డా|| నలిమెల భాస్కర్
తెలంగాణ భాషలో అసంఖ్యాకమైన జంటపదాలున్నాయి. ఈ జంటపదాలు సాధారణంగా ఏ భాషలోనైనా వుంటాయి. వీటిని కే.వి. నరేందర్ జోడి పదాలుగా ఓ చిన్న పుస్తకం వేశాడు (తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంకితం). ఆధునిక ప్రమాణ భాషతో తెలంగాణ భాషను పోల్చి చూసినపుడు తెలంగాణ జంట పదాల్లోనూ అనేక ప్రత్యేకతలు కన్పిస్తాయి. ఉదాహరణకు ”మీరు శ్రీవైష్ణవులా, శైవులా?” అనే ప్రశ్నను తెలంగాణలో ”మీరు తిరుమన్దార్లా? ఊబుద్దార్లా?” అని అడుగుతారు. ”తిరుమన్దార్లు” అంటే తిరుమణ్‌ధారులు అని. తిరు అంటే పవిత్రమైన అనీ, మణ్ అనగా మన్ను అనీ, ధారులు అంటే ధరించినవారు అనీ అర్థాలు. పవిత్రమైన మట్టిని (శ్రీమహావిష్ణువు పాదరజం) నామాలుగా పెట్టుకొన్నవారు తిరుమన్దార్లు. ఇక.. ఊబుదార్లు అంటే విబూతి (శివుని నివాసమైన స్మశానవాటికలోని బూడిదను) ధరించినవారు. వీళ్ళు శైవులు. శైవ, వైష్ణవ భేదాలు హిందూమతంలోని ప్రధాన శాఖలు అని తెలుసు మనకు. ఎదుటి వ్యక్తి మతశాఖను తెలుసుకోవాలనుకున్నపుడు ‘మీరు తిరుమన్దార్లా, ఊబుద్ధార్లా’ అని ప్రశ్నిస్తారు తెలంగాణలో.
‘పండుగలు పబ్బాలు’ అనేది మరో జంటపదం. బహుశః ఆధునిక ప్రమాణ భాషలో సైతం ఇదే జంటపదం ఉపయోగంలో వుండి వుంటుంది. పండుగ అంటే మనకు దసరా, ఉగాది మొదలైనవి గుర్తొస్తాయి. మరి ‘పబ్బం’ ఏమిటి? ఇది ‘పబ్బం’ కాదు పర్వం. పర్వం, పర్వదినం అంటే పండగ అనే కదా అర్థం. ‘పండుగులు పబ్బాలు’ అనే జంటపదంలో పండుగకు సమానార్థకమే. అంటే పర్యాయపదమే ‘పబ్బం’. కొన్ని జంటపదాల్లో సమానరకాలే వుంటే మరి కొన్నింటిలో వ్యతిరేకార్థాలుంటాయి. ”ఊబుద్దార్లు, తిరుమన్దార్లు” పరస్పర వ్యతిరేకాలు.
ఫలానా వ్యక్తి పెద్దగా శ్రమతో కూడిన పనిచేయనప్పుడూ, సులువైనపని అప్పగించినా వెనుకంజ వేసినప్పుడూ ”ఏందిరా? గింత చిన్నపనికి గూడ ఎనుకతొక్కులు తొక్కుతున్నవ్. ఏమన్న నువ్వు ‘మొద్దులు మోస్తున్నవా, మొరండ్లు కొడుతున్నవా? అని ప్రశ్నిస్తారు. మొద్దులు మొరండ్లు జంటపదం. మొద్దు అంటే తుంట. మొరడు అంటే మ్రోడు, స్థాణువు అని అర్థాలు. చెట్టు పూర్తిగా ఎండి పోతే మోడు అవుతుంది. ఆ మొరడుకు బహువచన రూపం ”మొరండ్లు” (పెరడు, పెరండ్లు అటువంటివే). ”ఆమెకు ఉత్త నల్లపూసలదారమే మెడల వున్నది. ఆకిరికి గుండ్లు ఎనలు గూడ లెవ్వు’ అంటుంటారు, పల్లీయులు పేదరాలుని చూసి. గుండ్లు అంటే గుండ్రముగా గురిజగింజల పరిమాణంలో చేసిన బంగారు నగలు. ఎనలు అంటే గుండ్ల నడుమ సమాంతర చతుర్భుజం ఆకారంలో తయారు చేసిన నగలు. ఇవీ బంగారువే, అయితే రాళ్ళతో వుంటాయి. ‘గుండ్లు ఎనలు’ అనేది తెలంగాణ భాషలోని జోడిపదం. ”వాళ్ళ యింటికి ఓ అచ్చగాడు రాడు, బిచ్చగాడు రాడు” అనేది పల్లేసీమల్లో వినిపించే వాక్యం సంభాషణలో. మరి ఈ అచ్చగాడు అంటే ఎవడు? వీడు హిందీ ”అచ్చా/అచ్చే” మనిషి కావచ్చు. అంటే మంచివాడు అని అర్థం. బిచ్చగాడంటే తెలుసు. వేళాపాళా లేకుండా ఇంటి ఇల్లాలిని బిచ్చం కోసం వేధించేవాడు కనుక చెడ్డవాడు.
