haritha-haramరాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు పరుస్తున్న ‘హరితహారం’ కార్యక్రమంపై డిసెంబర్‌29న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఒక ప్రకటన చేశారు.

ఈ ప్రపంచం ప్రకృతి ధర్మానికి లోబడి మనుగడ సాగిస్తున్నది. భూమ్మీద ఉనికిలో ఉన్న కోటానుకోట్ల జీవరాశులలో మానవజాతి కూడా ఒకటి. మనిషి వైజ్ఞానికంగా ఎంత ప్రగతిని సాధించినా, ప్రకృతి ధర్మానికి అతీతంగా జీవించడం అసాధ్యం. ఈ సత్యం మరిచిన మనిషి తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లు, తన మనుగడకు ఆధారమైన ప్రకృతిని తానే నాశనం చేస్తున్నాడు. మొట్టమొదట ఈ భూగోళం నిండా నీళ్లు, చెట్లు మాత్రమే ఉండేవి. మనిషి మొదట తన జీవనాధారం కోసం చెట్లను నరకడం ప్రారంభించాడు. భూమిని చదును చేశాడు. వ్యవసాయ క్షేత్రాలను, జనావాసాలను అభివృద్ధి చేసుకున్నాడు. ప్రకృతి ఇచ్చే ఫలాలపై ఆధారపడి మానవజీవనం సాగింది. నాగరికత పెరిగే కొద్దీ మనిషి ప్రకృతి సూత్రాలతో సమన్వయం కోల్పోయాడు. విచక్షణా రహితంగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ వినాశనం ఫలితంగా భూకంపాలు, జలప్రళయాలు, తీవ్ర ఉష్ణోగ్రతలు సంభవిస్తున్నాయి. నదీనదాలు అదృశ్యమవుతున్నాయి. కాలుష్యం కాటుకు జనావాసాలు విలవిల్లాడుతున్నాయి. మంచినీటి కోసం, స్వచ్ఛమైన గాలికోసం మనిషి అల్లల్లాడుతు న్నాడు. ప్రకృతి విధ్వంసంవల్ల కలిగిన దుష్పరిణామాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి.

ఈ భూమ్మీద 33 శాతం పచ్చదనం ఉంటేనే ప్రకృతి సమతౌల్యం సాధ్యం. కానీ ఈ రోజు మనదేశంలో ఆ స్థాయిలో పచ్చదనం లేదు. క్లైమెట్‌ రియాలిటీ ప్రాజెక్టు అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వే ప్రకారం కెనడాలో అత్యధికంగా సగటున ఒక మనిషికి 8,953 చెట్లుంటే రష్యాలో 4,461 చెట్లున్నాయి. అమెరికాలో 716 చెట్లుండగా, చైనాలో 102 చెట్లు ఉన్నాయి. అంటే భూమ్మీద ప్రతీ మనిషికి సగటున 422 చెట్లున్నాయి. మన భారతదేశంలో మాత్రం సగటున 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టి పర్యావరణం విషయంలో మనదేశం ప్రమాదం అంచున ఉందని వేరే చెప్పనక్కరలేదు.

ఇక మన రాష్ట్రం విషయానికొస్తే, గొప్ప అటవీ సంపదను ప్రకృతి తెలంగాణకు వరంగా ఇచ్చింది. ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో 26,903 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. ఇందులో ఒకప్పుడు 25 శాతం దట్టమైన అడవి, 50శాతం ఓ మోస్తరు అడవి ఉండేది. మిగతా 25 శాతం అటవీ భూముల్లో చెట్లు, చిన్న చిన్న పొదలు ఉండేవి. కానీ, ఇప్పుడు ఈ అటవీ భూమిలో 1.06 శాతం మాత్రమే దట్టమైన అడవి మిగిలింది. 28.95 శాతం మామూలు అడవి మిగిలింది. మిగతా అటవీ భూమి అంతా చెట్టూ చేమాలేని మైదానంగా మారింది.

అడవుల పరిరక్షణ అవసరాన్ని గత పాలకులు విస్మరించారు. పాలకులకు తగిన పట్టింపు లేకపోవడంతో చెట్ల నరికివేత పెద్ద ఎత్తున కొనసాగింది. కనీసం కోల్పోయిన అడవిని పునరుద్ధరించేం దుకైనా ప్రయత్నించలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతటికీ కలిపి కూడా అడవుల సంరక్షణ, పునరుద్ధరణ, మొక్కల పెంపకంకోసం ఏటా సగటున ఖర్చు పెట్టింది కేవలం 13 కోట్ల రూపాయలు మాత్రమే. 2004-2014 మధ్యకాలంలో అటవీశాఖ మొత్తం ఖర్చు 130.61 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక మొక్కలు నాటే కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది. 1980-2014 మధ్యకాలంలో తెలంగాణలోని అటవీ భూముల్లో 3.17 లక్షల హెక్టార్లలో మాత్రమే మొక్కల పెంపకం పరిమితమైంది. ఈ 34 ఏళ్లలో తెలంగాణలో నాటిన మొక్కల సంఖ్య కేవలం 35.3 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రతీ ఏటా సగటున 3,356 హెక్టార్ల అటవీ భూమి అన్యాక్రాంతమైపోయింది. ఈ పరిణామంవల్ల తెలంగాణ ప్రాంతం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని కొంత ప్రాంతం మినహా మిగతా తెలంగాణ అంతటా ప్రతీ ఏటా తీవ్ర వర్షాభావం నెలకొంటున్నది.

