ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతున్న నేతలు 1969 ఆగస్టు 27న ఢిల్లీలో ప్రధాని ఇందిరాగాంధీని, కాంగ్రెస్ అధ్యక్షులు నిజలింగప్పను కలిసి చర్చించారు. డా|| చెన్నారెడ్డి ఢిల్లీలో ఒక్క రాష్ట్రపతిని తప్ప మరే జాతీయ నాయకున్నీ కలుసుకోలేదు. కొండా లక్ష్మణ్ మాత్రం ప్రధాని ఇందిరాగాంధీని, కాంగ్రెస్ అధ్యక్షులు నిజలింగపును, దేశీయాంగమంత్రి వై.బి. చవాన్‌ను, జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కామరాజ్‌ను, మాజీ ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ తదితరులను కలుసుకుని తెలంగాణ సమస్యపై చర్చించారు.
వి.బి. రాజు, చొక్కారావు కూడా ప్రధానిని, చవాన్‌లను కలుసుకుని తెలంగాణ వ్యవహారం చర్చించారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకత్వంలో మార్పు వస్తుందని, ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో అధికార అభ్యర్థి సంజీవరెడ్డికి రాష్ట్రంలో చాలా తక్కువ ఓట్లు రావడాన్నిబట్టి నాయకత్వంలో మార్పు జరుగకతప్పదని తెలంగాణ నాయకులు ఆశించారు.
హైదరాబాద్‌లో చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌లకు ఘన స్వాగతం
ఆగస్టు 27 రాత్రి రైలులో హైదరాబాద్‌కు బయల్దేరిన చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌లకు నాగపూర్, చంద్రాపూర్, బల్హార్షా, కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట, ఆలేరు తదితర స్టేషన్లలో ఘనస్వాగతం లభించింది. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి జై తెలంగాణ నినాదాలిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగస్టు 29 ఉదయం రైలు దిగిన నేతలు ఓపెన్‌టాపు జీపులో చార్మినార్‌వరకు ఊరేగించారు. దారిపొడవునా ప్రజలు నేతలకు తిలకం దిద్ది హారతులిచ్చారు. రక్షాబంధన్ చేతికి ముడివేసారు. మేడలపై నుంచి నాయకులపై పూలు చల్లినారు. పిల్లలు, పెద్దలు ఇస్తున్న జై తెలంగాణ నినాదాలతో వీధులన్నీ మార్మోగినవి.
మునిసిపల్ కార్పొరేషన్‌కు క్రొత్తగా ఎన్నికైన మేయర్ లక్ష్మీ నారాయణ, డిప్యూటీ మేయర్ ఎం. రామచంద్రయ్య, కార్పొరేటర్లు నేతలకు స్వాగత చెప్పారు. అనంతరం గౌలిగూడాలోని తెలంగాణ ప్రజాసమితి కార్యాలయంలో డా|| చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీలో కేంద్ర నాయకులు తెలంగాణ ఉద్యమం లోతుపాతులను గమనించినట్లు తమ సంభాషణల్లో అవగతమైందని, రాష్ట్రపతి పాలనను ప్రవేశపెడితే, ప్రత్యేక తెలంగాణకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రతిపాదనల గురించి చర్చిండానికి తాము సిద్ధంగా వున్నామని డా|| చెన్నారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి మారినంతమాత్రాన చాలునని తాము చెప్పినట్లు వచ్చిన వార్తలు సరికాదని, ముఖ్యమంత్రి మార్పుతో తమకు సంబంధంలేదని డా|| చెన్నారెడ్డి అన్నారు.
సెప్టెంబర్ ఒకటినుండి విద్యాసంస్థలు పునః ప్రారంభం ప్రభుత్వం విద్యా సంస్థలను 1969 సెప్టెంబరు ఒకటినుండి ప్రారంభించాలని నిర్ణయించింది. విధ్యార్థులంతా తరగతులకు హాజరుకావాలని కోరింది.
సదాలక్ష్మి అధ్యక్షతన బహిరంగసభ
1969 ఆగస్టు 30న జైలునుండి తెలంగాణ నేతలు విడుదలైన సందర్భంగా హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో వేలాది మందితో బహిరంగసభ జరిగింది. సదాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో డా|| చెన్నారెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ విధ్యార్థులను స్కూళ్లకు పంపే ప్రయత్నం రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల కోర్కెను గౌరవించాలని తెలంగాణ ప్రజల కోర్కెల విషయంలో తాము మెత్తబడేదిలేదని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమం కానట్లయితే విద్యార్థులు దూరంగా ఉండేవారని విద్యార్థులు బడికిపోరని ఆయన చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోను, రాజమండ్రి నుండి ఢిల్లీయాత్రలోనూ తాము ఎంతటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నది డా|| చెన్నారెడ్డి సుదీర్ఘంగా వివరించారు. డిటిన్యూలకు సరైన సదుపాయాలు కలిగించలేదని అన్నారు. కొందరు ఉద్యమకారులు చెన్నారెడ్డికి రక్త తిలకం పెట్టారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ మాట్లాడుతూ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం గుండాలను వాడుకున్నదని, తామెవరూ హింసాత్మక చర్యలకు ప్రేరేపించలేదని చెప్పారు. నెలా పదిహేనురోజులక్రిందట ముఖ్యమంత్రి మనిషి ఒకరు నావద్దకు వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, తార్వత మీరే ముఖ్యమంత్రి అవుతారని బేరాలు పెట్టాడు. పదవి కావలిస్తే ముందు మంత్రి పదవి ఎందుకు వదులుకంటాను? నాకు పదవి అక్కర్లేదు అన్నారు బాపూజీ. పిల్లలు ఏమీ సాధించకుండా బడికి ఎలా వెడతారు? ప్రత్యేక తెలంగాణ వచ్చాక పిల్లలకు ఏమీ నష్టం లేకుండా చేస్తాము. ఏడాదికి రెండు తరగతులు పూర్తి చేస్తామన్నారు బాపూజీ.