ఫలానా వాళ్ళ యింటికి మంచోడు, చెడ్డోడు ఎవడూ రాడు అని చెప్పడానికి ఇటువంటి ప్రస్తావన తెస్తారు. ‘అచ్చగాడు బిచ్చగాడు’ కూడా తెలంగాణ జంటపదం.
‘పిల్లకు పెండ్లిల ఏమన్న బోల్లు బోకెలు పెట్టిండ్రా?’ అనే ప్రశ్నావాక్యంలో కూడా ‘బోళ్ళు బోకెలు’ జంటపదం. ఇవి నిజానికి ‘బోలె’లు ప్లస్ ‘బోకి’లు. ఇవి తమ నైఘంటికార్థాన్ని కోల్పోయి పాత్రలకు పర్యాయపదాలుగా మారాయి. అట్లనే ‘బట్టలు బాతలు’ మరొక జంట. బట్టలు అంటే గుడ్డలు. ‘బాతలు’ నిజానికి ‘బాతలు’ కావు, అవి ‘పాతలు’. సంధి వల్ల బాతలు అయ్యాయి. ‘పాతలు’ అంటే బట్టలకు సంబంధించినవే కానీ కొంత పాతబడ్డ గుడ్డలు.
”వాల్ల యింట్ల కోల్లు లెవ్వు కొంకనక్కలు లెవ్వు” – ఇదీ తెలంగాణ వాక్యమే. కోల్లు అంటే కోళ్ళు. కోడి ఏకవచనం.
కోళ్ళు బహువచనం. మరి కొంకనక్కలు ఏమిటి? కోళ్ళు అనే పదానికి వత్తాసుగా, మద్దతుగా వచ్చి చేరిన పదం. కొంకనక్క అంటే చిన్న జాతి నక్క అని అర్థం. ఏవీ లేవని చెప్పడానికి, పెంపుడు జంతువులూ, పక్షులూ ఏవీ లేవని చెప్పడానికి ఆ వాక్య ప్రయోగం వుంది. ‘మందులు మాకులు’లో మాకు అంటే మ్రాను, చెట్టు. పూర్వం ఔషధాలు దాదాపు ఓషదుల్లోంచీ, వనమూలిక ల్లోంచీ, చెట్లూ, మొక్కల్లోంచీ వచ్చేవే కనుక ‘మాకులు’ అంటున్నారు.
”వానికో పోరగాండ్లా పొట్టెగాండ్లా? ఏక్ నిరంజన్” అంటారు. సంతాన హీనుణ్ణి చూసి. ఇందులో పోరగాండ్లు తెలుసు మనకు. పొట్టెగాండ్లు ఎవరు మరి? తెలుగు భాషలో బొట్టియడు, బొట్టెడు అనే పదాలు కొడుకు అనే అర్థంలో వున్నాయి. అందుకని పొట్టెగాండ్లు అంటే కుమారులని అర్థం చెప్పుకోవచ్చు.
”మీ ఊల్లె గొల్ల కుర్మలు వున్నరా?” అని అడిగినపుడు వినిపంచే ”గొల్లకుర్మలు” జంటపదం. గొల్లలు ఎవరు? గొర్రెలు కాచేవారు, పెంచేవారు. మరి ‘కుర్మలు’. ‘కురి’ అంటే కన్నడంలో గొర్రె అని అర్థం. ‘కురి’లను కాచేవారు. కన్నడంలో కురిబలు – తెలుగులో కురుమలు.
”వాడు ఉత్త ఆకులు అలములు తినే బతుకుతడు’లోని ఆకులూ అలముల్లోని అలము అంటే ఒక శాకవిశేషమే!
”ముసలోల్లు ముడిగోల్లు” – ఇంకొక జంట పదం. ముడిగోల్లు అటే ముడికాళ్ళవాళ్ళు అయివుంటారు. అంటే పరస్పరం మోకాళ్ళు తాకుతూ వుండే పాదాలు కల్గిన వాళ్ళు. ఈ ”ముసల్లోల్లు ముడిగోల్లు” ఆంధ్రప్రాంతంలో ‘ముసలి ముతకా’ అయింది. ఆధునిక ప్రమాణ భాషలో వున్న ”పిల్లా పితకా, పిల్లా పీచూ” తెలంగాణ కొచ్చేసరికి ”పిల్ల జెల్లా” అయింది. ఈ ”జెల్ల”కు అర్థం చెప్పలేము. ఆంధ్రలో పెట్టే బేడా సర్దుకొని ప్రయాణమైతే తెలంగాణలో తట్ట బుట్ట సదురుకొని పైనం గడుతరు. ఇట్ల తెలంగాణ భాషల జంటపదాలు ఎన్నింటిని అయినా చెప్పుకోవచ్చును.