ప్రాతస్మరణీయులైన ప్రముఖుల జీవన రేఖల్ని చిత్రించే వ్యాసాలకు నేటి తరంలోనూ ఆదరణ కనబడుతున్నది. నేటి ఆశావహమైన సంగతి. ఆయితే ఆయా వ్యాసాలు భారంకాని శైలిలో, అనుభూతమయ వ్యక్తీకరణలతో, స్వీయానుభవాల సమ్మేళనంగా

ఉండాలి. ద్విగుణ సంపుటిగా రూపొందిన జీవిత చిత్రణ వ్యాసాలు అందరినీ చదివిస్తాయి. అందుకొక మంచి ఉదాహరణ ”తీపి గురుతులు”. సీనియర్‌ పాత్రికేయులు టి. ఉడయవర్లు రచన ఇది. ఇందులో మొత్తం నలభై వ్యాసాలున్నాయి. ”తీపి గురుతులు” (గుర్తుకాదు!) అని వినూత్న రీతిలో పేరుపెట్టడంలో రచియత దేశీయ దృష్టి, వైవిద్య వైఖరీ ఆర్థమవుతాయి. నిజంగానే ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ తీపి గురుతులే!

దశాబ్దాల పాటు పత్రికా విలేకరిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉడయవర్లు స్వంతం. ఈ సుదీర్ఘ వ్యవధిలో ఎంతో మంది గొప్ప వ్యక్తులతో సన్నిహితంగా మెలిగే అవకాశం ఆయనకు దక్కింది. ”తీపి గురుతులు”లో ఆయా ప్రముఖుల గొప్పతనంతో పాటు వారితో తన జ్ఞాపకాల పరంపరనూ చక్కగా చేర్చారు. దీనితో ”తీపి గురుతులు” జ్ఞాపకాల పరిమళాన్ని కూడా సంతరించుకున్నాయి. ”నార్లవారి సన్నిధిలో” ”చైతన్య కవిత”కు మరో పేరు దాశరధి. నాకు తెలిసిన నారాయణరెడ్డి వంటి వ్యాసాలు ఇందుకు ప్రతినిధులు.

”తీపి గురుతులు”లో పల్లా దుర్గయ్య, బిరుదురాజు రామరాజు, నటరాజ రామకృష్ణ వంటి ప్రసిద్ధులతోపాటు, చేసిన కృషికి తగిన గుర్తింపు లభించని ప్రముఖుల జీవన చిత్రాలూ బాగున్నాయి. ఎమ్మెల్యే నరసింహారావు, జి. రామారావు, జువ్వాడి గౌతమరావు వంటి గొప్ప వ్యక్తుల్ని సముచిత రీతిలో ఉడయవర్లు గుర్తు చేశారు.

వ్యాసాల శీర్షికల్లోనూ ఆయన లాలిత్వాన్ని చూపించారు. ”పాటల తోట నుంచి వెళ్ళిపోయిన వసంతం” ”తెలుగు సాహితీ లోకంలో కలకండ ఉత్పల సత్యనారాయణాచార్య, తెలంగాణాన్ని మాండలికాన్ని మ్రోయు తుమ్మెదలా ధ్వనించిన గూడూరి వంటి శీర్షికలు ఉడయవర్లు సృజన ప్రజ్ఞకు ప్రతీకలు.

వ్యాసాలన్నీ దాదాపు ఏదో ఒక పత్రిక లేదా ప్రముఖ సంచికలలో ప్రచురణను పొందినవే. వీటిలో కొన్ని సమకాలీన ప్రాధాన్యతలో కూడినవి. వృత్తి రీత్యా, వ్యక్తిగత జీవితంలోనే మార్గ దర్శకులుగా

ఉండి పురోగమనానికి దోహదం చేసిన మహానుభావులను స్మరించుకోవడం ప్రశంసనీయం.నిన్నటి తరం పెద్దల విశిష్ట జీవితాల్ని గురించి తెలుసుకోవాలనుకునేవారు తప్పక చదవవసినవి ఈ ”తీపి గురుతులు”.

– జి. ప్రసన్న హంసిక

Other Updates