అడవి దట్టంగా ఉన్నచోట వర్షాలు పడుతుంటే, వృక్ష సంపద తరిగిపోయిన చోట దుర్భిక్షం నెలకొంటున్నది. రాష్ట్రంలో అటవీశాతం ఎక్కువున్న జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్‌ తదితర జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం ఉంది. అడవులు తక్కువున్న కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, సిద్ధిపేట, సిరిపిల్ల, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి తదితర జిల్లాల్లో వర్షపాతం రాష్ట్ర సగటుకంటే కనిష్టంగా ఉంటున్నది. జిల్లా విస్తీర్ణంలో పదిశాతం కూడా అడవిలేని కరీంనగర్‌, గద్వాల, హైదరాబాద్‌, జనగామ, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌, నల్లగొండ జిల్లాల్లో పరిస్థితి విషమంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ జిల్లాలు ఎడారి వాతావరణాన్ని తలపించేంతగా మారిపోయే ముప్పు పొంచి ఉంది. 30శాతంలోపే అటవీ విస్తీర్ణం కలిగిన ఖమ్మం, పెద్దపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలు కూడా పైన చెప్పిన జిల్లాల పరిస్థితికి దిగజారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.

విచక్షణారహితంగా వనాలను విధ్వంసం చేయడంతో వన్యప్రాణుల స్థితి అగమ్యగోచరంగా మారింది. అడవే ఆవాసంగా బతికే జంతుజాలం ఆ అడవి నశించడంతో ఆహార అన్వేషణలో జనావాసాలపై పడుతున్నాయి. ఇవాళ వ్యవసాయరంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో కోతుల బెడద ఒకటి. ఇందుకు నిందించాల్సింది మూగ జీవాలను కాదు. పూర్తిగా ఇది మానవ తప్పిదం అని గ్రహించాలి. సరిదిద్దుకునే మార్గాలు వెతకాలి.

ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ దశలోనైనా మనందరం మేల్కొనకపోతే రేపు సంభవించనున్న తీవ్ర విపత్తుకు మనమే బాధ్యులం అవుతాం. ఈ నేపథ్యాన్నంతా దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

పచ్చదనాన్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన గొప్ప ప్రయత్నాల్లో తెలంగాణకు హరితహారం మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం. మొదటి ప్రయత్నం చైనాలో జరిగింది. అక్కడ గోబీ ఎడారి విస్తరణను నిలుపుదల చేసేందుకు యావత్‌ ప్రజానీకం పూనుకుని 4,500 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటి ‘గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ చైనా’ను నిర్మించారు. రెండవ అతి పెద్ద ప్రయత్నం బ్రెజిల్‌లో జరిగింది. అమెజాన్‌ నదీతీరంలో ఉన్న అడవిని పరిరక్షించడంకోసం ‘వన్‌ బిలియన్‌ ట్రీస్‌ ఫర్‌ అమెజాన్‌’ అనే పేరుతో వంద కోట్ల మొక్కల పెంపకం జరిగింది. ఈ రెండు ప్రయత్నాలను మించిన ప్రయత్నం ఈ రోజు తెలంగాణకు హరితహారం పేరుతో మన రాష్ట్రంలో జరుగుతున్నది.

రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలన్నది హరితహారం లక్ష్యం. తెలంగాణవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటడం ధ్యేయంగా పెట్టుకున్నాం. 120 కోట్ల మొక్కలను గ్రామాలు, పట్టణాల్లోని బాటల వెంట, ఖాళీ ప్రదేశాల్లో, చెరువు గట్లమీద, కాలువల దారులవెంట, పొలం గట్లమీద, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాలలో, కాలనీలలో, ప్రతీ ఇంటిలో నాటుతున్నాం. అటవీ ప్రాంతంలో సరైన సంరక్షణ లేక ఎదగలేకపోతున్న 100 కోట్ల మొక్కలను తిరిగి పెంచేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో పదికోట్ల మొక్కలు నాటుతున్నాం. 2015 జూలై 3న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి ఏడాది 15.86 కోట్లు, ఈ ఏడాది 31.67 కోట్ల మొక్కలు నాటాం. వచ్చే ఏడాది మరో 40 కోట్ల మొక్కలు నాటడానికి ఏర్పాటు చేస్తున్నాము. ప్రతీ గ్రామంలో సగటున 40వేల మొక్కల చొప్పున ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం పెద్దఎత్తున అమలవుతున్నది. కల్లుగీత వృత్తిని కాపాడేందుకు 5 కోట్ల ఈత మొక్కలు చెరువుగట్లమీద నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ ఏడాది దాదాపు 50 లక్షల ఈత మొక్కలు నాటాం.

