శాతవాహన కాలంలో
కోస్తాంధ్రలో తిసరణాలు మార్మోగుతుండగా, తెలంగాణాలోని కృష్ణ-తుంగభద్ర సంగమ ప్రాంతంలో మాత్రం ‘ఓం నమఃశివాయ’ మంత్రం వినవచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా తీరంలోని బ్రిడ్జిరంగా పూర్ అనే గ్రామంలో క్రీ.శ. 1వ శతాబ్దంనాటి శివా లయం బయటపడింది. గద్వాల చౌరస్తా దాటి హైదరా బాద్ వస్తుండగా శ్రీశైలం ప్రాజెక్టు నీటిముంపునకు గురైన ప్రాంతంలో రాష్ట్ర పురావస్తు శాఖ క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందినటువంటి శివాలయాన్ని వెలికి తీసింది. ఇదే తెలంగాణాలో తొలి శివాలయం. ఆ దేవా లయ నిర్మాణానికి 50 సెం.మీ. పొడవు, 25 సెం.మీ.ల వెడల్పు, 7సెం.మీ.ల మందం కలిగిన ఇటుకలు వాడారు. ఆ దేవాలయం చుట్టుపక్కల జరిపిన తవ్వ కాల్లో నలుపు, తెలుపు, ఎరుపు మట్టిపాత్రలు బయటపడ్డాయి.
శాతవాహనుల తర్వాత కృష్ణానది దిగువ ప్రాంతాన్ని వశంచేసుకున్న వారు ఇక్ష్వాకులు. వీరు శ్రీపర్వత విజయపురి నుంచి (క్రీ.శ.225-325 మధ్య) పరిపాలన సాగించారు. వీరు బౌద్ధంతోపాటు బ్రాహ్మణీయ మతా న్నికూడా ఆదరించారు. ఇక్ష్వాకు రాజవంశ స్త్రీలు బౌద్ధాన్ని ఆదరించగా, పురుషులుమాత్రం బ్రాహ్మణీయ మతానికి పెద్దపీట వేశారు. ఎహువల ఛాంతమూలుడు కార్తికేయ, పుష్పభద్ర, నొదగీశ్వర, దేవీ ఆలయాలను, అష్టభుజస్వామి పేరిట వైష్ణ్వాలయం కూడా నిర్మించాడు. కొన్ని ఆలయాలు గజపృష్టాకారంలో బౌద్ధ చైత్యాలయాలు గానూ, మరి కొన్ని మండపాలు గానూ నిర్మించబడినాయి.నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో ఇక్ష్వాకుల కాలం నాటి ఇటుకలతో నిర్మించిన శివాలయం బయల్పడింది. ఇంకా మెదక్ జిల్లా కంది అనే గ్రామంలో ఇదే కాలానికి చెందిన మరో ఇటుకరాయి దేవాలయం తవ్వకాల్లో బయల్పడింది. లోపల ఎనిమిది పలకలు, వెలుపల చదరంగాగల గర్భాలయం, ముందు దీర్ఘచదరపు మహామండపంతో నిర్మించబడింది.
విష్ణు కుండినుల ఆలయాలు (క్రీ.శ. 4 – 6 శతాబ్దాలు)
విష్ణుకుండినులు హైదరాబాద్ చేరువలోని కీసరగుట్ట రాజధానిగా క్రీ.శ. 5వ శతాబ్ది నుంచి 7వ శతాబ్ది వరకు పాలించారు. కృష్ణానది నుంచి నర్మదా నదివరకూ గల భూభాగాన్ని విష్ణుకుండినులు పాలించారు. వారు బౌద్ధ, శైవాలయాలను, గుహాలయాలను కల్పించి దేవాలయ నిర్మాణ వికాసానికి తోడ్పడ్డారు. రాష్ట్ర పురావస్తు శాఖ హైదరాబాద్‌కు 32 కి.మీ.ల దూరంలోనున్న కీసరగుట్ట వద్ద జరిపిన తవ్వకాలలో బయల్పడిన ఇటుకరాతి రాజప్రాసాదం, ఇటుక రాతి దేవాలయాలు, పాతిన రాతి శివలింగాలు, మాతృదేవత శిల్పం, విష్ణుకుండినుల నాణేలు, మట్టిపాత్రలు, అన్నింటికీ మించి స్థావరం చుట్టూగల రాతి కోటగోడ, అక్కడొక బండపైగల క్రీ.శ. 4వ శతాబ్ది అక్షరాల్లో నున్న ‘తులచు వాన్రు (రాతిని తొలిచేవారు)’ అనే చిన్న శాసనం విష్ణుకుండినులు కీసరగుట్ట నుంచే పాలించారని చెప్పడానికి వీలయ్యింది.
