‘‘దీపం జ్యోతి: పరబ్రహ్మ
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే”
జ్ఞానానికి, ఆనందానికి, భయరాహిత్యానికి మారుపేరుగా నిలిచే దీపానికి నమస్కరించడం భారతీయ సంప్రదాయం. ముల్లోకాలలోని చీకట్లను తొలగించి వెలుగులు ప్రసరించాలని ప్రార్థిస్తారు.
పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. భారతదేశంలోని ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగ అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలు పేద, ధనిక తారతమ్యం లేకుండా జరుపుకుంటారు. ఉత్తరభారతదేశంలో ఈ పండుగను ఐదురోజులు, దక్షిణభారతదేశంలో మూడురోజులు జరుపుకుంటారు. దీపావళి పండుగను ఆయా ప్రాంతాల్లో ఆయా పేర్లతో పిలుస్తారు. యక్షరాత్రి, సుఖరాత్రి, సుఖ సుప్తిక, కౌముదీ మహోత్సవం, దీపాలిక, దీపావళిగా పిలువబడే ఈ పండుగను మన ప్రాంతంలో దివ్వెలపండుగ, దివిటీ పండుగ అని అంటారు.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి కార్తీక శుద్ధ విదియ వరకు దీపావళి పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదురోజులు, కొన్ని ప్రాంతాల్లో మూడురోజులు జరుపుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా, అమావాస్యను దీపావళిగా పరిగణిస్తారు.
లోక కంటకుడైన నరకాసురుడిని విష్ణుమూర్తి శ్రీకృష్ణావతారంలో భూదేవి అవతారమైన సత్యభామతో కలిసి సంహరిస్తాడు. స్త్రీ ఆదిశక్తిగా తన స్వరూపాన్ని ప్రదర్శించి పుత్రుడైన నరకుడిని చంపి లోకహితం చేకూరుస్తుంది. నరకుడి బాధల నుండి విముక్తులైన ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకుంటున్నారు. నరకాసురుని వధ జరిగిన రోజును స్మరిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే లోక వ్యవహారంలో చెడుమీద మంచి విజయం, చీకటి నుండి వెలుగు, అజ్ఞానం నుండి జ్ఞానం అనే పలు అర్థాల్లో పెద్దలు చెప్తున్నారు.
దీపావళి పండుగను చేసుకునే విధానం గురించి ధర్మశాస్త్రాదుల్లో వివరంగా చెప్పబడింది. త్రయోదశినాడు రాత్రి అపమృత్యు నివారణ కొరకు దీపాన్ని వెలిగించి ఇంటిముందు పెట్టాలి. దీన్ని యమదీపం అంటారు. నరక చతుర్దశి నాడు తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి ఉత్తరేణి కొమ్మలు, మట్టిపెళ్లలతో ఇంట్లోనివారంతా దిష్టి తీయించుకోవాలి. ఆధునిక కాలంలో మంగళహారతులు తీసుకుంటున్నారు. యముడికి నువ్వులతో తర్పణం ఇవ్వాలి. యముడు మన దరిదాపుల్లో రాకుడదనే అంతరార్థం ఇందులోని మర్మం. నరకాసురుని జ్ఞాపకార్థం నాలుగు శిఖలు గల దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా చతుర్దశిరోజు నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగ కొలువై
ఉంటారు కాబట్టి ఆరోజు లక్ష్మీపూజ విశేషమైందిగా పరిగణింపబడుతుంది.
”చతుర్దశ్యాం యే దీపాన్ నరకాయ దదంతిన
తేషాం పితృగణాస్సర్వే నరకాత్ స్వర్గమాప్నుయ:”
ఎవరైతే నరక చతుర్దశినాడు దీపారాధన చేసి యముడిని పూజిస్తారో వారి పితృదేవతలు నరకం నుండి విముక్తి పొంది స్వర్గం చేరుకుంటారని చెప్పబడింది.
