– మంగారి రాజేందర్
శాసనాలని చేసే అధికారం పార్లమెంట్, అదే విధంగా రాష్ట్రాలకి సంబంధించి శాసన వ్యవస్థలకి వుంటుంది. పార్లమెంటులు తయారు చేసే శాసనాలని పార్లమెంట్ శాసనం (యాక్ట్ ఆఫ్ పార్లమెంట్) అంటారు. ఏదైనా బిల్లుని పార్లమెంట్‌లోని ఉభయ సభలు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి అనుమతి కోసం పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించిన అది శాసనంగా రూపుదిద్దుకుంటుంది.
కొన్ని సందర్భాల్లో చట్టం చేయడానికి వీలు కుదరకపోవచ్చు. దానికి సమయం పట్టవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు ఆర్డినెన్స్ జారీ చేస్తాయి.
ఆర్డినెన్స్ హోదా ఎంత వరకు..?
ఈ ఆర్డినెన్స్‌లని దేశానికి సంబంధించిన విషయాల మీద రాష్ట్రపతి జారీ చేస్తారు. రాష్ట్రాలలో గవర్నర్లు జారీ చేస్తారు. పార్లమెంట్ సెషన్స్‌లలో లేనప్పుడు, అదే విధంగా రాష్ట్రాల శాసన వ్యవస్థలు సెషన్స్‌లలో లేనప్పుడు, తక్షణ ఆవశ్యకత వుందని భావించినప్పుడు రాష్ట్రపతి, గవర్నర్లు జారీ చేస్తారు.
ఆర్డినెన్స్ ద్వారా వచ్చిన శాసనాలు తాత్కాలికమైనవి. పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అంశాల మీద రాష్ట్రపతి, శాసన వ్యవస్థల అంశాలకు సంబంధించి రాష్ట్రాల గవర్నర్లు వీటిని జారీ చేస్తారు. పార్లమెంట్ గానీ, రాష్ట్రాల శాసన వ్యవస్థలు గానీ తిరిగి సమావేశం అయిన ఆరువారాల కాలం వరకు మాత్రమే వీటి గడువు వుంటుంది. ఆ తరువాత అవి అంతం అవుతాయి. పార్లమెంట్ గానీ, శాసన వ్యవస్థలు గానీ ఆమోదిస్తే అవి చట్టరూపం దాలుస్తాయి. ఆర్డినెన్స్‌లు శాసనంగా మారుతాయి.
శాసనాలని ప్రధానంగా పార్లమెంట్ శాసన వ్యవస్థలు తయారు చేస్తాయి. శాసన వ్యవస్థలు కాకుండా కార్యనిర్వాహక వ్యవస్థ కూడా నియమాలు, రెగ్యులేషన్స్‌ని తయారు చేయవచ్చు. దీన్నే డెలిగేటెడ్ లెజిస్లేషన్ (అధికారమిచ్చిన శాసనం) అంటారు.
శాసనం ద్వారా కార్యనిర్వాహక వ్యవస్థకి నియమాలు, రెగ్యులేషన్స్, ఉత్తర్వులు తయారు చేసే అధికారం ఇచ్చినప్పుడు మాత్రమే కార్యనిర్వాహక వ్యవస్థ ఇవి తయారుచేసే వీలు వుంటుంది.
చట్టం ఉద్దేశ్యం నెరవేర్చడానికి ప్రతి చట్టంలో ‘అధికారం ఇచ్చే శాసన పద్ధతి’ నిబంధనలని పొందుపరచడం ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యింది. ఇలాంటి నిబంధనని చట్టంలో ఏర్పరచడానికి బలమైన కారణం వుంది. చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఉత్పన్నమయ్యే ప్రతి సంఘటనని శాసన వ్యవస్థ ఊహించలేదు. అలా ఎదురయ్యే సంఘటనలని, పరిస్థితులని ఎదుర్కోవడానికి ఉద్దేశించి ఇలాంటి నిబంధనలను ఏర్పరుస్తారు. అదే విధంగా కొన్ని సాంకేతిక విషయాల మీద నిపుణుల పనితనం అవసరం వుంటుంది. అందుకని ఇలా డెలిగేటెడ్ లెజిస్లేషన్ నిబంధనని చట్టాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీన్నే సబార్టినేట్ లెజిస్లేషన్ అని కూడా అంటారు.
