అచ్చమైన తెలంగాణ బిడ్డగా, తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ, తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడి చరిత్రను వెలుగులోకి తెస్తూ, నిరంతరం తెలంగాణ గురించి, ఇక్కడ ప్రాంతాల విశిష్టతను చెప్తూ నడయాడే తెలంగాణ చరిత్రగా గుర్తింపు పొందినవారు బి.ఎన్.శాస్త్రిగారు. తెలంగాణ జిల్లాల్లో మారుమూల గ్రామాల పేర్లు కూడా చెప్తూ బహుశా ఏ చరిత్ర పరిశోధకుడు కాని, రాజకీయ నాయకుడు కాని తిరగనన్ని గ్రామాలు (సుమారు 7 వేలు) తిరిగి శాసనాలు సేకరించి, పరిశోధనలు నిర్వహించినారు. సొంతంగా 400 శాసనాలు సేకరించి ప్రచురించారు. ఇవన్నీ వీరు విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిలో ఉండి నిర్వహించలేదు. ఒక సామాన్య మానవుడిగా ఉంటూ పది విశ్వవిద్యాలయాల పనిని ఒక్కరే పూర్తి చేసారు.
ఒక శాసనం వెలికి తీయాలంటే ఎంత శ్రమ ఉంటుందో పరిశోధకులకు తెలుసు. సరిగ్గా మౌలిక వసతులు లేని కాలంలో ఎంతో శ్రమకోర్చి శాసనాలను వెలికి తీసి, వాటిని ఫోటోలుగా ప్రచురించి, భూతద్దం ద్వారా చదివి, అందులోని విషయాన్ని ఆకళింపు చేసుకొని చరిత్రలో ఆశాసనాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని, అవి ఏ రాజుకు సంబంధించిన శాసనాలో వివరణ ఇస్తూ, చరిత్రకు వాటిని అనుసంధానం చేస్తూ చరిత్రకే ఒక కొత్త శోభను చేకూర్చారు. ఇది మామూలు విషయం కాదు. ఇటువంటి అనితర సాధ్యమైన కార్యాన్ని ఒంటిచేతి మీదుగా చేసినారు.
పది సంవత్సరాలు టీచర్ ఉద్యోగం చేసిన తరువాత ఉన్నత విద్య పట్ల ఆసక్తితో ఉస్మానియాలో ఎం.ఎ.తెలుగు పూర్తి చేసి పరిశోధన వైపు దృష్టి మరల్చారు. వారి పరిశోధనాంశం ‘‘శాసనాల ద్వారా తెలుగు భాషా వికాసం’’ “Development of Telugu Language through inscriptions” ఈ అంశంపై అప్పటివరకు పరిశోధన జరగలేదు. పరిశోధనాంశానికి సంబంధించి కొన్నివేల శాసనాలను పరిశీలించారు. అందులో భాగంగానే వారు ఒక కొత్త అంశాన్ని కనుగొన్నారు.
తెలుగు సాహిత్య చరిత్రలో అప్పటివరకు నన్నయ ఆదికవిగా అందరూ ముక్త కంఠంతో అంగీకరించినవారే. ఒక్క మానపల్లి రామకృష్ణ కవిగారు తప్ప. శాస్త్రిగారు తన పరిశోధనలో భాగంగా నన్నయ్యకు పూర్వం నుండి ఉన్న శాసనాలను పరిశీలించారు. అప్పుడే వారికి కొన్ని శాసనాలు లభించాయి. వాటి ఆధారంగానే తెలుగు సాహిత్యంలో నన్నయ్య ఆదికవి కాడు నన్నెచోడుడు అని సిద్ధాంతీకరించారు. ఇదే విషయమై 1972 ఫిబ్రవరి ‘‘భారతి’’ మాసపత్రికలో ‘ఆదికవి కాడు నన్నెచోడుడు’ అనే శీర్షిక 10 పేజీల వ్యాసాన్ని రచించారు. ఇందులో అనేక శాసనాలను ఉటంకిస్తూ నన్నెచోడుడే ఆదికవి అని నిర్ధారించారు.
