భారత దేశానికి సంబంధించి తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా మార్క్స్ పేర్కొన్న 1857 తిరుగుబాటు దేశ చరిత్రలో కీలకమైంది. అప్పటి వరకు మొగలాయిపాలనను బలహీన పరుస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకుంటున్న బ్రిటీిష్ సామ్రాజ్యవాదులకు చెందిన ఈస్టిండియా కంపెనీని ఒక కుదుపు కుదిపిన సంఘటన అది. బుద్దుని కాలం నుంచి శాంతి, సహనశీలతకు పేరుగాంచిన భరతభూమిలో స్థానిక జనం కోపాన్ని, కసిని చవిచూసిన క్షణమది. ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా మతాలకు, కులాలకు, అతీతంగా అన్నివర్గాల ప్రజలను, రాజవంశాల వారిని ఏకం చేసి పరాయిపాలకులను, వారి పాలనను అంతమొందించడానికి జరిగిన రాజకీయ, సామాజిక ఉద్యమమది.దాదాపు ఏడేళ్లపాటు భిన్న రూపాలలో , భిన్న దశలలో కొనసాగి బ్రిటిష్ వలసవాదులకు ముచ్చెమటలు పోయించిన ఈ మహా సంగ్రామం 1857 తిరుగుబాటు.ఇందుకు మొదటి అడుగు మీరట్ కంటోన్మెంటులో పడి తర్వాత ఢల్లీికి, అటు తర్వాత దేశంలోని భిన్న భూభాగాలకు వ్యాపించింది. ఈ క్రమంలో రెండు ప్రధాన తిరుగుబాటు కేంద్రాలు తలెత్తాయి. అందులో ఒకటి ఢల్లీి, రెండవది హైదరాబాద్.
బ్రిటీష్‌వారిని దేశంనుంచి పారద్రోలాన్ని లక్ష్యంతో నడిచిన ఈ తిరుగుబాటుకు రాజకీయ, సామాజిక ఆదర్శాలు, లక్ష్యాలున్నాయి.ఈఉద్యమానికి ఒక రూపం మిచ్చి జాతీయస్థాయిలో భిన్న వర్గాలను కూడ గట్టిన వారిలో ఆనాటి వహబీ లీడర్ సయ్యద్ అహ్మదుద్దీన్ దహెల్వీ, తాంతియా తోపే, నానా ఫడ్నవీస్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారి కనుసన్నలలో రూపుదిద్దుకున్న ఉద్యమమిది. దాని ప్రభావం హైదరాబాద్ రాజ్యంపై పడిరది. వెంటనే హైదరాబాద్ కేంద్రంగా రహస్యంగా కులాలకు, మతాలకు అతీతంగా ఏకమైన తిరుగుబాటు దారులు కోఠీలోని బ్రిటీష్ రెసిడెన్సీపై దాడికి పూనుకున్నారు. బేగంబజార్‌కు చెందిన మార్వాడి కుటుంబీకుడు పూనం చంద్, గోసాయి మఠానికి చెందిన సాధువులు, నిజామాబాద్ జిల్లా కౌలాస్ గ్రామ జాగిర్దారు పట్వారీ రంగారావు, మోర్తాడు జమిందారు రుక్మారెడ్డివంటివారు నాయకత్వం వహించిన ఈ తిరుగుబాటులో వీరమరణం పొందిన తొలి హైదరాబాద్ వీరుడు తుర్రెబాజ్ ఖాన్. ఈ తిరుగుబాటుకు ముందు బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న వహబీ ఉద్యమ ప్రభావం తుర్రెబాజ్ ఖాన్‌పై పడిరది. అప్పటికే బ్రిటీష్ పాలన వల్ల భారతీయులకు జరుగుతున్న కష్టనష్టాలపై వారు జాతీయ స్థాయి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రధానంగా ముస్లిం యువకులను, గ్రామీణ రైతాంగాన్ని కూడ గట్టడం మొదలు పెట్టారు. మరో వైపు హిందూ సాధువులు, సన్యాసులు కూడా బ్రిటిష్ వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇంతేకాకుండా ఆనాటి నిజాం ప్రభుత్వం బ్రిటీష్ వారి అనుకూల వైఖరివల్ల అనేక తిరుగుబాట్లను చవి చూసింది. 1780లలోనే ఇప్పటి మెదక్ జిల్లాకు చెందిన రాజా సదాశివరెడ్డి వహబీ ఉద్యమం నేపథ్యంలో ఆనాటి నిజాంపాలకులకు వ్యతిరేకంగా రైతాంగ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. రెండవ నిజాం కొడుకు ఆర్తుజా సదాశివరెడ్దితో చేతులు కలిపి ఇద్దరూ ఉరికంబమెక్కారు.
