digital-telangana

రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తొలి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామా రావు నేతృత్వంలో ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది తెలంగాణ. ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ ద్వారా తెలంగాణ యువతకు నూతన ఉపాధి అవకాశాలకల్పన, పరిపాలనలో ఐటీ వినియోగం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయడం, పౌరులకు ఆన్‌లైన్‌ ద్వారా అనేక సేవలు వారి ముంగిట్లోనే అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ఐటీ శాఖ నడుంబిగించింది. ఈ లక్ష్యాల సాధనలో తెలంగాణ వేస్తున్న ముందడుగులపై సమాచారం రాష్ట్ర ఐటీ శాఖ డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ ప్రతి నెలా ”డిజిటల్‌ తెలంగాణ” శీర్షిక ద్వారా అందిస్తారు.

నాలుగు ఐటీ సెక్టోరల్‌ పాలసీల ఆవిష్కరణ

2016 ఏప్రిల్‌ లో తెలంగాణ రాష్ట్ర ఐటి పాలసీతో పాటు నాలుగు సెక్టోరల్‌ పాలసీలు విడుదల చేసింది రాష్ట్ర ఐటీ శాఖ. ఈ పాలసీలకు పరిశ్రమ వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అనేక ఐటీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి.

రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ఐటీ శాఖ సెప్టెంబర్‌ 15 నాడు మరో నాలుగు సెక్టోరల్‌ పాలసీలను ఆవిష్కరించింది. అవి సైబర్‌ సెక్యూరిటీ పాలసీ, డేటా అనలిటిక్స్‌ పాలసీ, డేటా సెంటర్స్‌ పాలసీ, ఓపెన్‌ డేటా పాలసీ. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, ఇతర ఐటీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో ఈ నాలుగు పాలసీలు ఆవిష్కరింపబడ్డాయి. ఐటీ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలోకి నూతన పరిశ్రమలను ఆకట్టుకోవడమే ధ్యేయంగా మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో ఈ పాలసీలు రూపుదిద్దుకున్నాయి.

దేశంలో ఇటువంటి నవీన టెక్నాలజీలకు సంబంధించిన ప్రత్యేక పాలసీలు విడుదల చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

ఇదే సమావేశంలో సిస్కో సంస్థతో సిటీ డిజిటల్‌ ప్లాటారే ఏర్పాటు చేసేందుకు ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ఐటీ శాఖ.

హైదరాబాదులో భారీ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుచేయనున్న ZF  గ్రూప్‌

యూరప్‌ కేంద్రంగా నడుస్తున్న ప్రఖ్యాత ఆటోమోటివ్‌ కంపెనీ ZF గ్రూప్‌ హైదరాబాదులో ఒక భారీ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌ వేర్‌ రంగాల్లో ఈ టెక్నాలజీ సెంటర్‌ పనిచేస్తుంది.

సెప్టెంబర్‌ 7 నాడు హైదరాబాదులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, ZF కంపెనీ సీనియర్‌ అధికారుల సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా ఒక జర్మనీకి చెందిన ఆటోమోటివ్‌ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడం శుభపరిణామం అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆటోమోటివ్‌ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు మొదలుపెడతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.

హైదరాబాదులో నెలకొల్పుతున్న ZF టెక్నాలజీ సెంటర్‌ జనవరి 2017 నాటికి కార్యకలాపాలను మొదలుపెడుతుందని, మొత్తం 2,500 మంది ఇంజనీర్లకు తమ సెంటర్‌ లో ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఆగస్ట్‌ ఫెస్ట్‌ ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాదులో ప్రతియేటా జరిగే ప్రతిష్ఠాత్మక అంకుర పరిశ్రమల ఉత్సవం ”ఆగస్ట్‌ ఫెస్ట్‌” ను మంత్రి కేటీఆర్‌ సెప్టెంబర్‌ 2 నాడు జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌ లో లాంఛనంగా ప్రారంభించారు.

హైదరాబాదును అంకుర పరిశ్రమల కేంద్రంగా మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టి-హబ్‌ ను నెలకొల్పిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అంకుర పరిశ్రమలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊతం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇన్నోవేషన్‌ పాలసీని తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు.

తదనంతరం ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రయోక్తగా అంకుర పరిశ్రమలపై జరిగిన చర్చాగోష్టిలో మంత్రితో పాటు ”రెడ్‌ బస్‌” పోర్టల్‌ వ్యవస్థాపకుడు, తెలంగాణకు చెందిన యువ వ్యాపారవేత్త ఫణీంద్ర సామ, మార్ట్‌ జాక్‌ వ్యవస్థాపకుడు అభయ్‌ దేశ్‌పాండే పాల్గొన్నారు.

కెనెడా కాన్సుల్‌ జనరల్‌ ను కలిసిన మంత్రి కేటీఆర్‌

కెనడా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ డాబ్నీ ని మంత్రి కేటీఆర్‌ హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం గురించి ఈ సందర్భంగా మంత్రి కెనడా కాన్సుల్‌ జనరల్‌కు వివరించారు. కెనడాకు చెందిన కంపెనీలకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

డిజిటల్‌ ఇండియా ఛాలెంజ్‌ 2 ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ డ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, మై-గవ్‌, ఇంటెల్‌, సంయుక్తంగా నిర్వహిస్తున్న ”ఇన్నోవేట్‌ ఫర్‌ డిజిటల్‌ ఇండియా ఛాలెంజ్‌” పోటీని తెలంగాణ ప్రభుత్వ సంస్థ టీ-హబ్‌ సహకారంతో నిర్వహిస్తున్నారు. పౌరులు దైనందిన జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు టెక్నాలజీ సాయంతో స్థానికంగా పరిష్కారాలను కనుగొనేందుకు ఈ పోటీ ఉద్దేశించబడింది.

ఈ పోటీని టీ-హబ్‌ లో సెప్టెంబర్‌ 7 నాడు జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఇందులో పోటీపడుతున్న కొన్ని ఆవిష్కరణలను మంత్రి పరిశీలించారు.

తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గోవా ప్రభుత్వం

గోవా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కొరకు, నైపుణ్యాభివృద్ధిలో సహకారం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సెప్టెంబర్‌ 16 నాడు గోవా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందం గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పార్సేకర్‌, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం గోవాలో అంకుర పరిశ్రమల ఇంక్యుబేటర్‌ స్థాపనకు తెలంగాణ ప్రభుత్వ సంస్థ టీ-హబ్‌ సహకరిస్తుంది. అట్లాగే ఆ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కొరకు తెలంగాణ ఐటీ శాఖకు చెందిన టాస్క్‌ సంస్థ సహకరిస్తుంది.

నూతన ఐటీ పరిశ్రమలు గోవాలో నెలకొల్పేందుకు వీలుగా ఒక సమగ్ర ఐటీ విధానం రూపకల్పనలో కూడా గోవాకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుంది.

– దిలీప్‌ కొణతం

Other Updates