మన చరిత ఇదేనని చెప్పి,
మరో చరిత్ర రాసే మోసపు పన్నాగం పన్నినపుడు…
మన నేతను మరుగున దాచి,
పరాయి వారిని పతాక శీర్షికలుగా నిలబెట్టినపుడు…
మన పండుగ దండుగని వెక్కిరించి,
మాయా ఉత్సవాలను మహా పర్వాలుగా రుద్దినపుడు…
మన బాసను యాసగ, గోసగా మార్చి,
పదుగురి భాషను ప్రామాణికమని ప్రకటించినపుడు…
చివరికి… చిట్ట చివరికి…
మన అమ్మనే మరుపున ఉంచి,
మరో మాతను మన నెత్తిన పెట్టి
స్వీకరించాల్సిందేనని ఆదేశించినపుడు..
ఎవని తెలుగు తల్లి? ఎక్కడి తెలుగు తల్లి! అని నిలదీయక తప్పదు.
టంగుటూరి ప్రకాశం ఎవరికి కేసరి అని నిగ్గడించక తప్పదు.
పొట్టి శ్రీరాములు ఏ ఆంధ్ర కోసం అమరుడయ్యాడని ఆరాలడగక తప్పదు.
తెలుగు జాతి వేరు, తెలంగాణ జాతి వేరు అని తేడా చూపించక తప్పదు.
తెలుగు భాష కన్నా, తెలంగాణ భాష మిన్న అని తెగించి తేల్చి చెప్పక తప్పదు.
కొత్త ఇల్లు కట్టుకోవాలంటే, పాత గోడను పడగొట్టక తప్పదు. సరికొత్త భావనను నిర్మించాలంటే, సనాతన బంధాలను తెంచివేయక తప్పదు. అది తప్పుకాదు. తెలంగాణ ఉద్యమ రథ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసింది అచ్చంగా ఇదే. పంచముఖాలుగా ఉద్యమం నడిపించడాన్ని తొలిదశగా, తెలంగాణ సంప్రదాయ ప్రతీకల అనుసంధానం ద్వారా ఉద్యమంతో ప్రజలను మమేకం చేయడాన్ని రెండో దశగా భావిస్తే, తెలంగాణకు సరికొత్త అస్తిత్వ చిహ్నాలను రూపొందించడాన్ని ఉద్యమ ప్రస్థానంలో మూడో కీలక ఘట్టంగా అభివర్ణించవచ్చు.
నిజానికి ఒక జాతి అస్తిత్వ చిహ్నాలు రూపుదిద్దుకోవడం అంత సులభంగా జరగదు. ఒకప్రాంతంలోని విభిన్న సామాజిక వర్గాల సుదీర్ఘ సామూహిక ప్రయాణంలో కాకతాళీయంగా ఇవి ఏర్పడతాయి. కొన్నిసార్లు ఎవరు తయారు చేశారో కూడా తెలియనంత నిగూఢంగా, అప్రయత్నంగా అస్తిత్వ చిహ్నాలు ఆవిర్భవిస్తాయి. కదపలేనంత బలంగా, తాకలేనంత పవిత్రంగా అలా చరిత్రలో నిలబడిపోతాయి. వాటిని విధ్వంసం చేయాలని చూసినపుడు, కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలని ప్రయత్నించినపుడు, వికార పరచాలని విషం చిమ్మినపుడు.. అవి అలా దృఢంగా నిలబడుతూనే, మనుగడ కోసం కొత్త మారాకులు వేస్తాయి. శిథిలాల శిశిరం నుంచే కొత్త సంకేతాలు వసంతాలాడుతూ వస్తాయి. తెలంగాణ ఉద్యమంలో ఇలా అనేక స్ఫూర్తిదాయక అస్తిత్వ చిహ్నాలు కొత్తగా ఆవిర్భవించాయి. జాతి మొత్తానికి సంకేతంగా