ఊహ తెలిసినప్పటి నుంచి ఆఖరిశ్వాస దాకా తెలంగాణ కోసం తపించిన తపస్వి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. 1952లో నాన్-ముల్కీ గో బ్యాక్ ఉద్యమం నుంచి 2010-11లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన వరకు, ఫజల్ అలీ ఆధ్వర్యంలోని రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (1954) నుంచి శ్రీకృష్ణ కమిటీ (2010) వరకు, ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకు, కొండా వెంకటరంగారెడ్డి నుంచి కె.సి.ఆర్. వరకు అన్ని ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తూ, నివేదికలిస్తూ, వాదనలు వినిపిస్తూ, నేతలకు సలహాలిస్తూ, ఎప్పటికప్పుడు ఉద్యమదిశను నిర్దేశిస్తూ మార్గదర్శిగా నిలిచారు ఆచార్య జయశంకర్. చూస్తాననుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేకపోయినా త్వరలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందన్న ధీమాతో, నమ్మకంతో సంతృప్తితో, 2011 జూన్ 21న కన్నుమూశారు.
వి.ప్రకాశ్
1934 ఆగస్ట్ 6న జయశంకర్ హన్మకొండలో శ్రీమతి మహాలక్ష్మి, కొత్తపల్లి లక్ష్మీకాంతరావు దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. జయశంకర్‌కు అన్న, అక్క, తమ్ముడు, ఇద్దరు చెల్లెండ్లు. తమ్ముడు ప్రసాద్ అమెరికాలో స్థిరపడ్డారు. జయశంకర్ అవివాహితుడు. బంధువు కుటుంబానికి చెందిన బ్రహ్మం చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే చేరదీసి (1991లో) పెళ్లిచేసినారు. వారి కుమార్తెలో తన తల్లిని చూసుకున్నారు. ఆ పాపకు తన తల్లిపేరు పెట్టుకున్నారు.
ఆచార్య జయశంకర్ పూర్వీకుల గ్రామం అక్కంపేట. వరంగల్‌కు 16 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉన్నది. వీరి తాతగారైన కొత్తపల్లి వెంకటబుచ్చయ్య ఆ గ్రామంలో జన్మించారు. 4వ తరగతి చదివిన బుచ్చయ్యకు రెవెన్యూ శాఖలో ఉద్యోగం దొరకడంతో తన పిల్లలందరినీ (ఐదుగురు) చదివించారు. జయశంకర్ తండ్రి లక్ష్మీకాంతరావు, బుచ్చయ్యకు రెండవ కుమారుడు. లక్ష్మీకాంతరావు ఆ రోజుల్లోనే (నిజాం పాలనలో) ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ మధ్యలో వదిలేశారు. ఆయన ఉద్యోగంలో చేరి ఉంటే ఏ కలెక్టర్ ఉద్యోగమైనా వచ్చి ఉండేది. కానీ జయశంకర్ పెద్దనాన్న 7వ తరగతి చదివి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే ఏదో జబ్బుతో చనిపోవడంతో సర్కారు కొలువులు మనకు అచ్చిరావని లక్ష్మీకాంతరావుకు ఉద్యోగం అనవసరమని నిర్ణయించారు బుచ్చయ్య. దీనితో లక్ష్మీకాంతరావు అక్కంపేటలో వ్యవసాయం చేస్తూ హన్మకొండలో ఉంటూ పిల్లలను చదివిస్తూండేవారు. ముగ్గురు కొడుకులు, మరో ముగ్గురు కుమార్తెలు చదువుకు ఆయన ఆస్తి అంతా హరించుకుపోయింది.
