”ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ!…” అంటూ అవనత వదనంతో గళమెత్తినాడు నాడు దాశరథి మహాకవి. ఈ గళం నిన్న విన్పించింది, ఈరోజు విన్పిస్తున్నది, రేపు విన్పిస్తుంది. ఆచంద్ర తారార్కం, అవనీతలం ఉన్నంత వరకు విన్పిస్తుంది. పంచాక్షరి ఈ పదం, అయిదు అక్షరాల ఈ పదం నిరంతరం ఆవేశాన్ని ఆవహింపజేస్తుంది. ఈ పదం పోరాటానికి, ప్రగతి పథానికి, ఆత్మాభిమానధనానికి, అచంచల, అకుంఠిత ఆత్మవిశ్వా సంతో ఝంఝా మారుతంగ ఎగసిన జనకోటికి ప్రతీక, పర్యాయపదం. వేయి సంవత్సరాలకు మించిన తన మహోజ్వల చరిత్రకు, సంస్కృతికి, సారస్వతానికి, సమర ఘట్టాలకు విశ్వరూపం విరచించబోతున్నది తెలంగాణ-
‘వేస్తంభముల గుడి వ్రాయించుకొన్నది
నాచేత ఏకశిలా చరిత్ర
వీరరుద్రమదేవి వినిపించుకొన్నది
నాచేత జన్మజన్మాల కథలు
పోతన్న కవి కలబోయించుకొన్నాడు
నాచేత నేడు ఆనాటి కవిత
ముసునూరి కాపన్న మ్రోయించుకొన్నాడు
నాచేత క్రాంతివీణాచయమ్ము
నాకు తల్లివి నీవు, నేనీకు సుతుడ;
నల్ల నాటికి నేటికి నను దినమ్ము
మ్రోయుచున్నావు నా గళమ్మున, కలాన
నా తెలంగాణ! కోటి రత్నాల వీణ!…’
మహాకవి దాశరథి గానం చేసిన తెలంగాణ చరిత్ర ఈనాటిది కాదు. రెండు వేల సంవత్సరాలకు ముందే, క్రీస్తుశకం ప్రారంభానికి రెండు మూడు వందల సంవత్సరాలకు ముందే తెలంగాణ చరిత్రకు శ్రీకారం జరిగింది. తెలంగాణ తెలుగు భాషా సౌరభాలు, పరిమళాలు గుబాళించసాగాయి. క్రీస్తుకు పూర్వం శాతవాహన (శాలివాహన) చక్రవర్తుల పరిపాలన తెలంగాణలోనే ప్రారంభమయి ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు దిశలలో విస్తరించడం విశేషం. శాతవాహన పాలనలో ప్రాకృత, పైశాచి, సంస్కృ త భాషలు పాలకుల దృష్టిలో ప్రాధాన్యం వహించినప్పటికి సామాన్య ప్రజల నాలుకలపై నాట్యం చేసింది తెలంగాణ తెలుగే. శాతవాహన చక్రవర్తి హాలుడు ‘గాథాసప్తశతి’ని, ఆయన అమాత్యుడు గుణాఢ్యుడు ‘బృహత్కథ’ను ప్రాకృతంలో రచించినాడు. ఈ రెండు సంకలనాలలో తెలుగు సుగంధాలున్నాయని పండితులు, పరిశోధకులు అభిప్రాయ పడ్డారు. ఆనాడే తెలుగు భాష, సారస్వతాల వికాసంతో పాటు ప్రజలలో బౌద్ధమత వ్యాప్తితో, బౌద్ధ ఆరామాల, స్థూపాల ఏర్పాటుకు అవకాశం లభించి నూతన సంస్కృతికి అంకురార్పణ జరిగింది. గోదావరి, కృష్ణా సలిలాలవలె తెలుగుభాష, సారస్వతాల స్రవంతులు ప్రవహించడం మొదలయింది. రాజమహేంద్రవరంలో, వేంగీచాళుక్యుల పాలనలో, రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో నారాయణభట్టు సహాయంతో, పదకొండవ శతాబ్ది ప్రారంభంలో నన్నయభట్టారకుడు ఆంధ్రీకరించిన మహా భారతమే (ఆది, సభాపర్వాలు, అరణ్యపర్వంలో కొంతభాగం) తెలుగులో ఆదికావ్యం అన్న వాదన తెలంగాణ ప్రాంతంలోని అంతకు ముందటి తెలుగు రచనలు క్రమంగా వెలుగులోకి రావడంతో బాగా బలహీనపడింది. పదకొండవ శతాబ్దికి ముందే తెలంగాణంలో పంపకవి, ఆయన సోదరుడు జినవల్లభుడు, అంతకుముందే తెలంగాణంలో క్రీస్తుశకం 950లో (నన్నయ క్రీ.