ఇటీవల భారత- చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రగతి భవన్‌లో సంతోషికి అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి,
ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కల్నల్ సంతోష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 711 గజాల స్థలాన్ని అప్పగించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి షేక్‌పేట మండలంలోని మూడు స్థలాలను చూపించి, ఒకటి ఎంచుకోవాలని సూచించారు. కల్నల్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న 711 గజా స్థలాన్ని అప్పగించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపి బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.