స్వంత గ్రామమైన అక్కంపేటలో తన వాటాకు వచ్చిన కొద్ది స్థలాన్ని కూడా 2002లో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బడికి ఇచ్చినారు ఆచార్య జయశంకర్. మరణించడానికి కొద్ది నెలలకు ముందే తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లును అమ్మగా వచ్చిన డబ్బుతో బాసముద్రంలోని ఒక అపార్టుమెంటులో బ్రహ్మం పేరుతో ఒక ఫ్లాటుకొని అందులోకి మారినారు జయశంకర్. ఆ ఇంటిలోనే 2011 జూన్ 21న ఆఖరి శ్వాస విడిచారాయన. 70 ఏళ్ళకు పైగా హన్మకొండ పోలీస్‌స్టేషన్ ఎదురుసందులోని ఇంట్లో నివసించారు.
విద్యార్థిగా ఉన్నప్పుడు తండ్రిపై ఆధారపడినా ఉద్యోగంలో చేరిన తరువాత తన జీతం డబ్బుపై, ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్ డబ్బుపై ఆధారపడి జీవితం గడిపినారే తప్ప ఏనాడూ ఎవరిపై జయశంకర్ ఆధారపడలేదు. మరో సంపాదన కూడా ఆయనకు లేదు. చనిపోయేనాటికి ఆచార్య జయశంకర్ స్వంత ఆస్తి, పాత మారుతీ (800) కారు, కొన్ని పుస్తకాలు మాత్రమే.
చివరి రోజుల్లో హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో షరీఖయిన సంగతి తెలిసి గవర్నర్ నరసింహన్ వచ్చి ‘‘మీ వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. విదేశాలకు పంపి మెరుగైన చికిత్స చేయిస్తాను”. దయచేసి ఒప్పుకోండని బ్రతిమిలాడినా జయశంకర్ ‘నో థ్యాంక్స్’ అంటూ చిరునవ్వుతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ సున్నితంగా తిరస్కరించారు.
మరణం తథ్యమని డా॥ నాగేశ్వర రెడ్డిని నిలదీసి తెలుసుకున్న జయశంకర్, చికిత్సను వెంటనే ఆపేసి హన్మకొండకు పంపించమని కోరినారు. డిశ్చార్జి రోజు ఆఖరిసారి జయశంకర్‌ను చూడటానికి వచ్చిన కె.సి.ఆర్. హెలికాప్టర్‌లో హన్మకొండకు పంపిస్తానంటే కూడా వద్దని హాస్పిటల్ వాళ్ళు సమకూర్చిన సాధారణ అంబులెన్స్‌లోనే బ్రహ్మంతో వెళ్ళిపోయారు. ఇక మళ్లీ హైదరాబాద్‌కు రాలేదు. ( డా॥ నాగేశ్వర్‌రెడ్డి ఉచితంగా వైద్య సేవలను జయశంకర్‌కు అందించారు.) ఆచార్య జయశంకర్ ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరమే అయినా ఆయన మనకందించిన జ్ఞానసంపద బంగారు తెంగాణ నిర్మాణానికి బాట చూపుతున్నది. లక్ష్య సాధన కోసం బ్రహ్మచారిగానే ఉంటూ జీవితాన్నే అంకితం చేసిన ఆచార్య జయశంకర్ నేటి తరానికి ఒక మార్గదర్శి.
ఆచార్య జయశంకర్‌ది అరుదైన వ్యక్తిత్వం. నూటికో కోటికో మనం అలాంటి వ్యక్తిని చూస్తాం. ప్రజాకవి కాళోజీ ప్రభావం జయశంకర్‌పై చాలా ఉంది. కాళోజీని తన గురువుగా కూడా చెప్పుకున్నారు జయశంకర్. సంతోషం కల్గినపుడు పొంగిపోకుండా, మనసుకు బాధ కలిగినపుడు కృంగిపోకుండా వుండే స్థిత ప్రజ్ఞుడాయన. బహుశా మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ప్రభావం ఈ మేరకు జయశంకర్ సారుపై పడి ఉండవచ్చు. తొణకని కుండలా వుండే జయశంకర్ తన మనసుకు బాధకలిగించే కొన్ని అంశాలను మాత్రం మరణశయ్యపై వుండి కొందరు సన్నిహితులతో పంచుకున్నారు.