శ.1050 వాడనుకుంటే, అంతకునూరు సంవత్సరాల ముందు) కరీమ్‌నగర్ జిల్లావాసి మల్లియ రేచన ఒక ఛందో గ్రంథం ‘కవి జనాశ్రయం’ పేరిట రచించాడని చెప్పడానికి సాక్ష్యాధారాలు లభించాయి. మరో నిదర్శనం ఓరుగల్లు నివాసి మల్లికార్జున పండితుడు (క్రీ.శ. 1120-1190) తెలుగులో వీరశైవ సాహిత్యానికి బీజం వేస్తూ రచించిన ‘శివతత్వ సారం’ కందపద్య గ్రంథం. ఇతర ప్రాంతాలకంటె ఎన్నో సంవత్సరాల ముందు, క్రీస్తుశక ప్రారంభానికి ముందే, తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రజల భాష, కావ్యభాష. క్రమంగా తెలంగాణ ప్రాంతంలో, సామాన్య ప్రజల గళాల నుంచి ఏరులై వచ్చిన జానపద గీతాలలో, కవులు, పండితులు గళాల నుంచి తరంగాలుగా ఎగసివచ్చిన కావ్యభాషలో తెలుగు పరిపుష్టిని, పరిణతిని పొందగలిగింది. పలు రచనా ప్రక్రియలకు (ఛందోగ్రంథం, శైవ సాహిత్యం, దేశి కవిత, ద్విపద, చరిత్రాత్మక ఇతివృత్త రచన, శతకం, ఉదాహరణ కావ్యం, రగడ మొదలయిన ప్రక్రియలు) తెలంగాణ తేనె మాగాణంలోనె బీజావాపన జరుగడం గర్వకారణం.తెలంగాణంలో జరిగిన తెలుగు సారస్వత వికాసం అనంతర కాలంలో నన్నయ భారత రచనకు అమితంగా ఉపకరించి ఉంటుంది.
తెలంగాణ ప్రాంతం కేంద్రంగా, తెలంగాణలోనె తొలి రాజధానిగ శాతవాహనులు (శాలివాహనులు) రాజ్యం చేసిన పిదప ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, కందార వంశీయులు, విష్ణు కుండినులు, చాళుక్యులు, చోళులు, కళింగులు తదితరులు పాలకులయినారు. చిన్నచిన్న నాడులు, రాజ్యాలతో ఛిన్నాభిన్న పరిస్థితి కన్పించింది. ఆ క్లిష్ట పరిస్థితిలో, అప్పటి వరకు సామంతులుగా ఉన్న కాకతీయులు, కాకతీయ మహా సామ్రాజ్యాన్ని ఓరుగల్లు (ఏకశిలానగరం) రాజధానిగ అవతరింప జేయడం తెలంగాణ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. అచ్చమయిన తెలుగురాజ్యం, తెలంగాణ రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. క్రీస్తుశకం ఆరంభానికి ముందే పదకొండవ శతాబ్ది ఆరంభంలో నన్నయ భారతం రచించడానికి ముందే తెలంగాణ ప్రాంతంలో పద్యకావ్య రచన ప్రారంభమయిందని తెలిపే శాసనాలు తదితర సాక్ష్యాధారాలు లభించాయి. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో తెలుగు జానపద గీతాలు ప్రాచుర్యంలో ఉన్నాయని సురవరం ప్రతాపరెడ్డి ప్రబృత పండితులు, పరిశోధకులు నిర్ధారించారు. తెలుగు భాష, సారస్వతాలు కాకతీయుల పాలనలో వివిధ ప్రక్రియలలో బహుముఖంగా విస్తరించి సహస్ర దళాలతో వికసించాయి. కొన్ని సాహిత్య ప్రక్రియలకు తెలంగాణలోనె, కాకతీయుల పాలనా కాలంలోనె తెలుగు భాషా చరిత్రలో మొదటిసారి అంకురార్పణ జరిగింది. అంతవరకు సామంతుడుగా ఉన్న కాకతీయ ప్రోలరాజు విజంభించడంతో క్రీ.శ. 1120లో కాకతీయ సామ్రాజ్య స్థాపన జరిగింది. అంతవరకు కన్నడంలో మాత్రమే ఉన్న రాజ శాసనాలు తెలుగులో రచితం కావడం మొదలయింది. మొదటి ప్రతాపరుద్రుడు (రుద్రదేవ చక్రవర్తి) పాలన నాటి నుంచి తెలుగు భాషా సేవకు, సారస్వత కృషికి అపూర్వ ప్రేరణ, ప్రోత్సాహం లభించాయి. కాకతీయ యుగంలో తెలంగాణలో చేకూరిన తెలుగు వాఙ్మయ పరిపక్వతకు పలు నిదర్శనాలు కన్పిస్తాయి. రుద్రదేవ చక్రవర్తి (క్రీ.శ.1140-1160) వద్ద గంగాధరునికి మంత్రి పదవి లభించడానికి కారణం ఆయన (గంగాధరుడు) ఒక శాసనంలో ప్రత్యయాంతంగా తెలుగులో నాలుగు పద్యాలు రచించడం అని అన్నారు. రుద్రదేవ మహారాజు విద్యాభూషణ బిరుదాంకితుడు, ఆయన రచించిన గ్రంధం ‘నీతిసారం’. ఇది అమూల్య గ్రంధం. ఆనాటి సామాజిక, మతపర, భాషా సంబంధ సంప్రదాయాలకు భిన్నంగా, ప్రతిఘటన పతాకం ఎత్తి వీరశైవ మత ప్రబోధకుడయి మొదటి ద్విపద కావ్యం బసవ పురాణాన్ని, మొదటి చరిత్రాత్మక కావ్యం పండితారాధ్య చరిత్రను, మొదటి తెలుగు శతకం వృషాధిప శతకాన్ని, మొదటి ఉదాహరణ కావ్యం బసవో దాహరణం, మొదటి సారి రగడలు రచించిన జాను తెనుగు కవి పాల్కురికి సోమన ఆనాటి (12వ శతాబ్ది ఉత్తరార్థం) వాడే. రామేశ్వర భట్టారకుడు, మల్లికార్జునపండితారాధ్యుడు, బాలసరస్వతి తదితరులు పాల్కురికి సోమన సమకాలికులు. అనంతరం కాకతి గణపతి దేవుడు క్రీ.శ.1166 నుంచి 1260 వరకు అతి దీర్ఘకాలం జరిపిన పరిపాలన సారస్వత, కళా, సాంస్కృతిక రంగాలకు నిజంగా స్వర్ణయుగం. ఇప్పటికి, ఆధునికులకు సైతం అచ్చెరువు కల్గిస్తున్న అద్భుత శిల్పకళా, చిత్రకళా మందిరాలు, శిల్ప, చిత్రకళా నైపుణ్యం వెల్లివిరిసిన దేవాలయాలు, రాజభవనాలు, దుర్గాలు, కోటలు, వ్యావసాయక అభివృద్ధికి దోహదపడే అపూర్వ తాటాకాలు కాకతీయ పాలన అందించిన అమూల్య కానుకలు. కాకతీయుల కదన పాండిత్యం ఎంత ఘనమైనదో, ప్రసిద్ధమైనదో వారి భాషా సేవ, కళావైభవం అంత ఘనమైనవి, ప్రసిద్ధమైనవి. కాకతీయ కళా నైపుణ్యానికి, వైభవానికి దర్పణం విలక్షణ గ్రంధం ‘నత్తరత్నావళి’, ఈ గ్రంధం రచయిత గణపతి దేవ చక్రవర్తి బావమరిది, గజసైన్యాధిపతి జాయపసేనాని. తెలంగాణ శిల్ప చిత్ర, నత్య కళారీతుల దర్శిని జాయప సేనాని గ్రంధం. గణపతి దేవ చక్రవర్తి నిశ్చయంగా సాహిత్య