1975-79 మధ్యకాలంలో రాష్ట్ర పురావస్తు శాఖ కీసరగుట్ట పశ్చిమభాగాన జరిపిన తవ్వకాల్లో ఇటుకరాతితో నిర్మించిన శివాలయాలు బయల్పడినవి. రెండు దేవాలయాలు దీర్ఘ చదరంగా, రెండు మీటర్ల ఎత్తుతో అధిష్టానం వరకూ ఉన్నాయి. మరో దేవాలయం మూడు గర్భాలయాలు, మూడు అర్ధ మంటపాలు, ద్వారాలు, ముందు మెట్లు, చంద్రశిలలు కలిగిన ‘తొలి త్రికూట దేవాలయం’గా గుర్తింపు పొందింది. గర్భాలయం 2.0I2.65 మీటర్ల కొలతలతో ఉంది. మరో దేవాలయం 2.8I1.9 మీటర్ల కొలతలుగల గర్భాలయం, 2.35I2.20 మీటర్ల కొలతలున్న అర్ధ మంటపం కలిగి ఉంది. అధిష్ఠానంలో ఉపానం, జగతి, కుముదం, కంపం, కంఠం, పట్టిక వర్గాలున్నాయి. గర్భాలయంలో దేవతామూర్తిని ప్రతిష్టించడానికి, ఒక ఇటుకరాతి అరుగు ఉంది. గర్భాలయ గోడల బయటి గోడల మధ్య భాగంలో దేవతలకోసం కోష్టాల అమరిక ఉంది. ఈ ఆలయానికి విడిగా ఒక ప్రాకారంకూడా ఉంది. ఈ దేవాలయ అర్ధమంటప నైరుతి దిశన నేలమట్టంలో ఒక అందమైన మట్టికుండను పాతారు. ఈ కుండ మధ్యభాగంలో ఐదు స్త్రీ ప్రతిమలున్నాయి. మూతపై మరో స్త్రీమూర్తి ప్రతిమగలిగి, కుండపై మొత్తం ఐదు పాము బొమ్మలున్నాయి. ఇలాంటి బొమ్మలున్న కుండ లేక మట్టికలశం ఆ కాలపు మరే దేవాలయంలోనూ బయల్పడలేదు.
తవ్వకాల్లో పాలరాతి లింగాకారాలు కూడా దొరికాయి. అంతేకాక, తవ్వకాల్లో 9I9 సెం.మీ.ల కొలతలుగల ఒక రాతి ఫలకం లభించింది. మధ్యలో మాతృదేవత, తన రెండు చేతుల్లో శివ, విష్ణుమూర్తుల గుర్తులైన లింగం, సింహాలను ధరించి ఉంది. ఇంకా కొంచెం దూరంలో నీటి మడుగుకు ఆవల రోడ్డు పక్కగా చదరపు శివాలయం, చుట్టూ ప్రదక్షిణాపథంతోనూ, గర్భాలయంలోని అభిషేక జలం బయటకు వెళ్లడానికి ఇటుకరాతి కాలువతో నిర్మించబడిన ఆధారాలు దొరికాయి. ఇదే కాలానికి చెందిన అనేక శివలింగాలు కీసరగుట్టపై ప్రతిష్ఠించబడి నాయి. తవ్వకాల్లో రాతి శివలింగం, అర్ధనారీశ్వర హరిహరమూర్తి శిల్పాలను చెక్కిన నమూనా ఆలయాలుకూడా బయల్పడినాయి.
మహబూబ్‌నగర్ జిల్లా గుమ్మడంలో ఒక చదరపు గర్భాలయంగల ఆలయం బయల్పడింది. విష్ణుకుండిన కాలపు ఇటుకలతో నాలుగు వైపులా నాలుగు ద్వారాలతో ‘సర్వతోభద్ర ఆలయం’ నిర్మించబడింది.
నల్లగొండ జిల్లా యేలేశ్వరం (నాగార్జునసాగర్ జలాశయంలో మునిగిపోయింది) వద్ద జరిపిన తవ్వకాల్లో ఇటుకలతో నిర్మించిన చదరపు శివాలయం బయల్పడింది. ఈ గర్భాలయం మధ్యలో ఇటుకరాతి పానవట్టం, దాని మధ్యలో రాతితో చెక్కి నునుపుచేసిన శివలింగం ప్రతిష్ఠించబడింది. కీసరగుట్ట, ఏలేశ్వరం, గుమ్మడంలలో వెలుగుచూసిన ఆధారాలను బట్టి, ఈ కాలంలో ఆలయ నిర్మాణానికి ఇటుకలను మాత్రమే వినియోగించినట్లు, అప్పటికింకా రాతి ఆలయాల నిర్మాణం ప్రారంభం కానట్లు తెలుస్తుంది.