నిలిచే, జాతి మనో భావనను, వేదనను వెల్లడించి, ఆలోచనను, అభిమతాన్ని, ఆవేశాన్ని ప్రకటించే సరికొత్త సంకేతాలు అవతరించడం ఇలా ఒక రాష్ట్ర సాధన ఉద్యమంలో చాలా అరుదు. ఈ అరుదైన అద్భుతమైన ఘట్టం తెలంగాణ ఉద్యమంలో సాకారమైంది. రాజకీయ మార్గంలోనే తెలంగాణను సాధించడం సాధ్యమని పదేళ్ల క్రితమే ప్రకటించినప్పటికీ, కేసీఆర్ ఉద్యమాన్ని మాత్రం సాంస్కృతిక పంథాలో నడిపించారు. అప్పటికే ఉన్న తెలంగాణ ప్రతీకలను పతాక స్థానంలో పరిరక్షిస్తూనే, సరికొత్త అస్తిత్వ చిహ్నాలను ఆవిష్కరించారు. అందుకే తెలంగాణ ఉద్యమం అనితర సాధ్యమైన సృజనాత్మక ఉద్యమం. సామాజిక, రాజకీయ, కళా, సాంస్కృతిక ఉద్యమం. దీనికి సాటి రాగలది భారత స్వాతంత్య్ర ఉద్యమం మినహా మరోటి లేదు.
తెలంగాణ సుసంపన్నమైన గడ్డ. రాజరికంలో అయితే రాజులు యుద్ధాల ద్వారా సంపన్న ప్రాంతాలను కబళించేవారు. కాకతీయులు, శాతవాహనులు, కుతుబ్‌షాహీలు, మొగలాయీలు, అసఫ్‌జాహీల పరిపాలనలో గడిపిన తెలంగాణకు ఇలాంటి ఆక్రమణలు కొత్తకావు. కానీ స్వతంత్ర భారత దేశం ఏర్పడిన తర్వాత ఆంతరంగికంగా ఇలా యుద్ధాల ద్వారానో, బలవంతంగానో రాజ్యాలను, వాటికి మరోపేరైన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పనికాదు. ఈ నేపథ్యంలోనే జాతి భావన, భాషా ప్రయుక్త భావన తెరపైకి వచ్చింది. అప్పటికే బ్రిటిష్ వారి సహచర్యంతో ఆరితేరిన పలు ప్రాంతాల వారు, ఇంగ్లీష్ పరిపాలనలోని కౌటిల్యాలను కూడా అలవరచుకుని ఇతర ప్రాంతాలపై ఆధిపత్యం కోసం భావోద్వేగ భరితమైన మానసిక యుద్ధాలకు దిగారు. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిందే ఒకే తెలుగు భాష, ఒకే తెలుగు జాతి, ఒకే తెలుగు రాష్ట్రం. ఈ పేరుతో సమైక్య భావనను రుద్ది, భావోద్వేగపరమైన మానసిక మమేకతను సాధించడానికి స్వాతంత్య్రానికి పూర్వమే ఆంధ్రా ప్రాంత నాయకులు పథకం వేశారు. ప్రయత్నాలు ప్రారంభించారు. 1950 నాటికి ఇవి మరింత ముదిరాయి. ఇందులో భాగంగానే తెలుగు మాట్లాడే వారిది ఒకే జాతి, వారికి ఉండాల్సింది ఒకే రాష్ట్రం అనే భాషా ప్రయుక్త భావన వెలుగుచూసింది. ఈ క్రమంలోనే తెలుగు తల్లి ఆవిర్భవించింది. భారతమాత లాగా జాతి పేరుతోనో, ప్రాంతంపేరుతోనో ఇలాంటి ప్రతీకలు ఏర్పడ్డ సందర్భాలు గతంలో ఉన్నవి. కానీ భాషపేరుతో తల్లి ఏర్పడడం బహుశా తెలుగులోనే మొదటిది కావచ్చు!