చివరగా ఈ వ్యాసంలో ‘‘ఇట్లు ఆంధ్రభాషలో తొలి కావ్యమును రచించిన ఆదికవి నన్నెచోడుడు. శివకవియైనందున మరుగున పడి, పదియవ శతాబ్దిలో ఆంధ్రము నందాది కావ్యము రచింప, ఇరువదియవ శతాబ్దిలో నా గ్రంథము వెలుగులోనికి రాగా ఆంధ్ర పండిత ప్రకాండులు, చారిత్రకులు, నన్నెచోడుని పండ్రెండవ శతాబ్దివాడుగా నిర్ణయించుట చూడగా కొన్ని కొన్ని దురభిమానములెంత శక్తిమంతమైనవో ఊహింపవచ్చును’’ అని పూర్తి చేసారు.
శాస్త్రిగారు ఎవరు ఎటువంటి అభియోగాలు చేసినా నా పని నేను పూర్తి చేస్తాను. నేను చెప్పదల్చుకున్నది చెప్తాను అని స్థిరనిర్ణయంతో ఇంతటి సాహసోపేతమైన వాక్యాలను పల్కినారు. ఈ కారణంగా వారికి అందవలసిన పి.హెచ్.డి. పట్టా కూడా రాలేదు. ఈ విషయాన్ని మార్చి రాయవలసిందిగా విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు కోరగా శాస్ట్రిగారు అందుకు అంగీకరించలేదు. చరిత్రను వక్రీకరించి చెప్తే వచ్చే డిగ్రీ నాకు అక్కర్లేదని వారు సిద్ధాంత వ్యాసాన్ని తిరిగి సమర్పించ లేదు. ఆ కారణంగానే వారు ‘డాక్టరు కాని పరిశోధన శాస్త్రి’గా జనుల హృదయాల్లో పరిశోధకుల్లో నిలిచిపోయారు. కాని వారి వద్దకు పరిశోధక విద్యార్థులు వచ్చి సలహాలు తీసుకునేవారు.
ఆర్ధికంగా వెనుకబడిన తెలంగాణ ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుండి ప్రతి దశలోనూ కష్టాలను అనుభవించి, తాను అనుకున్న రంగంలో విజయం సాధించి చరిత్ర, శాసన పరిశోధనలో అందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచారు. సరళ స్వభావం, విశాల హృదయం, దానగుణం, పరిశోధనా పటిమ, నలుగురికి మంచి చేయాలనే తపన, దైవభక్తి, కష్టించి పనిచేయడం…. ఇవన్నీ శాస్త్రిగారికి దేవుడు ఇచ్చిన ప్రత్యేక లక్షణాలు. పరిశోధనలో అడుగుపెట్టిన తర్వాత సాహిత్యం నుండి దారి మళ్ళి చరిత్ర, శాసన పరిశోధన వైపు అడుగులు పడ్డాయి. ఈ క్రమంలోనే వారికి దైవానుగ్రహం వల్ల రెండు కొత్త తామ్ర శాసనాలు లభించాయి. ఆ శాసనాలే శాస్త్రిగారి పరిశోధనా జీవితాన్ని, చరిత్ర గతిని మలుపు తిప్పాయి. శాస్త్రి గారికి మిత్రుడైన రమా మనోహరరావుగారు తనవద్ద రెండు తామ్ర శాసనాలున్నాయని, వాటిని చదివి పరిష్కరించి, ప్రకటించవలసిందని శాస్త్రిగారికి ఇచ్చారు. శాస్త్రిగారు వాటిని పరిశీలించి, అవి విష్ణుకుండినుల కాలానికి చెందినవిగా గుర్తించారు. ఆ శాసనాలను 1965 జూన్, జూలై నెలల్లో ప్రకటింపచేశారు. మొదటి శాసనం విష్ణుకుండిన గోవింద వర్మది కాగా రెండవది విష్ణుకుండిన విక్రమేంద్ర భట్టారక వర్మది. ఈ రెండు శాసనాలు యాదృచ్ఛికంగా శాస్త్రిగారి మాతామహుల ఊరైన ఇంద్రపాల నగరానికి చెందినవి. అవి ఇంద్రపాల నగర తామ్ర శాసనాలుగానే చరిత్రలో పిలువబడుతున్నాయి.