ప్రజా సమితి ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్ మాట్లాడుతూ తెలంగాణ, పోలీసు అత్యాచారాలు వంటి అంశాలపై అంతర్జాతీయ న్యాయమూర్తులచే దర్యాప్తు చేయించాలన్నారు.
బ్రహ్మానందరెడ్డి రెండువందలమందిని చంపించాడు. ఆయనను మేమంతా సులువుగా వదిలపెట్టమని అచ్యుతరెడ్డి అన్నారు.
ఈ సభలో బద్రీవిశాల్ పిట్టీ, ఎస్.బి. గిరి, రమాకాంతరావు, ఎల్లప్ప, వెంకటరెడ్డి, మాజీ మేయర్ శ్రీమతి కుముద్‌నాయక్ తదితరులు మాట్లాడారు.
34మంది బాలికల అరెస్టు
రవీంద్రభారతి సమీపంలో నిషేధాజ్ఞులు ఉల్లంఘించిన 34మంది విద్యార్ధినులను అరెస్టు చేశారు. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు పరిశీలనకు సంఘం కోరిన నీలం సంజీవరెడ్డి దేశమంతటిలోనూ భాషా రాష్ట్రాల వ్యవస్థను పరిశీలించి ఉత్తమమైన, ఇప్పటికన్నా సమరశీవవంతమైన పరిపాలనకు చిన్న రాష్ట్రాల ఏర్పాటు మంచి చెడ్డలను విచారించడానికి, తెలంగాణ సమస్య పరిష్కారానికి హైదరాబాదులో రౌండ్‌టేబుల్ సమావేశం పెడితే అంతా సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరవచ్చని నీలం సంజీవరెడ్డి హైదరాబాదులో పత్రికా ప్రతినిధులతో అన్నారు. తమతో భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వారిని జైలుకు పంపించడంద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు.
నీలంపై వావిలాల విమర్శ
చిన్న రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనకు మరో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేయాలని నీలం సంజీవరెడ్డి సూచించడం విచారకరమైని వావిలాల గోపాలకృష్ణయ్య అన్నారు. సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కృషిచేసిన వారిలో ముఖ్యులని, ఆయన సూచన కంచెనే చేను మేసినదన్న సామెతను పోలి ఉందన్నారు వావిలాల. తెలంగాణ ఏర్పాటుకు నీలం సంజీవరెడ్డి కృషి అవసరమని డా|| చెన్నారెడ్డి అన్నారు. సంజీవరెడ్డి చేసిన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు సూచనపై చెన్నారెడ్డి వ్యాఖ్యానిస్తూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం ఏర్పడిందని, రెండు రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం నియమించేదాకా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపవలసిన అవసరం లేదన్నారు. నీలం సూచనను కొండా లక్ష్మణ్ తిరస్కరించారు. తెలంగాణకు సంబంధించినంత వరకు ఫజల్ అలీ కమిషన్ తీర్పు ఉండగా మరో కమిషన్ అవసరం లేదని బాపూజీ వ్యాఖ్యానించారు.
తెలంగాణ వచ్చేదాకా విద్యాసంస్థల బహిష్కరణకై విద్యార్థుల నిర్ణయం
సెప్టెంబర్ ఒకటినుండి విద్యాసంస్థలను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రాంత విద్యార్థి ప్రతినిధుల సమావేశం వ్యతిరేకించింది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు స్కూళ్ళు, కాలేజీలు బహిష్కరించాలని విద్యార్ధి ప్రతినిధులు నిర్ణయించారు. విద్యార్థులు తరగతులకు హాజరుకావద్దని వీరు పిలుపునిచ్చారు. 8 నెలలుగా విద్యాసంస్థలు పనిచేయడం లేదు.
విద్యాసంస్థలను తెరవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ
కొందరు విద్యార్థులు సెప్టెంబర్ 5న ఉస్మానియా వైద్య కళాశాలలో నాటుబాంబు విసిరినారు. ఎవరికీ గాయాలు కాలేదు. పెద్ద శబ్ధంతో బాంబు పేలింది. తరగతులలోవున్న విద్యార్థులు భయంతో బయటికి పరుగులు తీశారు. పదిరోజుల క్రితం ఉస్మానియా వైద్య కళాశాలను తిరిగి ప్రారంభించిన తర్వాత బాంబులు ప్రేలడం ఇది రెండోసారి.
