– మంగారి రాజేందర్
కోర్టులు తీర్పులు ప్రకటించడంలో ఎలాంటి జాప్యం జరుగకూడదు. ఉత్తర్వులు సత్వరంగా ప్రకటించాలి. బెయిల్ దరఖాస్తులు వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించినవి కాబట్టి వీటిలో ఉత్తర్వులు ప్రకటించడంలో ఎలాంటి కాలయాపన జరుగకూడదు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువగా కన్పిస్తున్నాయి. క్రింది కోర్టుల్లో కన్నా పై కోర్టుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తుంది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.
తుది వాదనలు విన్న తరువాత కూడా వివిధ కారణాల వల్ల కోర్టు తీర్పులు ప్రకటించడంలో జాప్యం జరుగుతూ వుంటుంది. వాటికి కారణాలు అనేకం. పని ఒత్తిడి, సమయాభావం, పనిభారం ఇట్లా ఎన్నో సహేతుక కారణాలు వుండవచ్చు. కారణాలు ఏమి వున్నప్పటికీ సకాలంలో తీర్పులు చెప్పాల్సిన బాధ్యత కోర్టుల మీద వుంది.
న్యాయం ”ఆలస్యమైతే న్యాయం జరగనట్టే”నన్నది నిన్నటి మాట. ”న్యాయం ఆపెయ్యడం న్యాయం జరగనట్టేనన్న దానికన్నా హీనమైనదన్నది” నేటి మాట. జనాభా ప్రాతిపదికన, కేసుల ప్రాతిపదికన కోర్టులు లేవన్నది వాస్తవమే అయినా సత్వరం తీర్పులు ప్రకటించాల్సిన బాధ్యత కోర్టుల మీద వుంది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం క్రిమినల్ కేసుల్లో తీర్పులని వెంటనే ప్రకటించాల్సి వుంటుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సివిల్ కేసులని తుది వాదనలు విన్న తరువాత రెండు మాసాల్లోగా ప్రకటించాలి. అయితే ఈ రెండు నిబంధలనలు దిగువ కోర్టులకే వర్తిస్తాయి. హైకోర్టులకి వర్తించవు. హై కోర్టులు తీర్పులు ప్రకటించడానికి శాసనం ఎలాంటి కాలపరిమితిని ఏర్పరచలేదు. తీర్పులు చెప్పడంలో హైకోర్టు చేస్తున్న జాప్యాన్ని గమనించి సుప్రీం కోర్టు అనిల్ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, 2001 సుప్రీం కోర్టు కేసెస్ (క్రిమినల్) 1009 కేసులో హైకోర్టులు తీర్పులు ప్రకటించే విషయంలో కొన్ని మార్గదర్శకాలను ఏర్పచింది. సుప్రీం కోర్టు డివిజన్ బేంచిలోని న్యాయమూర్తులు ఆర్.పి. సేథీ, కే.టి. థామస్‌లు ఈ తీర్పుని 68-2001న ప్రకటించారు. సేధీ తీర్పుతో ఏకీభవిస్తూ థామస్ మరికొన్ని విషయాలను అదనంగా జత చేశారు.
ఆ కేసు విషయాల్లోకి వస్తే, తొమ్మిది మంది ముద్దాయిలకి సెషన్స్ కోర్టు వివిధ నేరాలకు శిక్షను విధించింది. అందులో హత్యానేరం కూడా ఉంది. సెషన్స్ కోర్టు తన తీర్పుని 4-5-1991 రోజున ప్రకటించింది. ఆ తరువాత జైల్లో వున్న ముద్దాయిలు పాట్నా హైకోర్టుకి అప్పీలు చేసుకున్నారు. వాళ్ళ వాదనలని విన్న పాట్నా హై కోర్టు డివిజన్ బెంచి తీర్పుని తేది 23-8-1995 రోజున రిజర్వ్ చేసింది. ఆ తరువాత కొంత కాలానికి ఒక ముద్దాయి చనిపోయాడు. ఆ తరువాత అంటే 14-8-1997 రోజున హైకోర్టు డివిజన్ బేంచి ఈ కేసులో తన తీర్పుని ప్రకటించింది. అది కూడా డివిజన్ బేంచిలోని ఓ న్యాయమూర్తి పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో తీర్పుని ప్రకటించారు.
