Digidhan-mela.jpgపెద్ద నోట్ల రద్దు దరిమిలా కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇప్పటికే శరవేగంగా ముందుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రం, డిజిటల్‌ లావాదేవీల్లో కూడా తన సత్తాను చాటింది.

నవంబర్‌ 9 నుండి నుండి జనవరి 9 నడుమ రెండు నెలల కాలంలో జరిగిన డిజిటల్‌ (ఆన్‌లైన్‌) లావాదేవీల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందిస్తున్న 128 సర్వీసులపై మొత్తం 10.02 కోట్ల లావాదేవీలు గత రెండు నెలల్లో జరిగాయి. 8.64 కోట్ల డిజిటల్‌ లావాదేవిలతో గుజరాత్‌ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ప్రతి 1000 మంది జనాభాకు జరిగే డిజిటల్‌ లావాదేవీల్లో కూడా 2,849 లావాదేవీలతో తెలంగాణ తొలిస్థానంలో నిలబడింది. ఇది జాతీయ సగటు అయిన 527 లావాదేవీలకు సుమారు అయిదు రెట్లు ఉండటం గమనార్హం! తెలంగాణ ప్రభుత్వం ఈ-గవర్నెన్స్‌లో భాగంగా పౌర సేవలను ఆన్‌లైన్‌ అందుబాటులోకి తేవడంతో ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యత గురించి, డిజిటల్‌ లావాదేవీల గురించి అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం వల్లనే రాష్ట్రానికి ఈ అరుదైన గౌరవం దక్కింది.

డిజిధన్‌ మేళాకు భారీ స్పందన
డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సాహించడానికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌, రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా హైదరాబాదులో రెండు రోజుల పాటు నిర్వహించిన డిజిధన్‌ మేళాకు భారీ స్పందన లభించింది.

జనవరి 18న పీపుల్స్‌ ప్లాజా వద్ద కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్‌, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించిన డిజిధన్‌ మేళా రెండు రోజులపాటు కొనసాగింది.

మేళాను ప్రారంభించిన అనంతరం మంత్రి ఎంజె అక్బర్‌ ప్రసంగిస్తూ టెక్నాలజీ ఇన్నాళ్లూ ధనికులకే ఎక్కువగా ఉపయోగపడిందని, కానీ ఇప్పుడు దేశంలో డిజిటల్‌ లావాదేవీల వల్ల పేదలు కూడా టెక్నాలజీ ఫలాలను పొందుతారని అన్నారు. ఇన్నాళ్లూ దేశాన్ని పట్టి పీడిస్తోన్న అవినీతి భూతాన్ని తరిమికొట్టేందుకు డిజిటల్‌ లావాదేవీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు దరిమిలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు భేష్‌ అని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ అక్షరాస్యతపై, డిజిటల్‌ చెల్లింపులపై చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలను ఆయన మెచ్చుకున్నారు.

మేళాలో అన్ని ప్రముఖ బ్యాంకులు, ఆధార్‌ నమోదు, మొబైల్‌ పేమెంట్స్‌ కంపెనీలు, పెట్రోలియం సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, విత్తన, ఎరువుల ఉత్పత్తి కంపెనీలు, స్వయంసహాయక బృందాలు తమతమ స్టాళ్లను ఏర్పాటుచేశాయి.

ప్రజలకు వివిధ డిజిటల్‌ లావాదేవీల గురించి అవగాహన కల్పించడం, నూతన బ్యాంకు అకౌంట్లు తెరవడం, ఆధార్‌ కార్డు నమోదు, ఆధార్‌ కార్డులో సవరణలు, డిజిటల్‌ చెల్లింపుల ద్వారా వివిధ కొనుగోళ్లు జరపడం ఇత్యాది సేవలు సందర్శకులకు అందించారు.

వ్యవసాయ శాఖ సహకారంతో రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి దాదాపు 2000 మంది రైతులను రప్పించి వారికి డిజిటల్‌ లావాదేవీలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం జరిగింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు ఆధార్‌ నెంబర్‌, వేలిముద్ర సాయంతో నేరుగా సబ్సిడీని పొందే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. మేళాలో నాస్కాం, తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ స్టాళ్లు పెట్టి, వాలంటీర్‌ సేవలను కూడా అందించారు.

తొలిరోజు సాయంత్రం జరిగిన డిజిధన్‌ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. మేళా అంతా కలియదిరిగిన ఆయన వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఎంతశాతం డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయో ఆరాతీశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తొలుత ప్రజలు కొంత ఇబ్బంది పడ్డా దీర్ఘకాలంలో దీనివల్ల ప్రజలకు మంచే జరుగుతుందన్న ఆశాభావం మంత్రి వ్యక్తం చేశారు.

డిజిధన్‌ మేలా రెండో రోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఈ మేళాను విజయవంతంగా నిర్వహించినందుకు నీతి ఆయోగ్‌, రాష్ట్ర ఐటీ శాఖ అధికారులను ప్రశంసించారు. ప్రజల్లో డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన పొందాలనే తపన ఎంత ఉన్నదో ఇక్కడ సందర్శకుల తాకిడి చూస్తే అర్థమవుతున్నదని ఆయన అన్నారు. ఇలాంటి మేళాలను ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిర్వహించాలని ఆయన సూచన చేశారు.

రాష్ట్ర చేనేత సహకార సంస్థ టెస్కో వారు డిజిధన్‌ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్‌ రెండు రోజుల్లో దాదాపు రెండు లక్షల రూపాయల చేనేత వస్త్రాలను డిజిటల్‌ చెల్లింపుల ద్వారా అమ్మడం గమనార్హం. టెస్కో స్టాల్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్‌ అక్కడ ఒక చేనేత అంగీని కొనుగోలు చేశారు.

