లోక్‌సభలో చెప్పుకోదగ్గ సంఖ్యాబలం లేకపోయినప్పటికీ అనేక అవరోధాలను చాకచక్యంతో, రాజనీతిజ్ఞతతో అధిగమిస్తూ అయిదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తిచేసి దేశానికి అత్యావశ్యకమయిన రాజకీయ పరిపాలనా సుస్థిరత్వాన్ని కల్పించగలిగారు నరసింహారావు. ఆధునిక చాణక్యుడుగా ఆయన ప్రసిద్ధి పొందారు.
ఇంతవరకు గత ఏడు దశాబ్దాల కాలంలో, భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఆరుగురిలో అయిదవ వారు పి.వి. నరసింహారావు. అయిదుగురిలో ముగ్గురు నెహ్రూ కుటుంబానికి చెందినవారు, ఇంకొకరు లాల్ బహద్దుర్ శాస్త్రి. భారతదేశానికి జవహర్‌లాల్ నెహ్రూ అనంతరం దిక్కెవరు అని దేశ ప్రజలు, ఇతర దేశాల పరిశీలకులు కలవర పడుతున్న సమయంలో లాల్ బహద్దుర్ శాస్త్రి రంగం మీదికి వచ్చి గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
ఇందిరాగాంధీ అమానుష హత్య పిదప రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించి దేశ ప్రజలలో భవిష్యత్తు పట్ల ఆశలను రేకెత్తించారు. ఆయన అకాల, విషాద మరణంతో దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితి ఉత్పన్నమయింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ప్రతీకగా పి.వి. నరసింహారావు భారతదేశ పరిపాలనా బాధ్యతలను స్వీకరించవలసి వచ్చింది. అది ఒక సవాలు వంటి, ఒక అగ్నిపరీక్ష వంటి బాధ్యత. ఒక నాయకుని స్థితప్రజ్ఞతకు, రాజనీతి దురంధరత్వానికి, పరిపాలనా దక్షతకు కఠినపరీక్ష అది. ఎంతటి రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, తాత్విక దృష్టి గలవారు మాత్రమే అటువంటి పరీక్షలో ధీరోదాత్తంగా నిలిచి నెగ్గగలుగుతారు. తాత్విక పాలకులు మాత్రమే తరుణోపాయం చూపించగలుగుతారని ప్లాటో అన్నమాట నిజమైంది.
రాజకీయ అస్థిరత్వంలో, ఆర్థిక సంక్షోభంతో చుట్టూ సమస్యల సర్పాలు బుసలు కొడుతున్న గడ్డు పరిస్థితిలో నరసింహారావు తాత్విక చింతనాపరుడుగా సవాలును ఎదుర్కొనడానికి సంకల్పించారు. నాడు నరసింహారావు కూర్చున్నది కంటకావృత సింహాసనం. అపార మనోస్థయిర్యం అవసరమవుతుంది ఆ సింహాసనం మీద కూర్చోవడానికి. 1991 జూన్ 21వ తేదీన నరసింహారావు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి భారతదేశం అభివృద్ధి రేటు సున్నా శాతం. ఈ దేశంలో – విశేషించి స్వతంత్ర భారతంలో కనీవినీ ఎరుగని రీతిగా 16 శాతం రేటుతో ద్రవ్యోల్బణం విజృంభించింది ఎన్నడూ లేనంతగా ఆర్థికలోటు ఏర్పడింది. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం ఎగుమతుల పరిమాణం 2 శాతం నుంచి 0.5 శాతానికి దిగజారింది పర్యవసానంగా బ్యాలెన్స్ అఫ్ పేమెంట్ (బిఓపీ) క్లిష్టమయింది. దేశ ప్రజల తలసరి సగటు ఆదాయం తీవ్రంగా తగ్గింది రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా మన బంగారం నిల్వలను ఇంగ్లండ్ బ్యాంకులో తాకట్టు పెట్టవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ విషమ పరిస్థితిలో ప్రధానమంత్రి పదవిని చేపట్టడం ఎవరికీ సంతోషదాయకం కాదు. కానీ, నరసింహారావు అత్యంత క్లిష్టమయిన కార్యాన్ని నిర్వహించడానికి సిద్ధమయి, సాహసవంతంగా ఆర్థిక సంస్కరణలను అమలు జరిపి, అవసరమయిన ఇతర చర్యలు తీసుకొని గణనీయ విజయం సాధించారు.
