్ఞానశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు. నవంబరు 5న హైదరాబాద్ వచ్చిన మంత్రి, రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమలు, గనులశాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి టీహబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి కేటీఆర్ టీహబ్‌లోని సౌకర్యాలను గూరించి వివరించారు.
కేంద్ర మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ మన దేశంలో పరిశ్రమల స్థాపనకు ఎలాంటి వాతావరణం కావాలని భావిస్తున్నామో అలాంటి వాతావరణమే టీ హబ్‌లో ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. టీహబ్ వల్ల దేశానికి ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రూపొందిస్తున్న స్టార్టప్‌లను చూసిన ఆయన వివిధ అంశాలపై వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. టీహబ్ ఏర్పాటు చేసి నవంబరు 12 నాటికి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఔత్సాహికుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. తాను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నూతన ఆవిష్కరణల గురించి ప్రస్తావన వచ్చినపుడు టీహబ్ గురించి తప్పకుండా వివరిస్తానని అన్నారు.
భారతదేశ సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలకు విస్తరించేలాగా ఆవిష్కరణలు చేపట్టాలని కోరారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ మొదటిస్థానంలో ఉందని కేంద్రమంత్రి వివరించారు. కేవలం పారిశ్రామిక వేత్తలే కాకుండా సామాన్యులకు కూడా ఉపయోగపడే విధంగా స్టార్టప్‌లు రావాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. అలాంటి ఆవిష్కరణలకు కేంద్రం అండగా ఉంటుం దని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్య రంగాలలో నూతన ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని ఆయన అన్నారు. పేద వర్గాలకు ఉపయోగపడే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పన జరగాలని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభు త్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం విజ్ఞాన్‌భవన్‌లో వేదిక ఏర్పాటు చేసిందని తెలి పారు. స్టార్టప్ ఇండియా కోసం రూ. 10వేల కోట్లతో నిధులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్టార్టప్ కాపిటల్‌గా హైదరాబాద్ : కేటీఆర్
దేశ స్టార్టప్ కాపిటల్‌గా హైదరాబాద్ మారుతుందని రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమలు, గనులశాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గత సంవత్సరం నవంబరు 5న ఈ టీహబ్‌ను ప్రారంభించామని ఒక సంవత్సరంలో ఇంత తక్కువ కాలంలో ఇది ఎంతో ప్రగతి సాధించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రస్థుతం 200 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో ఉన్న టీహబ్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే టీహబ్-2కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇది ఇప్పుడు ఉన్న టీహబ్‌కు నాలుగు రెట్లు పెద్దగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చి దిద్దుదామని పిలుపునిచ్చారన్నారు. అందుకు అనుగుణంగా మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అదే స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వం టీహబ్‌ను ప్రారంభించిందని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ అడిషనల్ సెక్రటరీ అజయ్‌కుమార్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేష్‌రంజన్, టీహబ్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ కొల్లిపర, టీహబ్ సీఈఓ జే.కృష్ణన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
– కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్