తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసించిన 84 మంది నిరుపేద విద్యార్థులు డాక్టర్లు కాబోతున్నారు. ఇటీవల ప్రకటించిన నీట్‌ -2017 ఫలితాల్లో వీరు మంచి ర్యాంకులు సాధించి ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సులు చదవనున్నారు. 55 మంది ఎస్సీ విద్యార్థులు, 9 మంది ఎస్టీ విద్యార్థులు ఎంబిబిఎస్‌ లో సీట్లు దక్కించుకోనున్నారు. 15 మంది ఎస్సీ, 5గురు ఎస్టీ విద్యార్థులు బిడిఎస్‌ లో సీట్లు సంపాదించనున్నారు. గురుకుల విద్యాలయాల చరిత్రలో ఒకే ఏడు ఇంత మంది డాక్టర్లయిన సందర్భం చరిత్రలో లేదు. కెజి టు పిజి విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ స్థాపిస్తున్నారు. మంచి ప్రతిభ కనబరిచి, డాక్టర్లు కావాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం 2015 జూన్‌ నుంచి ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ ప్రోగ్రామ్‌ మొదలు పెట్టారు. దీని ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రత్యేక శిక్షణ ప్రారంభమయిన నాటి నుంచి ఇప్పటి దాకా 140 మంది విద్యార్థులు డాక్టర్‌ కోర్సుకు ఎంపికయ్యారు. ఈ శిక్షణ ఫలితంగానే ఇంత మంది విద్యార్థులు నీట్‌ ర్యాంకులు సాధించగలిగారు. కేవలం నీట్‌ ర్యాంకులే కాకుండా, దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో కూడా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ కు చెందిన 12 మంది విద్యార్థులు ఈ ఏడాది ఢిల్లీ యూనివర్సిటీలో, 6 గురు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ప్రవేశం పొందారు. మొదటి సారిగా ఇంతమంది విద్యార్థులు తెలంగాణ గురుకులాల్లో చదివి ఉన్నత విద్య అభ్యసించడం ఆనందంగా ఉందని టి.ఎస్‌.డబ్ల్యు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు.

ముఖ్యమంత్రి అభినందన

తెలంగాణ గురుకులాల్లో చదివిన విద్యార్థులు పెద్ద ఎత్తున డాక్టర్లు కాబోతుండడం, ఉన్నత విద్యను అభ్యసించడం తనకెంతో గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎంతో వ్యయం చేసి, వందలాది రెసిడెన్షియల్స్‌ స్థాపిస్తున్నామని, పేద విద్యార్దులు కార్పొరేట్‌ స్థాయి విద్యనభ్యసించి సమాజంలో ఎదగాలన్నదే తమ కోరిక అని చెప్పారు. ఈ యేడు విద్యార్థులు సాధించిన విజయాలు మరిన్ని గురుకులాలు స్థాపించేందుకు ప్రేరణ ఇస్తున్నాయని సీఎం అన్నారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు కృషి చేసిన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ను సీఎం అభినందించారు.

Other Updates