ఐదురోజుల దీపావళి పండుగలో మూడవరోజు అమావాస్య. ఈరోజు ఉదయమే తలస్నానం చేసి లక్ష్మీపూజ చేయాలి. శరదృతువు శక్తికి ప్రీతికరమైంది. శరదృతువులోనే అమ్మవారి నవరాత్రులు నిర్వహించబడతాయి. ఈ నెలలోనే అమావాస్యనాడు దరిద్రాన్ని తొలగించి సంపదలు కలగాలనే కోరికతో లక్ష్మీపూజ చేస్తారు. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ఎవరికి ఏది లోపం ఉందో దాన్ని తొలగించుకోవాలనే కోరికతో ఆ లోపనివారణకు చేసే పూజ, తత్ఫలితంగా లభించే ఫలం సంపద. దీపం వెలిగించడం అంటే జ్ఞానజ్యోతిని వెలిగించడమే. తద్వారా దైవత్వం సాక్షాత్కరిస్తుంది. దీపకాంతిలో నీలం, తెలుపు, ఎరుపువర్ణాలు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతులకు సంకేతంగా చెప్తారు. త్రిశక్తి స్వరూపిణియైన ఆ జగన్మాతను సేవించడం ఆశ్వయుజ బహుళ అమావాస్య విశిష్టత.
నాలుగవరోజు కార్తీక శుద్ధ పాడ్యమి నాడు బలిపూజ చేయడం విశేషం. దీన్ని బలిపాడ్యమి అంటారు. విష్ణుమూర్తి వామనాకారుడై బలిచక్రవర్తిని పాతాళానికి అణచివేసి, అతని దానశీలతకు మెచ్చి చతుర్దశి, అమావాస్య పాడ్యమి – ఈ మూడురోజులు బలి రాజ్యమని, అతని ప్రీతికోసం పూజ చేయాలని ఆదేశించాడు. పాడ్యమిరోజు బలిపూజతో ఆనాటి కార్యక్రమం పూర్తవుతుంది.
కార్తీక శుద్ధ విదియను యమ ద్వితీయ, భ్రాతృ ద్వితీయ అని పిలుస్తారు. దీపావళి ఐదురోజుల్లో ఇది చివరిరోజు. ఈరోజు యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి వస్తాడట. ఇక్కడ భోజనం చేసి పూర్వపు జ్ఞాపకాలను గుర్తుచేసుకొంటాడని చెప్తారు. ఆధునిక కాలంలో సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతివంట భోజనం చేసి తోచిన బహుమతు లను ఇవ్వడం సంప్రదాయంగా మారింది.
బలి చక్రవర్తి కథ పౌరాణికంగానే కాక జ్యోతిష సంబంధమైనది కూడ. విష్ణుమూర్తి వామనాకారంలో బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలం కోరినాడు. మొదటి రెండు పాదాలు భూమ్యా కాశాలను ఆక్రమించగా మూడవ అడుగుకు బలి తన తలను చూపాడు. వామనుడు మూడవ అడుగుతో బలిని పాతాళానికి అణచివేశాడు. పాతాళం అంధకారానికి చిహ్నం. విష్ణువు సూర్యుడే. తులా సంక్రమణం నుండి మేష సంక్రమణం వరకు సూర్యుడు అడుగున ఉండడం వల్ల ఆరు నెలలు చీకటి ఉంటుంది. మళ్ళీ తమకు సూర్యుడు కనిపించడానికి సూర్యుడిని అంటే విష్ణువును ప్రార్థిస్తూ దీపోత్సవం జరుపుతారు. కార్తీకమాసం మొత్తం దీపాలతో అలంకరించడం కూడా దీనికి సంకేతం.
నరకాసుర వధకు సంబంధించి ఈ పండుగ చేసుకుంటాం కానీ రామాయణంలో కూడా ప్రజలు దీపాలతో నగరాన్ని అలంకరించి దీపావళి జరుపుకున్నట్లు తెలుస్తుంది. రావణుని సంహరించినందుకు విజయోత్సవంగా విజయదశమిని జరుపుకుంటారు. సీతాదేవితో కలిసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి, పట్టాభిషిక్తుడై పరిపాలన ఆరంభించినందుకు గుర్తుగా అయోధ్య నగర వాసులందరూ నగరాన్ని దీపాలతో అలంకరించి దీపావళి జరుపుకున్నారని చెప్తారు. దీపావళిని పలుప్రాంతాల్లో ‘భరత్ మిలాప్’గా జరుపుకుంటారు.
