నగరంలో నాస్కామ్ గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ నవంబర్ 10 నుండి 12వ తారీఖు వరు జరిగింది. యానిమేషన్, గేమింగ్ రంగాల్లో దేశంలో అత్యంత పేరుమోసిన కాన్ఫరెన్స్ ఇది. ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ రంగ నిపుణులు అనేకమంది ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సదస్సులో కీలకోపన్యాసం చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యానిమేషన్, గేమింగ్ రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని తీసుకువచ్చిందని తెలిపారు.
యానిమేషన్, గేమింగ్ రంగాల్లో మౌలికవసతుల కల్పనకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి, ఈ సందర్భంగా త్వరలో ఇమేజ్ టవర్ (IMAGE-Innovation in Multimedia, Animation, Gaming & Entertainment) పేరిట ఒక అత్యాధునిక భవంతిని నిర్మించనున్నట్టు తెలిపారు. ఆ భవంతి నమూనాను ఆహూతుల సమక్షంలో ఆవిష్కరించారు. ఎటు చూసిన అక్షరాన్ని పోలి ఉండే ఈ భవనం, నగరానికి మరో మణిహారం కానున్నది.
3,352 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు
శాస్త్ర సాంకేతిక ఫలాలను సామాన్య పౌరులకు అందుబాటు తేవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలో మరో కీలక ముందడుగు పడింది. నవంబర్ 16 నాడు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు మొదల య్యాయి. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మన టీవీ నెట్‌వర్క్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ పాఠాలు తొలిదశలో 3,352 ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి వచ్చాయి. టీచర్ల బోధనకు తోడుగా ఈ డిజిటల్ క్లాసులు జత అయితే విద్యార్ధుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి ద్విగుణీకృతమవుతుందని, ఫలితాలు కూడా మెరుగ్గా వస్తాయని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంతి కడియం శ్రీహరి అన్నారు.
ప్రభుత్వ రంగ టీవీ చానెల్ మన టీవీ ద్వారా ఇప్పటికే టీఎస్పీఎస్సీ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చామని, త్వరలో మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పోటీ పరీక్షల విద్యార్ధులకు ట్రైనింగ్ కార్యక్రమాలను ప్రసారం చేస్తామని మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన టీవీ సి.ఈ.ఓ శైలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో డిజిటల్ తెలంగాణ పెవిలియన్
ప్రతి యేటా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ నిర్వహించే ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ తెలంగాణ థీమ్‌తో పెవిలియన్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ఐటీ ప్రాజెక్టులు ఈ పెవిలియన్ లో పొందుపరచడం జరిగింది. నవంబర్ 14 నాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చేతుల మీదుగా ఈ పెవిలియన్ ప్రారంభం అయ్యింది.
ఈ పెవిలియన్‌లో తెలంగాణకు చెందిన వివిధ చేెనేత, హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ స్టాల్లో తెలంగాణలోని వివిధ పర్యాటక స్థలాల వివరాలను పొందుపరిచారు. రాష్ట్ర ఐటీ శాఖ స్టాల్లో రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ఐటీ ప్రాజెక్టుల వివరాలు ప్రదర్శించారు. అట్లాగే రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కార్పొరేషన్ మన రాష్ట్రంలో ఉన్న వివిధ పారిశ్రామిక పార్కుల వివరాలు తెలియజెప్పే వివరాలతో స్టాళ్లు పెట్టడం జరిగింది. మన టీవీ, ఈసేవ విభాగాలు కూడా తమ తమ స్టాళ్లు ఏర్పాటు చేశారు.ట్రేడ్ ఫెయిర్లో భాగంగా నవంబర్ 21 నాడు తెలంగాణ స్టేట్ డే ఉత్సవాలు నిర్వహించారు. దీనికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర ఎంపీలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
తెలంగాణలో డేటా విండ్ ఉత్పత్తి కేంద్రం
తెలంగాణ ప్రభుత్వం ఎలెక్ట్రానిక్ పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా కెనడాకు చెందిన ప్రఖ్యాత ఎలెక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ డేటా విండ్, శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో టాబ్లెట్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది. నవంబర్ 18 నాడు ఐటీ, పరిశ్రమల శాఖ మంతి కేటీఆర్, కెనెడా హైకమీషనర్ నాదిర్ పటేల్ చేతుల మీదుగా డేటా విండ్ తయారీ కేంద్రం ప్రారంభం అయ్యింది.