లోక్‌సభలో చెప్పుకోదగ్గ సంఖ్యాబలం లేకపోయినప్పటికీ అనేక అవరోధాలను చాకచక్యంతో, రాజనీతిజ్ఞతతో అధిగమిస్తూ అయిదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తిచేసి దేశానికి అత్యావశ్యకమయిన రాజకీయ పరిపాలనా సుస్థిరత్వాన్ని కల్పించగలిగారు నరసింహారావు. ఆధునిక చాణక్యుడుగా ఆయన ప్రసిద్ధి పొందారు.
ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించి ఆర్థిక వ్యవస్థలో నరసింహారావు ప్రభుత్వం సాధించిన విజయాలు అద్భుతమయిన వంటే అతిశయోక్తి కాదు. 1991 జూన్‌లో సున్నా శాతం స్థాయిలో ఉన్న అభివృద్ధి రేటు నరసింహారావు పదవీ విరమణ చేసే నాటికి 7 శాతం స్థాయికి పెరిగింది. ఇది అసాధారణమైన పెరుగుదల రేటని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
మానవతా దృక్పథం
అంతేకాదు. నరసింహారావు అధికారం చేపట్టేనాటికి రూ. 15 వందల కోట్ల స్థాయిలో ఉన్న మన విదేశీ మారక ద్రవ్య నిలువలు తరువాత కేవలం ఆరు నెలలకే రూ. 9 వేల కోట్ల స్థాయికి హెచ్చాయి. భారతదేశపు విదేశీ మారకద్రవ్య నిలువలలో అంతటి పెరుగుదల అంతకు ముందెన్నడూ సంభవించలేదన్నది గమనార్హ విషయం. చితికి శిథిలమయిన భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది సక్రమ మార్గంలో నడిపించడానికి నరసింహారావు ప్రభుత్వం కావించిన కృషి సర్వదా ప్రశంసనీయమైనది, భవిష్యత్ ప్రభుత్వాలకు ఆదర్శప్రాయమయినది.
ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుందని, ఎన్నో త్యాగాలు చేయక తప్పదని నరసింహారావు దేశ ప్రజలకు సూటిగా, స్పష్టంగా వివరించారు. పరిపాలనలో, ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలలో పారదర్శకతకు, గోప్యతా రాహిత్యానికి, అభివృద్ధికి, సామాన్య ప్రజల సంక్షేమానికి, శ్రేయస్సుకు నరసింహారావు మానవతా దృక్పథంతో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు, తారతమ్యాలు తొలగిపోవాలని నరసింహారావు గాఢంగా ఆకాంక్షించి అందుకు అనుగుణంగా తమ ప్రభుత్వాన్ని నిర్వహించారు. అభివృద్ధికి సంబంధించిన ప్రధానమంత్రిగా తనను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన అభిలషించారు. మానవీయ సమాజ నిర్మాణానికి మధ్యేమార్గం అనుసరిస్తూ, ఏకాభిప్రాయ సాధన ద్వారా సఖ్యత, సామరస్యాలకు దోహదపడుతూ నరసింహారావు ప్రగతి పథంలో పయనించారు.
గాంధేయ స్వాప్నికుడు
నరసింహారావు స్వాప్నికుడు. జాతిపిత గాంధీ మహాత్ముని స్వప్నాలు నరసింహారావుకు స్ఫూర్తినిచ్చాయి. భారత జాతి ఉజ్వల భవిష్యత్తు కోసం నరసింహారావు ఒక గాంధేయవాదిగా కలలు కన్నారు. భారత ప్రజల సమైక్యత, శక్తి సామర్థ్యాలు, భారత ప్రజాస్వామ్యం పట్ల నరసింహారావు విశ్వాసం అచంచలమైనది. ‘‘భారతదేశ ప్రజలు అత్యంత క్లిష్ట సమయంలో ఒక్కటిగా నిలిచారు. దేశాన్ని అస్థిరత్వం పాలు చేయడానికి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించిన శక్తులకు భారత ప్రజలు గట్టి జవాబు ఇచ్చారు. ఇటీవల ముగిసిన ఎన్నికల కార్యక్రమం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ శక్తిని, పటిష్టతను మరొకసారి వెల్లదించాయి. భారత ప్రజల సమైక్యతను ఎవరూ సవాలు చేయలేరని మరోమారు రుజువయ్యింది… దేశ ప్రజలందరి కన్నీళ్లను తుడిచి వేయాలన్నది తన కోరికని గాంధీజీ అన్నారు. గాంధీజీ కల, కోర్కెలు నా ప్రభుత్వానికి ఉత్తేజం కలిగి స్తాయి…అని నరసింహారావు ప్రధాన మంత్రి పదవిని చేపట్టగానే దేశ ప్రజల కిచ్చిన సందేశంలో వివరించారు.
నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖల మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో విదేశాంగ, రక్షణ, దేశ వ్యవహారాల, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రిగా, పార్లమెంటేరియన్‌గా, అరవయి సంవత్సరాల పాటు కాంగ్రెస్ వాదిగా రాజకీయ, పరిపాలనా రంగాలలో అపార అనుభవం గడించారు. ఆ అనుభవం ప్రాతిపదికగా నరసింహారావు స్పష్టమయిన అవగాహనతో, నిర్దిష్ట లక్ష్యాలు, ఆశయాలు, కార్యక్రమాలతో తమ ప్రభుత్వ విధుల నిర్వహణ ప్రారంభించారు.
1991 జూలై 15వ తేదీన లోక్‌సభలో విశ్వాసతీర్మానం మీద జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ప్రధాని నరసింహారావు తాము మహాత్మాగాంధీ, జవహరలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విధానాలనే అనుసరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘ఏం చేయాలో తెలిసిన వ్యక్తిని ఇక్కడున్నాను. ప్రజలు కోరుతున్నదేమిటో మాకు తెలుసు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. జాతీయ ప్రయోజనాలకు భంగకరమయిన విధానం దేనిని మేము అనుసరించబోము‘‘ అని నరసింహారావు దృఢమయిన ఆత్మ విశ్వాసంతో పార్లమెంటులో ప్రకటించారు. అయిదు సంవత్సరాల పదవీకాలంలో ప్రధాన మంత్రిగా నరసింహారావు జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు.
విశిష్ట ప్రజాతంత్రవాది
పార్టీలపట్ల అచంచల విధేయత, ప్రజలపట్ల, ప్రజాస్వామ్యం పట్ల అకుంఠిత విశ్వాసం నరసింహారావు రాజకీయ వ్యక్తిత్వంలోని విశిష్ట లక్షణాలు. ఆయన రాజకీయ వ్యక్తిత్వం సమున్నతంగా రూపొందడంలో ఈ విశిష్ట గుణగణాలు దోహదపడ్డాయి. ‘‘ఒక చిన్న గ్రామంలో జన్మించిన నా వంటి వ్యక్తి చరిత్రాత్మకమయిన ఎర్రకోట మీది నుంచి మీ ముందు ప్రసంగించగలగడం ప్రజాస్వామ్యానికి నివాళి. ఇది మీ ఆశీర్వాదబలం, నా అదృష్ట విశేషం. దేశ స్వాతంత్య్రం కోసం అనేకులు త్యాగం చేశారని, తమ రక్త తర్పణంతో స్వాతంత్య్రాన్ని బలిష్టం కావించారని మీకు తెలుసు. ఈ మహత్తర ప్రజాస్వామ్య రథం స్థిరంగా పురోగమిస్తున్నది’’ అంటూ నరసింహారావు ప్రధానమంత్రిగా ప్రథమ పర్యాయం ఢిల్లీలో చరిత్రాత్మక మయిన ఎర్రకోట మీది నుంచి జాతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉద్ఘాటించారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భాన బొంబాయిలో, చరిత్రాత్మక క్రాంతి మైదాన్‌లో నరసింహారావు కావించిన ప్రసంగం మరువరానిది. నిజానికి, రాష్ట్రంలో, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరసింహారావు పలు సందర్భాల్లో, విభిన్న విషయాలపై కావించిన ప్రసంగాలలో ఆయన ఒక విజ్ఞానమూర్తిగా, మహామేధావిగా, మహా మనీషిగా, ఉత్తమ, అనర్గళ వక్తగా దర్శనమిస్తారు.
ఒక జాతి స్వాతంత్య్ర సమరం స్వాతంత్య్ర సాధనతో సమాప్తం కాదని, స్వాతంత్య్ర సాధనతో స్వాతంత్య్ర సమరంలో ఒక వినూత్న అధ్యాయం ప్రారంభమవుతుందని ఆయన క్రాంతి మైదాన్‌లో ఉద్బోధించారు. ‘‘భారతదేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మీకు గౌరవ పూర్వకంగా నమస్కరిస్తున్నాను. అయితే, ఈ స్వాతంత్య్రాన్ని పరిరక్షించి, పటిష్టపరచి, సుసంపన్నం కావించగల యువతీ యువకులను చూడడానికి నేను ఆరాటపడుతున్నాను’’ అని ప్రకటించి నరసింహారావు యువజనులపై పెట్టుకొన్న ఆశలను వ్యక్తపరిచారు.