బాదామి చాళుక్యుల రేఖానగర ప్రాసాదాలు
(క్రీ.శ. 6 – 8 శతాబ్దాలు)
విష్ణుకుండిన రాజులు బలహీనపడడంతో కర్నాటకలోని బాదామి (వాతాపి)ని రాజధానిగా జేసుకొని పాలించిన పశ్చిమ లేక బాదామి చాళుక్యులు పశ్చిమాంధ్రదేశాన్ని (ఇప్పటి తెలంగాణను), తీరాంధ్రాన్ని స్వాధీనపరచుకొని, క్రీ.శ. 621 నుంచి వేంగిని రాజధానిగా, తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుని పాలకునిగా చేసి, వేంగీ లేక తూర్పు చాళుక్య రాజ్యస్థాపన గావించిన అనంతరం రెండో పులకేశి వెనుదిరిగి బాదామికి వెళ్లిపోయాడు. రెండో పులకేశి వేసిన తుమ్మయనూరు రాగిరేకు శాసనంలో మహబూబ్‌నగర్- కర్నూలు ప్రాంతాలు కలిసిన చాళుక్య విషయం ఇంకా కృష్ణా-తుంగభద్ర నదుల సంగమ స్థానమైన కూడల సంగమేశ్వర ప్రస్తావన ఉన్నాయి. దీంతో తెలంగాణాలో బాదామీ చాళుక్యులుతమదైన చాళుక్యశైలిలో అయిజ, అలంపురం, కూడలి సంగమేశ్వరంలలో రేఖానగర ప్రాసాదాలను నిర్మించి దక్షిణ భారత దేవాలయ నిర్మాణంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు.
అలంపురంలోని తొమ్మిది బ్రహ్మ ఆలయాలు బాదామీ చాళుక్య దేవాలయ వాస్తుకు అద్దం పడుతున్నాయి. సాధారణంగా గర్భాలయం, అర్ధమంటపం, మహా మంటపాలతోనూ, వీటిచుట్టూ ప్రాకారంతోనూ నిర్మించబడినాయి. గర్భాలయంలో కొన్నిసార్లు నాలుగు స్తంభాలుకూడా ఉంటాయి. గర్భాలయానికి అధిష్ఠానం, పైన సాదా పాదవర్గం, ప్రస్తరం (మంటపం కప్పుతో కలిసిపోతుంది), దానిపైన పలు అంతస్తుల రేఖా నగర విమానం, వృత్త కంఠం, ఉసిరికను పోలిన శిఖరం, పొడవాటి కలశం ఉంటాయి. ప్లాన్ పరంగా చదరపు గర్భాలయం, దీని ముందు అర్ధమంటపం, ముందు దీర్ఘ చదరపు మహామంటపం, చుట్టూ ప్రదక్షిణాపథం, దానిచుట్టూ గోడ ఉంటాయి. ద్వారాలు కొన్ని సాధారణంగానూ, మరికొన్ని గంగ, యమున శిల్పాలు, ద్వారపాల శిల్పాలు, పైన లలాటబింబంతోనూ అలంకరించి ఉంటాయి. స్తంభాల కింద పూర్ణకుంభం, అందులోంచి వెలువడుతున్న తీగలు, మధ్యలో పట్టం, దానిపైన మళ్లీ పూర్ణఘటం, చివరగా పాదిక ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్తంభం మీద బౌద్ధ స్తంభాలమాదిరిగా అర్ధపద్మాలు రెండు ఉండడం గమనార్హం. ఆలయాలకు ముందు ముఖ చతుష్కి అనే పోర్టికో ఉంటుంది. గర్భాలయానికి ముందు, అర్ధమంటపంపైన విమానం నుంచి ముందుకు పొడుచుకొచ్చిన శుకనాసి చాళుక్య దేవాలయ వాస్తుకు ప్రత్యేకత. కూడలి సంగమేశ్వరాలయం బయటి గోడమీద అనేక శిల్పాలు ఉన్నాయి.
చాళుక్య దేవాలయాల బయటి గోడ బయటవైపు కోష్టాలు, కిటికీలు, దంపతి శిల్పాలు ఉన్నాయి. క్రీ.శ.7వ శతాబ్దిలో కృష్ణ, తుంగభద్ర నదుల సంగమస్థానంలో కూడలి సంగమేశ్వరాలయాన్ని 10 అడుగుల పునాదులపై నిర్మించారు.
రాష్ట్రకూటుల ఆలయాలు (క్రీ.శ. 8 – 10 శతాబ్దాలు)
బాదామీ చాళుక్యుల సామంతులుగా ఉన్న రాష్ట్రకూటులు స్వతంత్రులై క్రీ.శ. 753లో రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించారు. మొత్తం తెలంగాణ, రాష్ట్రకూటుల అధీనంలోకి వచ్చింది. వీరి పాలనలో దేవాలయ వాస్తు, శిల్ప నిర్మాణం అత్యున్నత ప్రమాణాలను అందుకొంది. రాష్ట్రకూట రాజైన మొదటి కృష్ణుడు అనేక దేవాలయాల నిర్మాణానికి పూనుకొన్నాడు. ఇతడి హయాంలోనే ప్రపంచ ప్రఖ్యాత ఎల్లోరా కైలాసనాథ దేవాలయంతోపాటు అలంపురంలోని తారక బ్రహ్మాలయం నిర్మించబడింది.
అలంపురంలోని తారక బ్రహ్మాలయం రాష్ట్రకూటులదే!