ఈ శాసనాలను శాస్త్రిగారు భారతి పత్రికలో ప్రకటించగానే చారిత్రక లోకంలో విద్వాంసులు, శాసన పరిశోధకులు ఆశ్చర్యానికి గురైనారు. విష్ణుకుండినులు మొదట తెలంగాణ ప్రాంతం నుండి పాలించారని, వారు మొదట బౌద్ధమతానుయాయులని తర్వాత వైష్ణవాన్ని స్వీకరించారని శాస్త్రిగారు తీర్మానించారు. ఈ విషయం ఆనాటి చారిత్రకులకు మింగుడు పడలేదు. తెలంగాణ ప్రాంతంలో ఇంత గొప్ప రాజ్యం ఉందా? ఉన్నా తెలంగాణాలో శాసన పరిశోధకులకు అది సాధ్యం కాదు. ఇది శాస్త్రిగారు కల్పించి చెప్తున్నది. శాసనాలు కూడా వారి అమ్మమ్మ వారి ఊరికి దగ్గరలోనివే. శాస్త్రిగారే స్వయంగా రాగి రేకులపై వ్రాయించి చెప్తున్నారనే అభాండాలు కూడా వేసినారు.
ఈ విషయమై భారతిలో కొన్ని నెలలు తర్జన భర్జనలు శాస్త్రిగారికి, ఇతర చారిత్రకులకు జరిగినాయి. ఈ సందర్భంలో భారతి పత్రిక సంపాదకులు శివలెంక శంభు ప్రసాద్, శాస్త్రిగారికి అండగా నిల్చి ఎంతో ప్రోత్సహించారు. చివరకు ఇండియన్ ఆర్కియాలజీ చీఫ్ డా॥ జి.ఎస్.ఘమ్ గారు హైదరాబాద్ వచ్చి శాస్త్రిగారి పరిశోధనను చూసి వారితో చర్చించి, శాస్త్రిగారు నిరూపించిన అంశాలు యదార్థమని నమ్మి, ఆంగ్లంలో వ్యాసాలు ప్రచురించారు. అప్పటికి ఆంధ్రప్రదేశంలోని చారిత్రకుల నోళ్ళకు, కలాలకు విశ్రాంతి లభించింది.
అప్పటి నుండి ఆయన చరిత్ర, శాసన పరిశోధనా రంగంలో వెనుదిరిగి చూడలేదు. తనకు లభించిన శాసన ఆధారాలతో చరిత్రను సత్యవంతంగా, నిజాయితీగా, ఎవరి సహాయ సహకారాలు లేకుండా శ్రమించి అనేక శాసన పరిశోధన గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు వెలువరించారు.
1. శాసనసంపుటి 1,2 భాగాలు, 2. త్రిపురాంతక దేవాలయ శాసనములు, 3. కందూరిచోడుల శాసనములు చరిత్ర సంస్కృతి 4. బెజవాడ దుర్గా మల్లేశ్వరాలయ శాసనములు, 5. ముఖలింగ దేవాలయ చరిత్ర శాసనములు, 6. చెఱకు రెడ్డి వంశ చరిత్ర ` శాసనములు, 7. గోలకొండ చరిత్ర ` సంస్కృతి`శాసనములు, 8. రేచర్ల రెడ్డి వంశ చరిత్ర ` శాసనములు 9. రేచర్ల పద్మనాయకులు, 10. కాయస్థరాజులు, 11. వేములవాడ చరిత్ర ` శాసనములు, 12. మల్యాల వంశ చరిత్ర శాసనములు. ఈ విధంగా 12 శాసన సంపుటాలు ఒంటిచేత్తో వెలువరించిన శాస్త్రిగారు ఇంకా రెండు మూడు శాసన సంపుటాలను వెలువరించాలనే ప్రణాళికలో ఉండేవారు. అవి విరియాల వంశ శాసనాలు, నతవాడి వంశ శాసనాలు.
