మొన్నటి దాక గుడిసె..! ఇవాళ డబుల్ బెడ్ రూమ్..! నాలుగు దశాబ్ధాలుగా ఎండ, వానలకు బిక్కు బిక్కుమని గడిపిన బతుకులు వారివి. స్వరాష్ట్రం వచ్చాక ఇవాళ ఆత్మగౌరవంతో సగర్వంగా తలెత్తుకున్నరు. నిన్నటి దాక దశ దిశ లేని తమ జీవితాలకు.. తెలంగాణ సర్కారు దేవుడిలా వచ్చి గుడిసె బదులు గూడునిచ్చిందని పిట్టలవాడ వాసుల నుంచి సంబురం వ్యక్తమవుతున్నది. ”మా కలల కూడ ఊహించని.. ఇండ్లిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సార్లు పది కాలాల పాటు సల్లంగా ఉండాలి” అని పిట్టలవాడ వాసులు దీవెనలిస్తున్నరు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల తర్వాత సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లి గ్రామ మధిర పిట్టల వాడలో 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి. శ్రావణ శుక్రవారం సరిగ్గా ఉదయం 10 గంటలకు ఏక కాలంలో 20 ఇళ్ళల్లో ఇంటికో వేద పండితుడి మంత్రోచ్ఛారణల మధ్య వాయిద్యాల నడుమ అట్టహాసంగా డబుల్ ఇండ్ల ప్రవేశాలు జరిపారు. ఈ కార్యక్రమానికి గృహ నిర్మాణ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి హరీశ్ రావులు హాజరయ్యారు. వీరికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తూర్పు వైపు నిర్మించిన 20వ డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మొదటగా మంత్రులు ప్రారంభించారు. ఆ ఇంటి లబ్ధిదారుకి కొత్త బట్టలను బహుకరించారు. అనంతరం ఇంటింటికీ తాగునీటి సరఫరాను ప్రారంభించి వరుస క్రమంలో ఉన్న ప్రతి గృహాలను ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రులిద్దరూ కలిసి పిట్టలోల్ల పాత గుడిసెలు పరిశీలించారు.
దేవుండ్లోలే సొంత గూడు ఇచ్చిన్రు..
”మాకు 5 మంది పిల్లలు. ఇద్దరు బిడ్డలు కవిత, లలితలు నాతోటే కూలీ, కైకిలి చేస్తరు. పెద్ద కొడుకులిద్దరూ శ్రీను, రమేష్‌లు షికారు పని, కూలీ పని చేస్తరు. చిన్న కొడుకు రవి 7వ తరగతి సదువుతుండు. దినం దినాం షికారు పని చేసుకుంట బతికేటోళ్ళం. గిట్ల ఈ గుడిసెల బతికే మమ్మల్ని.. దేవుండ్లోలే ఎతికి కొత్త బంగ్ల కట్టి ఇచ్చిన గవర్నమెంటోళ్ళు కేసీఆర్, హరీశ్ రావులకు ఎప్పటికీ రుణ పడి ఉంటం. గిట్ల కొత్త ఇంట్ల ఉండి మా పని మేం చేసుకుంట ఉండేలా చేసినందుకు దేవుడు వాళ్ళను సల్లగ సూడాలి”.
– గుజరాతీ చంద్రవ్వ
పిట్టలవాడకు సకల వసతులు..
పిట్టల వాడ డబుల్ బెడ్ రూం కాలనీలో ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతను నిర్మించారు. ఇండ్లలో ఎల్‌ఈడీ బల్బులను, మూడు ఫ్యాన్లను బిగించారు. కరెంటు మీటర్లను సైతం ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లకు ఇరువైపులా హరిత హారంలో భాగంగా మొక్కలను నాటారు. ప్రతి ఇంటి ముందు బాదం చెట్టు, పూల మొక్కలు నాటారు. కాలనీలో మిషన్ భగీరథ కింద 60 వేల లీటర్ల సామర్థ్యంతో నీటిని నింపేందు కోసం ట్యాంకు నిర్మించి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
మందపల్లి మధిర పిట్టల వాడలో 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గతంలో ప్రభుత్వ పథకాలేమీ వీరికి అందేవి కావు. అడవిలో షికారుకు వెళ్లి బుర్కలు, పిట్టలు పట్టుకొచ్చి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. వీరిలో కొంత మంది షికారు పనులు తగ్గించి కైకిలి-కూలీ పనులకు వెళ్తున్నారు. మరికొంత మంది ఆటో నడుపుతూ తమ బతుకులు వెళ్ళ దీస్తున్నారు. ఇలా రాను రాను పిట్టలోళ్ళ జీవితాల్లో మార్పులొచ్చాయి. వారి పిల్లలను మంచిగా చదివించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో గతేడాది దసరా పండుగ రోజున మంత్రి హరీశ్ రావు పిట్టల వాడ బతుకులు చూసి చలించిపోయి వారికి డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇస్తానని భరోసా ఇస్తూ.. అదే రోజు శంకుస్థాపన చేశారు. వచ్చే దసరా పండుగకు కొత్త ఇళ్ళలో ప్రవేశాలు చేస్తారని పిట్టలోళ్ళకు మంత్రి మాట ఇచ్చారు. అనుకున్న గడువులోపే దసరా పండుగ రాక ముందే పిట్టలవాడలో ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయించి అన్న మాటను నిలబెట్టుకున్నారు.
ఆ సార్లు నూరేళ్ళు సల్లగుండాలే..!
”ఇంతకు ముందు ముప్పై ఏండ్ల సంది చీకట్ల ఉండేటోళ్ళం. వానొస్తే మస్తుగ తిప్పలు పడేటోళ్ళం. కొడుకు సాయి, బిడ్డ స్రవంతి, మా అత్త, మామలు లచ్చవ్వ, పెంటయ్యలతో ఇన్నేండ్లు గుడిసెలోనే సావాసం చేసినం. రాత్రిపూట పాములు, తేళ్ళు, జెర్లు వస్తుండే. భయం భయంతో బతికేది. ఇయ్యాల మస్తు సంతోషం. ఇళ్ళు లేక గుడిసెలో ఉన్న మాకు సీఎం కేసీఆర్, హరీశ్‌రావు సార్లు ఇళ్ళు కట్టించి ఇచ్చిన్రు. ఆ సార్లు నిండు నూరేళ్ళు సల్లగుండాలే.. ఆ దేవుడు వాళ్ళను సల్లగ సుడాలే.
-కవిత, కృష్ణ
ఇయ్యాల బిల్డింగులకు వచ్చినం
– గుజరాతీ కనకవ్వ, గోపాల్
”మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద బిడ్డ ప్రమీల, ఇంటి కాడనే ఉంటూ మాతో కైకిలి పని చేస్తది. రెండవ బిడ్డ సంతోషి 6వ తరగతి, కొడుకు రాజు 5వ తరగతి గవర్నమెంట్ స్కూళ్ళ సదువుతుండ్రు. గుడిసెల ఉన్నన్నాళ్లు.. రాత్రైనా పగలైనా.. ఎప్పుడూ పురుగు, బూచీలతో భయమయ్యేది. పాములు, తేళ్ళు వచ్చేవి. పిల్లలతో మేము సుత మస్తుగ భయపడేటోళ్ళం. 30 ఏండ్ల సంది ఈ గుడిసెల ఉన్న మాకు.. ఇయ్యాల హరీశ్‌రావు సార్ పుణ్యమా అని బిల్డింగులకు వచ్చినం. ఇప్పుడు మంచిగ పని చేసుకుంటా బతుకుతం”.
మామిడాల రాము