తెలుగునాట రాష్ట్రకూటులు నిర్మించిన దేవాలయాలు చాలా ఉన్నాయి. అలంపురం నవబ్రహ్మాలయాల్లో తారక బ్రహ్మాలయం వీరు నిర్మించినదే. మహబూబ్‌నగర్ జిల్లా మియాపూరు, మల్లేశ్వరం, సోమశిల, బెక్కెం, మీనాంబరం అనే చోట్ల రాష్ట్రకూటుల ఆలయాలున్నాయి.గర్భాలయ, అర్ధమంటప, మహామంటపాలతోనూ, కొన్నిచోట్ల మహామంటపం మూడువైపులా ద్వారాలు, ముందు మెట్లతోనూ, అలాగే అధిష్ఠానం, పాదవర్గం, ప్రస్తరం, శిఖరాలతోనూ, అర్ధమంటపంమీద శుకనాసితోనూ ఉంటాయి. రాష్ట్రకూటుల ఆలయాలు మహాబలిపురంలోని రాతిరథాలవలె ఉండడమే కాక, పల్లవుల వాస్తును ప్రతిబింబిస్తాయి.
వేములవాడ చాళుక్యుల దేవాలయాలు (క్రీ.శ. 8 – 10 శతాబ్దాలు)
కరీంనగర్ – నిజామాబాద్ జిల్లాలు కలిసిన ప్రాంతాన్ని సపాదలక్ష, సవలక్షె, సవలక్కె అనీ, కొసవంసవలక్షకె అని శాసనాలు పేర్కొంటు న్నాయి. ఈ ప్రాంతాన్ని బోధన్, వేములవాడల కేంద్రాన్ని పాలించిన సూర్యవంశ చాళుక్యులను వేములవాడ చాళుక్యులని పిలిచారు. మూడో అరికేసరి (క్రీ.శ.946-968) వరకూ దాదాపు 10 మంది రాజుల వివరాలు దొరికాయి.
వేములవాడ చాళుక్యులు వేములవాడలో భీమేశ్వరాలయం, కేదారేశ్వ రాలయం, బద్దిగేశ్వరాలయం, యుద్ధమల్ల జినాలయం, నగరేశ్వరాల యాలను నిర్మించారు. వీటిలో భీమేశ్వరాలయం చెప్పుకోదగ్గది. రాష్ట్రకూటుల సామంతులుగా నున్న వీరు, రాష్ట్రశైలిలోనే ఆలయాలను నిర్మించారు. గర్భాలయ, ఆర్ధమండప, మహామండపాలతోనూ, నిలువుగా అధిష్టానం, పాదవర్గం, ప్రస్తరం, విమానాలతో స్థానిక సంప్రదాయ వాస్తును కూడా తెలియజేస్తుంది. భేదాభేద అధిష్టానంపై శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి. గర్భాలయ ద్వారబంధాలపై అంతగా అలం కార శిల్పం లేకపోయినా, గంగా, యమున శిల్పాలు వేములవాడ శిల్పశైలిని తెలియజేస్తున్నాయి. మండపస్తంభాలు భారీగా,సాదాగా ఉన్నా యి. ఆలయ శిల్పాల్లో మహిషాసురమర్దని, శంఖనిధి, పద్మనిధి, ముఖ మండప ద్వారలలాటంపైనున్న మకరతోరణం గజలక్ష్మీ శిల్పాలు నాటి సాంప్రదాయానికి అద్దం పడుతున్నాయి.
కళ్యాణ చాళుక్యుల దేవాలయాలు (క్రీ.శ. 10 – 12 శతాబ్దాలు)
రాష్ట్రకూటుల తరువాత బాదామీ చాళుక్య రాజవంశానికి చెందిన నాల్గవ విక్రమాదిత్యుని కొడుకు రెండవ తైలపుడు, రాష్ట్రకూటరాజు మూడవ కృష్ణుని సామంతుడుగా ఉండి, క్రీ.శ. 973లో స్వతంత్రుడై కళ్యాణ చాళుక్యరాజ వంశానికి మూల పురుషుడైనాడు. అతడు క్రీ.శ. 997 వరకూ పాలించాడు. రాష్ట్రకూట, వేములవాడ చాళుక్యల భూభాగమంతా తైలపుని వశమైంది. రెండవ తైలపుని పెద్దకొడుకు, ఇరివ బెడంగ సత్యాశ్రయుడు క్రీ.శ. 998లో సింహాసనాన్నధిష్టించి, క్రీ.శ. 1008 వరకూ పాలించాడు. చివరి రాజైన త్రిభువనమల్ల నాలుగో సోమేశ్వరుడు క్రీ.శ. 1163 నుంచి క్రీ.శ. 1189 వరకూ పాలించారు. అంతటిదానితో కళ్యాణ చాళుక్య రాజ్యం అంతరించింది.
