శిల్పాలకు నమూనాలుగా నిలవడంతప్ప, కలకాలం శిల్పులుగా నిలబడే మహిళలు అరుదు. అయినా, ఆ రంగంలో అహో! అనిపించే అపురూపమైన శిల్పాలు చెక్కి, సమకాలీన శిల్పకళా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని స్వంతం చేసుకున్న ప్రవర్ధమాన శిల్పి – రోహిణీరెడ్డి.
టి. ఉడయవర్లు
దేవాలయ శిల్పాలనుంచి ప్రేరణపొంది ఆమె శిల్పాలు రూపొందిస్తారు. ముఖ్యంగా మహిళల శిల్పాలు ఆమె పనితనానికి పరాకాష్ఠలు. ఆమె చెక్కిన శిల్పాల ముఖాలు చూడచక్కనివి. పరీక్షగా చూస్తే-అన్నింట్లో రోహిణి ముఖమేనేమోననే భ్రాంతి కలుగుతుంది. భంగిమల్లో మాత్రం బోలెడంత భేదముంటుంది. జీవం ఉంటుంది. ఎలాంటి దాపరికంలేకుండా ఆ బొమ్మల్లో ఆడతనం తొణికి సలాడుతుంది. ఆమె రూపులుదిద్దే కళాకృతులలో అప్పుడప్పుడు మగశిల్పాలు ఉన్నా, ఇతివృత్తపరంగా అవి సహాయకారిగానే ఉంటాయి. ఒక్కమాటలో ఆమె శిల్పాలన్నింటికీ ఆడదే ఆధారం. ఎక్కువగా కాంస్యంతో, శిలతో, ఫైబర్‌గ్లాస్‌తో, టెర్రాకోటాతో ఆమె శిల్పాలు రూపొందిస్తారు. ఇటీవల ఆమె చిత్రకళపై అంటే డ్రాయింగ్ లోనూ సాధన ఎక్కువగా చేస్తున్నారు. అందులోనూ మూర్తులన్నీ శిల్పంలోలాగే ఉంటాయి. మాధ్యమంలో మాత్రమే వైవిధ్యం ద్యోతకమవుతుంది. మట్టిముద్దలను మాణిక్యాలలాంటి శిల్పాలుగా మలిచే రోహిణి సూరత్‌లో ఉపాధ్యాయిని పూర్ణిమాబెన్, సుప్రసిద్ధ శిల్పి-నరోత్తమ్ లుహర్‌ల ముద్దుల కూతురు. ఆమె బాల్యంలో తండ్రిని చూసి బొమ్మలు చేయడం ప్రారంభించింది. తండ్రి చేసే శిల్పాల ప్రభావం ఆమెను శిల్పకళా విద్య నేర్చుకోవడానికి దోహ దం చేసింది. అహ్మదాబాద్‌లోని సి.ఎన్. లలితకళల కళాశాల నుంచి శిల్పంలో డిప్లొమాలో ఉత్తీర్ణురాలైంది. అనంతరం బరోడా లోని ఎం.ఎస్. విశ్వవిద్యాలయంనుంచి 1990లో శిల్పంలోనే స్నాతకోత్తర డిప్లొమా పూర్తి చేశారు. అప్పుడే తన క్లాస్‌మేట్, సృజనాత్మక శిల్పి, చిత్రకారుడైన బి. శ్రీనివాసరావుతో పాణి గ్రహణమైంది. అయినా, నిరాటంకంగా శిల్పిగా ఆమె రోజు రోజుకు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూనే ఉన్నది. కొంతకాలం హైదరాబాదులోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని లలితకళల కళాశాల, శిల్ప విభాగంలో ఆచార్యగా ఎందరో యువ శిల్పులకు పాఠాలు చెప్పింది, పనిచేసి, వారితో చేయించింది.