ఎవని తెలుగు తల్లి? ఎక్కడి తెలుగు తల్లి? అని కేసీఆర్ ప్రశ్నించినపుడు అంతా నివ్వెర పోయారు. తెలంగాణలోని కొందరు కూడా.. కేసీఆర్ ఏమిటి? ఇలా మాట్లాడుతున్నాడు? అని విస్తుపోయారు. అయితే వారికి తెలియనిది ఒకటుంది. ఇక్కడ తెలుగు తల్లి కేవలం గౌరవప్రదమైన అమ్మ భావనకు ప్రతీక కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చేసే ఒక దీర్ఘకాలిక పథకంలో భాగం. సమైక్య వాదుల చేతి ఆయుధం. ఆ ఆయుధాన్ని ఎదుర్కొనాలంటే దానికి దీటైన మరో ఆయుధాన్ని సృష్టించాల్సిందే. ఈ క్రమంలోనే తన సంచలన ప్రకటన ద్వారా తెలుగు తల్లి భావనను ప్రశ్నార్థకం చేసిన కేసీఆర్, తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు. కట్టుబొట్టులో తెలంగాణ తనాన్ని ప్రతిబింబించేలా, తెలంగాణ సంప్రదాయ ప్రతీకల సమాహారంగా తయారైన తెలంగాణ తల్లి అనతి కాలంలోనే ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంది. తెలంగాణవ్యాప్తంగా వేల సంఖ్యలో బస్టాండుల్లో, చౌరాస్తాల్లో విగ్రహాలు వెలిశాయి. మేం వేరు, మా రాష్ట్రం వేరు అన్న భావనను మౌనంగా, నిరంతరాయంగా, ఘనంగా చాటిచెబుతూ వచ్చింది.
సరికొత్త అస్తిత్వ చిహ్నాల ఆవిష్కరణలో మరో కీలక ఘట్టం జయజయహే తెలంగాణ గీతం. ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ కలం నుంచి అద్భుతమైన రీతిలో జాలువారిన, కేసీఆర్ సవరించిన ఈ గీతం అనధికారికంగా తెలంగాణ జాతీయ గీతంగా మారిపోయింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చాలా ఏళ్ల ముందు నుంచే పాఠశాలల ప్రార్థనా సమావేశాల్లో దీన్ని ఆలాపించడం మొదలైంది. తెలంగాణ భావనతో ఏ కార్యక్రమం జరిగినా ఈ గీతాలాపన జరగడం ఒక ఆనవాయితీగా, సంప్రదాయంగా మారిపోయింది.
తెలంగాణ ఉద్యమం అందించిన మరో సృజనాత్మక కళా రూపం ధూంధాం. రసమయి బాలకిషన్ తదితర వేలాది మంది కళాకారుల సమష్టి కృషికి ఇదో దర్పణం. నిజానికి తరతరాలుగా తెలంగాణ జనపదాలకు, జానపద సంగీతానికి నెలవు. పండిత పామర జనాన్ని అలరించే పాటలనేకం తెలంగాణ జనుల నోటి వెంట నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటాయి. హరికథలు, బుర్ర కథలు, ఒగ్గు కథలు, గొల్ల సుద్దులు, వీధి భాగోతాలు, చక్క భజనల వంటి అనేక కళారూపాలకు తెలంగాణ నెలవు. పండుగలు, పబ్బాలు, వ్యవసాయ విరామ సమయాల్లో ఊర్లో రాత్రి పూట ఏదో ఒక ఆట పాట ఉండాల్సిందే. జనులంతా బావా, మామా అనుకుంటూ ఒక చోట చేరి వినోదించాల్సిందే. మారిన వాతావరణంలో కనుమరుగయ్యే దశకు చేరిన ఈ పరిస్థితిని, ధూంధాం కార్యక్రమం మళ్లీ చక్కదిద్దింది. ఉద్యమ సమయంలో తెలంగాణలో ఎన్ని వేలవేల ధూంధాంలు జరిగాయో లెక్కేలేదు. కేసీఆర్ ఏ సభ పెట్టినా ముందు ధూంధాం జరగాల్సిందే. కళాకారులు గజ్జెకట్టి ఆడిపాడే ధూం ధాం వల్ల యువ కళాకారులు, ప్రముఖ రచయితలు ఎన్ని వేల కొత్త పాటలు రాశారో చెప్పలేం. తెలంగాణ పోరాట ఉధృతికి ధూంధాం ఒక సంకేతంగా మారిందంటే ఆశ్చర్యం కాదు.