కళ్యాణ చాళుక్యుల కాలంలో కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని దివకేశ్వరాలయం (క్రీ.శ.992), మెదక్ జిల్లాలోని నందికందిలోని రామ లింగేశ్వరాలయం (క్రీ.శ. 1015-42), నల్లగొండ జిల్లా పానగల్లులోని పచ్చల సోమేశ్వరాలయం (క్రీ.శ. 1015-42), మహబూబ్‌నగర్ జిల్లా మల్లేశ్వరం లోని అగస్తేశ్వరాలయ సముదాయం (క్రీ.శ. 1015-42), అదే జిల్లాలోని సోమశిలలోని సోమేశ్వరాలయం, అలంపూరులోని సూర్యనారాయణా లయం, గంగాపురంలోని చెన్నకేశవాలయం, పూడూరులోని చెన్నకేశ వాలయం, బెక్కెంలోని బెక్కేశ్వరాలయం, కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని రామలింగేశ్వరాలయం, రాయకల్‌లోని పంచముఖ లింగేశ్వరాలయం, చిలవ కోడూరులోని రామలింగేశ్వరాలయం, నగునూరులోని త్రికూటా లయం, నాంచెర్లలోని రామాలయం, తోటపల్లి శివాలయం, నంది మైడారంలోని త్రికూటాలయం, పొలాసలోని పులస్తేశ్వరాలయాలు, వరంగల్ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జునాలయం, పున్నూరులోని కేశవాలయం, నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వరాలయం, నిర్మించారు. వీటిని పరిశీలించి చూస్తే కళ్యాణ చాళుక్యుల కాలంలో దేవాలయాలు రాష్ట్రకూటుల ఆలయాలకంటే విశాలంగా, ఎత్తుగా నక్షత్రాకారపు ఉపపీఠం, ద్వారబంధాలపై విశేషమై శిల్పం, వెలుతురు రావటానికి మండపంలో కిటికీలు, బయటి గోడలమీదే కాక, కప్పులపై కూడా శిల్పం, విమానం నుంచి అర్ధమండపం వరకు ముందుకొచ్చిన శుకవాసి, మామిడిపిందెల మాదిరి డిజైన్లలో పై దూలమున్న తోరణాలు, మండప స్తంభాల నుంచి దూలాలను కలుపుతూ అమర్చిన శిల్పాలు, తొలి చాళుక్యుల రేఖానగర పద్ధతి కంటే భిన్నంగా కాదంబ నాగర విమానాలు ముఖ్య లక్షణాలని చెప్పవచ్చు.
కందూరు చోళుల దేవాలయాలు (క్రీ.శ. 11 – 12 శతాబ్దాలు)
మహబూబ్‌నగర్ జిల్లాలో హైదరాబాద్-కర్నూల్ జాతీయ రహదారిపై నుంచి మూసాపేటకు ముందు లోపలి రెండు కిలోమీటర్ల దూరంలో నున్న కందూరు పేరుతో కందూరునాడు ఉండేది. కళ్యాణీ చాళుక్యులు కాకతీయుల కాలంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న కందూరునాడు, కందూరు-300, కందూరు-1000, 1100 అన్న పేర్లతో పిలవబడింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ముసాపేట, జడ్చర్ల, నాగరకర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, మహబూబ్‌నగర్ తాలూకాలు, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నల్లగొండ తాలూకాల్లో విస్తరించిన కందూరును తెలుగు చోళులు పరిపాలించారని వారిని కందూరు చోళులని పేరు వచ్చింది. మొదట వీరి రాజధాని మహబూబ్‌నగర్ సమీపంలోని కోడూరు. ఈ వంశానికి చెందిన మూడో భీమచోడ, మొదటి గోకర్ణులకు వర్ధమానపురం (నంది వడ్డెమాన్), పానగల్లులు రాజధానులుగా ఉండేవి. క్రీ.శ. 1033 నుంచి క్రీ.శ. 1163 వరకూ 130 ఏళ్ళపాటు సాగింది.
కందూరు చోళులు నల్లగొండ జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మల్లేశ్వరం, సోమశిల, వర్ధమానపురం, ఒల్లాల, పానగల్లు, మామిళ్ళపల్లి, కొలనుపాక, పాములపాడు, వేములనెరవ, ఆలవానిపల్లి, నెక్కొండ, భూత్‌పూర్, రాచూరు, అనిమెల, గట్టుతుమ్మెన, ఉప్పరపల్లి, రామలింగాలగూడెం, తుమ్మేడు, పెద్దకడుంబూరు, పేరూరు, పరడ, ఎండబెట్ట, సిరికొండ, జూపల్లి, ఆగామోతుకూరులలో దేవాలయాలను నిర్మించి, చెరువులను త్రవ్వించి వాటి నిర్వహణకు భూముల్ని దానం చేశారు. కందూరు చోళులు తొలుత కళ్యాణ చాళుక్యులకు సామంతులుగా ఉన్నందువల్ల వారు కట్టిన దేవాలయాలు కళ్యాణ చాళుక్యుల వాస్తురీతినీ, స్వతంత్రులై పాలించిన తరువాత వర్ధమానపురం, పానగల్లుల్లో కాదంబ నాగర శైలి విమానాలతోనూ నిర్మించారు. పానగల్లులోని పచ్చల సోమేశ్వరాలయ సముదాయంలో ఒకవైపు మూడు, మరోవైపున ఒకటి దేవాలయాలు (చతుష్కూటం) ఒక మండపానికి కలుపబడినాయి. అన్ని దేవాలయాలు గర్భాలయ, అర్ధమండపాలతో ఉండి, ముందు భాగంలో 64 స్తంభాలతో ఒక మహామండపముంది.
