bandaru-dattatreyaగజ్వేల్‌ నియోజకర్గం ములుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణకే తలమానికంగా తయారవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభివర్ణించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న అటవీ కళాశాల నుంచి ఎందరో తెలంగాణ బిడ్డలు ఐఎఫ్‌ఎస్‌లు కావాలని ఆకాంక్షించారు. విత్తనోత్పత్తికి తెలంగాణ ప్రాంతం నిలయం కావాలన్నారు. జనవరి 7న మెదక్‌జిల్లా ములుగులో శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ సెంటర్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌, సీఎం కేసీఆర్‌లు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

తెలంగాణ ప్రాంతం, ఇక్కడి భూమి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందన్నారు. ఆ కారణంగానే ఈ ప్రాంతంలో వందల కొలది విత్తనోత్పత్తి కేంద్రాలు వెలిశాయన్నారు. నీటిపారుదల, మార్కెటింగ్‌లను అభివృద్ధిపరచి విశ్వవిద్యాలయ సేవలను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని సీడ్‌బౌల్‌గా మారుస్తామన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కేంద్రం ఉదారంగా విరాళాలు ఇవ్వాలన్నారు. తాము విత్తన ఉత్పత్తి, అభివృద్ధి, మైక్రో ఇరిగేషన్‌, గ్రీన్‌హౌజ్‌, పాలీహౌజ్‌ కల్టివేషన్‌ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని తెలంగాణ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఈ విషయంలో కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. ఉద్యానవన విశ్వవిద్యాలయానికి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 75 కోట్లు కేంద్రం కేటాయించినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో ఇప్పటి దాకా రూ. 37.5 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయని, మిగతావి కూడా త్వరలో విడుదల చేయాలని కోరారు.

ములుగులో 1300 ఎకరాల్లో అద్భుతమైన మూడు సంస్థలు ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ సెంటర్లు ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతం తమిళనాడులోని మరో కోయంబత్తూరు కానుందని అన్నారు. అక్కడ ఎలాగైతే ఐఎఫ్‌ఎస్‌లు తయారవుతున్నారో ఇక్కడ నుంచి కూడా ఐఎఫ్‌ఎస్‌లు తయారై దేశవ్యాప్తంగా సేవలందించాలని సీఎం ఆకాంక్షించారు. దేశంలో ఫారెస్ట్‌ కళాశాలల సంఖ్య తక్కువని దక్షిణ భారతదేశంలో ఒకేఒక్క కళాశాల కోయం బత్తూరులో ఉందని, ప్రస్థుతం ఇండియన్‌ ఫారెస్టు సర్వీసులో పనిచేస్తున్న వందమంది అధికారులు ఆ కళాశాలకు చెందిన వారేనన్నారు. ఇప్పుడు ములుగులో ఏర్పాటు చేస్తున్న కళాశాల వల్ల భవిష్యత్తులో ఇక్కడి విద్యార్థులు కూడా ఇండియన్‌ ఫారెస్టు సర్వీసులో ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. దాదాపు రూ. 50 కోట్లతో కళాశాల ఏర్పాటు కానుందని సీఎం తెలిపారు. భవన నిర్మాణాలతో పాటు అటవీ, పండ్లు, వ్యవసాయంపై అద్భుతమైన ప్రయోగాలు జరుగుతాయని పేర్కొన్నారు.

అగ్రభాగంలో తెలంగాణ

కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనా కూడా ఉద్యాన ఉత్పత్తుల్లో ముందు వరసలో ఉందని ప్రశంసించారు. పసుపు, పండ్లు, కూరగాయల ఉత్పత్తులు పెంచితే రైతుల ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా బీహార్‌లోని చంపారన్‌లో రైతుల సమస్యలపైనే గాంధీ మహాత్ముడు తొలి పోరాటాన్ని జరిపాడని, ఇక్కడ ఉద్యాన విశ్వవిద్యాలయానికి తెలంగాణ గాంధీ కొండాలక్ష్మన్‌ బాపూజీ పేరు పెట్టడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేపట్టే ప్రతి పథకానికి కేంద్రం నుంచి సహాయ సహాకారాలు ఉంటాయన్నారు. మామిడి, అరటి, బొప్పాయి, జీడి, కొబ్బరి, దానిమ్మ తదితర ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానాన్ని ఆక్రమించిందన్నారు. మోడీ సర్కార్‌ రైతుల కోసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నదని, మార్చి 18 నాటికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న 500 మార్కెట్‌లను ఈ-కనెక్టివిటీ ద్వారా అను సంధానిస్తామని తెలిపారు. భూ ఆరోగ్య కార్డులను రైతులకు అందచేస్తామన్నారు. మాజీ ప్రధాని అటల్‌జీ సడక్‌ యోజన పథకం తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించారని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ప్రతి వ్యవసాయక్షేత్రానికి సాగునీరు అందించి అధిక దిగుబడుల నినాదంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లా డుతూ హైదరాబాద్‌కు చేరువలో ఉన్న ములుగును ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఎంపిక చేయడం వల్ల నగరానికి మరింత ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ఈ పరిశోధనా కేంద్రం తెలంగాణ రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, కరువుతో అల్లాడుతున్న తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర మంత్రి రాధామోహన్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. కరవు సాయం సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌, ఇతర ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Other Updates