విద్యార్థిగా ఉన్ననాడే తన తండ్రితో (ఆయన నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు) ఆయన మిత్రులు, రక్షణ కోసం విజయవాడ, గుంటూరు జిల్లాలకు పోయి ఆశ్రయమివ్వమని కోరితే ఆదరించిన ఆంధ్రులు తమను ఎలా నిలువుదోపిడీ చేసింది చెప్తుంటే జయశంకర్ ఆసక్తితో వినేవారు. పసితనంలోనే ఆయన మనసుపై ఈ సంభాషణలు బలమైన ప్రభావాన్ని చూపించాయి.
ఇంటర్ చదువుతున్నప్పుడు జూనియర్ కాలేజీకి వచ్చిన ప్రముఖ ఆంధ్రనేత అయ్యదేవర కాళేశ్వరరావు ‘మీకు తెలుగురాదు. మీకు నాగరికత తెలవాలె, మీరు మాతో కలవాలె..’ అంటూ తెలంగాణ వారిని అవమానిస్తూ ప్రసంగిస్తుంటే విద్యార్థులంతా అడ్డు తగిలి అల్లరి చేయడంతో లాఠీచార్జీ జరిగింది. దెబ్బ తిన్న వాళ్ళలో జయశంకర్, మాజీ మంత్రి ముచ్చర్ల (సంగంరెడ్డి) సత్యనారాయణ ఉన్నారు. ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన తెలుగునేర్పే లెక్చరర్లు, వరంగల్ లోని ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లనే మాట్లాడుతుండేవారు. అయ్యదేవర కాళేశ్వరరావు మాటలు విద్యార్థులలో ‘కసి’ని పెంచినాయి. ఆ ‘కసి’ కొద్ది రోజులకే ‘నాన్‌ముల్కీ గో బ్యాక్’ ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ ‘గోంగూర పచ్చడి గో బ్యాక్’ నినాదాలతో ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది.
1954లో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వ విద్యాయంలో జయశంకర్ డిగ్రీచదువుతున్నప్పుడు ఫజల్ అలీ కమీషన్ ముందు మరో నలుగురు విద్యార్థులతో కలిసి హాజరైనారు. ఆంధ్రతో తెలంగాణను విలీనం చేస్తే కలిగే దుష్పరిణామాలపై అప్పటికే కొందరు తెలంగాణ ఉపాధ్యాయుల, రాజకీయ నేతలు ఈ విద్యార్థి బృందాన్ని బాగా సిద్ధం చేసి పంపించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న విద్యార్థులు కోర్కెను విన్న ఫజల్ అలీ నవ్వుకుంట ‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మీ కిస్తే బతకగలుగుతారా?’’ అని ఉర్దూలో అడిగినాడు.
‘మంచిగ బతకగుగుతం. బతక లేకపోతే బిచ్చమెత్తుకొనైనా బతుకుతం తప్ప వాళ్ల (ఆంధ్ర) దగ్గరికి మాత్రం బోం’ అన్నారు జయశంకర్‌తో సహా విద్యార్థులు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉధృతంగా సాగినప్పుడు జయశంకర్ డిగ్రీ విద్యార్థిగా చురుగ్గా పాల్గొన్నారు. అప్పటికి ఆయన వయస్సు 20 సంవత్సరాలు. 1957లో బి.ఇ.డి ఉత్తీర్ణుడైన జయశంకర్ గతంలో దక్కన్ క్రానికల్‌లో హైదరాబాద్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీ ప్రకటనను (బి.ఇ.డి. చేసిన వారికి జాబ్ ఆఫర్) పట్టుకొని డిప్యూటీ డైరెక్టర్‌ను కలువగా ఆయన పకాపకా నవ్వి ‘ఆ ప్రకటననిచ్చిన హైదరాబాద్ ప్రభుత్వాన్ని వెళ్ళి అడుగు, జాబ్ లేద’ని వెటకారంతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆంధ్ర అధికారుల ప్రవర్తన ఇలాగే ఉండేది.
