మంత్రి కేటీఆర్ మానసపుత్రిక, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్, మరో మైలురాయిని చేరుకుంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో టీ-బ్రిడ్జ్ పేరిట ఒక ఔట్ పోస్టును మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించడంతో తన ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించింది టీ-హబ్.
మన రాష్ట్రంలోని యువతీయువకులు ప్రారంభిస్తున్న అంకుర సంస్థలను (స్టార్టప్స్) సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలకు పరిచయం చేయడం, అక్కడి ఇన్వెస్టర్లతో అనుసంధానం చేయడం తద్వారా ఈ అంకుర సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా సాయపడటమే టీ-బ్రిడ్జ్ ప్రధాన లక్ష్యం.
అక్టోబర్ 15 నాడు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సిలికాన్ వ్యాలీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో టీ-బ్రిడ్జ్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాదును స్టార్టప్స్ రంగంలో ప్రపంచంలోని టాప్ టెన్ లో నిలపాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. కాలిఫోర్నియా ప్రభుత్వం, టై(ఱజు) సిలికాన్‌వ్యాలీ, ఊబర్ సంస్థల భాగస్వ్యామ్యంతో ఏర్పాటవుతున్న టీ-బ్రిడ్జ్ మన రాష్ట్రం నుండి వస్తున్న అంకుర సంస్థలు అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా ఎదిగేందుకు ఉపకరిస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, డైరెక్టర్ డిజిటల్ మీడియా దిలీప్ కొణతం, టీ హబ్ సీ.ఈ.ఓ. జే కృష్ణన్, సి.ఓ.ఓ. శ్రీనివాస్ కొల్లిపర, టై సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇల్లినాయిస్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ
స్మార్ట్ స్టేట్ సొల్యూషన్స్, ఈ-గవర్నెన్స్, బిజినెస్ ఇంక్యుబేటర్స్ స్థాపన, ఉపాధి కల్పన రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల అమెరికాలో పర్యటించిన మంత్రి కే. తారకరామారావు సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.
స్మార్ట్ స్టేట్ సొల్యూషన్స్ లో భాగంగా వాయు కాలుష్యం కొలిచే సెన్సార్లను ఇల్లినాయిస్ రాష్ట్రం నెలకొల్పనుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఓపెన్ డేటా, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ రంగాల్లో ఇరురాష్ట్రాలూ పరస్పరం సహకరించుకోనున్నాయి. ఈ-గవర్నెన్స్ లో భాగంగా పౌరులకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తేవడంలో ఇన్-ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో కూడా ఇరు రాష్ట్రాలూ సహకరించు కోనున్నాయి.
షికాగోలోని భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కార్యక్రమానికి షికాగోలోని భారత కాన్సుల్ జనరల్ ఔసాఫ్ సయీద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ తరఫున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇల్లినాయిస్ రాష్ట్రం తరఫున ఆ రాష్ట్ర ఛీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి హార్దిక్ భట్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
మంత్రి కేటీఆర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే ఐటీ రంగంపై తనదైన ముద్రవేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు అంతర్జాతీయ అవార్డు లభించింది. తెలంగాణలో డిజిటల్ అక్షరాస్యత పెంపుదల కొరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నందుకుగాను మంత్రి కేటీఆర్‌కు ప్రఖ్యాత ఐటీ ట్రయినింగ్ సంస్థ సెర్టిపోర్ట్ ”గ్లోబల్ చాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ” అవార్డును ప్రదానం చేసింది.
శాటిలైట్ టీవీ ద్వారా నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం
తెలంగాణ యువతీయువకుల్లో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ ఎండ్ నాలెడ్జ్ (టాస్క్)ను స్థాపించి గణనీయమైన ఫలితాలు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ, ఇప్పుడు మంత్రి కేటీఆర్ సారథ్యంలో మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో శాస్త్ర సాంకేతిక సహకారంతో శాటిలైట్ టీవీ ద్వారా తెలంగాణా యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు దోహదపడేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ప్రసారం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం అమలుకు ఇస్రో సంస్థతో సెప్టెంబర్ 28 నాడు మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ఐటీ శాఖ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టిఎస్‌పిఎస్‌సి ఛైైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇస్రో డైరెక్టర్ కృష్ణమూర్తి, మన టీవీ సి.ఈ.ఓ. శైలేశ్ రెడ్డి పాల్గొన్నారు. ఒప్పందం దరిమిలా అక్టోబర్ 1వ తారీఖు నుండి రాష్ట్ర ప్రభుత్వ శాటిలైట్ టీవీ మన టీవీ ద్వారా టీ.ఎస్.పీ.ఎస్.సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షకు అవసరమైన శిక్షణా కార్యక్రమాల ప్రసారం మొదలైంది. శాటిలైట్ టీవీ ద్వారానే కాకుండా యూట్యూబ్ వంటి డిజిటల్ మీడియా ప్రసార సాధనాల ద్వారా కూడా ఈ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.