నిజానికి ఆమె ఒక పని రాక్షసి. ఎందుచేతనంటే వృద్ధాప్యం లోఉన్న అమ్మా-నాన్నలు తమ ఇంటి సమీపంలోనే ఉంటున్నం దున ఒకవంక వారి యోగక్షేమాలు చూస్తూ, మరోవంక-ఇంట్లో తల్లిగా పిల్లల బాగోగులు పర్యవేక్షిస్తూ, ఇంకొకవంక, గృహిణిగా తన విధులు నిర్వర్తిస్తూ, వేరొకవంక-తనలో చిగురించిన కళాద్రుమం మూడుపువ్వులు-ఆరుకాయలుగా వర్థిల్లడానికి దోహదం చేస్తూ రోహిణి-బహుముఖ వ్యాపకాలలో రోజంతా మునిగిపోయి ఉంటుంది.
శిలలపై శిల్పాలు చెక్కడం, కలపతో కమనీయమైన బొమ్మలు రూపొందించడం లేదా ముందుగా ముచ్చటైన నమూనాలు తయారు చేయడం, ఆ తర్వాత తాను చేయదలుచుకున్న లోహంతో శిల్పం పోతపోయడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఈ రంగంలోకి ఆడవాళ్లు అట్టే రావడంలేదు.
ఈ మాధ్యమం చాలా కష్టమైందైనా, ఎంతో ఇష్టంతో ఇందులో ప్రవేశించిన రోహిణి శిల్పాలకు, కళాహృదయుల ప్రశంసలే కాకుండా పలు ప్రతిష్ఠాత్మక సంస్థలనుంచి అవార్డులు లభించాయి. 1998లోనే హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డు, 2002లో, 2004లో ఎఐఎఫ్‌ఏసిఎస్ అవార్డులు వచ్చాయి. 2012లో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం ప్రదానం చేసింది. 2016లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగానూ ప్రభుత్వం పురస్కారం అందజేసింది.
1989లో బరోడా లోని ఎం.ఎస్. విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పదమూడుమంది యువశిల్పుల శిబిరంనుంచి, 2016లో భోపాల్‌లో నిర్వహించిన ‘అవధాన్’ సింహస్థ జాతీయ శిల్పకళా శిబిరందాకా ఆమె పాల్గొని తనముద్రగల శిల్పాలను రూపొందించారు. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన టెర్రకోటా శిబిరంలో, నాగపూర్ దక్షిణమధ్య సాంస్కృతిక కేంద్రం వారు 1991లో పూనాలో ఏర్పాటు చేసిన శిబిరంలో, 1999లో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కళామేళా’లో 2001లో చెన్నై ప్రాంతీయ కేంద్రం బెంగుళూరులో ఏర్పాటు చేసిన రాయి చెక్కడం శిబిరంలో, హైదరాబాదులోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం 2002లో నిర్వహించిన టెర్రాకోటా శిబిరంలో, 2003లో సృష్టి ఆర్ట్ గ్యాలరీవారు టెర్రాకోటా నుంచి కాంస్య బొమ్మలతయారీ శిబిరంలో, చెన్నై ప్రాంతీయ కేంద్రం విశాఖపట్నంలో 2003లో ఏర్పాటు చేసిన ‘ఫైబర్ గ్లాస్’ శిబిరంలో, 2004లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన అఖిలభారత కళాకారుల శిబిరంలో, 2014లో తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎట్ తెలంగాణ శిబిరంలో, గ్వాలియర్‌లో అష్టమ అంతర్జాతీయ శిల్పకళా ఆనవాళ్ళ శిబిరంలో, 2015లో కోలకతాలోని బిర్లా అకాడమి ఆఫ్ ఆర్ట్‌వారు ఏర్పాటుచేసిన కాంస్య శిల్పాల శిబిరంలో రోహిణి పాల్గొని తీర్చిదిద్దిన శిల్పాలన్నీ ఆమె ప్రావీణ్యతను చాటాయి. బోలెడు ప్రశంసలు తెచ్చాయి. అయితే ఈ శిబిరాల్లో 1991 తర్వాత ఎనిమిదేళ్లు, 2004 తర్వాత పదేండ్లు ఒక తల్లిగా పిల్లలను చూడవలసిన బాధ్యతతో పాల్గొనలేకపోయింది. అలాగే ఆమె దాదాపు అరవై పర్యాయాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమష్టి కళా ప్రదర్శనలలో పాల్గొని తన సత్తా ఏమిటో, సాటి ప్రపంచానికి ప్రస్ఫుటం చేశారు. దుబాయ్, కొలరాడోలలో నిర్వహించిన కళా ప్రదర్శనలలోనూ ఆమె పాల్గొనడం విశేషం.