తెలంగాణలో కొరియన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌
digital-telanganaతెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు అకర్షించేందుకు దక్షణ కొరియాలో పర్యటించిన మంత్రి కెటి రామారావు అక్కడ పలు కంపెనీల అధిపతులతో సమావేశమయ్యారు. సాంసంగ్‌ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంగ్‌ మోయిమ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ పీటర్‌ రీ తో సమావేశమయిన మంత్రి తెలంగాణలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ డివైజ్‌ మాన్యూపాక్చరింగ్‌ పార్కులో యూనిట్‌ ఏర్పాటు చేయాల్సిందిగా సాంసంగ్‌ ను మంత్రి ఆహ్వానించారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో కలిసి సాంసంగ్‌ ఇన్నోవేషన్‌ మ్యూజియంను సందర్శించారు.

భారత చాంబర్‌ అప్‌ కామర్స్‌ దక్షిణ కొరియా (Indian Chamber of Commerce in Korea ICCK) ఏర్పాటు చేసిన వ్యాపారవేత్తల సమావేశంలో మంత్రి ప్రసంగించారు. సియోల్లో జరిగిన ఈ సమావేశంలో సుమారు వందకు పైగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం గురించి వివరించిన మంత్రి, ఇక్కడి ప్రభుత్వ విధానాలపైన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానంలోని సింగిల్‌ విండో అనుమతులు, 15 రోజుల్లో ఖచ్చితమైన అనుమతుల వంటి విశిష్టమైన అంశాలను వారికి మంత్రి తెలియజేశారు. అయా కంపెనీల ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను, మంత్రి ప్రసంగాన్ని అభినందించారు.

కొరియాలో భారత రాయబారి విక్రం దొరైస్వామి అద్యక్షత వహించిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కొరియా సంస్ధల కోసం ప్రత్యేకంగా కొరియన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు వచ్చే ప్రతి కొరియన్‌ పెట్టుబడికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. కొరియన్‌ కంపెనీలకు భారత దేశంలో ఉత్తమ సౌకర్యాలు, పాలసీలు ఉన్న తెలంగాణ రాష్ట్రమే అత్యుత్తమ అకర్షణీయమైన ప్రాంతంగా మంత్రి అభివర్ణించారు. మంత్రి వెంబడి పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఐటి శాఖ ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరిలు ఉన్నారు.

జపాన్‌ పర్యటనలో పలు దిగ్గజ కంపెనీలతో మంత్రి భేటీ
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు జపాన్లో పర్యటిస్తున్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. హిటాచీ, సోనీ, తోషిభా, మిత్సుబిషి, పుజిత్సూ లాంటి ప్రముఖ కంపెనీల సినియర్‌ కార్యనిర్వహక బృందాలతో సమావేశం అయ్యారు. జపాన్‌ బిజినెస్‌ ఫెడరేషన్‌ ”కైదాన్రెన్‌” ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ జపనీస్‌ కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ పెట్టుబడులకు గల అవకాశాల గురించి, ప్రభుత్వ విధానాల గురించి వివరించారు.

హిటాచీ కంపెనీ ఉపాధ్యక్షులు అకిరా శిమిజు, యండి కోజిన్‌ నకకిటలతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలోని హిటాచీ కంపెనీ విస్తరణ, భవిష్యత్తు పెట్టుబడులపైన చర్చించారు. హైదరాబాద్‌ నగరంలో హిటాచీ కంపెనీ నిర్వహిస్తున్న కార్యకలాపాలను మరింత విస్తరించే అవకాశాలను పరిశీలిస్తామని హిటాచీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.

ప్రపంచంలోని టాప్‌ 25 ఫార్మాస్యూటికల్‌ కంపెనీల్లో ఒకటైన ఈసాయి ఉపాధ్యక్షులు సాయోకొ సాసకితో మంత్రి కేటీఆర్‌ సమావేశం అయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ, హైదరాబాద్‌ నగరానికి ఫార్మా రంగంలో గల అనుకూలతల గురించి మంత్రి వివరాలు అందజేశారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీపైన సాయోకొ సాసకి ఆసక్తి వ్యక్తంచేశారు.

దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారం అవసరం: కేటీఆర్‌
చెన్నైలో ‘ఇండియా టుడే’ పత్రిక వారు నిర్వహించిన కాంక్లేవ్‌ సౌత్‌ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామా రావు పాల్గొన్నారు. ”వై ఇన్వెస్ట్‌ ఇన్‌ సౌత్‌ – ద కేస్‌ ఫర్‌ చేంజ్‌” అనే అంశంపై జరిగిన చర్చలో దక్షిణాది రాష్ట్రాల పరిశ్రమల మంత్రులతో పాటు ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల కొరకు పోటీ ఇప్పుడు దేశంలోని నగరాల మధ్యనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల మధ్య ఉన్నదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతిశీలమైన పారిశ్రామిక పాలసీని తీసుకువచ్చిందని చెబుతూ, ఈ పాలసీ రూపకల్పనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలియజేశారు. పరిశ్రమలను త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సింగిల్‌ విండో ప్రవేశపెట్టిన విషయం సభికులకు తెలియజేశారు.

దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడుల విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో అనుకూలత ఉన్నదని, కనుక ఈ రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే పరస్పరం సహకరించుకోవాలని మంత్రి చర్చలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల పరిశ్రమల మంత్రులకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

– కొణతం దిలీప్‌

Other Updates