-డా|| నలిమెల భాస్కర్‌
tsmagazine
తెలంగాణ భాషలో కొన్ని పదాల్లో హల్లులు ద్విత్వాలుగా మారిపోతాయి. ఇది ఈ భాష ప్రత్యేక లక్షణం. శకట రేఫం ద్విరుక్తమవుతుంది. అఱ అర్రగానూ, ఎఱ ఎర్రగానూ మారుతున్నది. అయితే ఇవి సాధురేఫ ద్విత్వరూపాలు. మామూలు రకారం సైతం అప్పుడప్పుడు ద్విత్వం అవుతున్నది. ‘సర్ర సర్ర నడువుండి’ అనే వాక్యం ఉదాహరణ (త్వరత్వరగా నడవండి) ఇట్లాగే తెలంగాణలో కొన్ని సందర్భాల్లో ‘ళ’ ద్విరుక్తంగా మారుతున్నది. ద్విరుక్తంగా మారేటప్పుడు మామూలు లకారం ద్విరుక్తం కావడం విశేషం.

ఉదాహరణకు ‘వాడు యాల్ల కమాన వచ్చిండు’ అనడంలోనే యాల్ల నిజానికి యాల్ల కాదు, అది వేళ. యాల్ల కమాన అంటే వేళ ప్రకారం. యాల్ల అయింది అంటే వేళ అనే పదం యాల్ల అయినట్లే పాళ పాల్లగా మారిది. వేళ అనే పదం అప్పుడప్పుడు తెలంగాణలో అల్ల అవుతుంది. అంబటాల్ల, ఎసర్లాల్ల, పసులాల్ల, గైరాల్ల, గోజలొచ్చే ఆల్ల మొదలైన వాటిల్లోనే చివరి అల్ల అంటే వేళ అనే! గైరాల్ల అంటే వేళకాని వేళ అని అర్థం. (యాల్ల గానియాల్ల) ఏది ఏమైనా ‘ళ’ అనే హల్లు మెల్లమెల్లగా ‘ల్ల’గా మారుతున్నది. అప్పుడప్పుడు మామూలు లకారం కూడా డబుల్‌ లకారం అవుతుంది. ‘ఇంట్ల ఈ యాల్లాటలు ఏందే?’ అనే ప్రశ్నార్థక వాక్యంలోని యాల్లాటలు (వేలాడుటలు)లోని ‘ల్ల’లనుండి ఉత్పన్నమైనదే! గుడ్డలు బాగా వేలాడదీసినప్పుడు యిట్లా మాట్లాడుతుంటారు. ఇంకా ‘బట్టలు దండానికి యాల్లాడుతున్నయి’లోని ద్విత్వ లకారం అటువంటిదే! ‘అరేయ్‌! ఈడ అందరు కల్సి మాల్లెం పెట్టిండ్రు ఏందిరా?’ అనే వాక్యంలోని మాల్లెం ‘మేళం’ నుండి వచ్చింది. మేళతాళాల గురించి మనకు తెలుసు. బ్యాండు మేళం గుంపుగా వుండి బోలెడు ధ్వనులు చేస్తుంటే మేళం. అట్లాగే ‘మా యెల్లేమే వస్తిరి’ అనే తెలంగాణ వాక్యంలోని మా యెల్లెం మహావైళము నుండి ఏర్పడింది. వైళము అంటే తొందర. మహా వైళములోని ‘ళ’ల్లగా మారుతున్నది. ‘తప్పెట కొట్టినా పెండ్లే-తల్లె గొట్టినా పెండ్లే’ సామెతలోని ‘తల్లె’ మొదట తలియ. పల్లియ పల్లె అయినట్లు, మల్లియ మల్లె అయినట్లు, తలియ తలెగా మారి ఆ తర్వాత తల్లె అయ్యింది. తల్లె అంటే పళ్ళెం-కంచం. అక్కడ ‘తలె’లోని మామూలు ‘ల’తల్లెలో ద్విరుక్తం అయి కూర్చున్నది.

ఇంకా మామూలు లకారం ద్విత్వంగా మారుతున్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. ‘దయగల తల్లి’ అనే వాక్యం తెలంగాణలో దయగల్ల తల్లి అవుతుంది. అలాగే ‘ఆత్మగల చెయ్యి’ అనేది ఆత్మగల్ల చెయ్యిగా మారుతుంది. ‘అనగలమాట’ (అనదలచిన మాట) అనగల్ల మాటగా పరిణమిస్తుంది. ‘కిలకిలా నవ్వింది’ అనే ప్రమాణ భాషా వాక్యం ‘కిల్లకిల్ల నవ్వింది’ అని పర్యవసిస్తున్నది తెలంగాణలో.

తెలుగులో బాలసాహిత్యానికి సంబంధించిన పాటల్లోనూ ఈ ద్విత్వ లకారం ఎట్లా వుందో చూద్దాం.

(1) పాపాయి కన్నుల్లు కలువ రేకుల్లు పాపాయి జుంపాలు పట్టు కుచ్చుల్లు పాపాయి దంతాలు మంచి ముత్యాలు పాపాయి చేతుల్లు పొట్ల కాయల్లు

(2) మా పాప మామల్లు మత్స్యావతారం కూర్చున్న తాతల్లు కూర్మావతారం వరసైన బావల్లు వరహావతారం కన్నుల్లు, రేకుల్లు, కుచ్చుల్లు, చేతుల్లు, కాయల్లు, మామల్లు, తాతల్లు, బావల్లు… ఇత్యాది పదాల్లోని ద్విత్వలకారంవల్ల పాటలో ఒక లయ వస్తున్నది. ఒక రకమైన శక్తి కలుగుతున్నది. గానయోగ్యతవల్ల నాద సౌందర్యం గోచరిస్తున్నది. ఈనాద మాధుర్యమే ఇప్పటివరకూ ఉదాహరించిన తల్లె, మా యెల్లెమే, మాల్లెం, అంబటాల్ల, యాల్ల లేదు పాల్ల లేదు, యాల్లాటలు..మొదలైన మాటల్లో ద్విరుక్త లకారం వల్ల ఏర్పడింది. ఇది తెలంగాణ భాషా వైశిష్ట్యాల్లో ఒకటి. తెలంగాణ భాషల్లో శకటరేఫమూ, సాధురేఫమూ (అప్పుడప్పుడు) ద్విత్వ రూపంలోకి మారుతున్నాయి. అట్లాగే ళకారమూ, లకారమూ (అప్పుడప్పుడు) ద్విరుక్తాలు అవుతున్నాయి. ఇలా మారడం, అవడం తెలంగాణ ప్రత్యేకత. నాదంకోసం, లయకోసం, ఉనికికోసం యిటువంటి మార్పులు కలుగుతాయి. ఈ రకాల లకారాలే కాకుండా మరికొన్ని అక్షరాలు సైతం ఇట్లా మారి వున్నాయి. ఉదాహరణకు.. కిస్సకిస్స నవ్వుడు (కిసుక్కుమనడం), మిట్టమిట్ట చూసుడు (మిటకరించి చూడడం), పట్టపట్ట కొరుకుడు (పండ్లు పటపట కొరకడం), పనులు చిట్టచిట్ట చేసుడు (చిటికెలో చేయడం), తట్టతట్ట కొట్టుడు (కాళ్లు తటతట కొట్టుకోవడం), పిస్సపిస్స మాట్లాడుడు (గబాగబా చేయడం)వంటి మాటల్లోని ద్విత్వం ఈ నాదమాధుర్యం కొరకు వచ్చి చేరిందే! ఇది తెలంగాణ భాషా విశిష్టత.

Other Updates