ts21

ప్రపంచంలో గ్రీకు, బాబిలోనియా మొదలగు ప్రాచీననాగరికతలకంటె ఎంతో పూర్వం నుండి అనగా, ఐదారువేల సంవత్సరాలకు పూర్వమే భారతదేశం శాస్త్ర సాంకేతిక, శిల్ప, తత్త్వశాస్త్రాది రంగాల్లో అత్యంత ఉన్నత స్థానంలో ఉండినదన్నది జగమెరిగిన సత్యం. మన దేశంపై మొదట్లో సంపదను కొల్లగొట్టటానికి తర్వాత పరిపాలించటానికి ఎన్నో దురాక్రమణలు జరుగుతూ వచ్చినవి. మన సంస్కృతి సంప్రదాయాలను విజ్ఞానాన్ని వృత్తివిద్యలను అణగద్రొక్కి నశింపజేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ వచ్చినవి. ఐనా శాస్త్రవేత్తలు వ్యవసాయాది వృత్తినిష్ణాతులతో బాటు సామాన్యప్రజలు మనశాస్త్ర, సాంకేతిక, శిల్ప, తత్త్వశాస్త్రాదులనన్నిటిని కాపాడుతూ వచ్చినారు, కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సుప్రసిద్ధ చరిత్రకారుడు కోశాంబి వ్యవసాయాదిపద్ధతులు, ఇతరవృత్తులు వేదకాలం నుండి పాశ్చాత్యప్రభావం ప్రబలే దాకా ఎక్కువ మార్పులు లేకుండా కొనసాగినవని హేతుబద్ధంగా నిరూపించినారు.

స్వాతంత్య్రానికి ముందు తెలంగాణ నిజాం రాజుల పాలనలో నున్నది. వీరి పాలనలో అల్లోపతి, యూనాని వైద్య పద్ధతులకు ప్రభుత్వ ప్రోత్సాహమున్నా ఇక్కడి వైద్యులు తమ దేశీయ ఆయుర్వేద విజ్ఞానాన్ని, దానితోబాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నారు. నాల్గవ నిజాం కాలంలోనే పాశ్చాత్యవైద్యానికి తెలంగాణలో తెర లేచింది. క్రీ.శ.1846లో డాక్టర్‌ మాక్లిన్‌ వైద్యాధికారిగా గన్‌ఫౌండ్రీలో పాశ్చాత్యవైద్యానికి అంకురార్పణ జరిగింది. అంతకు ముందే 1811 లో యూనాని అడుగు పెట్టింది. మొఘల్‌పురా ప్రవేశద్వారం వద్ద ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వచ్చిన మౌల్వీ ఒకడు ఇస్లాం మతం మొదలగు వాటితో బాటు యూనాని వైద్యం కూడా బోధించేవాడు. వీటికి అధికారుల, పాలకుల అండదండలు ఉన్నందున పరోక్షంగా దేశీయ ఆయుర్వేదంపై చెడు ప్రభావం పడింది.

తర్వాత ఆరవ నిజాం (మహబూబ్‌ అలీఖాన్‌) కాలంలో మంత్రియైన నవాబ్‌ ఆస్మాన్‌జా బహద్దుర్‌ 1890లో యూనానికి ఆధికారిక ప్రతిపత్తి కలిగించినాడు. సదర్‌ షిఫాఖానా (ముఖ్యవైద్యశాల), హుసేనీఆలం, బేరూన్‌ బల్దా అని మూడు యూనాని వైద్యశాలలు ప్రారంభింపజేసి క్రమంగా వృద్ధిచేస్తూ 15 వేల నుండి 20 వేల రూపాయయల వరకు నిధులు కేటాయించటం జరిగింది.

చివరి ఏడవ నిజాం (ఉస్మాన్‌ అలీఖాన్‌) కాలంలో పాశ్చాత్యవైద్యానికి యూనానికి మరింత ప్రోత్సాహం లభించింది. ఇప్పటి ఉస్మానియా వైద్యశాలకు 1925లో శంకుస్థాపన జరుగగా, మక్కా మసీదు ఎదురుగా 150 పడకల యూనాని వైద్యశాలకు 1926లో శంకుస్థాపన జరిగింది.