ఈ విషయాన్ని గమనించిన సుప్రీంకోర్టు, తీర్పులు ప్రకటించడంలో కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.
సుప్రీం కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు :
న్యాయం జరగడమే కాదు జరిగినట్టు అన్పించాలి. న్యాయం ఆలస్యమైతే న్యాయం జరగనట్టే. న్యాయం ప్రకటించడంలో (తీర్పు చెప్పడంలో) జాప్యం వుంటే న్యాయం జరగనట్టే అన్న విషయం అధమమైనది. ఎలాంటి కారణాలు లేకుండా నిర్లక్ష్యంగా తీర్పులు ప్రకటించడంలో జాప్యం వుంటే అది శిక్షపడిన వ్యక్తులు హైకోర్టుకి, సుప్రీం కోర్టుకి అప్పీలు చేసుకోవడానికి ఆటంకంగా మారుతుంది. అంతే కాదు, అప్పీలు చేసుకోకుండా నిరోధిస్తుంది. అప్పీలు చేసుకునే హక్కు అనేది నాగరిక న్యాయశాస్త్రం ఇచ్చిన హక్కు. ఈ హక్కుని ఏ కారణం లేకుండా ఆలస్యం చేయడం సహించరాని విషయం. నెపాన్ని వాద ప్రతివాదుల మీదకు, రాజ్యం మీదకు, న్యాయవాదుల మీదకు త్రోసి వేయడానికి అవకాశం కూడా లేదు. అప్పీలులో తీర్పు ప్రకటించడంలో జాప్యానికి కారణం న్యాయమూర్తుల సంఖ్య కాదు. న్యాయవాదుల సమ్మెకాదు. అవి అన్నీ అయిపోయి తీర్పు ప్రకటించడంలోనే జాప్యం. ఈ తీర్పు ప్రకటించడంలోని జాప్యం క్షమించడానికి వీల్లేని జాప్యం. మరీ ముఖ్యంగా రాజ్యాంగం పార్ట్ 3లో పొందుపరచిన ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే జాప్యం. ఇది క్షమించరాని జాప్యం.
ఇలాంటి పరిస్థితి మనదేశంలోని చాలా హైకోర్టుల్లో వున్నట్టుగా కన్పిస్తుంది. ఆ జాప్యాన్ని నిరోధించడానికి అవసరమైన విషయాలు చెప్పడం అత్యంత ఆవశ్యకమైన విషయం. దానివల్ల వివాదాల్లో చిక్కుకున్న ప్రజలకి ఉపశమనం లభించే అవకాశం వుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని నెం. 353(1)ని పరిశీలిస్తే శాసన కర్తల ఉద్దేశ్యం మనకి అర్థమవుతుంది. ఈ నిబంధన ప్రకారం కేసు విచారణ పూర్తికాగానే వెంటనే కోర్టు తీర్పును బహిరంగ కోర్టులో ప్రకటించాలి. లేదా ఆ తరువాత ప్రకటించాలి. అయితే తీర్పు ప్రకటించే తేది పార్టీలకు తెలియాలి. ”తరువాత ప్రకటించే” వీలు కూడ శాసనం కల్పించింది. కానీ తరువాత ప్రకటించడం అంటే ఎలాంటి జాప్యం లేకుండా ప్రకటించడమని శాసనకర్తల ఉద్దేశ్యం. తీర్పు చెప్పడంలో జాప్యం శాసనానికి విరుద్ధం. ”తరువాత ప్రకటించే వీలు” అంటే కొంతకాలం తరువాత అని అర్థం. అంటే క్రిమినల్ కేసులో తీర్పుని మూడు రోజుల్లోగా ప్రకటించాలి. ఈ విషయాన్ని ఇంతకుమించి అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అదే విధంగా సివిల్ కేసులో వాదనలు పూర్తి అయిన రెండు నెలల్లోగా కోర్టు తీర్పుని ప్రకటించాలి.
