ప్రవర్థమాన కళాకారుడు కంది నర్సింలు చిత్రాలలోని, శిల్పాలలోని కమనీయమైన, కళ్ళు మిరమిట్లు గొలిపే రంగులు-రేఖల వెనక-కనిపించీ కనిపించని తెలంగాణ పల్లెపట్టులు, సంస్కృతి-సంప్రదాయాలు ఉన్నాయి. ఆయన రూపొందించిన ప్రతి కళాకృతిలో పల్లీయుల ఆప్యాయతలు, అనుబంధాలు ఫక్తు ప్రతిబింబిస్తాయి. వాటిలో ఆయన కష్టం ఉంది, కసి ఉంది, వేదన ఉంది, వైవిధ్యం ఉంది. పేదరికం ఉంది, పెన్నిధి ఉంది.
అందుకే 2010లోనే ఆయన చిత్రానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇచ్చి సత్కరించింది. అదే యేడాది కాకతీయ ఎన్‌ఆర్‌ఐ వేదికవారి కళల తెలంగాణ అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ సత్కారం పొందాడు. 2011లో ఈయన వేసిన చిత్రం హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ బంగారు పతకం గెలుచుకున్నది. 2016లో తెలంగాణ ప్రభుత్వం ‘బతుకమ్మ’ పండుగ ప్రాశస్త్యాన్ని కళ్లకుకట్టే చిత్రాల పోటీ నిర్వహించగా నర్సింలు గీసిన చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది.
ఆయన ఏ చిత్రం వేసినా, ఏ శిల్పం చెక్కినా-ఉన్న ఊరును,కన్న తల్లిని విస్మరించడు. నిజానికి ఆయన రూపొందించే కళాకృతులన్నింటిలో ఆయన తల్లీ-తండ్రే ఉంటారు. మరీ ఎక్కువ మందిని చిత్రించవలసి వస్తే ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితులు ఉంటారు. నిత్య జీవితంలో వారి వ్యవహారశైలే ఆయన చిత్రాల్లో వస్తువు. కేవలం రెండు ఆయతనాలలోనే కాదు చిత్రాల్లో మూడు ఆయతనాలలో చూపే ప్రయత్నం నర్సింలు చేస్తున్నాడు.
కేవలం చిత్రాలేకాదు శిల్పాలు వేయడంలోను చేయి తిరిగినవాడు నర్సింలు. ముఖ్యంగా గ్రామీణ స్త్రీ, పురుషుల ఫైబర్‌గ్లాస్ శిల్పాలు ఎక్కువగా ఈయన రూపొందిస్తున్నాడు. త్వరలో కంచు విగ్రహాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ యేడాదే గ్రామీణ అంశాలు తీసుకుని వ్యష్టి చిత్రకళా ప్రదర్శన నిర్వహించే సన్నాహాల్లో ఆయన ఉన్నాడు.
ఇంతవరకు ఆయన నిర్వహించిన నాలుగు వ్యష్టి చిత్ర, శిల్పకళా ప్రదర్శనలలో ఒకటి గ్రామీణుల గుసగుసలు, ముచ్చట్లమీద కేంద్రీకరించగా, మరొకటి-పల్లెల జానపద సంగ్రహంగా చెప్పుకోదగింది. ఇంకొకటేమో ‘పల్లెటూరి ప్రతిబింబాలు’గా అభివర్ణించదగినవి. వేరొకటేమో-రెండు, మూడు ఆయతనాలలో రూపొందించిన చిత్రాలు, శిల్పాలు. ఏవి ఏమైనా ఆయన రూపుదిద్దిన ప్రతి కళాకృతిలో-ఆయన చూసిన, అనుభవించిన జీవితమే ప్రస్ఫుటమైనందున, వాటిలో అనివార్యంగా జీవకళ ఉట్టిపడుతుంది.
నర్సింలు తీసుకునే వస్తువు, ఎత్తుగడ-అందులోని వివిధ మౌలిక అంశాలు, వాటి అమరిక కళాకారుడి భావనా ప్రతిభను తేటతెల్లం చేస్తుంది.
‘గుసగుసలు’, ‘సంతకు’, ‘భార్యాభర్తలు’, ‘కుటుంబం’, ‘బస్సుకోసం’, ‘అట్టచెమ్మ’, ‘పూసపేర్ల వాళ్లు’, ‘పాలమ్మేవాళ్లు’, ‘కొత్త దంపతులు’, ‘బోనాలు’, ‘ఎదురుకోలు’ మొదలగు చిత్రాలలో-స్త్రీలు రంగురంగుల చీరలు, వాటిపై చూడచక్కని పూలు, లతల డిజైన్లు, పలురకాల అంచుల జాకెట్లు, నుదుట రంగుల బొట్లు, మెడలో పుస్తెలు, గుండ్లు, పుస్తెల తాడుకు తాళం చెవి, రోల్డ్ గోల్డ్ హారాలు, రంగురంగుల తీరైన గాజులు, మోచేతి కడియాలు, ముంజేతి కడియాలు, బొడ్లో రంగుల సంచి, చెవుల కమ్మలు, పోగులు, వేలికి వెండి లేదా రాగి ఉంగరాలు, రకరకాల సిగలు, పిన్నీసులు, చేతిలో సద్దిమూట లేదా చెంబు, వీటన్నింటినీ మించిన చురుకైన కండ్లు ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తాయి. ఇక మగవారైతే పైకి దోపిన తెల్లని ధోవతి, రంగురంగుల కమీజు, రంగుల గుండీలు, మీసకట్టు, చెవికిపోగు, భుజంపై తువాలు, చంకలో గొడుగు, చేతిలో సంచి, జేబులో బీడీల కట్ట లేదా చేత చుట్ట, చేతి గడియారం, కాలుకు బేడీ, వేలికి ఉంగరం-ఇట్లా అన్ని చిత్రాలు నఖశిఖపర్యంతం వేయడం నర్సింలు పద్ధతి.