ఆంధ్ర అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన జయశంకర్‌కు కొద్దిరోజుల తరువాత టీచర్ జాబ్ వచ్చింది. కానీ ఆ ఉద్యోగం తాత్కాలికమేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్కేల్ 85-175 రూపాయులు. ఏడాది క్రితం హైదరాబాద్ స్టేట్‌లో స్కేల్ రూ. 154-275 ఉండేది. ఆంధ్రతో కలిసిన తరువాత తెలంగాణ ఉపాధ్యాయులు స్కేల్ తగ్గించి ఆంధ్రప్రాంత స్కేల్ తో సమానం చేశారు. దీనివలన తెలంగాణలోని ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ‘‘ స్కేల్ ఏంది?’’ అని ఆంధ్ర అధికారిని ప్రశ్నించిన జయశంకర్‌కు మళ్ళీ వెటకారమే సమాధానం ‘‘హైదరాబాద్ గవర్నమెంట్‌నే అడగాలె’’. ఎండాకాలపు సెలవులకు ముందే ఆ తాత్కాలిక ఉద్యోగం నుంచి జయశంకర్‌ను తొలగించారు. మళ్ళీ ఆంధ్ర అధికారిని ప్రశ్నించిన జయశంకర్‌కు ‘‘ఆంధ్ర రాష్ట్రంలో పదేండ్లు ఇలా టర్మినేట్ జేసినంక, అప్పుడు ఆలోచిస్తం పర్మినెంట్ చేయడానికి. అంతవరకు కాదు. ఇష్టం ఉంటే చేయండి లేకపోతే పోండి’’ అని సమాధానం.
ఆంధ్ర అధికారుల వేధింపులు, వెటకారపు మాటలు, వెకిలి నవ్వులు, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరుగుతున్న అన్యాయాలు జయశంకర్‌లో ఆంధ్ర దోపిడీ, వివక్ష పట్ల కసిని మరింత పెంచి ఉపాధ్యాయ సంఘంలో బాధ్యత చేపట్టడానికి కారణమైనాయి. టీచరుగా జయశంకర్ మధిర, జహీరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ఇలా ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికి పోయి పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే ఉపాధ్యాయ సంఘాల్లో ముఖ్యమైన బాధ్యత నిర్వహించారు.
ఎకనమిక్స్‌లో లెక్చరర్‌గా పని చేయాలనే కోరిక జయశంకర్‌లో వుండేది. ఉపాధ్యాయునిగా పని చేస్తూనే ప్రైవేట్‌గా ఎం.ఎ. చదవాలనుకున్నారు. సరిగ్గా ఆ సంవత్సరమే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్లు ఈ పద్ధతిని ఎత్తేసారు. తప్పనిసరై జయశంకర్ బనారస్ హిందీ యూనివర్సిటీలో పరీక్షపాసైనారు. మల్టీ పర్పస్ స్కీంలో ఎం.ఎ. పాసైన వాళ్లకు హయ్యర్ గ్రేడ్ ప్రమోషన్ రావాలి. ‘మీరు టెంపరరీ టీచర్స్. మీకు ఎలా వస్తుంద’ని ఆంధ్ర అధికారి హేళనగా మాట్లాడినారు. ఆంధ్రలో మాత్రం టెంపరరీ టీచర్లకు ఈ ప్రమోషన్లు ఇచ్చినారు. అలీఘడ్ యూనివర్సిటీలో మరో ఎం.ఎ. పట్టా పొందినారు జయశంకర్. రెండు ఎం.ఎ. పట్టాలున్నా ప్రమోషన్ ఇవ్వలేదు ఆంధ్ర అధికారి. కానీ ఆంధ్ర టెంపరరీ టీచర్లకు మాత్రం ప్రమోషన్లిచ్చి వారిని వరంగల్‌కు బదిలీ చేశారు.