హైదరాబాదులో మరో ప్రతిష్ఠాత్మక సదస్సు
నవంబర్ 3-9 తారీఖుల్లో హైదరాబాదులో మరో ప్రతిష్ఠాత్మక మైన అంతర్జాతీయ సదస్సు జరగనుంది. అంతర్జాలంలో ఐపి అడ్రసులు, వెబ్ సైట్ పేర్లను నియంత్రించే ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైండ్ నేమ్స్ ఎండ్ నెంబర్స్ (ఐకాన్) 57వ సదస్సుకు మన భాగ్యనగరం వేదిక కానుంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేత ప్రారంబించబడే ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామా రావు ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు.
మెడ్ టెక్ హబ్ గా తెలంగాణ: అమెరికాలో మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రతినిధి బృందం అక్టోబర్ మూడోవారంలో అమెరికాలో విస్తృ తంగా పర్యటించి ఫార్మా, హెల్త్ కేర్, మెడికల్ పరికరాల తయారీ రంగంలో పేరెన్నికగన్న అనేక అగ్రశ్రేణి కంపెనీల అధిపతులతో సమావేశమయ్యింది. ఈ పర్యటనలో భాగంగా మిన్నియాపోలిస్ నగరంలో జరిగిన ప్రతిష్ఠాత్మకమైన అడ్వామెడ్ 2016 కాన్ఫరెన్సులో రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొన్నది. ఈ కాన్ఫరెన్సులో భాగంగా జరిగిన ఎగ్జిబిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక పెవిలియన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఎగ్జిబిషన్ సందర్శించిన వారికి ఈ పెవిలియన్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కాన్ఫరెన్సు ప్లీనరీ సదస్సులో ప్రసంగించే అరుదైన అవకాశం భారత దేశం నుండి కేవలం మన రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకే దక్కడం గమనార్హం.
ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన దాదాపు వెయ్యి మంది మెడ్ టెక్ పరిశ్రమ ప్రతినిధులనుద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగానికి సభికుల నుండి విశేష స్పందన లభించింది.
మెడికల్ పరికరాల తయారీరంగంలో భారత దేశంలో ఉన్న అపారమైన అవకాశాల గురించి మంత్రి తన ప్రసంగంలో వివరించారు. భారత దేశంలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పారిశ్రామిక పాలసీ గురించి, సింగిల్ విండో క్లియరెన్స్ – టీ ఎస్ ఐపాస్ విధానం గురించి మంత్రి తెలిపినప్పుడు ప్రతినిధులు కరతాళ ధ్వనులతో స్వాగతించారు. మెడికల్ పరికరాల తయారీరంగానికి తెలంగాణను హబ్‌గా తీర్చిదిద్దనున్నామని, ఇందుకోసం 250 ఎకరాల స్థలంలో మెడికల్ డివైసెస్ పార్క్ ఫేజ్ – 1, 1000 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ డివైసెస్ పార్క్ ఫేజ్-2లను త్వరలో ఏర్పాటు చేయనున్నామని మంత్రి తన ఉపన్యాసంలో తెలిపారు.
పర్యటన తొలివారంలో వాషింగ్టన్, న్యూయార్క్, న్యూ జెర్సీ నగరాలను సందర్శించిన మంత్రి బృందం జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్, ఎలి లిలి, మెర్క్, తదితర ఫార్మా, మెడ్ టెక్ కంపెనీల అధినేతలను కలుసుకున్నారు. తెలంగాణలో ఫార్మా, మెడ్ టెక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా వారికి ఆహ్వానం పలికారు.
పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు అనుకూల మైన పారిశ్రామిక పాలసీలు, సమర్ధవంతమైన నాయకత్వం, సుస్థిర మైన పాలన తెలంగాణలో ఉన్నదని మంత్రి వారికి వివరించారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక ప్రమాణాలతో స్థాపించ నున్న ఫార్మా సిటీ, మెడికల్ డివైసెస్ పార్క్ గురించి మంత్రి వారికి తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ పరిశ్రమ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ కూడా పాల్గొన్నారు.
దిలీప్ కొణతం