డెలిగేటెడ్ లెజిస్లేషన్‌కి సంబంధించి ఉదాహరణలు
డెలిగేటెడ్ లెజిస్లేషన్‌కి సంబంధించి కొన్ని ప్రధానమైన ఉదాహరణలు :
నియమాలు (కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీటిని తయారు చేస్తుంది)
రెగ్యులేషన్స్ (బోర్డు, కార్పోరేషన్స్ సాధారణంగా వీటిని తయారు చేస్తాయి)
నోటీసులు మరియు ఉత్తర్వులు (వీటిని సాధారణంగా ప్రభుత్వం జారీ చేస్తుంది)
స్కీమ్‌లు
బైలాస్ (లోకల్ అథారిటీస్ వీటిని తయారు చేస్తాయి)
ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ ద్వారా వచ్చిన నియమాలు, రెగ్యులేషన్స్ వగైరాలు అన్ని కూడా మూల శాసనానికి లోబడి వుండాల్సి వుంటుంది. అంతేకాదు, మూల శాసనానికి విరుద్ధంగా వుండటానికి వీల్లేదు.
పార్లమెంట్ పర్యవేక్షణ
ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ పైన పార్లమెంట్ పర్యవేక్షణ వుంటుంది. పార్లమెంట్ సబార్టినేట్ లేజిస్లేషన్ కమిటీలని ఏర్పాటు చేసి వాటి ద్వారా వీటిని పర్యవేక్షిస్తాయి.
ఏవైనా నియమాలు, ఉత్తర్వులు వగైరాలు న్యాయబద్ధంగా లేనప్పుడు, అణిచివేసే విధంగా వున్నప్పుడు ఆ పౌరుల మీద ఆర్థిక భారం పడుతుందని అనిపించినప్పుడు కోర్టుల పరిధిని ఆతిక్రమిస్తుందని భావించినప్పుడు, చట్టం ఉద్దేశాలకి విరుద్ధంగా వున్నప్పుడు వాటిని సరిచేయడానికి ఈ కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తుంది.
ఈ పరిస్థితిని అధిగమించడం కోసం ఈ చట్టాల ప్రకారం తయారు చేసిన నియమాలని మళ్ళీ పార్లమెంట్ ముందు పెట్టేవిధంగా చట్టంలో నిబంధనలని ఏర్పాటు చేస్తున్నాయి. ఆ నియమాలని పార్లమెంట్ ఆమోదించవచ్చు. లేదా మార్పు చేయవచ్చు. రద్దు కూడా చేయవచ్చు.
చట్టాల గురించి ఎలా తెలుస్తుంది?
ప్రభుత్వం తయారు చేసిన శాసనాలని, నియమాలని ప్రభుత్వ సంస్థలు ప్రచురిస్తాయి.
ఇండియా కోడ్ అని ప్రచురణని ప్రభుత్వం నడిపిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన అన్ని చట్టాలు వుంటాయి. అయితే చట్టంలో వచ్చిన మార్పులని వెంటనే ఈ ప్రచురణ సంస్థ తీసుకొని రావడం లేదు. చాలా సంపుటాలు వుండటం వల్ల చదవడంలో కొంత అసౌకర్యం వుంది.
ప్రైవేట్ పబ్లికేషన్ సంస్థలు ముఖ్యమైన చట్టాలని మాన్యువల్ రూపంలో ప్రచురిస్తున్నాయి. ఉదాహరణకి – క్రిమినల్ మేజర్ యాక్ట్స్, క్రిమినల్ మైనర్ యాక్ట్స్ వగైరా కొన్ని చట్టాలని ప్రైవేట్ సంస్థలు కామెంటరీలతో బాటు ప్రచురిస్తున్నాయి.
ఆచారం
చాలా కాలం నుంచి ఒక పద్ధతిని ప్రజలు పాటిస్తూ వుంటే అది ఆచారంగా (కస్టమ్) పరిగణించబడుతుంది.
మన దేశంలో కూడా ఈ ఆచారం యొక్క ప్రాధాన్యత చాలా శాసనాల్లో కన్పిస్తుంది.
ఆచారం అనేది ఫ్యామిలీ లాలో ప్రముఖంగా కన్పిస్తుంది. చట్టంలోని నిబంధనలని ఇది కొన్ని సార్లు అధిగమిస్తుంది. కొన్ని విషయాలను చేరుస్తుంది.
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలో కూడా ఆచారం ప్రధాన పాత్రని పోషిస్తుంది.