హైకోర్టులు ఏ కాలపరిమితిలో తీర్పులని ప్రకటించాలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిర్దేశించలేదు. కానీ తీర్పు ప్రకటించడమనేది న్యాయం చెప్పే వ్యవస్థలోని ఒక భాగం. అందుకని ఎలాంటి జాప్యం లేకుండా తీర్పులని ప్రకటించాల్సిన బాధ్యత కోర్టుల మీద వుంది. మన దేశంలో న్యాయమూర్తులని దేవుని తరువాత దేవునిగా పరిగణిస్తారు. ఆ నమ్మకాన్ని పోగొట్టకుండా చూడాల్సిన బాధ్యత కోర్టుల మీద వుంది, తీర్పులు ప్రకటించడంలోని జాప్యం వల్ల ప్రజలు కనుబొమ్మలు ముడివేసే పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని మనం పరిగణనలోకి తీసుకోకపోతే న్యాయవ్యవస్థ మీద విశ్వాసం తొలగిపోయే అవకాశం వుంది.
సమన్యాయపాలన అందరికీ లభ్యం కావడానికి న్యాయవ్యవస్థ తన గౌరవాన్ని నిశ్చితం చేసుకోవాల్సి వుంది. ఏవో కొన్ని తప్పిదాల వల్ల మొత్తం న్యాయవ్యవస్థనే తక్కువగా, హీనంగా కన్పించడానికి వీల్లేదు. ప్రజలకి సత్వరన్యాయం అందడం న్యాయవ్యవస్థ పాలసీ, అదే ఉద్దేశ్యం కూడా, కళంకం లేని కలుషితం కాని న్యాయాన్ని ప్రజలకి అందించడానికి న్యాయవ్యవస్థ తన శక్తియుక్తులని వినియోగించాల్సి వుంది. కొన్ని రాష్ట్రాలలో నెలకొనివున్న పరిస్థితుల దృష్ట్యా హైకోర్టులు తీర్పులు ప్రకటించే విషయంలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ఇవ్వదలిచామని సుప్రీం కోర్టు అనిల్ రాయ్ కేసులో ప్రకటించింది.
”తీర్పులు ప్రకటించే విషయంలో మార్గదర్శక సూత్రాలు :
1. తీర్పుని రిజర్వ్ చేసి ఆ తరువాత ప్రకటించినప్పుడు తీర్పు ప్రతిలోని మొదటి పేజీలో రెండు కాలమ్స్ ఏర్పరిచి, తీర్పుని రిజర్వు చేసిన తేదీ, ప్రకటించిన తేదీలని సంబంధిత కోర్టు అధికారి పేర్కొనే విధంగా రిజిష్ట్రీని దేశంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆదేశించాలి.
2. తీర్పులు రిజర్వ్ చేసి ఆ నెలలో ప్రకటించినప్పుడు వాటి వివరాలను ఆ కేసుల లిస్టుని తెలియజేస్తూ కోర్టు అధికారులని, రీడర్స్ తనకు తెలియచేసే విధంగా నివేదికలను సమర్పించాలి. పరిపాలనా పరంగా ప్రధాన న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేయాలి.
3. తుది వాదనలు విన్న రెండు మాసాల్లో తీర్పుని ప్రకటించనప్పుడు ఆ బెంచి దృష్టిని వాటి వైపు మరల్చే విధంగా ప్రధాన న్యాయమూర్తులు చూడాలి. అదే విధంగా వాదనలు విన్న ఆరు మాసాల్లో తీర్పులు ప్రకటించని కేసుల వివరాలను తయారుచేసిన పట్టికని హైకోర్టు న్యాయ మూర్తులకి పంపిణీ చెయ్యాలి. ఈ సమాచారం రహస్యంగా సీల్డు కవర్లో తెలియచెయ్యాలి.