ఈ తరహా తిరుగుబాట్ల వాతావరణంలో పెరిగిన తుర్రెబాజ్ ఖాన్ హైదరాబాద్‌లో జరిగిన 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించి వీరమరణం పొందాడు. ప్రాణాలతో దొరకకుండా బ్రిటీష్ వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఖాన్‌సాబ్ చార్మినార్ సమీపం లోని సాధారణ ముస్లిం కుటుంబంలో జన్మించారు. జన్మత: తెగింపునకు, దైర్యసాహసాలకు పేరెళ్లిన పఠాన్‌ల తెగకు చెందిన వారు.ఈ తిరుగు బాటుకు ముందు ఒక వంద సంవత్సరాలుగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో అంటే దక్కన్ లో వహబీల ఉద్యమం బలంగా సాగుతూ వస్తున్నది.ఆసియాఖండంతో పాటు హిందుస్తాన్‌పై ఆంగ్లేయులు సాగిస్తున్న అధర్మపాలనపై, దుర్మార్గాలపై ప్రజ లను వారు చైతన్యం చేస్తూ వచ్చారు.
ఆంగ్లేయుల పాలనను అంత మొందిం చాలని రహస్యంగా ప్రచారం చేస్తూ వచ్చిన వహబీలకు ఒక దశలో ఆనాటి నిజాం ప్రభుత్వం పరోక్ష మద్దతునిచ్చేది. స్థానిక మక్కామసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా వహబీలు రహ స్యంగా సమావేశమై ఆంగ్లేయుల అధర్మ పాలన, అనైతిక, అవినీతి ప్రవ ర్తనపై, హైదరాబాద్ రాజ్యంపై వారు సాగిస్తున్న అనైతిక పెత్తనంపై స్థానిక ముస్లిం యువకులకు బోధించేవారు. ప్రజలను కూడా గట్టడానికి మక్కా మసీదులో నిత్యం పోస్టర్లు వేసేవారు. అయితే ఇదంతా రహస్యంగా జరిగేది.
మక్కామసీదులో ప్రార్థనలకు హాజరయ్యే తుర్రెబాజ్‌ఖాన్ వహబీల రహస్య సమావేశాలలో పాల్గొని స్ఫూర్తిపొందాడు. అప్పటికే ఆనాటి హైదరాబాద్ రాజ్యంలోని ఔరంగాబాద్‌లో తిరుగుబాటు చెలరేగింది. వారిని బంధించిన ఆంగ్లేయ అధికారులు హైదరాబాద్ నగరం, కోఠీలోని ఒక రహస్య స్థలానికి తరలించి చిత్రహింసల పాలు చేశారు.ఈ సంఘటనతోపాటు ఢల్లీిలో చెలరేగిన పరిణామాలు స్థానిక ముస్లిం యువకులను, రైతాంగాన్ని, సాధారణజనంతోపాటు జమీందారులను, సంస్థానాధీశులను ఉత్తేజపరిచాయి. తాము సైతం ఆంగ్లేయ పాలనను అంతమొందించాలనుకు న్నారు. ఇదే సమయంలో మక్కా మసీదులో మౌల్వీ సయ్యద్ అల్లాఉద్దీన్ ఆయనతోపాటు మరో నలుగురు మౌల్వీలు సమావేశమై ఔరంగాబాద్ సంఘటనలో అరెస్టయిన తెలంగాణ, మరాఠా సైనికుల విడుదలకు ప్రయత్నించాలని నిర్ణయించుకుని నిజాంను కలువడానికి చౌమొహల్లా రాజభవనానికి వెళతారు.కానీ చర్చలు విఫలమౌతాయి.