ఆలయాల శిఖరాలు శిధిలమైనాయి. అధిష్ఠానం, పాదవర్గం ప్రస్తరం, మూడంతస్తుల విమానాలతో నిర్మించబడి, పాదవర్గం పై కూట కోష్ఠాలతో, దేవతాశిల్పాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వాహనాలపై ఉన్న అష్టదిక్పాలకులు, ఉమామహేశ్వర, భైరవ, నటరాజ, గణేశ, అందగత్తెల శిల్పాలున్నాయి. లోని కెళితే గర్భాలయ ద్వారాలను అత్యంత రమణీయంగా చెక్కారు. మండపం మధ్య స్థంభాలపై భాగవత, రామాయణ దృశ్యాలను, శివపురాణంలోని అంశాలు చెక్కారు. మండపం మధ్య స్తంభాలపై భాగవత, రామాయణ దృశ్యాలను, శివపురాణంలోని అంశాలను చెక్కారు. కప్పులపై దిక్పాలకులు, మధ్యన నటరాజశిల్పం, కందూరు చోళుల కాలపు శిల్పుల పనితనాన్ని తెలియజేస్తున్నాయి. మూడు దేవాలయాలు ఒక వరుసలో నుండగా ఎదురుగా వున్న ఒక దేవాలయ గోడలపై అంతగా శిల్పం లేదుగానీ, ప్రస్తర కపోతం కిందగల ఉత్తర (దూలం) వర్గంపైన మైథున, శృంగార దృశ్యాలు లైంగికవిద్య నందిస్తున్నాయి.
నందివడ్డెమానులోని త్రైపురుషదేవాలయం (త్రికూటం) మూడు దేవాలయాలతో రంగమండపానికి కలపబడినాయి. ఒక్కో ఆలయం గర్భాలయ, అర్ధమండపాలతోనూ, అధిష్టానం, పాదవర్గం, ప్రస్తరం, కంఠం, కపోతం వరుసలున్న విమానం, శిఖరాలతో కాదంబ నాగర శైలిలో ఉంది. నల్గొండ జిల్లా ఒల్లాలలో కందూరు చోళుల కాలపు సాదా శిలాతోరణముంది.
కాకతీయుల దేవాలయాలు (క్రీ.శ. 12 – 14 శతాబ్దాలు)
శాతవాహనుల తరువాత తెలుగు మాట్లాడే వారి ప్రాంతాలన్నీ ఏకంచేసిన కాకతీయులు క్రీ.శ.1152 నుంచి క్రీ.శ. 1323 వరకూ పాలించారు. కాకతీయ రుద్రదేవుని కాలంలో (క్రీ.శ.1163) నిర్మించిన వేయిస్తంభాల గుడి నుంచి, గణపతిదేవుని కాలంలో నిర్మించిన రామప్పగుడి, ఘనపురం దేవాలయాలు, కాకతీయుల దేవాలయ వాస్తుకు అద్దం పడుతున్నాయి.
హనుమకొండలోని వేయిస్తంభాల గుడిగా పిలువబడుతున్న త్రికూటాలయం రుద్ర, వాసుదేవ, ఆదిత్యుల కోసం నిర్మించబడింది. నక్షత్రాకారపు చిన్న ప్రదక్షిణాపధం, దానిపైన ఒక అధిష్టానం, స్తంభవర్గం, దీని మీద గోడంతా స్తంభాలతో అమర్చినట్లు కనిపించే విన్యాసం, మధ్య మధ్య దేవతా శిల్పాలు, చిన్న కపోతమున్న ప్రస్తరంలో చూడముచ్చటగా వుంది. పైన ఇటుకలతో నిర్మించిన ఆలయాలు పడిపోయాయి. ఇక లోపలికెళితే, ప్రవేశద్వారానికి ఇరువైపులా కక్షాసనాలు, అద్భుతమైన శిల్పాలతో చెక్కిన రంగమండపం, కప్పుల భాగాలు, అర్ధమండప ద్వారాలపై కిటికీలు, శిల్పాలు, పై దూలాలపై నటనమాడుతున్న నటరాజు, నరసింహుల శిల్పాలు తొలి కాకతీయ శిల్పుల పనితనానికి మచ్చుతునకలు. తరువాత ఆలయానికి కొంచెం ముందుగా నంది, దాని తరువాత కళ్యాణ మండపం (369 స్తంభాలతో నిర్మించబడినది) ఉన్నాయి.
