pelliయితారం.. మా కాలేజీ లేదు. ఇంక మేము వొంట జెయ్యలేదు. ఊరికి బోయిన మా నర్సిమ్మరెడ్డిగాడొచ్చిండు. వచ్చుడొచ్చుడే ఆకలైతున్నదని గాడన్నడు.

” తినెతందుకేమన్న ఉన్నదారా” అని గాడు అడిగిండు. ” లేదురా” అని అంటె ఏదన్న ఒక హోటల్కు బోదాం” అని గాడన్నడు.

నేను ప్రమోద్‌, నర్సిమ్మరెడ్డి గాడు గల్సి బజార్కు బోయినం. పొద్దుగూకుతున్నది. మషీర బాద్ల మంచి హోటల్‌ లేదు. ఏమన్న తినాలంటె చిక్కడ్‌పల్లి బోవాలె. గాడి దాంక బోయెదాంక నర్సిమ్మరెడ్డి గాడు ఆగెటట్లు లేడు. మషీర బాద్ల ఇరాని హోటలున్నయి. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఉన్నాయి. ఒక ఫాస్టు ఫుడ్‌ సెంటర్‌ కాడ్కి బోయినం.

” నూడుల్స్‌ గావాలె. జల్ది దేండ్రి” అని జెప్పినం. నూడుల్స్‌ దెచ్చే ముంగట ఉల్లి గడ్డ పచ్చలు, పచ్చిమిర్చికాయ చట్ని దెచ్చి మా ముంగట ఉంచిండ్రు. ఆకలి మీద ఉన్న నర్సిమ్మరెడ్డి గాడు ఉల్లిగడ్డ పచ్చలు దిన్నడు. చట్ని నోట్లె బెట్టుకున్నడు. గాని నోరు బగ్గున మండింది. ఇగ దాంతోని గిలాస మీద గిలాస నీల్లు దాగిండు గాడు. నర్సిమ్మగాడికి పెండ్లి అయ్యింది. గిప్పుడు గాడు మాతోని ఉంటలేడు. వేరే ఇల్లు దీస్కొని పెండ్లాంతోని ఉంటున్నడు. గాడు దినాం కాలేజీకి వొస్తలేడు. పెండ్లాంను దీస్కొని మ్యాట్ని షోలకు బోతున్నడు. మున్పటి లెక్క గాడు మాతోని తిర్గుతలేడు. మున్పటి లెక్క మాతోని గంటలు గంటలు ముచ్చటబెడ్తలేడు. మేము గిట్లస్తుంటె గాడు గట్ల ఏల్లి బోతున్నాడు.

” ఏం రా మమ్ముల తప్పిచ్చుకోని దిర్గుతున్నవు” అని నేను అడిగితె ” మిమ్ములను గలిస్తె గంటలు గంటలు ముచ్చట బెడ్తరు. ఇంటి కాడ నా పెండ్లాం ఒక్కతే ఉంటది. నేను జల్ది బోకుంటె గామె పర్షానైపోతది” ”అరే అయితారం తినెతందుకు మా ఇంటికి రాండ్రి. నా పెండ్లాం బిర్యాని బెహత్రీన్గజేస్తది” అని గాడన్నడు.

” మీ ఇద్దరి నడ్మ మేమెందుకురా” అని ప్రమోద్‌ గాడు అన్నడు. ” గట్లంటె ఎట్లరా. ఒక్క దినం. కమస్కం ఒక పూటన్న మీకు వొంట పని లేకుంట జేద్దామంటె రామంట రేేందిరా” అని నర్సిమ్మరడ్డి అన్నడు.

” నువ్వు ఒక్క తీర్గ జెప్తుంటె రాకుంట ఉంటమార. తప్పకుంట అయితారం తినేతందుకు మీ ఇంటికొస్తం” అని నేనన్న.

అయితారమొచ్చింది. నేను, ప్రమోద్ గాడు గల్సి నర్సిమ్మరేడ్డి గాని ఇంటికి పోయినం. గాని పెండ్లాం చికెన్ బిర్యాని, బగార బైగన్ జేసింది. మంచిగ దిన్నం. తిన్నంక సిన్మాకు బోయినం. రెడ్డిగాడు లేకుండ బట్కే మేము ఇద్దరమే అయినం. గాని నెల దినాలైనంక లచ్చినారి మతోని గల్సి ఉండేతంద్కు వొచ్చిండు. గాడు మా కాలేజీల బికాం సద్వుతుండు. జన్గాం గాని వూరు. అంతకు ముందు దినాం రేల్ గాడిల గాడు కాలేజీకి వొచ్చేటోడు. తిర్గుట్లనే సమయం కర్సు గాబట్టింది. ఇగ దాంతోని గాడు మాతోని గల్సి ఉండేతంద్కు వొచ్చిండు. ఒకడు గట్లబోతె ఇంకొకడు గిట్లోచ్చిండు.

దినాం నర్సిమ్మా రెడ్డి మాకు కాలేజీల కలుస్తనే ఉన్నడు. గాని మున్పటి లెక్క గాడు మాతో గల్సి సిన్మాలకు వోస్తాలేడు. కాలేజి గాంగనే సక్కగ గాడు ఇంటికి బొతున్నడు. కొత్తగా పెండ్లయినోడు మాతోని తిర్గుతడా? ఎప్పుడన్నొకపారి గాడు మాతోని హోటల్కు వొచ్చేటోడు. గిట్ల చాయ్‌తాగి గట్ల ఉర్కేటోడు. మేము ఎంత మొతుకున్నా గాడు ఉండేటోడు కాదు.

ఎప్పటి లెక్కనే గా అయితారం గూడ తినేదంద్కు గానింటికి రమ్మని నర్సిమ్మరేడ్డి మాకు జెప్పిండు. ముగ్గురం గల్సి గానింటికి పోయినం. పోయి తినేతందుకు గుసున్నా. గీపారి బిర్యాని దినంగానే నోరు బాగ్గుమన్నది. గిలాస మీద గిలాస నీల్లు దాగినం. బగార బైగన్ల ఉప్పు లేదు.

“బిర్యాని బాగుంది. ఇంకింత ఏస్కొండ్రి” అని అన్నడు నర్సిమ్మరేడ్డి, గానికి గాని పెండ్లాం మంచిగ జేసిన బిర్యాని బెట్టినట్లు గోడ్తున్నది. గింత మీద బడి గింత దిని గిలాస మీద గిలాస నీల్లు దాగినం. నర్సిమ్మరేడ్డి ఉండమన్నా ఉండకుంట మా అర్రకొచ్చి గింత శక్కరి బుక్కినం. గీ సంగతి ఎర్కలేని నర్సిమ్మరేడ్డి అయితారం వొస్తే సాలు తినేతందుకు గానింటికి రమ్మనబట్టిండు. తెనాలి రామ లింగాని పిల్లి లెక్క అయిన మేము గాడు ఎంత బత్మిలాడిన గాని ఇంటికి బోలేదు.

గిట్లునడంగ ఒకపారి నర్సిమ్మరేడ్డి పండ్లాం నాకు బజార్ల గల్సింది. “బాగున్నవా?” అని అడిగిన. “బాగున్న అన్నా!” మీ గురించి అయితారం బిర్యాని, చేపల పులుసే గాకుంట బచ్చాలు గూడ జేసిన. తినేతంద్కు ఎందుకు రాలేదన్నా” అని చిల్క నవ్వు నవ్వుకుంట గామె అడిగింది.

“ఊరికి బోయింటి. జెర పని ఉన్నది మల్ల గలుస్త” అన్కుంట ఒక్కటే ఉర్కిన.

Other Updates