మెదక్ జిల్లా తూప్రాన్, సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రాలలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకస్మికంగా పర్యటించారు. ఆయా నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కార్పొరేట్ దవాఖానల తరహాలో నిర్మించి 50 పడకల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తూప్రాన్‌లో ప్రారంభించి అక్కడి వసతులను పరిశీలించారు.
తూప్రాన్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు రూ.12 కోట్ల పైచిలుకు నిధులు కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కో మండలానికి రూ.కోటితో కమ్యూనిటీహాల్ నిర్మించేందుకు రూ.6 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 500 డబుల్ బెడ్‌రూం ఇండ్లను తూప్రాన్‌కు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్ని హంగులతో వైకుంఠధామం నిర్మించేందుకు ఇప్పటికే కలెక్టర్‌కు ఆదేశాలిచ్చామని చెప్పారు. తూప్రాన్‌లోని ఖబరస్థాన్ ప్రహరీ నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేశారు. గజ్వేల్‌లో ఆడిటోరియం నిర్మాణంతోపాటు,తూప్రాన్ పెద్ద చెరువు సుందరీకరణకు నిధులు ఇస్తామని తెలిపారు. అన్ని వసతులతో ప్రభుత్వ దవాఖానను నిర్మించాం కాబట్టి ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గజ్వేల్ నిర్మాణపనుల పరిశీలన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు,ప్రజా అవసరాల నిమిత్తం సౌకర్యాల కల్పన ,గడువులోపు పనుల పూర్తి లాంటి వివిధ అంశాలపై అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. పట్టణంలో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌యార్డు నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. విక్రయస్టాల్స్ ,డ్రైనేజీ సౌకర్యం ,మిగిలిన కూరగాయల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయితో చర్చించి పలు సూచనలు చేశారు. యార్డులో పువ్వులు, పండ్లు, కూరగాయలు, మాంసం స్టాళ్ల నిర్మాణంపై సలహాలిచ్చారు. ఒక నెలలోపు మార్కెట్ యార్డు ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.
గజ్వేల్ దవాఖానలో పడకల సంఖ్య పెంపు
గజ్వేల్‌లో నిర్మిస్తున్న వంద పడకల దవాఖానను పరిశీలించిన ముఖ్యమంత్రి దీనిని మరో 50 పడకలకు విస్తరించి,150 పడకల దవాఖానగా మార్చాలని ఆదేశించారు. కొత్తగా చేపట్టే పడకల నిర్మాణాన్ని పై అంతస్తులో చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న పాత దవాఖాన స్థానంలో హైరిస్క్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆధునిక పరికరాలతో అన్ని సౌకర్యాలతో స్థానికంగా ఒక ట్రామా సెంటర్‌ను ఏర్పాటుచే యాలన్నారు. జాతీయ రహదారి, రాజీవ్ రహదారి పై జరుగుతున్న ప్రమాదాలతోపాటు స్థానికంగా జరిగే రోడ్డు ప్రమాదాల బాధితులను హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన, ఇతర ప్రైవేటు హాస్పిటళ్లకు తరలించకుండా స్థానికంగానే పూర్తి వైద్య సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ఇందుకు అవసరమైన యంత్ర పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు వైద్య సిబ్బందిని కూడా నియమించా లని అన్నారు. అనంతరం గజ్వేల్ శాసనసభ్యుని అధికార నివాసాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి నిర్మాణ పనులపై సంతప్తి వ్యక్తంచేశారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి, భవనం ఎలివేషన్ బాగుందని, సంగాపూర్ కాలనీ అద్భుతమైన కాలనీగా మారుతుందని కితాబిచ్చారు. మోడల్ హౌస్ కోసం ఐదు రకాల రంగులను వేయించి, బాగా అందంగా కనిపించే రంగును ఎంపిక చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.
అంతకుముందు మార్కెట్ యార్డులో, డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. తూప్రాన్, గజ్వేల్ పర్యటనల్లో సీఎం వెంట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులున్నారు.