సాహిత్యపరంగా తెలంగాణ ప్రాంతాన్ని చూసినప్పుడు తెలంగాణ సాహిత్యంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు గమనించవచ్చు. తెలంగాణ సాహిత్యం సంప్రదాయ సాహిత్య రీతులకు కొంత భిన్నంగా కనిపిస్తుంది. అంటే పండిత ప్రకాండులు వెలయించిన మార్గ సాహిత్యానికి సమాంతరంగా ఒక పాయ తెలంగాణలో ప్రవహిస్తున్నది. ఉదాహరణకు పాల్కురికి సోమన బసవ పురాణ రచన. తెలంగాణలో దేశి కవితా పద్ధతులు ఎక్కువ. జానపదుల గీతాలు ఎక్కువ. తెలంగాణేతర ప్రాంతాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రాంతంలో సంప్రదాయ సంగీతం, సంప్రదాయ నృత్యాలు పరిఢవిల్లితే తెలంగాణలో జానపదుల గేయాలూ, జానపదుల ప్రదర్శన కళలూ పరిపుష్టంగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో లలిత గీతాలాపన ఉన్నట్లే తెలంగాణలో ప్రతి ఇంటా, ప్రతి గ్రామాన నిసర్గ సుందరమైన పల్లెప్రజల పాటలు ఉన్నాయి. భక్త రామదాసు కీర్తనల్లోనూ, పోతన పద్యాల్లోనూ ఈ గానయోగ్యమైన జానుతెనుగుతనం ఉన్నది. అందుకే అవి ప్రజల హృదయాలలో గూడుకట్టుకుని నాల్కలపై నాట్యం చేస్తున్నవి.
ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతంలో ప్రజల్లో ప్రచారంలో వున్న ఒక పొడుపు కథను పరిశీలిద్దాం: చవితికి సామగింజంత ఉంటది/ పెత్రమాసకు పెసరు గింజంత అయితది / దీలెకు దీపంత అయితది / సంకురాత్రికి సంకలు లెవ్వనియ్యది/ మాగమాసంకు మంటల పడ్డ పోదు/శివరాత్రికి శివశివా అనుకుంట పోతది. తెలంగాణీయులు దేశికవితా రీతిలో జానపద ఫణితిలో ‘చలి’ గురించి చెప్పిన పోలికలతో కూడిన ప్రహేళిక యిది. చవితి అంటే వినాయక చవితి. అప్పుడు చలి చిన్నగా మొదలై సామగింజ పరిమాణంలో ఉంటుందట! ఇది నిజం. ఒడిపిళ్ళ ధాన్యం ఏ సైజులో ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది సామగింజ. పల్లె ప్రజలు వ్యవసాయదారులు కనుక చలిని సామగింజలతో పోల్చారు. చలికి ఒక మూర్త రూపం కలిగించారు. చవితి తర్వాత వచ్చే పెద్దల అమావాస్యకి చలి కొంత పెరిగి పెసర గింజంత అవుతుందంట! ఆ గ్రామీణుల ఊహాశక్తి, కవిత్వకల్పనాసక్తి, యతులు వెయ్యగలిగిన సామర్థ్యతనూ గమనించండి.
ఇక ఆ తర్వాత దీపావళికి దీపావళి ప్రమిద అంత అవుతుంది. ఇక్కడ వరకూ మనకు ఆ పల్లె ప్రజలు దేని గురించి ఈ పొడుపు కథలో చెబుతున్నారో తెలియదు. తర్వాత కొంత ‘క్లూ’ దొరుకుతుంది. విడుపుకోసం, ఏమిటది? సంక్రాంతికి సంకలు లెవ్వనియ్యదు. చలి విపరీతమవుతుంది కదా! మాఘ అమావాస్య నాటికి మనం మంటల్లోపడ్డా చలిపోదు. సాధారణంగా సంక్రాంతీ, మాఘమావాస్యాలు జనవరిలో వస్తాయి. అప్పుడు చలి తీక్షణంగా, తీవ్రంగా ఉంటుంది కదా! చివరికి శివరాత్రికి చలి శివశివా అనుకుంటూ వెళ్లిపోతుందట! ఇది జానపదుల రమణీయ కవిత్వ కళ!! చలికి సంబంధించి ఇంత చక్కటి ఊహాశక్తి కలిగిన కవితా, పొడుపు కథా ఇతర సాహిత్యాల్లో నాకు తెలిసి ఎక్కడా లేదు. సంక్రాంతినాటి, మాఘఅమావాస్యనాటి చలి తీవ్రతను అత్యంత సహజంగా, అద్భుతంగా వ్యక్తీకరించిన తెలంగాణ జానపదుల అభివ్యక్తి ఇది.
