తెలంగాణలో పరిశ్రమలకు అతి తక్కువ సమయంలో అనుమతులిస్తున్నామని, ఇక్కడి మౌలిక రంగంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయని పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మలేషియా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ముస్తఫా మహ్మద్ నేతృత్వంలో 35 మంది సభ్యులతో కూడిన వ్యాపార, పారిశ్రామిక బృందం మే 4 హైదరాబాద్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా కేటిఆర్‌తో వారు భేటీ అయ్యారు.
తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఐటి, లైఫ్ సైన్స్, ఏరోస్పేస్ రంగాల్లో పరిశ్రమలకు, పెట్టుబడులకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని కేటిఆర్ వివరించారు. పరిశ్రమలకు 1.50 లక్షల ఎకరాల భూమి సిద్దంగా ఉందని, టెక్స్‌టైల్స్, మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలున్నాయన్నారు. మలేషియాలో ఎనిమిది శాతం మంది భారతీయ సంతతికి చెందిన వారున్నారని కేటిఆర్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మౌలికరంగ ప్రాజెక్టుల గురించి వివరించిన కెటిఆర్ ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని మలేషియా కంపెనీలను కోరారు. హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు అంతర్జాతీయ కంపెనీలు, పలు మలేషియన్ కంపెనీలు సైతం హైదరాబాద్ రోడ్ల నిర్మాణంలోని భాగస్వామ్యంగా ఉన్నాయని వివరించారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడుల అంశాన్ని పరిశీలిస్తామని మలేషియన్ మంత్రి ముస్తఫా అహ్మద్ తెలిపారు. తెలంగాణతో ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలు, టీ హబ్‌తో భాగస్వామ్యంపై మలేషియన్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. మరింత విస్తృతంగా చర్చించేందుకు తమ దేశానికి రావల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్‌ను ముస్తఫా ఆహ్వానించారు.
ఈ సమావేశంలో పరిశ్రమ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ మాణిక్ రాజ్, టీఎస్‌ఐఐసి ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, మలేషియా ప్రతినిధులు అహ్మద్ స్యాయల్ హఫ్రీజ్ అబ్దుల్లా, సఫినాజ్ అల్లియాస్ తదితరులు పాల్గన్నారు.