kcr

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సమాధానం

పొరుగు రాష్ట్రాలతో జలవివాదాలు సృష్టించి తెలంగాణ ప్రాజెక్టులను జాప్యం చేయాలనే ఆంధ్రా నాయకుల కుట్రల వల్లనే తెలంగాణ ప్రాజెక్టులు ఆలస్యమయ్యా యని, ఆ విషవలయాలను ఛేదించి పక్క రాష్ట్రాలతో సత్‌ సంబంధాలను ఏర్పాటు చేసుకుని, ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే తాము మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోవడానికి సిద్దపడ్డామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై మార్చి 13న అసెంబ్లీ, కౌన్సిల్‌లలో జరిగిన చర్చకు ఆయన రెండు సభలలోను సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. అయిదు సంవత్సరాల్లో గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్న మన నీటి వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకునే దిశగా తాము ప్రాజెక్టులు రీ డిజైనింగ్‌ చేస్తున్నామన్నారు. గత పాలకులు ప్రాజెక్టుల పేర వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారే కానీ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని విమర్శించారు. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్న విషయంలో పలు విమర్శలు చేస్తున్నారని, కానీ ఈ ఒప్పందం చేసుకోవడం వల్లనే ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్‌ సంబంధాలు నెరవేర్చడానికి వారితో అడ్డంకులు తొలగించుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. పలు క్లియరెన్స్‌లు తేవడానికి ఏళ్ళు గడిచిపోతున్నాయని, అందుకే త్వరగా క్లియరెన్స్‌ వచ్చి ప్రాజెక్టులకు నిర్మాణాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే తాము మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.

గవర్నర్‌ ప్రసంగం టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలాగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్‌ చదువుతారని, అది రాజ్యాంగబద్దమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇది తెలిసి కూడా రాద్దాంతం చేయడమేమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందా అని సి.ఎం. ప్రశ్నించారు. 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తామని, రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పి నెరవేర్చిందా అన్నారు. తండాలు గ్రామ పంచాయతీలు, ప్రతి ఇంటికి గ్యాస్‌ కనెక్షన్‌, తదితర ఏ హామీని గత ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల లోపే 90 శాతం హామీలను నెరవేరుస్తున్నదన్నారు. కేవలం ప్రాజెక్టులే కాకుండా సంక్షేమ పథకాల అమలు విషయంలోను తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు.

ఎన్నికల హామీలో భాగమైన తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చే ప్రక్రియ వచ్చే పంచాయతీ ఎన్నికల లోపు పూర్తవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ విత్తనాలు, ఎరువులు రైతులకు కొదవ లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తు పోలీసుశాఖను ఆదునీకరించామన్నారు. గతంలోకంటే 14శాతం నేరాలు తగ్గాయన్నారు. వీటితో పాటు విద్యా, వైద్య రంగాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రుల నిర్వహణ అధికారాన్ని డాక్టర్లు, సూపరిండెంట్లకే అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతినెల ఒక బెడ్‌కు రూ. 5వేల చొప్పున తమిళనాడు తరహాలో కెటాయిస్తామన్నారు. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు గురుకులా లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యారంగాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలు ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నదన్నారు. ఇంటింటికి నల్లానీరు ఇచ్చే మిషన్‌ భగీరథ దేశం మొత్తంలోనే అన్ని రాష్ట్రాలతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి స్పూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. మిషన్‌ కాకతీయ పలువురు మేధావుల ప్రశంసలందుకుందన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు

కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన కమిటీ వేశామని తెలిపారు. ఆ కమిటీ జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నదన్నారు. విభజన చట్టం ప్రకారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య పెరగాల్సి ఉందన్నారు. ఈ స్థానాలు పెరిగిన తరువాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలా, ముందే చేయాలా.. అనే విషయాన్ని పరిశీలించి నిర్ణయిస్తామన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రజలకు ఏది మంచిదైతే దానికి అనుగుణంగానే పాలన సాగిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శాసనసభ, శాసనమండలిలో మొత్తం సుదీర్ఘ ప్రసంగంలో గత పాలకులు చేసిన తప్పిదాలతో పాటు, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, పాలనా సంస్కరణలు తదితర విషయాలను కూలంకషంగా వివరించారు.

Other Updates