తరువాత నిర్మించిన కాకతీయ ఆలయాలకు రుద్రుని వేయిస్తంభాల గుడి నమూనా ఉపకరించింది. ప్రధానంగా ప్రస్తావించాల్సిన కాకతీయ దేవాలయాల్లో హనుమకొండలోని వేయిస్తంభాల గుడి (క్రీ.శ.1163), మంథని, బెజ్జంకి, కొండపర్తి, నందివడ్డెమాను, ముత్తారం, గోదావరి ఖని, కాళేశ్వరం, నిడికొండ, చంద్రవల్లి, వరంగల్, కటాక్షపూరం, రామానుజపురం, బుద్ధపురం, వూటుకూరు ముఖ్యమైనవి.
గణపతిదేవుని కాలంలో అతని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రిరెడ్డి (రుద్రుడు) పాలంపేటలో (క్రీ.శ.1213లో) నిర్మించిన రామప్పదేవా లయం, కాకతీయ దేవాలయ వాస్తుకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఆలయాన్ని పరిశీలించి చూస్తే, నక్షత్రాకారపు ఎత్తైన ఉపపీఠం ప్రదక్షిణాపధంగానూ, దానిపైన గర్భాలయం, అర్ధమండపం, మహా(రంగ)మండపం, కొంచెం ముందుగా నందిమండపం, ఎడమవైపు అమ్మవారి ఆలయం, దానికి కుడివైపు మూలలో రేచర్ల రుద్రుని శాసనమున్న మండపం, మరో ఆలయం చుట్టూ ప్రాకారంతోనూ, ఇక ప్రదక్షిణాపధంపై నున్న ఆలయం అధిష్టానం, స్తంభవర్గం, విశాలమైన కపోతంతోనున్న ప్రస్తారం, దానిపై శుకనాసితోనున్న విమానం పేర్కొనదగిన అంశాలు.
ఆలయ అధిష్టానం, కక్షాసనాలపై వెలుపలివైపు జైనతీర్ధంకరులు, రుషులు, మైధున, శృంగార, రతికేళిలో నున్న శిల్పాలు, భైరవ, గణేశ శిల్పాలు చిన్నవైనా ముచ్చటగా ఉంటాయి. ఆలయం గోడలపై కూటకోష్టాలతోనూ, స్తంభికలతోనూ, మూడంచెల మంచెలతోనూ, పొడవాటి స్తంభాలతోనూ విలక్షణ వాస్తు ప్రతిబింబిస్తుంది. కప్పు భాగంలోనున్న కపోతం విశాలంగా అలంకార శిల్పంలో వడ్రంగానికేమీ తీసుపోనట్లుంది.
దూలాలకు, స్తంభాలనూ కలుపుతూ ఏటవాలుగా అమర్చిన నాగిని, మదనిక శిల్పాలు, మరెక్కడా కానరావు. ఆలయ రంగమండపంలోకెళితే కక్షాసనంపై చిన్న దేవాలయాలు పరివారాలయాలుగానున్నాయి. రంగమండప స్తంభాలు, దూలాలు, కప్పుపైన చెక్కిన శిల్పాలు కాకతీయ శిల్పులు, నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఇక అర్ధమండప ద్వార శాఖలను పరిశీలిస్తే 20కి పైగా నృత్యభంగిమల్లోనున్న శిల్పాలు, వాద్యకాండ్రు, చెలికత్తెలు, ద్వారదూలంపై నటరాజ శిల్పం, మధ్యరంగ కప్పుపై అష్టదిక్పాలకుల శిల్పాలు కంటికింపుగా ఉంటాయి.
పాలంపేటకు 6 కి.మీ. దూరంలో నున్న గణపురంలో గణపతి దేవుడు కట్టించిన కోటగుళ్ళు కాకతీయ దేవాలయ వాస్తుకు మరో ఉదా హరణ. మధ్య ప్రధాన దేవాలయం, తూర్పున త్రికూటం, పడమరన కళ్యాణ మండపం, ఉత్తరాన తొమ్మిది, దక్షిణాన మూడు, పశ్చిమాన నాలుగు మధ్యలో ఇంకా మూడు దేవాలయాలతో మొత్తం 22 దేవాలయాలున్న సముదాయం ఆనాటి కళింగ, ఆంధ్ర, ద్రావిడ, కర్ణాటక, ఘూర్జరశైలి దేవాలయాల నమూనాలుగా నిర్మించబడినాయి. ప్రధా నాలయం గర్భాలయ, అర్ధమండపాలతోనూ, శిథిలమైన మహామండ పాలతో ఉండి మొత్తం ఎత్తైన ఉపపీఠం,ప్రదక్షిణాపథంపై ఉంది. రంగమండప స్తంభాలు, దూలాల మధ్య రామప్ప మాదిరిగా యువతులు, సింహ-వ్యాళ శిల్పాలున్నాయి. త్రవ్వకాల్లో బయటపడిన నిలువెత్తు శివ, విష్ణు ద్వారపాలక శిల్పాలు కాకతీయ శిల్పుల పనితనాన్ని తెలియజేస్తున్నాయి.