అదేవిధంగా నృసింహ క్షేత్రాల్లో ఉన్న శాసనాలన్నిటినీ ఏకం చేసి ఒక ప్రత్యేక గ్రంథంగా ప్రచురించాలనుకున్నారు. దీనికి సంబంధించి శాసనాలను సేకరించి శాసన పాఠాలను తయారు చేసుకున్నారు. కాని వారి ఆరోగ్యం క్షీణించడంతో ఈ మూడు గ్రంథరూపం దాల్చలేదు.
శాస్త్రిగారు తమ పరిశోధనలో ఎక్కువగా తెలంగాణా ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కారణం ఇక్కడి చరిత్ర, సంస్కృతి ఎంతో విలక్షణమైనవి. శాసనాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. కాని వాటిని పరిశీలించి పరిష్కరించింది తక్కువ. తెలంగాణా ప్రాంతంలో శాసన పరిశోధకులు లేరు అన్న అపప్రథను తొలగించడానికే శాస్త్రిగారు అధిక సంఖ్యలో శాసనాల సేకరణ చేసి పుస్తకరూపంలో ప్రచురించారు. వారు ప్రకటించిన శాసన సంపుటాలలో తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తూ స్వతంత్రులైన రాజన్యుల శాసనాలే అధికంగా వున్నాయి. తెలంగాణలోని చిన్న చిన్న సామంతరాజులు స్వతంత్రులై రాజ్యాలను స్థాపించినవారికి చిన్న రాజ్యాల రాజులను గూర్చి కూడా ప్రత్యేకంగా శాస్త్రిగారు పేర్కొన్నారు.
వేములవాడ చరిత్ర, కాయస్థరాజులు, గోలకొండ చరిత్ర, రేచర్ల పద్మనాయకులు, రేచర్ల రెడ్డి, చెఱకు రెడ్డి, మల్యాల, కందూరు చోళుల వంశాలను గూర్చి శాసనాలను మొట్టమొదటి సారిగా పరిశోధించి తెలంగాణ చరిత్ర గొప్పదనాన్ని, అస్తిత్వాన్ని దేశానికి తెలియజేసిన తెలంగాణ తొలి పరిశోధకుడు బి.ఎన్.శాస్త్రిగారు. ప్రాంతీయ భేదం లేకుండా త్రిపురాంతకం, ముఖలింగం, బెజవాడ దుర్గామల్లేశ్వరాలయ శాసన సంపుటాలను కూడా వారు ప్రచురించారు.
మూడు జిల్లాల సర్వస్వాల ప్రచురణ.. అదే విధంగా ప్రభుత్వం వారు ప్రచురించిన జిల్లా గెజిటీర్ల లాగా తెలంగాణకు సంబంధించి మూడు జిల్లా సర్వస్వాలను ప్రచురించారు. కృష్ణా, గుంటూరు తదితర ఆంధ్రప్రాంత జిల్లాలకు సర్వస్వాలు అంతకు పూర్వమే వెలువడ్డాయి. తెలంగాణ ప్రాంతంలో అటువంటి సర్వస్వాలు ఉండాలనే కాంక్షతో మొదటగా స్వంత జిల్లా అయిన నల్లగొండ మండల సర్వస్వం ప్రచురించారు. ఆ తరువాత ఆదిలాబాదు, మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వాలను ప్రచురించారు. ఇవన్నీ వారి స్వంత ఖర్చుతో ముద్రించినవే. మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వం ఒక పెద్ద ఉద్గ్రంథం. దాదాపు రెండు వేల పేజీలతో కూడిన సమగ్ర జిల్లా స్వరూపం అందులో మనకు కన్పిస్తుంది. ఇంకా వరంగల్ జిల్లా సర్వస్వాన్ని రూపకల్పన చేసుకున్నారు. కాని అది కార్యరూపం దాల్చలేదు.