ఈవిధంగా రాజధానిలో యూనాని అల్లోపతి అభివృద్ధి పొందుతున్నా జిల్లాల్లో గ్రామాల్లో ఆయుర్వేద వైద్యులే ప్రజల రోగాలను నయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుండేవారు. సంస్కృతంలోని చరకసంహిత, సుశ్రుతసంహిత మొదలగు గ్రంథాలను అందరు చదువకపోయినా బహుళప్రచారంలోనున్న బసవరాజీయం, వైద్యచింతామణి మరి కొన్ని తెలుగు పద్యాల వైద్యపుస్తకాలను అధ్యయనం చేసి ఆయుర్వేద సిద్ధాంతాలకు అనుగుణంగా మందులు తయారు చేస్తూ చికిత్స చేసే వారు. ఈ విధమైన వైద్య వృత్తి నైపుణ్యం అనాదిగా తెలంగాణలో విలసిల్లినదనటానికి ఆధారాలు లేకపోలేదు. వెలిగందలలోని (కరీంనగర్‌) రామగిరి ప్రభావవంతమైన ఓషధులకు

నిలయమై ఎందరినో ఆకర్షించేది. జైనవిద్యానిధియైన ఉగ్రాదిత్యాచార్యుడు కల్యాణకారకమనే ఆయుర్వేద గ్రంథాన్ని ఇక్కడే వ్రాసినట్లు తెలుస్తున్నది. పాలమూరు ( మహబూబ్‌నగర్‌ ) జిల్లాలోని పూడూరు శాసనంలో (క్రీ.శ.1088 ) హల్లకరసు అనే గొప్ప విద్వాంసుడు -భైషజ్యశాస్త్ర దానవినోద-అని కీర్తింపబడినాడు. అంటే వైద్యశాస్త్రాన్ని బోధించేవాడని తెలుస్తున్నది. అగ్గలయ్య అనే శస్త్రచికిత్సకుడు వైద్యరత్నాకరుడని, ప్రాణాచార్యుడని, నరవైద్యుడని చాళుక్య జయసింహుని క్రీ.శ. 1034 నాటి కొలనుపాక దగ్గరి శాసనంలో ప్రశంసింపబడినాడు. నరవైద్యుడని ప్రత్యేకించి చెప్పినందువల్ల, ఇతర ఆధారాలవల్ల, గజ, అశ్వ, పశువైద్యులు ప్రత్యేకంగా

ఉండేవారని తెలుస్తున్నది. ఇట్టివెన్నో ఉండి ఉంటాయి. అయితే విదేశీయుల దురాక్రమణలు దురాగతాలవల్ల చాలా ఆధారాలు నశించినవి. ఉన్నవి కూడ పరిశీలనకు, పరిశోధనకు నోచుకోలేదు.

అవిభక్త రాష్ట్రంలోనూ నిర్లక్ష్యానికి గురైన విషయం తెలంగాణ ఏర్పడిన ఈ కొద్ది కాలంలోనే బయటపడుతున్న మరుగున పడిన ఆధారాలు స్పష్ట పరుస్తున్నవి.

ఆయుర్వేద విద్వాంసులు వైద్యవృత్తితో బాటు గ్రంథరచన చేసినట్లు కూడ తెలుస్తున్నది. నిదాన చూడామణి, భిషగ్విజయము, మూలికాయోగములు, రసనిఘంటువు, శ్రీధన్వంతరి సంపూర్ణ వైద్య సారసంగ్రహము, ద్రవ్యరత్నావళి, దక్షిణామూర్తినిఘంటువు, నిఘంటుచూడామణి, చమత్కారనిఘంటువు మొదలగు ముద్రిత, అముద్రిత పుస్తకాలెన్నో ఉన్నవి.

సుల్తాన్‌ బజారునుండి వేదాల తిరుమల వేంకటరామానుజస్వామి సంపాదకత్వంలో వైద్యకళ అనే వైద్యమాసపత్రిక ప్రకటింపబడేది. వారణాసిిలోని జంగమవాడి మఠానికి అధిపతిగా నుండిన తెలంగాణ వీరశైవవిద్యానిధి చిదిరెమఠం వీరభద్రశర్మ సంపాదకత్వంలోని విభూతి మాసపత్రికలో కొన్ని ఆయుర్వేద పుస్తకాలసమీక్షలు ప్రకటింపబడినవి. 1950 ప్రాంతంలో సికింద్రాబాదు నుండి ప్రకటింపబడిన శబ్దార్థదీపిక అనే సాధారణ భాషా నిఘంటువులో రెండువేలకు పైగా ఓషధుల పేర్లున్నవి. ఇది వైద్యవృత్తి ప్రాధాన్యానికి, వారి పాండిత్యానికి ద్యోతకం. ఇంకా వెలుగుకు నోచుకోలేక వ్రాతప్రతుల రూపంలోనున్నవీ లుప్తమైపోయినవి ఎన్నో.

