రాష్ట్ర అవతరణోత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఎన్నోవరాలు ప్రకటించినప్పటికీ, ప్రత్యేకించి మహిళలకు ఇచ్చిన వరాలు రెండు. అందులో ఒంటరి మహిళలకు పెన్షన్‌ మంజూరు ఒకటికాగా, కె.సి.ఆర్‌ . కిట్ల పంపిణీ రెండవది. తమకంటూ ఎవరూ తోడునీడలేని ఒంటరి మహిళలకు ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయల భతిని మంజూరు చేయడం ప్రారంభించింది. ఇక రెండవ పథకం కె.సి.ఆర్‌ కిట్ల పంపిణీ . ఈ కార్యక్రమాన్ని పేట్లబురుజు ప్రభుత్వాస్పత్రిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వహస్తాలతో ప్రారంభిం చారు. ఈ రెండు పథకాలు ప్రభుత్వ మానవీయకోణానికి కేవలం మచ్చుతునకలు.

బిడ్డకు జన్మనివ్వడం తల్లికి మరో జన్మలాంటిది. అలాంటి మహిళ గర్భిణిగా వున్నప్పుడు, ప్రసవానికి ముందు, ప్రసవం తరువాత బలమైన పౌష్టికాహారం , తగినంత విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరం. కానీ, రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలలోని గర్భిణీలకు ఇప్పటివరకూ ఇవి అందని ద్రాక్షలాగే వున్నాయి. గర్భిణీలు పేదరికంతో నెలలు నిండిన తరువాత కూడా, ప్రసవానికి ముందు వరకూ కూలి పనులకు వెళ్ళక తప్పని పరిస్థితి. మరో వంక తల్లీబిడ్డల ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం, పౌష్టికాహారలోపం , వైద్యలోపం, అవగాహనాలోపం తల్లీపిల్లల ప్రాణాలమీదకు తెస్తోంది. మాతా, శిశు మరణాలకు కారణ భూతమవుతోంది.

ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు గత మూడేళ్ళలో రాష్ట్రప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అంగన్‌ వాడీల ద్వారా పౌష్టికాహారం సరఫరా, మందుల పంపిణీ, వైద్యసలహాలను అందిస్తోంది. మరో వంక ప్రభుత్వ ప్రసూతి కేంద్రాలలో మెరుగైన వైద్యం అందేలా అవసరమైన పడకలు, వైద్యసేవలు, మందులను సమకూర్చింది. గుర్తించిన గర్భిణీలను 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు రావడం, ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా 102 వాహనంలో ఇంటివద్దకు దింపడం, తదితర ప్రభుత్వ చర్యల ఫలితంగా, ప్రస్తుతం 30 నుంచి 40 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రులలోనే జరుగుతున్నాయి. దీనిని కనీసం 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం తక్షణ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, గత మూడేళ్ళలో రాష్ట్రంలో మాతాశిశు మరణాల సంఖ్యకూడా గణనీయంగా తగ్గింది. శిశుమరణాల రేటు ప్రతివెయ్యి మందికి 32 నుంచి 28 కి తగ్గింది. ఇక తల్లుల మరణాల రేటు లక్షకు 92 నుంచి 71 కి తగ్గించగలిగాం. ఇవి దేశ సగటుకంటే తక్కువ.

అసలు మాతా శిశు మరణాలనేవే రాష్ట్రంలో జరగరాదని, జన్మనిచ్చిన ప్రతి తల్లి, పుట్టిన ప్రతి బిడ్డా ఆరోగ్యవంతంగా వుండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న పథకమే కె.సి.ఆర్‌ కిట్‌ల పథకం. ఈ పథకం కింద ఒక్కో గర్భిణికి నాలుగు విడతలుగా 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి అదనంగా మరో వెయ్యి రూపాయల సహాయం అందిస్తారు. ఈ ఆర్థిక సహాయంతోపాటు పుట్టిన బిడ్డల సంరక్షణకోసం రెండువేల రూపాయల విలువైన కె.సి.ఆర్‌. కిట్‌ ఒకదానిని ప్రసవానంతరం అందిస్తారు. ఇందులో తల్లికి, బిడ్డకు మూడు నెలలపాటు సరిపడా బట్టలు, బేబి సోపులు, బేబి ఆయిల్‌, బేబి పౌడర్‌, దోమతెర, ఆటవస్తువులు, నాప్కిన్లు, డైపర్లు, తదితర 16 రకాల వస్తువులు అందిస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తూ, గత నెల చివరివారం వరకే 12,000 మందికి పైగా కె.సి.ఆర్‌ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.

ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్యపెరగాలి. మాతా, శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గాలి. ఇందుకు ఈ పథకాన్ని ప్రతి పేదింటిమహిళా సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్య తెలంగాణకు బాటలువేయాలి.

Other Updates