మొక్కలు నాటడంతోనే బాధ్యత తీరిపోదు.

మొక్కలు నాటడంతోనే బాధ్యత తీరిపోయిందని ప్రభుత్వం భావించడంలేదు. నాటిన మొక్కలకు నీరు పోసేందుకు, కాపాడేందుకు కూడా చర్యలు తీసుకున్నాం. 3,200 ట్యాంకర్లతో మొక్కలకు నీరు పోస్తున్నాము. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలలో మొక్కల సంరక్షణ కొనసాగుతున్నది. అటవీ భూముల్లో నాటిన మొక్కల పరిరక్షణ బాధ్యతను అటవీశాఖ నిర్వర్తిస్తున్నది.

తెలంగాణ ఏర్పడే నాటికి గత 35 సంవత్సరాలలో నాటిన మొక్కలు 35 కోట్లని ప్రభుత్వ లెక్కల్లో ఉంది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రెండున్నరేళ్లలో నాటిన మొక్కలే 47.98 కోట్లు. గడిచిన 35 ఏండ్లలో 3.17 లక్షల హెక్టార్ల అటవీ భూమిలో అడవి పునరుద్ధరణకోసం ప్రయత్నాలు జరిగితే, ఈ రెండున్నరేళ్లలో 4.31 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్‌ జరిగింది. మొక్కలను ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4వేల నర్సరీలను అభివృద్ధి చేశాము. ఈ రోజున రాష్ట్రంలో సగటున రెండు గ్రామాలకు ఒక నర్సరీ అందుబాటులోకి తేగలిగాం.

నిర్లక్ష్యానికి గురైన అటవీశాఖను విస్తృతపరిచి బలోపేతం చేసే దిశగా సమగ్ర చర్యలు చేపట్టాం. బడ్జెట్లో నిధుల కేటాయింపును, ఉద్యోగుల సంఖ్యను పెంచాం. గత ప్రభుత్వంలో అటవీశాఖకు ఏడాదికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిననాటినుంచి నేటి వరకు 1,243 కోట్ల రూపాయలు అటవీశాఖకు మా ప్రభుత్వం కేటాయించింది. అంటే సగటున ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలకు పైగా పచ్చదనాన్ని పెంచడంకోసం ఖర్చు చేస్తున్నది. గత ప్రభుత్వాలు పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇది 30 రెట్లు ఎక్కువ.

అటవీశాఖను అవసరాలకు తగినట్లుగా పునర్వ్యవస్థీకరించాం. తెలంగాణలో గతంలో 28 ఫారెస్టు డివిజన్లుంటే, వాటిని 37 చేశాం. రేంజ్‌ల సంఖ్యను 106 నుండి 185కు పెంచాం. 469 సెక్షన్లను 831 చేశాము. బీట్ల సంఖ్యను 1438 నుండి 3132కు పెంచాం. ఉద్యోగుల సంఖ్యను కూడా ఇందుకు అనుగుణంగా పెంచాం. కొత్తగా 2014 పోస్టులను భర్తీ చేశాము. 67 రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు, 90 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు, 1857 బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు, మరో 44 ఇతర పోస్టులు అదనంగా మంజూరు చేశాము.

అటవీ భూముల పరిరక్షణకోసం, కలప స్మగ్లింగ్‌ను అరికట్టడంకోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అడవిలో చెట్ల నరకివేతను చాలా వరకు నిరోధించగలిగాం. గతంలో ఏడాదికి సగటున 15వేల వరకు ఇలాంటి సంఘటనలు జరిగితే, ఈ ఏడాది వాటి సంఖ్య 5వేలకు తగ్గింది. పేరుమోసిన కలప స్మగ్లర్లు ఐదుగురిని పీడీ యాక్టుకింద అరెస్టు చేసి, జైలుకు పంపాము. గతంలో అడవిలో గస్తీ తిరిగేందుకు తగినన్ని వాహనాలు ఉండేవి కావు. గతంలో అటవీశాఖకు మొత్తం వాహనాలు 237 ఉండేవి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,143 వాహనాలు కొత్తగా అటవీశాఖకు సమకూర్చాం. కొత్తగా సమకూర్చిన వాటిలో 20 కార్లు, 124 జీపులు, 1993 మోటారు సైకిళ్ళు ఉన్నాయి.