చలికి సంబంధించినవే మరికొన్ని పదాలూ, పదబంధాలూ, పలుకుబళ్ళూ, సామెతలూ తెలంగాణలో ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం: అన్నం అడుక్కోవడానికి వచ్చే బిచ్చగాళ్ళు ‘ఇంత సలిదో బులిదో ఉంటే ఎయ్యవ్వా!” అంటూ ఇల్లాలిని అడుగుతుంటారు. ఇక్కడ ‘చలిదో’ అంటే నిన్నటి అన్నం. అది ఈనాటికి చలిదే! చల్లారిపోయినదే!! ఈ ‘చలిది’నే మనం సలి అన్నం, సలిబువ్వ, సలికూడు అంటున్నాం. ఈ ‘చలిది’ అనే మాట వర్ణ సమీకరణంతో ‘చద్ది’ అయ్యింది. దాన్నే జానపదులు సద్ది అంటున్నారు. ‘పెద్దలమాట సద్దిమూట’ అనే సామెతలోని సద్ది ఇదే! అయితే ఇప్పుడు అర్థం మారిపోయింది. గ్రామాంతరం వెళుతున్న వ్యక్తికి ఓ డబ్బగిన్నెలోనో, క్యారియర్‌లోనో పెట్టి యిచ్చే అన్నమూ, కూరా, తొక్కూ ఇప్పుడు చద్దిగా మారింది. నిజానికి మునుపు మాత్రం చద్ది అంటే నిన్నటిదే అని! పోతన భాగవతంలో ‘చల్దులు ఆరగించుట’ ఒక రసవత్తర సన్నివేశం. ఇక… పై ‘సలిదో బులిదో’లోని ‘బులిది’ ఏమిటి? అది బులిది కాదు పులిది. నిజానికి పులిది అంటే పుల్లనిది. పులిసినది. పులుపు కలది. పూర్వం కలినీళ్ళతో అన్నం వండి వార్చేవారు. ఆ కలి కొన్నాళ్ళకు పులిసిపోయేది! ఆ పుల్లని నీళ్ళతో అన్నం వండితే అది పుల్లలు పుల్లలుగా విడివిడిగా చక్కగా అయ్యేది. కనుక గుమ్మం ముందరి బిచ్చగాడు మనల్ని అయితే చలన్నమో, లేక పులిసి పుల్లలుగా మల్లెలుగా వండిన అన్నమో అడుగుతున్నాడు. ‘మాతా కబళం తల్లీ’ అన్న అర్థింపు ఆంధ్రప్రాంతంలోనిది.
తెలంగాణలో బాగా వేడి శరీరాలను ‘దార్నం శరీరాలు’ అనీ, బాగా చల్లని దేహాలను ‘సలువ శరీరాలు’ అనీ అంటారు. ‘సల్వ శరీరం’ అంటే చలి పడనివాళ్ళు. చలితిండ్లు సరిపడనివాళ్ళు. ఎక్కడినుంచైనా ఒక ఊరికి ఆశ్రయం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇది ‘సలువ గల్ల ఊరు’ అంటుంటారు. బాలింతలకు అదేపనిగా చెమటలు పోస్తున్నపుడు పెయ్యి అంత ‘సలువలు వస్తున్నవి’ అని పలుకుతుంటారు. అదేపనిగా తుమ్ములు వస్తుంటే జలుబు చేస్తే ‘సలువ చేసింది’ అనడం తెలంగాణలో పరిపాటి. నిజానికి ఆధునిక ప్రమాణ భాషలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతపు అభివ్యక్తిలో ‘చలువ చేయడం’అంటే గుడ్డల్నీ చవుటి నీళ్ళతో ఉడికించి ఉతకటం, ఇస్త్రీ కూడా చేయడం. ఆ ప్రాంతంలోని ‘చలువరాళ్ళ’ను తెలంగాణలో మార్బుళ్ళు, బండలు అంటారు.
చలి ఎక్కువైనప్పుడు ‘సలి మంటలు’ కాగడం తెలంగాణలో సర్వ సాధారణం. ‘సలి చీమలు, సలిజెరం, సలి పిడుగు’వంటి మాటలు తెలంగాణ, తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో ఒకే అర్థంలో చలామణిలో
ఉన్నాయి. తెలంగాణలో ‘సలిగాలి’ ఇతర తెలుగు ప్రాంతాల్లో ‘చల్లగాలి’ అయ్యింది. అదే శీతవాయువు. తెలంగాణలో ‘సలినీల్లు’, ‘సన్నీల్లు’ అనే సమాసాలూ వుంటే ఆంధ్రలో ‘చన్నీళ్ళు’ వ్యవహారంలో వుంది. తెలంగాణలో చలికి పెయ్యి ఇర్రిర్రుమని అంటది. ఇర్రిర్రు అంటే అదోరకమైన చిమచిమ, చర్మ పగుళ్ళు, దురద. చలిబాధ. ఈ ‘ఇర్రిర్రు’కు సమానార్థకం ఆధునిక ప్రమాణ భాషల్లో లేదు.
తెలంగాణలో ‘తియ్యటి మాటలకు తీర్తం బోతే’ నువ్వు గుల్లె నేను సల్లె’ అనే సామెత సైతం వుంది.
డా|| నలిమెల భాస్కర్