double-bed-roomడబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకే అందించేందుకు సిమెంట్‌ కంపెనీలు ముందుకు వచ్చాయి. బస్తా సిమెంట్‌ ను రూ.230 కే అమ్మేందుకు సిమెంట్‌ కంపెనీలు అంగీకరించాయి. ఈ మేరకు హిమాయత్‌ నగర్‌ లోని తెలంగాణ హౌజింగ్‌ కార్పోరేషన్‌ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలో తెలంగాణ హౌజింగ్‌ కార్పొరేషన్‌ -సిమెంట్‌ కంపనీలకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌ కుమార్‌, సీఈ ఈశ్వరయ్య, 32 సిమెంట్‌ కంపనీలు ప్రతినిధులు పాల్గ్గొన్నారు. ఈ సందర??ంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణంలో సామాజిక బాధ్యతగా తమ సహకారాన్ని అందించేందుకు సిమెంట్‌ కంపనీలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. డిమాండ్‌ను బట్టి ఆయా జిల్లా కలెక్టర్లు అడిగిన 48 గంటల్లో ఇండ్ల నిర్మాణానికి సిమెంట్‌ను సరఫరా చేసేందుకు సిమెంట్‌ కంపెనీలు ప్రతినిధులు అంగీకరించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. డబుల్‌ బెడ్‌ ఇండ్ల నిర్మాణానికి సుమారు 27.31 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ అవసరం ఉన్నట్లు అంచనా వేశామని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి చెప్పారు. సిమెంట్‌ కంపనీలకు కూడా వారం రోజుల్లోనే సిమెంట్‌ బిల్లు చెల్లింపులు చేస్తామన్నారు. సిమెంట్‌ సరఫరా, చెల్లింపులో ఏమైనా సమస్యలు ఉన్నా పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తామని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. సిమెంట్‌ కంపెనీలతో ఒప్పందం కుదరడంతో డబుల్‌ బెడ్‌ ఇండ్ల నిర్మాణం వేగవంతం అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా చొరవ తీసుకోవాలని మంత్రి కోరారు. డబుల్‌ బెడ్‌ ఇండ్ల నిర్మాణానికి నిధుల సమస్య లేదని, రుణం ఇచ్చేందుకు హడ్కో ఇప్పటికే ముందుకు వచ్చిందని వెల్లడించారు. మరోవైపు సబ్సిడి ధరకు ఇచ్చే సిమెంట్‌ పక్క దారి పట్టకుండా సిమెంట్‌ బస్తాలపై ప్రత్యేకమైన చిహ్నంను ముద్రిస్తామని సిమెంట్‌ కంపనీలు ప్రతినిధులు తెలిపారు. గతంలో మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి – సిమెంట్‌ కంపెనీలతో సమావేశమై చర్చించారు. అప్పుడు కుదిరిన సూత్రప్రాయ అంగీకారం మేరకు ఇవాళ సిమెంట్‌ కంపెనీలు ప్రతినిదులతో అవగాహన ఒప్పందం కుదిరింది.

Other Updates