తెలంగాణ అంటే ఎంతో అభిమానం, ఇక్కడి ప్రజలకు, చరిత్రకు అన్యాయం జరుగుతుందని వేల సంవత్సరాల రాజకీయ, సాంఘిక చరిత్ర ఉన్న తెలంగాణా ప్రాంతానికి చరిత్రకారులు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. మొదట్నుండీ చరిత్రను అధ్యయనం చేస్తున్న నన్ను ఈ విషయం తీవ్రంగా కలచివేసింది. ‘‘తెలంగాణ సమగ్ర చరిత్ర నిర్మాణం కానిదే సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదనుకుని పరిశోధన వైపునకు మొగ్గాను. ఆ సంకల్పంతోనే పాళీ, ప్రాకృత భాషల్ని అధ్యయనం చేశాను’’ అని డా॥ పత్తిపాక మోహన్ నిర్వహించిన 1997 డిసెంబర్ 14 నాటి ఆంధ్రభూమి ఇంటర్వ్యులో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ కారణంగానే తెలంగాణలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలకు సంబంధించిన శాసనాలకు, చారిత్రక సమాచారాన్ని క్రోడీకిరించి శాసన సంపుటాలుగా, ఆంధ్రదేశ, భారతదేశ చరిత్రలో చేర్చినారు.
‘భారతదేశ చరిత్ర’ అనే బృహత్ప్రణాళికను నెత్తిన వేసుకుని 27 సంపుటాలుగా విభజన చేసుకుని అందులో 21 సంపుటాలు ఒక్కరే వెలుగులోకి తెచ్చారు. శాస్త్రిగారి కంటే పూర్వం భారతదేశ చరిత్రను ఉత్తర భారతీయులు లేదా భారతీయ విద్యాభవన్ వంటి సంస్థలు మాత్రమే ప్రయత్నం చేశారు. వారు ఎక్కువగా ఉత్తరదేశ చరిత్రకు ఆంగ్లేయుల చారిత్రక గ్రంథాల ఆధారంగా చరిత్ర నిర్మాణం చేశారు. కాని శాస్త్రిగారు ఆ తప్పిదం చేయలేదు. దక్షిణ భారతదేశ చరిత్ర ఎంతో గొప్పనైనదని, ఇక్కడ ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, చరిత్ర, దేవాలయాలు వాటిలో ఉండే శాసనాలు చాలా విలువైనవని, కాబట్టి భారతదేశ చరిత్రలో ఈ ప్రాంతాలకు సముచిత స్థానం లభించాలని అనుకున్నారు.
ఆ వరుసలోనే వారు ఏ చరిత్రకారుడు చేయని యుగవిభజన చేసుకున్నారు. అందులో ప్రత్యేకంగా దక్షిణాన్ని పరిపాలించిన చిన్న రాజ్యాలైన కాకతీయులు, విజయనగర రాజులు, దక్కన్ సుల్తాన్‌లు అని దక్షిణాది చరిత్రకు ప్రాధాన్యతనిచ్చారు.