మరోవైపు హైదరాబాద్ చేరుకున్న 1857 తిరుగుబాటు జాతీయ నాయకుడు తాంతియా తోపే నగరంలోని జనసామాన్యాన్ని, జమీందారులను, వ్యాపారులను, సాధువులను కూడ గడుతున్నాడు.ఈ వాతావరణంలో స్థానిక యోధులను కూడగట్టి రెసిడెన్సీపై దాడి చేసి ఆంగ్లేయులను అంతమొందించాలని తుర్రెబాజ్ ఖాన్ నిర్ణయించుకుంటాడు.అప్పటికే మౌల్వీ సాబ్‌తో చేతులు కలిపిన నవయువకుడు తుర్రెబాజ్ ఖాన్ తన సాటి పఠాన్ యోధులను స్థానిక తెలుగు వారిని మొత్తం 300ని కూడాగట్టి బేగం బజార్‌లో మాటు వేశాడు. మరోవైపు మౌల్వీ సయ్యద్ అల్లా ఉద్దీన్ వందలాది మంది తిరుగుబాటు యోధులను కూడగట్టి సైదాబాద్ ఈద్గా మైదానం మీదుగా అల్లాహో అక్బర్ అంటూ కోఠీలోని రెసిడెన్సీ పైకి దండయాత్రకు బయలు దేరాడు.
ఈ యోధుల సైన్యం కోఠీలోని మార్వాడీల ఇండ్లపైకి చేరుకుంది. అక్కడ తుర్రెబాజ్‌ఖాన్ మౌల్వీ సయ్యద్ అల్లా ఉద్దీన్‌లు సమాలోచనలు జరిపి మారణాయుధాలతో రెసిడెన్సీపైకి దాడి జరపాలని పథకం రూపొందించారు. వెను వెంటనే తుపాకులతో ప్రధాన ద్వారం రెసిడెన్సీ భవనంపైకి దాడి చేయడం మొదలు పెట్టారు. ఈ సమాచారం తెలిసిన ఆనాటి రెసిడెంట్ డేవిడ్‌సన్ వణికిపోయాడు. హైదరాబాద్ యోధులను ముఖాముఖి ఎదుర్కోలేక తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్‌లను దొంగచాటుగా మట్టుబెట్టడానికి తోపులతో దొంగదాడికి దిగాడు. 1857 జులై17న మొదలైన ఈ లడాయి మరుసటిరోజు జులై (18 వతేదీ) ఉదయం వరకు కొనసాగింది.చీకటి కావడంతో డేవిడ్ సన్ పన్నాగానికి హైదరాబాద్ వీరయోధులు ఒక్కొక్కరే మరణించారు.
అయినప్పటికీ మౌల్వీ అల్లాఉద్దీన్, తుర్రెబాజ్ ఖాన్ అక్కడే ఉండి చివరి వరకు పోరాడుతూనే ఉన్నారు. ఆఖరికి శత్రువు వ్యూహం అర్థమై మరణిస్తున్న తమ సహచరుల ఆశయాలను నిజం చేయడానికి తిరిగి శక్తిని కూడగట్టు కోవడానికి అక్క్ణణ్ణుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో మారువేషంలో బెంగుళూరుకు వెళుతుండగా ఖాన్ సాబ్ మహబూబ్‌నగర్ జిల్లా మొగిలిగిద్ద ఊరులో పోలీసులకు దొరికి పోతాడు. అదాలత్‌లో హాజరు పరిచినప్పుడు తాను తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు గర్విస్తున్నానని, నాజాతి కోసం, నా ప్రజలకోసం పోరాడడం ధర్మంగా భావిస్తున్నానని ప్రకటించాడు. అక్కడ ఆయనకు జీవిత ఖైదు పడిరది.
డమాన్‌కు తరలిస్తుండగా 1859 జనవరి 18న ఆయన మెరుపు తీగలాగా తప్పించుకున్నాడు.