స్టడీ అండ్ స్ట్రగుల్
తరగతులను బహిష్కరించాలని తెలంగాణ విద్యార్థి ప్రతినిధులసభ, టీపీఎస్ పిలుపునిచ్చినా ఆ పిలుపును లెక్కజేయకుండా వివిధ విద్యా సంస్థలలో విద్యార్థులు తరగతులకు హాజరు కావడం మొదలైంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థి నాయకులు కొల్లూరి చిరంజీవి తదితరులు స్టడీ అండ్ స్ట్రగుల్ (చదువుతూ ఉద్యమిద్దాం)అని నినాదమిచ్చారు.
శాసనసభలో తెలంగాణ లొల్లి
తెలంగాణలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని గురించి తక్షణమే సభలో చర్చ జరపాలని వాదిస్తూ కొందరు ప్రత్యేక తెలంగాణ కోరుతున్న శాసనసభ్యులు సభా నిర్వహణకు అడ్డు తగిలారు. సభాపతి బి.వి. సుబ్బారెడ్డి వారి కోర్కెను త్రోసివేసినందుకు నిరసనగా గంటన్నరసేపు సభను స్తంభింపజేసి కొండా లక్ష్మణ్ నాయకత్వంలో దాదాపు 15మంది సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. సభలో జై తెలంగాణ నినాదాలిచ్చారు.
పోలీసులనుండి రక్షించమని సభాపతిని కోరిన ఎమ్మెల్యే
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకులు, శాసనసభ్యుడు పోల్సాని నర్సింగరావు ప్రివెంటివ్ డిటెన్షన్ క్రింద పోలీసులు అరెస్టు చేసే ప్రమాదం ఉన్నందున తనను శాసనసభలోనే ఉండేలా అనుమతించాలని ఆయన సభాపతిని కోరారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు సమాప్తమయ్యేదాకా తనను అసెంబ్లీలోనే ఉండనివ్వాలని కోరగా మరుసటిరోజు సాయంత్రందాకా అసెంబ్లీలో ఉండడానికి సభాపతి బి.వి. సుబ్బారావు అనుమతించారు. ఒక సభ్యుడు సభాపతి రక్షణ కోరడం అందుకు సభాపతి అనుమతించడం ఇదే ప్రథమం.
ముఖ్యమంత్రికి, తెలంగాణ ఎమ్మెల్యేలకు మధ్య సభలో మాటలయుద్ధం
తెలంగాణ పరిస్థితిపై శాసనసభలో చర్చ జరుగాలని సెప్టెంబరు 2న కూడా తెలంగాణ కోరే ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో చాలాసేపు సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ్యులకు, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి మధ్య 70 నిముషాలసేపు వాగ్వాదం జరిగింది. ఈ సంఘర్షణకు సంబంధించిన మాటలను సభాపతి రికార్డులనుండి తొలగించారు.
ప్రివెంటివ్ డిటెన్షన్‌నుండి ముందురోజు విడుదలైన శాసనసభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి ఈశ్వరీభాయి సభలో జై తెలంగాణ నినాదాలిచ్చారు. తమను అరెస్టుచేసి 15 రోజులకుపైగా జైలులో నిర్భంధించడంవల్ల శాసనసభ సమావేశాల్లో పాల్గొనలేకపోయామని, ఇది సభాహక్కులకు భంగం కలిగించడమేనని వారు అన్నారు. అరెస్టులపై హక్కుల తీర్మానాన్ని ప్రతిపాదించడానికి అచ్యుతరెడ్డి, మరికొందరు సభ్యులు నోటీచ్చారని, వాటిని తాము పరిశీలించగలమని సభాపతి చెప్పారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక స్త్రీని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం క్రింద అరెస్టు చేశారని ఈశ్వరీబాయి సభకు తెలిపారు. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంక్రింద తొలిసారి ఒక గెజిటెడ్ అధికారి (డా|| గోపాలకిషన్)ని అరెస్టు చేయడం తెలంగాణలో జరిగింది.
తెలంగాణ డిటెన్యూలందరి విడుదల-వారంట్ల ఉపసంహరణ
తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం క్రింద ఇంకా నిర్బంధంలో ఉన్న వారందరినీ విడుదల చేయడానికి సెప్టెంబరు 5న ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా కొందరిపై ఉన్న అరెస్టు వారంట్లను కూడా ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణా ప్రాంతీయకమిటీ సూచనను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి సభకు తెలిపారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం 64మందిని, తనకు తానుగా 35మందిని ప్రభుత్వం విడిచిపెట్టిందని, ఇంకా 74మంది జైళ్లో వున్నారని, 15మందిపై వారంట్లు వున్నాయని సీఎం సభలో ప్రకటించారు.
(అధికార, విపక్ష కాంగ్రెస్ నేతల తెలంగాణ సభలు, వాంఛూ కమిటీ రిపోర్టు వచ్చే సంచికలో)