ఆంధ్ర అధికారులు, పాలకుల వివక్షను వృత్తిపరంగా అర్థం చేసుకున్న జయశంకర్ అన్ని రకాల ఉద్యోగాల్లో కూడా ఇట్లనే జరుగుతున్నదని తెలుసుకొని తెలంగాణ అధ్యయనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఉపాధ్యాయ సంఘాల్లో మరింత చురుకైన పాత్రను పోషించారు. ఆ క్రమంలోనే.. 1969 జనవరి నాటికి తీవ్రమైన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చురుకైన పాత్రపోషించారు. వివిధ రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ప్రధాని ఇందిర అది చదివి జయశంకర్, ఆనందరావు తోట తదితరులను ఢల్లీికి పిలిపించి చర్చలు జరిపినారు.
1971లో వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాని (తెలంగాణ ప్రజాసమితి పార్టీ) జయశంకర్‌ను చెన్నారెడ్డి అడిగినారు. ఆనాడు డిపాజిట్ మొత్తం పదివేల రూపాయులు. ఆ డబ్బు లేకపోవడం, ఎన్నికల్లో పోటీ చేయాలనీ ఆసక్తికూడా లేనందున జయశంకర్ నిరాకరించారు.
సిటీ కాలేజి (హైద్రాబాద్) లెక్చరర్‌గా, వరంగల్ సి.కె.యం కాలేజి ప్రిన్సిపాల్‌గా, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, విసిగా, హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఇనిస్టిట్యూట్‌లో పదేళ్ళు రిజిస్ట్రార్‌గా.. ఏ హోదాలో పని చేస్తున్నా తెలంగాణ అధ్యయనాన్ని, ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను విడువక పోవడం, వివిధ సంస్థలతో, వ్యక్తులతో తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి, భావజాల వ్యాప్తికి నిరంతర కృషిని కొనసాగించడం ఒక్క జయశంకర్‌కే సాధ్యమైంది.
1996 నవంబర్ ఒకటిన వరంగల్‌లో భూపతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ‘తెంగాణ విద్రోహ దినం’ సభలో జయశంకర్, కాళోజీ, జస్టిస్ కొండా మాధవరెడ్డి ప్రసంగించారు. రెండు వందలమంది వస్తారనుకున్న సభకు సుమారు నాలుగైదు వేలమంది వచ్చారు. మరునాడు చంద్రబాబు (సీ.ఎం.) వేర్పాటు వాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జయశంకర్ ఇక తన పూర్తి సమయాన్ని తెలంగాణ ఉద్యమ నిర్మాణం కోసం, భావజాల వ్యాప్తి కోసం కేటాయించారు. ఆర్.ఎస్.ఎస్ నుంచి ఆర్.ఎస్.యు దాకా ఎవరు తెలంగాణ మీటింగ్ ఎక్కడ పెట్టినా తన స్వంత ఖర్చులతో జయశంకర్ హాజరయ్యేవారు. తానే ముందుండి తెలంగాణ ఐక్యవేదికను నడిపించారు. తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రగతి వేదిక, కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ తదితర వేదికలు, పార్టీలు తెలంగాణ సమస్యలపై, రాష్ట్ర ఏర్పాటుకై నిర్వహించిన అనేక సమావేశాల్లో జయశంకర్ పాల్గొనేవారు. 1998లో ఆదిలాబాద్ గిరిజనుల కలరా మరణాలపై వి.ప్రకాశ్, మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి నిజనిర్ధారణ చేశారు. 1999లో అమెరికాలోని తెలంగాణ వాదులతో అనేక సభలు, సమావేశాలు పెట్టి ‘తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం’ ఏర్పాటులో ముఖ్యపాత్ర వహించారు జయశంకర్.
2000 సంవత్సరం అక్టోబర్‌లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎం.పి.లతో జయశంకర్ ఢిల్లీ వెళ్ళి ప్రణబ్ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని రెండున్నర గంటలపాటు వివరించారు. ఈ కమిటీలో మన్మోహన్‌సింగ్ కూడా సభ్యులుగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందు సుమారు ఏడు నెలలు కె.సి.ఆర్.తో వందలాది గంటల పాటు తెలంగాణపై చర్చించారు. పార్టీ ఏర్పాటులో ముఖ్యపాత్ర వహించారు.