అన్ని జిల్లాలలో ఎన్నో ఆనువంశిక వైద్య కుటుంబాలు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేవి. విక్రాల, ముదిగొండ, ప్రతివాది భయంకర, మందుల, ఇస్తా, లోకా, వైద్యుల, విరివింటి, సురభి, మదునూరు, గంగాపురం, భాగవతం, వెల్లికంటి మొదలైనవి. అన్ని జిల్లాలనుండి ఈ వైద్యచారిత్రిక విశేషాలు సంగ్రహించి పదిల పరచవలసిన అవసరం ఉన్నది. లోకావారు షాద్‌నగర్‌ దగ్గరి వెలిజర్లలో గతశతాబ్దం ప్రారంభంలో ఉండేవారు. వీరి వద్దకు కర్ణాటక మున్నగు సుదూర ప్రాంతాలనుండి రోగులు చికిత్సకొరకు వచ్చేవారు. నేను సేకరించిన కొందరు వైద్యులు, వైద్యవంశాలు మచ్చుకు లోకా బాపు, లోకా లక్ష్మయ్య, ప్రతివాదిభయంకర శఠగోపాచార్యులు, ఇస్తా రాయుడు, భాగవతము సీతారామ శర్మ, మందుల శంకరయ్య, తెలకపల్లి జానమ్మ దొరసాని, విక్రాల, వైద్యుల శంకరయ్య, శ్రీపెరుంబుదూరు రాఘవాచార్య, వల్లికంటి రాఘవ సిద్ధాంతి, మదునూరి అంబాదాసు, గంగాపురం శేషమ్మ. నాయీ బ్రాహ్మణులు ఎందరో వ్రణాలకు చికిత్స చేసేవారు. పద్మశాలీలలో కూడ వైద్యం చేసే కుటుంబాలెన్నో ఉండేవి. ఇక విరిగిన ఎముకలు మొదలైన వాటిలో అల్లోపతికి సాధ్యంగాని వాటిని నయం చేయటం ఇప్పటికీ అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము. శ్రీశైలం, అలంపురం, నాగార్జునకొండ మున్నగు చోట్ల వైద్యంతో బాటు నీచలోహాలను బంగారంగా మార్చే రసవాదం, రసవిద్యకూడ బాగా ప్రచారంలో ఉండినవని చరిత్రకారుల అభిప్రాయం.

ఏడవ నిజాం కాలంలో అల్లోపతి యునాని బాగా బలపడుతుండటంతో ఆయుర్వేద వైద్యులలో కదలిక వచ్చింది. ఆయుర్వేదానికి గుర్తింపును తెచ్చి ఔన్నత్యాన్ని సంపాదించే ఉద్యమంలో మొదటివారు పండిత హరిగోవిందుగారు. వీరు ఉర్దూ, ఫారసీ,సంస్కృతాలలో నిష్ణాతులు. అటవీశాఖలో అధికారిగా చేరిన వీరు ఓషధులు, మూలికలు వాటి ఉపయోగాలపై అవగాహన కలిగి వైద్యంవైపు ఆకర్షితులై

ఉద్యోగాన్ని వదలుకున్నారు. ఆయుర్వేదాన్ని అభ్యసించి యునానీలోగూడ అవగాహన కలిగించుకున్నారు. 1911లో ప్లేగువ్యాధి తర్వాత ఇన్‌ఫ్లూయెంజా ప్రబలినపుడు వీరు చేసిన సేవకు ప్రభుత్వం నుండి ప్రజలనుండి ప్రశంసలు వెల్లువెత్తి రాజా కిషన్‌ ప్రసాదుకు వ్యక్తిగత వైద్యునిగా నియమింపబడినారు. తన జీవితాన్ని ఆయుర్వేదానికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అంకితం చేసి కొందరికి ఆయుర్వేదాన్ని ప్రయోగాత్మకంగా బోధించి, వారి ద్వారా ఆయుర్వేదానికి బహుళప్రచారం కలిగించి డెబ్బది ఐదవ ఏట జీవితాన్ని త్యజించినారు. వీరి శిష్యులలో హకీం నారాయణదాసు, హకీం రామరాజు, హకీం జనార్దన్‌ మున్నగు ముఖ్యులు వారి ఆదర్శాలను కొనసాగించినారు. కొంతకాలం తర్వాత తొమ్మండుగురు వైద్యులు కలిసి నిజాం ఆయుర్వేద వైద్యసంఘాన్ని స్థాపించి 1933 లో రిజిష్టరు చేయించి కార్యకలాపాలు సాగించినారు. ఆ తొమ్మండుగురు- 1. హకీం వైద్యభూషణ జనార్దన్‌ 2. హకీం శంకర్‌ ప్రసాద్‌ 3. హకీం పండిత రాధాకృష్ణ ద్వివేది