కాకతీయులకు సామంతులుగా ఉన్న రేచర్ల వంశీయులు, నల్లగొండ జిల్లా పిల్లలమర్రి, నాగులపాడులోనూ, మల్యాల చౌండసేనాని వరంగల్ జిల్లా కొండిపర్తిలోనూ, చెఱకు వంశీయులు నాగర్ కర్నూల్ జిల్లా కలువ కొలనులోనూ, గోన వంశీయులు నందివడ్డమాను ( వర్ధమానపురం), బూద(బుద్ధ)పురం లోనూ దాదాపు కాకతీయ శైలిలోనే ఆలయాలను నిర్మించారు.
తెలంగాణా రీతిని ప్రతిబింబిస్తున్న కాకతీయ దేవాలయాలు 1500లకు పైగానే ఉన్నాయి. తొలుత నిర్మించిన మొగలిచర్ల, సోమశిల దేవాలయాలు సాదాగా ఒక వరుస రాతితో నుండగా, తరువాత రెండు వరుసల గోడలతో విశాలంగా నిర్మించబడినాయి. దేవాలయాలు ఏకకూట, ద్వికూట, త్రికూట, పంచకూటాలయాలని, ఒకటి, ఎదురెదురుగా రెండు, ఒకటి మధ్యలో, అటూ ఇటూ చెరొకటి చొప్పున మూడు, ఒకటి మధ్యన ప్రక్కన అటూ ఇటూ ఎదురెదురుగా రెండు, రెండు చొప్పున మొత్తం ఐదు దేవాలయాలు నిర్మించబడినాయి.
ఇంకా తోరణాలు (వరంగల్ కోటలోని కీర్తి తోరణాలు). ద్వార మండపాలు (రెండంతస్తుల ద్వారమండపం- రామానుజపురం), నందిమండపం (రామప్ప), శాసన మండపం (రామప్ప), కళ్యాణ మండపం (హనుమకొండ, గణపురం), కాకతీయ దేవాలయ వాస్తులో ప్రధానాంశాలు. తొలినాళ్ళలో కళ్యాణ చాళ్యు దేవాలయ వాస్తును అనుసరించినా, స్వతంత్రులైన తరువాత ఒక ప్రత్యేక శైలిలో ఆలయాలను నిర్మించి కాకతీయ శైలిగా గుర్తింపు నిచ్చారు.
కాకతీయుల అనంతరం తెలంగాణా ఢిల్లీసుల్తాన్‌లు, తరువాత ఓఢ్రగజపతుల పాలనలోకొచ్చింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని రామాలయం, చూడటానికి విజయనగర దేవాలయంలా ఉన్నా, గజప తులు క్రీ.శ.15వ శతాబ్దిలో విజయనగర శైలికి కొద్ది మార్పు చేర్పులతో నిర్మించారు. గుట్టపై నిర్మించిన ఈ ఆలయానికి ఒక చక్కటి తోరణ ద్వారం, గర్భాలయం, అర్ధమండప, మహామండ పాలు, వెలుపల అధిష్ఠానం, పాదవర్గం, ప్రస్తర వర్గాలున్నాయి.ఆలయ వెలుపలి గోడల పైభాగంలో అనేక శృంగార మైధున శిల్పాలున్నాయి.
క్రీ.శ.16వ శతాబ్దిలో విజయనగర పాలనలో కొద్ది తెలంగాణా భూభాగం మాత్రమే ఉండటం గమనించాల్సిన విషయం. మహబూబ్ నగర్ జిల్లా పెంట్లవెల్లి, మంచాల కట్ట, జటప్రోలు, సింగవటం, శ్రీరంగాపురంలలో విజయనగర సామంతులుగానున్న జటప్రోలు సంస్థానాధీశుడు కుమార మాదానాయకుడు నిర్మించిన ఆలయాలున్నాయి. జటప్రోలులోని మదన గోపాలస్వామి దేవాలయం, గర్భాలయ అర్ధమండప మహామండప, సభామండపం, వాహనాలయం, ధ్వజస్థంభం, గోపురం, పరివారాలయాలు, ప్రాకారం, యాగశాల, పాకశాల, ప్రాకార మండపాలతో ఒక పరిపూర్ణ దేవాలయ వాస్తుకు అద్దం పడుతుంది. విజయనగర రాజుల తరువాత గూడూరు, వనపర్తి, గద్వాల, దోమకొండ మొదలైన సంస్థానాలు కూడా తమదైన శైలిలో ఆలయాలను నిర్మించాయి. ఇలా క్రీ.శ. 1వ శతాబ్ది (శాతవాహనుల కాలం) నుంచి క్రీ.శ.17వ-18 శతాబ్దాల(సంస్థానాల) కాలందాకా తెలంగాణాలో అనేక ఆలయాలు విలక్షణ వాస్తుశైలితో నిర్మించబడినాయి.
డా.ఈమని శివనాగిరెడ్డి