తెరాసలో ఏ బాధ్యతులు తీసుకోని జయశంకర్ దశాబ్దకాలం పాటు పార్టీ నిర్వహించిన దాదాపు అన్ని సభల్లోనూ కె.సి.ఆర్. వెంటే ఉంటూ ప్రజలను చైతన్యపరిచే ప్రసంగాలు చేసినారు.
2004 ఎన్నికల అనంతరం కె.సి.ఆర్, నరేంద్రలు ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన కాలమంతా జయశంకర్ వారితోనే ఉన్నారు. జయశంకర్ సేవలను ఉపయోగించుకోవాలనుకున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలనుకోగా సిపిఎం ఆ సీటు తమకు కావాలనడంతో, ప్రణాళిక సంఘం సభ్యునిగా నియమించాలని భావించారు. ఈ విషయం తెలిసి అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి జయశంకర్‌ను ప్లానింగ్ కమీషన్ మెంబర్ కాకుండా అడ్డుపడినారు. చివరకు ప్రధాని అధ్యక్షతన వున్న ‘నేషనల్ కమీషన్ ఫర్ ఎంటర్ ప్రైజెస్ ఇన్ అనార్గనైజ్డ్ సెక్టార్’లో మొదటి సభ్యునిగా నియమింపబడినారు. ‘నా తెలంగాణ యాక్టివిటీకి అడ్డువస్తే ఈ పదవి నాకక్కర్లేద’ని జయశంకర్ మన్మోహన్‌సింగ్‌కి స్పష్టం చేశారు. అలాంటిదేమీ ఉండదని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టినప్పుడు గట్టిగ తిట్టక’ని మన్మోహన్ సలహాఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన బంగ్లాను, సర్వెంట్స్‌ను జయశంకర్ తీసుకోలేదు. ఎ.పి.భవన్ రూంలోనే వుండేవారు కె.సి.ఆర్. నరేంద్రతో బాటు జయశంకర్ ఢిల్లీలోని అన్ని రాజకీయ పార్టీ నేతలను కలిసి తెలంగాణ అవసరాన్ని వివరిస్తూ, వారికి లేఖ రాస్తూ, వారు ప్రణబ్ కమిటీకి రాయాల్సిన లేఖ డ్రాఫ్ట్‌ను కూడా తానే రాస్తూ చాలా శ్రమించారు. చివరికి బి.జె.పి.ని కూడా తెలంగాణ కోసం ఒప్పించి (ఆర్.ఎస్.ఎస్. హెడ్‌క్వార్టర్స్, నాగపూర్‌కు కూడా వెళ్ళి) ఆ తర్వాత అసంఘటిత కార్మికరంగ సమస్యలపై తనకున్న బాధ్యతలను కూడా సంపూర్ణంగా నెరవేర్చినారు. నివేదికను రూపొందించి అర్ధాంతరంగా ఆ బాధ్యతనుంచి (మన్మోహన్ సింగ్ అనుమతితో) తప్పుకొని తెలంగాణ ఉద్యమంలో పూర్తి సమయం వెచ్చించారు. యు.పి.ఏ ప్రభుత్వం వైఎస్ ఒత్తిళ్ళకు లోనై తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టడంతో కె.సి.ఆర్., నరేంద్రలు కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంపై దృష్టి పెట్టిన సందర్భమది.
2009 నవంబర్ 29న కె.సి.ఆర్.ను కరీంనగర్‌లో పోలీసులు అరెస్టు చేసినపుడు జయశంకర్‌ను ఆయన కారులోనుంచి దించినారు. ఆ తర్వాత నిమ్స్‌లో కె.సి.ఆర్. ఆమరణదీక్ష చేసిన రోజుల్లో జయశంకర్ రాత్రింబగళ్ళు ఆయనతో హాస్పిటల్‌లోనే వుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. డిసెంబర్ 9 నాటి చిదంబరం తెలంగాణ ప్రకటన రూపకర్త జయశంకర్‌సారే. ఆ రాత్రి తన సన్నిహితులకు ముందే ఫోన్ చేసి (అర్థ శతాబ్ది స్వప్నం నెరవేర్చే ప్రకటన కాసేపట్లో కేంద్ర హోంమంత్రి నోటి నుండి వేలువడబోతున్న కొద్దిక్షణాల ముందు) టివి చూడమని చెప్పారు. ఎందుకో మాత్రం చెప్పనేలేదు. చిదంబరం ప్రకటన వెలువడిన వెంటనే ఫ్రూట్ జ్యూస్‌ను తన చేత్తో ఇచ్చి కె.సి.ఆర్. దీక్షను జయశంకర్ స్వయంగా విరమింపజేశారు.