సంస్కృతీ సంపన్నుడు
నరసింహారావు దేశభక్తి, దేశాభిమానం, మాతృభూమి పట్ల ఆయనకు గల అపార ప్రేమ, గౌరవం ఈ మాటల్లో వ్యక్తమవుతున్నాయి – నేను వందకంటె ఎక్కువ దేశాలను చూసాను. కేవలం ఆ దేశాల విమానాశ్రయాలనే చూసి రాలేదు. ఆ దేశాలన్నిటిని సూక్ష్మ దృష్టితో పరిశీలించాను. మనదేశ స్థానం విశిష్టమయినదని గమనించాను. ఈ స్థానాన్ని మనం కొనసాగించవలసి ఉంటుంది. భారతీయ సంస్కృతిలో, భారతీయ సమాజంలో, మన వారసత్వంలో, సంప్రదాయాలలో నాకు విశ్వాసం ఉంది. విచ్ఛిన్నకర శక్తులు విజయం సాధించకుండా అడ్డుకోగల శక్తి మన సంస్కృతిలో ఉంది. ఆ శక్తి ప్రవహించాలని నేను కోరుతున్నాను..
ఏ విషయంపై వ్యక్తపరిచినా నరసింహారావు అభిప్రాయాలు విలువయినవి, ఉదాత్తమయినవి, స్ఫూర్తి దాయకమయినవి. నిరాయుధీకరణ శాంతిస్థాపనకు దారి తీస్తుందనుకోవడం పొరపాటు, అణ్వస్త్రాలను నిర్మూలించవచ్చు. కాని, సంప్రదాయక ఆయుధాలతోనే దేశాలు ఘర్షణ పడవచ్చు. ఘర్షణ పడాలనుకున్న వారికి బాంబులు లేకుంటే తుపాకులు, తుపాకులు లేకుంటే లాఠీలు లేక వట్టి చేతులు సరిపోతాయి. నిరాయుధీకరణ అత్యావశ్యకం. ఎంతో అవసరం కాని, దానితోనే సరిపోదు. నిరాయుధీకరణతో పాటు మనుషుల మస్తిష్కాలలో మార్పు రావాలి. హింస, ప్రతీకారం, పగ, ఆలోచనలు కొనసాగితే ప్రయోజనం లేదు. ఘర్షణ మనస్తత్వాన్ని నిర్మూలించాలి.
నరసింహారావు చెప్పిన, ఈ మాటలను ఈ రోజు లేక రేపు అంతర్జాతీయ రంగంలో శాంతి సామరస్యాలు నెలకొనాలనే వారందరు గమనించవలసి ఉంటుంది. అనేక దేశాల అధినేతలకు ఆయన రాజనీతిజ్ఞుడు, ఆచార్యుడు, మార్గదర్శకుడు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఆయనను మహా రాజనీతిజ్ఞుడని ప్రస్తుతించాడు.
పేదల పెన్నిధి
దేశంలోని అత్యున్నత పదవి – ప్రధానమంత్రి పదవిని – నిర్వహించిన నరసింహారావు గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగారు. నిరుపేదల, పేద రైతుల కష్టసుఖాలు, పరిస్థితులు ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. భూములు లేని పేదల, కూలీల కడగండ్లు ఆయన స్వయంగా చూసినవే. అందువల్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భూసంస్కరణల చట్టాన్ని రూపొందించి అమలు జరిపారు. అవి విప్లవాత్మకమయినవి. ఒకసారి ఢల్లీిలో ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన అన్న మాటలు ఇవి. ‘‘ఒక పేద మనిషికి, ఒక చిన్న మనిషికి, ఒక బలహీనుడికి భూమి రికార్డు ఒక ఆయుధం. అది కేవలం ఒక రికార్డు కాదు. అది కేవలం ఒక కాగితం ముక్క కాదు… అది అతనికి ఆయుధం. సమాజంలో ఎంతో పలుకుబడి ఉన్నవారు ఎల్లప్పుడు లేక కొన్ని సందర్భాలలో ఈ పేద మనిషి హక్కులను హరించాలనుకుంటారు. చేతిలో ఈ ఆయుధం లేకపోతే పేద మనిషి సమాజంలో పలుకుబడిగల వారితో పోరాడలేడు. కనుక, నిరుపేదలకు భూమి ఇవ్వడంతో పాటు రికార్డు రూపంలో దానిపై హక్కు కూడా కల్పించాలి. ఆర్థికంగా అతను బలపడడానికి సహాయపడాలి.