తెలంగాణ ఉద్యమం అందించిన సరికొత్త పోరాట రూపం జేఏసీ. నిర్దిష్ట ఉమ్మడి లక్ష్య సాధన కోసం, స్వల్ప విభేదాలను విస్మరించి, ఏక రీతి భావనలున్న వ్యక్తులంతా, ఒక ప్రత్యేక సమూహంగా ఏర్పడి, సమష్టిగా పోరాడడమే జేఏసీ అంటే. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ రూపకల్పనలో, కోదండరాం చైర్మన్‌గా రాష్ట్ర స్థాయిలో రాజకీయ, సామాజిక, ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో జేఏసీ ఏర్పడిరది. ఇది శాఖోపశాఖలుగా విస్తరించింది. ఊరు ఊరుకూ, పల్లెపల్లెకూ విస్తరించింది. ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా, ఎన్ని లక్షల జేఏసీలు ఏర్పడి ఉద్య మంలో పాల్గొన్నాయో చెప్పడం ఎవరి తరమూ కాదు. చివరికి జేఏసీ అనేది తెలంగాణ ఉద్యమ రూపానికి పర్యాయపదంగా మారింది. ఉద్యమం లేదా పార్టీలు గతి తప్పుతున్నప్పుడు హెచ్చరించి మళ్లీ దారిలో పెట్టే ఒత్తిడి వ్యవస్థ (ప్రెజర్‌గ్రూప్) గానూ, విభిన్న వర్గాల మధ్య సమన్వయం సాధించే సౌలభ్య వ్యవస్థ (ఫెసిలిటేటర్) గానూ, ఉద్యమ నాయకత్వం ఇచ్చే పిలుపును అందుకుని ఆందోళన కార్యక్రమాలకు సమాజాన్ని సన్నద్ధం చేసే సన్నాహక (ప్రిపరేటరీ) వ్యవస్థగానూ, స్తబ్దత సమయంలో తానే చొరవ తీసుకుని పాత్రధారులను క్రియాశీలం చేసే సమరశీల (యాక్టివ్) వ్యవస్థగానూ జేఏసీ పోషించిన పాత్రలు బహుముఖం. దేశంలో అనేక ఉద్యమాలకు ఈ జేఏసీ వ్యవస్థ స్ఫూర్తిదాయకంగా మారింది.
ఇవే కాదు; సకల జనుల సమ్మె, మిలియన్‌మార్చ్, సాగరహారం, రోడ్లపై వంటావార్పు, రహదారుల దిగ్బంధం ఇలా తెలంగాణ ఉద్యమం సాధించిన ప్రత్యేక అస్తిత్వ చిహ్నాలు, పోరాట రూపాలు ఎన్నో! ఇవేవీ అంతకుముందు లేనివి. ఎవరినీ అనుకరించనివి. ఎందరికో మార్గదర్శకమైనవి. చివరికి సమైక్యాంధ్ర కోసం పోరాడిన వారు కూడా తెలంగాణను చూసే జేఏసీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి లాగే అక్కడా ప్రొఫెసర్లనే ఛైర్మన్‌గా పెట్టుకున్నారు. ఇక్కడిలాగా రోడ్లపై వంటా వార్పులు చేశారు. సాగరహారాలు నిర్వహించారు. వీటన్నింటినీ అనుకరించారు కానీ… తెలంగాణ ఉద్యమం సృష్టించినంత ప్రజా సాహిత్యాన్ని గానీ, పాటల పరంపరనూ, కనీసం ఒక కొత్త పోరాట రూపాన్నిగానీ సృజనాత్మక రీతిలో వారు ఆవిష్కరించ లేకపోయారు. దటీజ్ తెలంగాణ.
(సశేషం)