డిసెంబర్ 23న రాత్రి చిదంబరం తెలంగాణ ప్రకటనను కోల్డ్‌స్టోరేజీలో పెట్టడంతో అదే రాత్రి కె.సి.ఆర్.తో కలిసి కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటికి పోయి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమికను పోషించారు జయశంకర్. కోదండరాంను జాక్ చైర్మన్‌గా ప్రతిపాదించింది జయశంకరే.
జనవరి 5న ఢిల్లీలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో కెసీఆర్‌తో బాటు హాజరైన జయశంకర్ ‘ఫర్‌దర్ కన్సల్టేషన్స్ గావాలె’ అన్న చిదంబరాన్ని నిలదీస్తూ ముందు ‘ఎస్’ అని తర్వాత ‘నో’ చెప్పిన ఆ రెండు పార్టీ (టిడిపి, ప్రజారాజ్యం) నేతలను పిలిచి మాట్లాడుకోండి. కమిటీతో కాలయాపన చేయొద్దని కరాఖండిగా చెప్పినారు. కానీ మిగిలిన పార్టీ, కాంగ్రెస్ ‘ఫర్‌దర్ కన్సల్టేషన్స్’ను వ్యతిరేకించలేదు.
కమిటీ ఒక రిటైర్డ్ జడ్జీతో వేస్తామని ఎవరికీ చెప్పకుండానే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణకమిటీని వేసింది. ‘మనం చెప్పేది చెప్పాలె. లేకుంటే చెప్పలేదంటరు’ అని జయశంకర్ కమిటీ ముందుకు పోదామన్నారు. ‘మాది న్యాయమైన కోర్కె అని చెప్పడానికే వచ్చినమ’ని శ్రీ కృష్ణకమిటీకి చెప్పి తెలంగాణ అంశాలను వ్రాతపూర్వకంగా అందించారు. కమిటీ సభ్యుల ప్రశ్నకు, సందేహాలకు వివరంగా జవాబులిచ్చారు. కె.సి.ఆర్.తో బాటు జయశంకర్.
శ్రీకృష్ణకమిటీ కోరికపై ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని కూడా జయశంకర్ అందజేశారు.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు వెలువడిన తర్వాత జయశంకర్ దిగ్భ్రాంతికి లోనైనారు. ‘ఇంత చెత్త రిపోర్టు ఇస్తారను కోలేద’ని సన్నిహితులతో అన్నారు. రెండు మూడు రోజులు ముభావంగా వున్నారు. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే జయశంకర్ క్యాన్సర్‌తో ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలివెళ్ళారు. ఆచార్య జయశంకర్ ఎప్పుడూ అనేవారు ‘ తెలంగాణ తేవడం పదిశాతం పనైతే వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మలుచుకోవడం తొంబయి శాతం పని’. తెలంగాణ సాధించాం. ఉద్యమ పార్టీయే అధికార పార్టీగా సుపరిపాలన సాగిస్తున్నది. ముఖ్యమంత్రి కె.సి.ఆర్. సారథ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, పట్టుదలతో కృషి చేయాలి. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన బలహీన వర్గాలకు (బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనారిటీలకు) అభివృద్ధిలో వాటా దక్కాలనేవారు జయశంకర్. ఆ లక్ష్యం నెరవేర్చినప్పుడే జయశంకర్‌కు నిజమైన నివాళి.