ప్రియుడు కనుక తిక్కన సోమయాజి భారతం విని, ఆయన కోరిక తీర్చి గౌరవించినాడు. మార్కండేయ పురాణం రచించిన మారన, వ్యాకరణ బ్రహ్మగా పేరొందిన కొలని రుద్రదేవుడు కాకతీయు కాలం వారే. మొదటి ప్రతాపరుద్ర దేవుని, తరువాత గణపతి దేవుని కొలువులో అమాత్య శేఖరు డుగా రాజతంత్రం నడిపిన శివదేవయ్య నూరు సంవత్సరాలు జీవించారు. ఆయన రచించిన ‘పురుషార్ధసారం’ విలువయిన రాజనీతి శాస్త్ర గ్రంధం. శివదేవయ్య ధీమణి ఒక శతకాన్ని గూడ రచించి ఉన్నాడని సాహిత్య పరిశోధకులు భావించారు. శివదేవయ్య మొదటి ప్రతాపరుద్రునికి శివమంత్రోపదేశికుడు, విద్యాగురువు అని గూడ పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
గణపతి దేవ చక్రవర్తి తరువాత ఆయన కుమార్తె రుద్రమదేవి (1260-1295) పరిపాలన కాలం గూడ తెలంగాణ సారస్వత చరిత్రలో మరో ఉజ్వల అధ్యాయం. ద్విపద రామాయణం రచించిన (అదే రంగనాధ రామాయణం) గోనబుద్ధారెడ్డి, రావిపాటి త్రిపురాంతకుడు, భాస్కర రామాయణం రచించిన భాస్కరుడు, మల్లికార్జునభట్టు తదితరులు, నలకీర్తి కౌముది రచించిన అగస్త్యేశ్వరుడు అప్పటివారే. భాస్కర రామాయణ కర్తలలో ఒకడయిన మల్లికార్జునభట్టు అనేక గ్రంధాలు రచించిన ఉభయభాషా (సంస్కృతం, తెలుగు) ప్రవీణుడు. ఆయన లేఖిని నుంచి వెలువడిన ‘అభిషిక్తరాఘవం’ సంస్కృత కావ్యం. ఆయన రాజతంత్ర నిపుణుడుగా ప్రసిద్ధి పొందినాడు. ఆయన ఆశు కవితా నిపుణుడు గూడ. నాడు తెలంగాణ సారస్వత రంగంలో అమూల్య సంపదలను సష్టించిన కవీశ్వరులు కొందరి జీవిత విశేషాలపై (కుమార రుద్రదేవుడు, హుళక్కి భాస్కరుడు, అయ్యలార్యుడు, భాస్కరుడు మొదలయినవారు) ఇంకా ఎంతో పరిశోధన జరుగవలసి ఉంది. రుద్రమదేవి పిదప ఆమె దౌహిత్రుడు రెండవ ప్రతాపరుద్రుడు సింహాసనా రూఢుడయి క్రీ.శ. 1265 నుంచి 1323 వరకు జరిపిన పరిపాలన గణనీయమయినది-విద్యానాధ మహాకవి ‘ప్రతాపరుద్రీయం’ అలంకార గ్రంధాన్ని రచించి ప్రతాపరుద్రునికి అంకితం కావించడం విశేషం. నిజానికి, ‘ప్రతాప రుద్రీయం’ నాటి తెలంగాణ ఉజ్వల చరిత్రను వివరించే ఉద్గ్రంధం. చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడు కవి, పండితుడు. ఆ రోజుల్లో దేవత ఉత్సవాలలో ‘ప్రేమాభిరామం’ రూపకం ప్రదర్శితమయ్యేది. ఈ రూపకం రచయిత రావిపాటి త్రిపురాంతకుడు. కాకతీయుల పాలనలో గ్రంధాలయాలు గూడ స్థాపితమయినాయి. కాకతీయ పాలన ముగియ డంతో మాధవ విద్యారణ్యులు, నాచన సోముడు, అగస్త్యేశ్వరుడు, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లినారు. ఏకామ్రనాధుని ప్రతాప చరిత్ర, కూచిమంచి జగ్గకవి సోమరాజీయం నాటి చరిత్ర వివరణకు ఆధారభూతమయినవి.