అడవిమీద ఆధారపడి జీవించే ప్రజలకుండే హక్కుకు సంబంధించి కొంత స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. గతంలో ప్రభుత్వం ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌.లు ఇచ్చింది. దీని ప్రకారం అటవీప్రాంత వాసులకు అటవీ ఉత్పత్తులను సేకరించుకుని జీవనం గడిపే హక్కు ఉంటుంది. అంతేతప్ప, అడవిని చదునుచేసే హక్కుకాదు. ఆదివాసుల జీవన విధానాన్ని భంగపరచకుండా ఉండేందుకు ఈ హక్కు ఉద్దేశించబడింది. కానీ ఇది అటవీ భూమి మీద హక్కు కాదనే విషయం గ్రహించాలని ఈ సభద్వారా కోరుతున్నాను.

తెలంగాణకు హరితహారం యాంత్రికంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమంవలె కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో ఒక హరిత ఉద్యమంగా సాగుతున్నది. వానలు వాపస్‌ రావాలె, కోతులు వాపస్‌ పోవాలె అని నేనిచ్చిన నినాదం జనసామాన్యం గుండెలను తాకింది. గత వర్షాకాలంలో ఆబాలగోపాలం అమితోత్సాహంతో నర్సరీలనుంచి మొక్కలు తీసుకొచ్చి అనువైన చోటల్లా నాటారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునందుకుని వేలాదిగా తరలివచ్చిన జనం విజయవాడ, బెంగళూరు వెళ్లే రహదారుల వెంట భారీస్థాయిలో మొక్కలు నాటారు. తెలంగాణవ్యాప్తంగా ప్రతీ ఊరిలో ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి తమ బాధ్యతగా మొక్కలు నాటడంలాంటి దృశ్యాలు ఎన్నో ఆవిష్కృతమయ్యాయి. తెలంగాణ భూమిపై పచ్చని నీడను పరిచే ఈ మహాయజ్ఞం నిరంతరాయంగా, నిరాటంకంగా కొనసాగిస్తామని సభకు తెలియజేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలూ ముందుకొచ్చి ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించాలని ఈ సభద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.

హరితహారం లక్ష్యం

రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడం

తెలంగాణవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటడం

అప్పుడు

తెలంగాణ ఏర్పడే నాటికి గత 35 సంవత్సరాలలో నాటిన మొక్కలు 35 కోట్లని ప్రభుత్వ లెక్కల్లో ఉంది.

3.17 లక్షల హెక్టార్ల అటవీ భూమిలో అడవి పునరుద్ధరణకోసం ప్రయత్నాలు జరిగితే,

ఇప్పుడు

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రెండున్నరేళ్లలో నాటిన మొక్కలే 47.98 కోట్లు.

రెండున్నరేళ్లలో 4.31 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్‌ జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా 4వేల నర్సరీల అభివృద్ధి.

మొదటి ఏడాది 15.86 కోట్ల మొక్కలు

ఈ ఏడాది 31.67 కోట్ల మొక్కలు నాటాం.

వచ్చే ఏడాది మరో 40 కోట్ల మొక్కలు నాటడానికి ఏర్పాటు చేస్తున్నాము.

ప్రతీ గ్రామంలో సగటున 40వేల మొక్కల చొప్పున ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో

40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం పెద్దఎత్తున అమలవుతున్నది.

నాటిన మొక్కలకు నీరు పోసేందుకు, కాపాడేందుకు కూడా చర్యలు తీసుకున్నాం.

3,200 ట్యాంకర్లతో మొక్కలకు నీరు పోస్తున్నాము. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు మొక్కల సంరక్షణ కొనసాగుతున్నది. బాధ్యతను అటవీశాఖ నిర్వర్తిస్తున్నది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో పదికోట్ల మొక్కలు

గత ప్రభుత్వంలో అటవీశాఖకు ఏడాదికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే..తెలంగాణ రాష్ట్రం వచ్చిననాటినుంచి నేటి వరకు అటవీశాఖకు కేటాయించింది 1,243 కోట్లు సగటున ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంచడంకోసం ఖర్చు చేస్తున్నది 400 కోట్లు

గత ప్రభుత్వాలు పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇది 30 రెట్లు ఎక్కువ.

తెలంగాణలో గతంలో ఫారెస్టు డివిజన్లు 28.. ఇప్పుడు 37

రేంజ్‌ల సంఖ్య 106 నుండి 185కు పెరిగాయి.

469 సెక్షన్లను 831కి పెంపు

బీట్ల సంఖ్య 1438 నుండి 3132కు పెంపు

కొత్తగా 2014 పోస్టుల భర్తీ

67 రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు

90 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు

1857 బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు

అదనంగా మరో 44 ఇతర పోస్టులు

Other Updates