భారతదేశంలో దీపావళి పండుగ జరుపుకునే సమయం ఒకటే అయినప్పటికీ జరుపుకునే విధానంలో తేడాలు ఉన్నయి. ప్రతి వ్యక్తి తన ప్రాంత అస్తిత్వాన్ని, విశిష్టతలను కాపాడుకుంటూ ఆచార సంప్రదాయాలను పాటిస్తాడు. ఆయా మతాలవారు వివిధతీరుల్లో దీపావళిని జరుపుకుంటూ ఆనందిస్తున్నారు.
మన దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో ఈ పండుగను మూడురోజులు జరుపుకుంటారు. అందులో మొదటిరోజు నరక చతుర్దశి, మూడవరోజు బలిపాడ్యమికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. పాడ్యమిరోజు మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి బలి చక్రవర్తికి స్వాగతం పలుకుతారు.
మహారాష్ట్రలో ఈ పండుగను ఐదురోజులు ఎంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆవుకు, దూడకు హారతి ఇవ్వటంతో పండుగ ప్రారంభమవుతుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని వివిధ ఆభరణాలతో అలంకరించి లక్ష్మీపూజను చేస్తారు. రాత్రిపూట పటాకులు పేలుస్తారు.
ఒరిస్సాలో దీన్ని పెద్దల పండుగగా ఆచరిస్తారు. తమ వంశం పూర్వీకులు అమావాస్యరోజు ఆకాశంలో విహరి స్తారని చీకట్లో వారికి వెలుగులు చూపాలని బాణాసంచా కాలుస్తారు. దానివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందనే నమ్మకం వారిలో
ఉంటుంది. లక్ష్మీదేవికి పూజ చేయడమే కాకుండా పలు ప్రాంతాల్లో కాళిమాత విగ్రహాలు నిలిపి పూజలు చేస్తారు.
పశ్చిమబెంగాల్‌లో ఈ పండుగ ప్రత్యేకించి కాళిమాతకు సంబంధించినదిగా చెప్పవచ్చు. బీహార్‌లో, అస్సాంలో కూడా కాళిమాతతో పాటు లక్ష్మి, గణపతి విగ్రహాలకు కూడా పూజలు నిర్వహిస్తారు.
గుజరాత్‌లో దీపావళి ధన సంబంధమైన పండుగ. నరక చతుర్దశిని వీరు ‘ధన్‌తేరస్’ అంటారు. ఈరోజు లక్ష్మీదేవి పూజను చేసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఈ సంప్రదాయాన్ని అన్ని ప్రాంతాలలో అనుసరిస్తూ వ్యాపారస్తులు దీపావళిరోజున సాయం సమయాల్లో లక్ష్మీపూజలు నిర్వహిస్తున్నారు.
భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ సంస్కృతిలో భాగమై పండుగలను, ఉత్సవాలను కలిసి నిర్వహించుకొనే సంప్రదాయం అనూచానంగా వస్తుంది. తర తరాలకు ఈ సంస్కృతి అవిచ్ఛినంగా ప్రవహిస్తూ అజ్ఞానం నుండి జ్ఞానం వైపు అడుగులు మోపుతూ అందరూ జ్ఞానవంతులు కావలన్నదే ఈ దీపావళి పండుగలోని అంతరార్థం.
పౌరాణికంగా, చారిత్రకంగా దీపావళికి సంబంధించి కథలు మనకు కనబడుతున్నాయి. 1. సత్యభామతో కూడి శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించడం 2. బలి చక్రవర్తిని విష్ణుమూర్తి పాతాళానికి అణగద్రొక్కడం 3. శ్రీరామ, భరతుల పునస్సంగమం 4. విక్రమార్కుడు పట్టాభిషేకం చేసుకున్న రోజు.
డా. భిన్నూరి మనోహరి