కథాత్మకరీతిలో వివరణాత్మక చిత్రాలు వేయడంలో నర్సింలుది ప్రత్యేకత. ‘జనతా అపార్ట్‌మెంట్’, ‘బతుకమ్మ’, ‘సంచార వాహనాలతో జాగ్రత్త’, ‘మా పెదనాయన దినం’లాంటి చిత్రాలు అంకాలు, అంకాలుగా తీర్చిదిద్ది పలువురి దృష్టిని ఆకర్షించాడు. ఇవేకాదు సాధారణ పౌరులకు కూడా కావలసిన వినియోగ వస్తువులపై చిత్రాలు వేసేందుకు సాంకేతికంగాను ఈయన కృషి చేస్తున్నాడు. అయితే ఈ వినియోగ వస్తువులు సరసమైన ధరలకు లభ్యమయ్యేవిధంగా ఉంటేనే అందరికీ అందుబాటులోకి కళ చేరుతుందని ఆయన ముచ్చట పడుతున్నాడు.
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాస్లాబాద్‌లోని దిగువ మధ్య తరగతి వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన ఎల్లవ్వ-రాజయ్య దంపతుల కుమారుడు-కంది నర్సింలు. తమ ఊళ్ళోనే ప్రాథమిక విద్య, ఆ తర్వాత మిరుదొడ్డిలో హైస్కూల్‌లో చదువు, దుబ్బాకలో ఇంటర్‌మీడియట్ చదివిన నర్సింలు చిన్ననాటినుంచే రుస్తుం సార్‌వద్ద డ్రాయింగ్ మెళకువలు నేర్చుకున్నాడు. దేవాలయాలపై బొమ్మలుచూసి ప్రభావితుడయ్యాడు. జేబు ఖర్చులకోసం కడపలకు రంగులతో ముగ్గులు వేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత సైకిళ్ళపై ఎనామిల్‌తో పేర్లు వ్రాయడం, సైన్‌బోర్డులు వ్రాయడానికి అలవాటుపడ్డాడు. డబ్బులకోసం బస్సులపై బొమ్మలు వేశాడు.
ఇంటర్‌లో ఉండగా-అరగంట సేపట్లో ఆవగింజపై భారతదేశ పటం వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అనంతరం బఠానీ గింజపై ప్రపంచపటం వేశాడు, ఖండాలపేర్లు వ్రాశాడు. బియ్యపు గింజపై-తలపై గంప పెట్టుకున్న మహిళను, జింకను, నందిని చిత్రించాడు. ఆముదపు గింజపై భగత్‌సింగ్‌ను, సొరకాయ గింజపై ఇందిరాగాంధీని, తుమ్మ గింజపై చార్మినార్‌ను, చెమ్మ గింజపై రాజీవ్ హత్యకుముందు పూలదండ వేస్తున్న మహిళ దృశ్యాన్ని వేశాడు. ఆ గింజ వెనుకభాగంలో రక్తపు మరకలు వేశాడు. ఇంకా మహాత్మాగాంధీని చెమ్మగింజపై, బీరగింజపై శాంతి చిహ్నమైన పావురాన్ని వేశాడు. ఇంకా ఎన్నో మనోహర సూక్ష్మ చిత్రాలను వేసి నర్సింలు పలువురిని ఆశ్చర్యచకితులను చేశాడు.
ఇంటర్ పూర్తి చేయకుండానే జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తాలూకు లలితకళల కళాశాలలో ప్రవేశ పరీక్ష వ్రాసి 1993లో శిక్షణ లేకుండానే మంచి ర్యాంకు సాధించాడు. ఐదేండ్ల బి.ఎఫ్.ఏ.లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత అక్కడే 2009లో రెండేండ్లు, ఎంఎఫ్‌ఏలో చేరి ప్రథమ శ్రేణి సాధించాడు.
ఆ తర్వాత చిత్రకారుడుగా అనేక సంస్థలలో పనిచేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ‘ఓషన్ పార్క్’లోగాజులా స్ఫురించేటట్టుగా ఎనామిల్‌తో పై కప్పులపై 70 I 70 సైజులో బౌద్ధానికి సంబంధించిన అంశంతో వేసిన ఆరు చిత్రాలు నర్సింలు సంవిధాన చాతుర్యాన్ని చాటుతాయి. వాటిలో వర్ణాల అమరిక రేఖల లావణ్యం వస్తువులోని నిర్దుష్టత, ఒకదానికి మరొకదానికి మధ్య సంబంధం చూడముచ్చటగా ఉంటుంది.
అనేక చిత్రాలు వేస్తూ, తనకంటూ ఒక ముద్రను రూపొందించుకునే ప్రయాణంలో నర్సింలు దాదాపు గత రెండు దశాబ్దాల కాలంలో హైదరాబాద్‌లోనే కాకుండా బెంగుళూరు, కలకత్తా, ముంబై, ఢిల్లీ మొదలగు మహానగరాలలో నిర్వహించిన ముప్పై సమష్టి చిత్ర శిల్పకళా ప్రదర్శన లలో పాల్గొన్నాడు. కేవలం 2014లోనే పది సమష్టి కళా ప్రదర్శనల్లో ఆయన చిత్రాలు చోటు చేసుకోవడం విశేషం. ఆయన చిత్రాలు దేశవిదేశాల్లో పలువురు కళాభిమానులు సేకరిం చారు.
టి. ఉడయవర్లు