కాకతీయ పాలన అనంతరం తెలంగాణ ప్రాంతంలో, పదిహేనవ శతాబ్దంలో సారస్వత మకరందాలను వెదజల్లిన మహాకవి, మహాభక్తుడు, ఋషితుల్యుడు, ‘సత్కవుల్ హాలికులయిననేమి’ అని ప్రబోధించిన వాడు బమ్మెర పోతన. రామాయణ కావ్యాల తరువాత తెలుగు భాగవతం గూడ తెలంగాణ పుణ్యభూమిలో అవతరించింది. రామభద్రుడు స్వయంగా భక్తకవి పోతన చేత పరమ పవిత్ర భాగవతాన్ని పలికించడం అసాధారణ, అద్భుత, మహత్తర సన్నివేశం. పోతన మాటల్లోనె చెప్పాలంటే-”…వెలయున్ భాగవతాఖ్యకల్పతరువుర్విన్ సద్ద్విజశ్రేయమై”. క్రీ.శ. 1512లో (పదహారవ శతాబ్ది ప్రారంభంలో) కులీకుతుబ్‌షాల స్వతంత్ర రాజ్యస్థాపన గోలకొండలో జరిగింది. కుతుబ్‌షాహి పాలనలో ఫారసీ రాజభాష అయినప్పటికి తెలంగాణ ప్రజల తెలుగు భాషకు, హిందూ మేధావులు, కవులు, రచయితలకు ప్రాధాన్యం లభించింది. అద్దంకి గంగాధర కవి, మొట్టమొదటి అచ్చతెలుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ రచించిన పొన్నిగింటి తెలగన్న, కందుకూరి రుద్రకవి గోలకొండ కవులే. తెలుగు భాషాభిమానం ప్రదర్శించి ఇబ్రహీమ్ కులీ కుతుబ్‌షా ఇభరాముడయినాడు. కంచర్ల గోపన్న కుతుబ్‌షాహి రాజ్యం అధికారి అయినప్పటికి భద్రాచల రామాలయం కట్టించి, మధురాతిమధురమయిన తెలంగాణ నుడికారంతో భక్తిరసం తొణికిసలాడే కీర్తనలు రచించి జగద్విఖ్యాతుడయినాడు. నిజామ్ పాలనలో సైతం తెలంగాణంలో కవులు, రచయితలు, మేధావులు, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి సంస్థలు, తెనుగు పత్రిక, గోలకొండ పత్రిక, శోభ మాస పత్రిక తదితర పత్రికలు తెలుగుభాష, వాఙ్మయ రోచిస్సులను ఆరిపోకుండా కాపాడి మరింత ప్రజ్వలితం కావించడం ఒక ఉజ్వల చరిత్ర. ప్రపంచ ప్రఖ్యాత కవయిత్రి సరోజనీనాయుడు, విశ్వవిఖ్యాత కవీశ్వరుడు హరీంద్రనాధ చటోపాధ్యాయ, మల్లినాధసూరి, కాకునూరి అప్పకవి (సుప్రసిద్ధ వ్యాఖ్యాతలు, లాక్షణికులు) తెలంగాణ బిడ్డలు కావడం గర్వకారణం. రాజకీయ, పరిపాలనారంగాలలో రాణించిన బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు బహుభాషల కోవిదులయి భాసించడం మరో గర్వకారణం. తెలంగాణ తెలుగు కవులు, రచయితలు, పండితులు ఇక్కడి ఉర్దూ, ఫారసీ భాషలలో కూడా సాటిలేని కవులై, పండితులై ప్రసిద్ధి పొందడం ఇంకొక గర్వకారణం.
దేవులపల్లి ప్రభాకరరావు