4. హకీం డి.రామరాజు 5. హకీం శతావధాని తిరుమల వేంకటరామానుజ స్వామి 6. హకీం ఎం. అనంత రంగాచారి 7. హకీం పి.రామదాసు

8. హకీం నరసింగ్‌ ప్రసాద్‌ 9. హకీం మార్కండేయులుts20

ఈ నిజాం ఆయుర్వేద వైద్యసంఘం ద్వారా ఒక ఆయుర్వేద వైద్య పాఠశాల, చికిత్సాలయము 1934 నవంబరు నెలలో కోఠీలో పూర్వం తాజ్‌మహల్‌ హోటల్‌ ఉన్న చోట అప్పటి ప్రిన్స్‌ ఆఫ్‌ బిరార్‌ ఆజంజా బహదుర్‌చే ప్రారంభింపబడింది. వీటికి మంత్రి కిషన్‌ ప్రసాద్‌ బహదూర్‌, కోత్వాల్‌ వేంకట్రామారెడ్డి మొదలగు వారి అండదండలు ఉండేవి. తర్వాత ప్రభుత్వం వీటి నిర్వహణకు నెలకు 200 రూపాయలు మంజూరు చేసింది. 1941 లో ప్రభుత్వం తన అధీనంలోకి తీసికొని నిర్వహించింది. ఈ సంస్థలకు హకీం జనార్దన్‌, హకీం వైద్యభూషణ రామరాజు, హకీం జగన్నాథం, హకీం కృష్ణమాచార్యులు ముఖ్యులు. చంద్రయ్య అనే వ్యక్తి మందులు తయారు చేసేవాడు. 1935 నుండి కళాశాలను ప్రారంభించినారు.

ఏడవ నిజాం పాలనలోని ఇంకొక విశేష సంఘటన సంచార ఆయుర్వేద వైద్యశాల ఏర్పాటు. ఇది మహంత్‌ బాబా పూరణదాస్‌జీ నివేదిక ఆధారంగా ఏర్పాటు చేయబడింది. 1930లో ప్రయాగ (అలహాబాద్‌)లో జరిగిన కుంభమేళాలో యాత్రికులకు ఈ సంచార ఆయుర్వేద వైద్యశాల ఎంతో సేవ చేసినట్లు తెలుస్తున్నది. హకీం పండిత రాధాకృష్ణ, హకీం రంగాచారి నేతృత్వంలో ఇది నిర్వహింపబడింది. ఆనాటి ప్రముఖులెందరో ఈ సంచార ఆయుర్వేద వైద్యశాలను దర్శించి ప్రశంసించినారు. దీనికి సంబంధించిన వివరాలు మహంత్‌ బాబా పూరణదాస్‌జీ 36 పుటల ఉర్దూ నివేదికలో సాలార్‌జంగ్‌ మ్యూజియం గ్రంథాలయంలో చూడవచ్చు.

పైన పేర్కొన్న ఆయుర్వేద చికిత్సాలయము, కళాశాల 1941లో ప్రభుత్వం అధీనంలోనికి వచ్చింది. ఇందులో ప్రారంభంలో వైద్యులు రాధాకృష్ణ, సుబ్బరాయశాస్త్రి, శ్రీరంగం సుబ్బారావు, పంచాంగం తిరువేంకటాచార్యులు మొదలైన వారు ఎంతో కృషి చేసినారు. తూర్పుబజారు నుండి చార్మినార్‌ దగ్గరి సర్దార్‌ మహల్‌కు, కిషన్‌ ప్రసాద్‌ దేవిడీకి ఇంకా కొన్ని చోట్లకు మారి చివరగా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలగా ఎఱ్ఱగడ్డలోని స్వంతభవనంలో ప్రస్తుతం ఉన్నది.

(జాతీయ భారతీయ వైద్య చరిత్ర సంస్థకు కృతజ్ఞతలతో)

ఢా.బాగవతం రామారావు

Other Updates