పరిశోధన రంగంలో అగ్రగామి
శాసన, చరిత్ర పరిశోధనలో ఒక నూతన ఒరవడిని ప్రారంభించి, చారిత్రక ఆధారాలతో పాటు స్పష్టమైన చారిత్రకాధారాలను సంపాదించి, పరిశోధనా రంగంలో అగ్రగామిగా నిలిచారు. వీరు చేసినన్ని రచనలు, సాగించిన పరిశోధనలు తెలంగాణా ప్రాంతంలో మరే పరిశోధకుడు చేయలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. సుమారు 50 పుస్తకాలు చరిత్ర, శాసన సంబంధమైనవి వున్నాయి. అదే విధంగా పరిశోధనా రంగంలో అడుగిడక పూర్వం సాహిత్యంలో సృజనాత్మక ప్రక్రియలైన నవల, కథ నాటిక, గేయనాటికలు వంటి సృజనాత్మక సాహిత్యాన్ని కూడా సుమారు 20 పుస్తకాల వరకు సృష్టించారు. ఇవే కాక భారతి, సుజాత, ఆంధ్రపత్రిక వంటి పత్రికల్లో వివిధ సాహిత్య ప్రత్యేక సంచికల్లో వందల కొద్ది వ్యాసాలు రచించి కొత్త కోణంలో ఆలోచించి భావి పరిశోధకులకు మార్గదర్శకులుగా నిలిచారు. బి.ఎన్.శాస్త్రిగారు సాహిత్య, చారిత్రక పరిశోధనలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తుశాఖ తెలుగుశాఖల్లో వేరు వేరుగా విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారంటే పరిశోధనారంగానికి వారు చేసిన యోగదానం తెలుస్తుంది.
చరిత్ర, శాసనాలు ఎంతటి అభిమాన విషయాలో సాహిత్యం అంటే అంతే గౌరవం, భారతి వంటి పత్రిక తెలంగాణ ప్రాంతం నుండి ఉండాలని అనుకుని భారతి పత్రికను ఆదర్శంగా తీసుకుని ఇక్కడి ప్రాంతానికి అద్దంపట్టే విధంగా ‘మూసీ’ అనే సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక పత్రికను ప్రారంభించారు. భుక్తికోసం అనేక ప్రాంతాలు తిరుగుతూ అదే సమయంలో ప్రవృత్తియైన శాసన సేకరణ చేస్తూ, పత్రికను ఎంతో కష్టంగా నిర్వహించేవారు. ఎవరి సహాయ సహకారాలు ఆశించేవారు కాదు.
1980`86 వరకు పత్రికను నిరాఘాటంగా నడిపించారు. పరిశోధనవైపు దృష్టి సారించిన తర్వాత పత్రికా నిర్వహణ సాధ్యపడలేదు.
తిరిగి 1997లో పత్రిక పునఃప్రారంభించబడిరది. అప్పటి నుండి నేటి వరకు పత్రిక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూనే విశ్వవిద్యాలయాల్లో పరిశోధనాత్మక విలువలున్న పత్రికగా గుర్తింపు పొందింది. ‘మూసీ పత్రిక సాహిత్య సేవ’ అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పి.హెచ్.డి., మద్రాసు విశ్వ విద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన జరిగింది.
పరిశోధన, పత్రిక నిర్వహణ, వ్యాపారాలతో శాస్త్రిగారి ఒక పార్శ్వాన్ని మనం చూస్తాం. మరో దిక్కు వారి జీవిత ఆశయం, కల హరహర త్రిశక్తి దేవస్థానం రూప కల్పన, దీనికై వారు స్వగ్రామమైన వలిగొండలో తొమ్మిది ఆలయాలకు శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించినారు. ఎవరినీ ధన రూపంలో సహాయం అర్థించలేదు. తను రచించిన గ్రంథాలను అమ్మి వాటి ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత గృహ నిర్వహణకు ఖర్చు చేసి మిగతా సొమ్ముతో ఆలయాల నిర్మాణం, దాన ధర్మాదులకు వెచ్చించేవారు. ఆ క్రమంలోనే దాదాపు యాభై శాతం దేవాలయాల నిర్మాణం జరిగింది. అనారోగ్య పరిస్థితుల కారణంగా, వారి మరణ సమయానికి ఆ నిర్మాణం పూర్తికాలేదు.
