రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేంద్ర 2017-18 సంవత్సరానికి సంబంధించి మార్చి 13న శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నివిధాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పటికే అమలులోవున్న పథకాలతోపాటు, సరికొత్త పథకాలకు రూపకల్పన చేసి, భారీగా నిధులు కేటాయించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి, సబ్బండవర్ణాలకు అగ్రతాంబూలం ఇస్తూ, కులవృత్తులవారికి భరోసా కల్పించారు.
బడ్జెట్ రూపకల్పనలో కూడా ఈసారి భిన్నపద్ధతి అవలంబించారు. సహజంగా బడ్జెట్ ను ఇంతకాలం ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులకింద చూపించేవారు. కానీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, రెవెన్యూ, క్యాపిటల్ పద్దుల క్రింద బడ్జెట్ రూపకల్పన జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.1,49,646 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఇందులో నిర్వహణా వ్యయం రూ. 61,607.20 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88,38.80 కోట్లు ప్రతిపాదించారు. నిర్వహణా వ్యయం కంటే ప్రగతిపద్దు అధికంగా వుండటం ఓ విశేషం.
ప్రభుత్వానికి సంతృప్తినిచ్చిన, పేదలు మెచ్చిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహాయం రూ. 51,000 మొత్తాన్నిరూ. 75,116 లకు పెంచడం పేదింటి పెళ్ళికళకు మరింత వన్నె తెచ్చింది. రైతు రుణమాఫీ చివరి కిస్తుకు రూ. 4,000 కోట్లు కేటాయించడం రైతు మోములో ఆనందం నింపింది. బిడ్డకు జన్మనిచ్చే దశలో గర్భిణికి పూర్తి విశ్రాంతినిచ్చి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేందుకు వీలుగా, గర్భిణీలకు మూడు విడతలుగా రూ. 12,000 ఆర్థిక సహాయం, ఆడపిల్లను ప్రసవిస్తే అదనంగా మరో రూ.1,000, తల్లికి, పుట్టిన బిడ్డ సంరక్షణకు మూడు నెలల వరకూ ఉపయోగపడే 16 వస్తువులను ‘కె.సి.ఆర్. కిట్’ పేరిట అందించడం వంటి నిర్ణయాలు ప్రభుత్వ మానవీయ దృక్పధానికి నిదర్శనాలు.
బడ్జెట్ రూపకల్పనలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో కూడా మార్పులు అనివార్యమయ్యాయి. అందుకే, అంతకన్నా పటిష్టంగా, కేటాయించిన నిధులు వ్యయం చేయకపోతే, ఆ నిధులు మరుసటి ఏడాదికి జమ అయ్యే విధంగా ప్రభుత్వం ఈ శాసన సభా సమావేశాలలోనే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం పేరిట అసాధారణ చట్టాన్ని కూడా తీసుకు వచ్చింది.
ఎం.బి.సిల సంక్షేమానికి రూ. 1,000 కోట్ల నిధులు కేటాయించడం, మానవ వనరులను ప్రోత్సహించి, సద్వినియోగ పరచుకొనే క్రమంలో వివిధ కుల వృత్తులవారికి భారీగా నిధులు కేటాయించడం ఈ బడ్జెట్లో మరో ప్రత్యేకత.
గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్య క్రమాలకు నిధులు కేటాయిస్తూ, సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రయోజనకరంగా బడ్జెట్ రూపకల్పన జరగడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సంబురాలు అంబరా న్నంటాయి.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పేర్కొన్నట్టు, రాష్ట్ర ప్రగతిలో ఇదొక కీలకమైన మైలురాయి. తెలంగాణ పల్లె కన్నీరు తుడిచే మహత్తర పద్దు. తెలంగాణకు కొత్త పొద్దు.