మహామేధావి, మనీషి
చైతన్యవంతమయిన జాతి ప్రధాన లక్షణం మతాతీత లౌకిక వాదమని (సెక్యులరిజం) నరసింహారావు అభిభాషించారు. ‘‘మనం సెక్యులర్ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. మతతత్వం అతి ప్రమాదకరమయిన విషక్రిమి. అది ద్వేషాన్ని రగుల్గొల్పుతుంది అది మనిషికి మనిషిని, సోదరుడికి సోదరుని శత్రువుగా మార్చుతుంది. మతతత్వ హింసాకాండను నిరోధించడంలో మన జాతి శక్తి వనరులలో అధికభాగం వ్యయం కావడం దురదృష్టకరం. ఈ వ్యయభారాన్ని మనదేశం భరించలేదు. మన దేశంలో తక్షణ అవసరం అభివృద్ధి, పేద ప్రజల అభ్యున్నతి’’ నూతన శతాబ్దిలో ఎదురవుతున్న సవాళ్లను నరసింహారావు సూక్ష్మ దృష్టితో పరిశీలించి వివరించారు. సంపన్న దేశాలకు వర్థమాన దేశాలకు మధ్య ఏర్పడిన ఆర్థిక అగాథం అంతర్జాతీయ రంగంలోని ఉద్రిక్తతకు ఒక ప్రధాన కారణమని నరసింహారావు దృఢంగా అభిప్రాయపడ్డారు. మానవజాతి అభివృద్ధికి సైన్సు, టెక్నాలజీ అపరిమిత అవకాశాలను కల్పించాయని నరసింహారావు అంగీకరిస్తారు. సైన్స్, టెక్నాలజీ ప్రగతి కారణంగా సంభవించిన కొన్ని అనర్థాలను ఆయన విస్మరించలేదు. బహుముఖ ప్రతిభా వంతులు నరసింహారావు ప్రధానమంత్రిగా దేశానికి నేతృత్వం వహించడంతో పాటు ఒక ప్రబోధకుని పాత్రను కూడా నిర్వహించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విభిన్న విషయాలపై కావించిన గంభీర ప్రసంగాలలో నరసింహారావు విజ్ఞానాన్ని, సునిశిత వ్యంగ్యాన్ని, విజ్ఞతను మేళవించి వెదజల్లారు. ఆయన మేధోమథనంలో వికసించిన ఆలోచనలు అమూల్యమయినవి. ఆయన భావితరాలకు మార్గదర్శకుడు, సర్వదా స్మరణీయుడు.
అద్వితీయ వ్యాఖ్యాత
జాతీయ సమైక్యతా మండలి సమావేశంలో ప్రసంగిస్తూ నరసింహారావు భారత సమాజంలోని నిగ్రహస్ఫూర్తిని వివరించిన తీరులో వైదుష్యం తొణికిసలాడుతుంది. ‘‘చరిత్ర తొలి క్షణాల నుంచే భారత సమాజం నిగ్రహస్ఫూర్తికి ప్రసిద్ధి పొందింది. ప్రపంచంలో బహుశా ఎక్కడాలేని స్ఫూర్తి ఇది. మన విశ్వాసాన్ని, జీవన సరళిని అనుసరిస్తూ, గౌరవిస్తూ మనం సర్వదా ఇతరులకు వారి విశ్వాసాన్ని అనుసరించడానికి, ప్రచలితం చేయడానికి, వారి జీవన సరళిని ఎంపిక చేసుకోవడానికి ఉన్న హక్కులను గౌరవించడం. ఇది భారతదేశానికి గణనీయ సాంస్కృతిక వైవిధ్యం గల సుసంపన్న నాగరికతను ప్రసాదించింది. ఈ నాగరికత మనకు గర్వ కారణమయినది. ఈ సాంస్కృతిక వైవిధ్యంలో అంతర్లీనంగా ఉన్న సమైక్యతా సూత్రం భారత సమాజానికి విశిష్టతను కలిగించింది.