4. తీర్పుని రిజర్వు చేసిన మూడు మాసాల్లో ఏదైనా కేసులో తీర్పుని ప్రకటించనప్పుడు, ఆ కేసులోని పార్టీలు ఎవరైనా తీర్పుని త్వరగా ప్రకటించమని హైకోర్టులో దరఖాస్తుని దాఖలు చేయవచ్చు. ఈ దరఖాస్తుని రెండు రోజుల్లోగా (సెలవులని మినహాయించి) ఆ సంబంధిత బెంచి ముందు వుంచాలి.
5. ఒకవేళ, ఏదైనా కారణం వల్ల తీర్పుని 6 మాసాల్లో ప్రకటించకపోతే ఆ కేసులో పార్టీలు ఆ కేసుని ఆ బెంచి నుంచి ఉపసంహరించి వేరే బెంచికి పంపించమని దరఖాస్తు ద్వారా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరవచ్చు. ప్రధాన న్యాయమూర్తి ఆ కోరికని మన్నించవచ్చు. లేదా వేరే ఏదైనా ఉత్తర్వుని జారీ చేయవచ్చు.
ఈ తీర్పుని సుప్రీం కోర్టు డివిజన్ బెంచిలోని న్యాయమూర్తులు కె.టి.థామస్, ఆర్.పి. సేథీలు ప్రకటించారు. ప్రధాన తీర్పుని నేధీ రాశారు. ఆ తీర్పుతో థామస్ ఏకీభవిస్తూనే మరికొన్ని విషయాలని అదనంగా చేర్చారు.
కే.టి.థామస్ సూచనలు : దేశంలో ఉన్నత న్యాయస్థానాల్లోని కొందరు న్యాయమూర్తుల్లో ఇటీవలి కాలంలో మందకొడితనం కన్పిస్తున్నది. దాని ఫలితంగా కొన్ని కేసుల్లో తీర్పులు అట్లాగే వుండి సుషుప్తావస్థలో వుండిపోతున్నాయి. దానివల్ల ఆ కేసులోని విషయాలని, ప్రధాన విషయాలని, వాదనలని సహజంగానే న్యాయమూర్తులు మర్చిపోయే అవకాశం వుంది. ఇంకా కొంతకాలానికి అలాంటి కేసు ఒకటి పెండింగులో వున్న విషయమే మర్చిపోవడం జరుగుతుంది. ఇది అప్రియమైన విషయమే, కానీ ఇది కఠిన సత్యం. ఉద్దేశ్యం లేకుండా కొద్దిమంది తమ ఆఫీసు తీసుకునే ముందు చేసిన ప్రమాణానికి భంగం కలిగించడమే ఈ ఆలస్యంగా తీర్పులు ప్రకటించడం.
ఇవే కాకుండా రిజర్వ్ చేసిన తీర్పులు సత్వరం ప్రకటించాలని ఇంకా ఏవైనా చర్యలు ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తోస్తే అతను వాటిని వీటికి జతచేయవచ్చు. అమలు చేయవచ్చు. అలాంటి చర్యలు ఏవైనా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపట్టే వరకు ఈ మార్గదర్శక సూత్రాలు ఈ విషయాలలో సరిపోతాయి. పార్లమెంట్ ఈ విషయంలో శాసనం చేసే వరకు ఈ చర్యలు అమల్లో వుంటాయి.
(బెంచి : కె.టి.థామస్, ఆర్.పి. సేథి, తీర్పు తేది : 6-8-2001, అనిల్ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ (2001) 7 సుప్రీం కోర్టు కేసెస్ 318=2001 ఎస్.సి.సి. (క్రిమినల్) 1009).