వారి సంకల్పబలం ఎంతో గొప్పది అది నేడు ఆలయాల నిర్మాణ పూర్ణతకు ఉత్తేజాన్నిచ్చింది. వేదసంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పీఠంపై త్రిమాతలు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి, వారి ఇష్టదైవమైన శివుడు (మరకత లింగం), శ్రీదేవి, భూదేవి సహిత కల్యాణ వేంకటేశ్వరుడు, సిద్ధిబుద్ధి సహిత వినాయకుడు, వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్యస్వామి, పంచముఖ ఆంజనేయుడు, మేధా దక్షిణామూర్తి, లక్ష్మీహయగ్రీవుడు, సూర్యభగవానుడు, మహామేరువు శ్రీ చక్రం, నవగ్రహ మంటపముతో సర్వదేవతలకు, విద్యలకు నిలయంగా వలిగొండ గ్రామంలో శ్రీవిద్యాపురంలో ‘హరి హర త్రిశక్తి క్షేత్రం’లో కొలువై ఉన్నారు. ఇది వారి కలల సార్థక్యానికి, సంకల్ప బలానికి ప్రతిరూపం.
ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించి అత్యున్నత స్థాయికి చేరుకుంటే జీవితంలో అతడు పరిపూర్ణ వ్యక్తిగా కీర్తింపబడుతాడు. అదే పలురంగాల్లో ఎవరూ చేరలేని ఎత్తుకు ఎదిగితే ఒక రకంగా అతడిని ఋషిగానే పరిగణిస్తాము. అటువంటి ఋషితుల్యుడు బి.ఎన్.శాస్త్రిగారు. తాను అనుకున్న కార్యాన్ని చేసుకుపోవడమే తప్ప ఫలితాలకై ఆశించలేదు. ఏ ప్రభుత్వ సంస్థల సహాయాన్ని అర్థించలేదు, ఏ అవార్డులను, సన్మానాలను ఆశించలేదు.
అర్హతలేకుండా గౌరవ డాక్టరేట్‌లు అందుకున్న వారిని ఎంతోమందిని చూస్తున్నాము. కాని ఎన్నో డాక్టరేట్‌లకు సరిపడ విషయ విజ్ఞానాన్ని పరిశోధకులకు అందించిన వ్యక్తికి ఏ యూనివర్సిటీలు కూడా గౌరవ డాక్టరేట్ అందించలేక పోయాయి. అది ఈనాటి విశ్వవిద్యాలయాల పక్షపాత దృష్టికి నిదర్శనంగా మనం భావించవచ్చు. ప్రస్తుతం మనం స్వంత రాష్ట్రంలో, శాస్త్రిగారు అత్యధికంగా ప్రేమించే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణ నడయాడే చారిత్రక సర్వస్వంగా పిలువబడే శాస్త్రిగారికి ఇప్పటికైనా గుర్తింపు లభిస్తుందని ఆశిద్దాం. వారి పేరు మీద విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ చరిత్ర, శాసన పరిశోధనలకు ప్రభుత్వం గుర్తింపునిచ్చినట్లవుతుంది. అంతేకాకుండా ప్రాచీనమైన తెలంగాణ చరిత్ర వెలుగు చూస్తుంది.
ఆంధ్రదేశంలో మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరి వెంకట రమణయ్య, మారేమండ రామారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వంటి చారిత్రకులతో సమానంగా తెలంగాణ ప్రాంతంలో ఇక్కడి చరిత్ర, చీకటి కోణాలను గురించి వేలాది శాసనాలను సేకరించి సాక్ష్యాధారాలను తీసుకువచ్చిన చారిత్రక భగీరథుడు బి.ఎన్.శాస్త్రిగారు.
హోం
»