ఇదే సందర్భంగా మంగళంపల్లిలో అరెస్టయిన మౌల్వీ సయ్యద్ అల్లా ఉద్దీన్‌కు యావజ్జీవ శిక్ష పడిరది. ఆయనను బ్రిటీషు ప్రభుత్వం అండమాన్‌కు తరలించి అక్కడ నిర్బంధించింది. 30 ఏళ్లపాటు జీవించిన మౌల్వీసాబ్ అక్కడే తుది శ్వాస వదిలారు. బేగం బజారు సమీపంలోని గోసాయి మఠంలో అరెస్టయిన నిజామాబాద్ రైతాంగ యోధుడు రుక్మారెడ్డికి 24 ఏళ్ల జైలు శిక్ష పడిరది. మార్వాడీ పూనంచంద్ కూడా అంతే.వీరు హైదరాబాద్ లోనే శిక్ష అనుభవించారు. కానీ తప్పించుకున్న తుర్రెబాజ్ ఖాన్ 1859 జనవరి 20 ఉదయం తూఫ్రాన్ గ్రామంలో ఆశ్రయం తీసుకుంటుండగా సమాచారం తెలిసిన పోలీసులు అరెస్టు చేయడానికి పన్నాగం పన్నారు. వారికి సజీవంగా దొరకరాదని నిర్ణయించుకున్న ఖాన్ వారితో ఘర్షణకు దిగి అక్కడే కాల్పులలో వీరమరణం పొందాడు. పరాయి దేశస్థులయిన ఆంగ్లేయులకు సజీవంగా దొరకరాదని నిర్ణయించుకున్న ఖాన్ సాబ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, హైదరాబాద్ నగర షాన్ నిలిపి వీరయోధునిగా నిలిచిపోయాడు.
ప్రజల మనిషి తుర్రెబాజ్ ఖాన్
తెలంగాణఅంతటా జనం యాదిలో తురుం ఖాన్‌గా నిలిచి పోయిన తుర్రెబాజ్ ఖాన్ నిజమై ప్రజల మనిషి. జనం వీరుడు. తన జాతి జనులకు అన్యాయం జరిగినప్పుడు స్పందించిన కొమురం భీం వలే తుర్రెబాజ్ ఖాన్ ప్రజల నుంచి వచ్చిన వారు. స్పష్టమైన రాజకీయ లక్ష్యాలతో కార్యాచరణను రూపొం దించుకున్న కార్యశీలి. నిజానికి ఢల్లీిలో జరిగిన తిరుగుబాటు ఒక రాజ్యానికి మరో రాజ్యానికి జరిగింది. రెండు రాజ వంశాల మధ్య అధికారం మార్పిడి కోసం జరిగింది. అక్కడ ఢల్లీి ముట్టడిలో బ్రిటీష్ వారిలో సేవలో ఉండి వారిపై అసంతృప్తితో తిరుగు బాటు చేసిన వారు. ప్రత్యక్ష ప్రజల భాగస్వామ్యం తక్కువ. మీరట్‌లో తిరుగుబాటుకు నాందిపలికిన మంగళ్ పాండే తన విశ్వాసం కోసం తిరగబడ్డాడు. తుర్రెబాజ్ ఖాన్ తరహా వేరు. ఆయన సాధారణయువకుడు, వహబీల రాజకీయ లక్ష్యాలలో భాగంగా తిరుగుబాటు దారునిగా మారాడు.పూర్తిగా ఆంగ్లేయుల పాలనను అంతమొందించి హిందూస్తాన్‌ను విముక్తి చేయాలన్న తలంపుతో తిరుగుబాటు చేసి వీరమరణం పొంది జనం యాదిలో తురుంఖాన్‌గా నిలిచిపోయాడు.
సాహసానికి గుర్తుగా తురుం ఖాన్ పేరుతో తెలంగాణ ప్రజలు తలుచుకునే తుర్రెబాజ్ ఖాన్ జనం యాదిలో ఎప్పటికీ నిలిచేఉంటాడు.