1986, 87, 88, 89, 90లలో యేటా ఒక్కొక్క సమష్టి కళా ప్రదర్శనలో పాల్గొన్న రోహిణి 2007లో ఏడు కళా ప్రదర్శనలలో ముంబైలోని స్టూడియో నొపిన్ అతసో గ్యాలరీలో, హైదరాబాదులోని లక్ష్మణ ఆర్ట్ గ్యాలరీలో, న్యూఢిల్లీలోని శ్రీధరన్ ఆర్ట్ గ్యాలరీలో, జైపూర్‌లోని సమన్వయి ఆర్ట్‌గ్యాలరీలో, చెన్నైలోని విన్యాస్ ప్రీమియర్ ఆర్ట్ గ్యాలరీలో, కోల్‌కత్తాలోని బిర్లా అకాడమి ఆర్ట్ కల్చర్ ప్రదర్శనలో, న్యూఢిల్లీలోని గ్యాలరీ ఎన్‌వివైఎలో నిర్వహించిన కళా ప్రదర్శనలో పాల్గొన్నారు. అట్లాగే 2011లో ఆరు సమష్టి ప్రదర్శనలలో, 2013లో ఐదు సమష్టి కళా ప్రదర్శనలలో, 2009లో, 2003లో నాలుగేసి సమష్టి కళా ప్రదర్శనలలో, 1999, 2001, 2008, 2010, 2014లలో మూడేసి సమష్టి కళా ప్రదర్శనలలో, 1998, 2002, 2004, 2005, 2016లో రెండేసి సమష్టి కళా ప్రదర్శనలలో పాల్గొని-తన నిరంతర కళాపిపాసను, ప్రతిభను వ్యక్తం చేశారు. ఆమె ఇల్లే స్టూడియో కావడంవల్ల ఎప్పుడూ ఆమె ధ్యాస కళాకృతులపైనే.
ఇది ఇలా ఉండగా-కొన్ని ప్రైవేట్ సంస్థల కోరిక మేరకు ఆమె శిల్పాలు తయారు చేస్తు న్నారు. ఈ శ్రేణిలో రెడ్డి ల్యాబ్స్‌వారి కోసం ఏడడుగుల ఎత్తుగల కూర్చున్న బొమ్మ తయారు చేశారు. ఇలాంటి శిల్పాలు ప్రారంభిస్తే మధ్యలో నిలిపివేయకుండా, పూర్తి చేయవలసి ఉంటుంది. పూర్తయిందంటే-ఇంట్లో పెట్టుకోలేక వెంటనే వారికి ఇచ్చేయాలి. ఇలాంటి విశిష్టమైన కళను పూర్వకాలంలో రాజులు పోషించేవారు. ఇవ్వాళ్ళ రాజులు లేరు కాబట్టి ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అప్పుడే ఈ కళ నిత్యనూతనంగా ఉంటుంది. పెద్దసంఖ్యలో యువతీ, యువకులు ఈ కళను అభ్యసిస్తారని రోహిణి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె సామాజిక అవగాహనతో నిలువెత్తు ప్రయాణంలో మహిళల డ్రాయింగ్స్ గీయడంలో నిమగ్నమై ఉన్నారు.
ఒక గొప్ప శిల్పికి కూతురు, మరో ప్రసిద్ధ శిల్పికి భార్య అయిన రోహిణి స్వయంగా సృజనాత్మక శిల్పి కాబట్టి-తన కుమారుడ్ని సైతం చిత్రకారుడిగా తీర్చిదిద్ది తన కర్త వ్యాన్ని సుగ్రీవాజ్ఞగా ఆచరిస్తున్నది.