తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దుబాయి పారిశ్రామికవేత్తలు ఉత్సాహాన్ని చూపించారు. రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటి శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణలో పెట్టుబడుల కోసం దుబాయి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి డిసెంబర్ 14,15 తేదీల్లో జరిపిన పర్యటన విజయవంతమైంది. అక్కడి పారిశ్రామికవేత్తలను తెలంగాణలో పరిశ్రమల అనుమతుల కోసం రూపొందించిన టీపాస్ విధానం అబ్బురపరచింది. కొందరు పారిశ్రామికవేత్తలు వెంటనే తాము తెలంగాణలో వస్త్ర పరిశ్రమలు, ఆహార సంబంధ పరిశ్రమలు, మినరల్ ఆధారిత పరిశ్రమలు, బయో టెక్నాలజీ, జనరల్ ఇంజనీరింగ్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చారంటే మన పాలసీ వారిని ఎంతగా ఆకట్టుకుందో అర్దమవుతుంది. ఇదేకాకుండా ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లలో మౌలిక సదుపాయాల కల్పనా రంగాలు చేపడతామని పేర్కొన్నారు. డిసెంబర్ 14న కేటీఆర్ ఫిక్కీ, ఇండియన్ బిజినెస్ ప్రోఫెషనల్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇన్‌వెస్ట్ ఇన్ తెలంగాణ, షోకేసింగ్ ఇన్‌వెస్ట్‌మెంట్ అపార్చునిటీస్ ఇన్ పొటెన్షియల్ సెక్టార్స్ అనే అంశంపై దుబాయిలో నిర్వహించిన ఇన్‌వెస్టర్స్ మీట్‌లో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరిస్తు తాము పారదర్శకంగా పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
వ్యక్తిగత హామీ(సెల్ఫ్ డిక్లరేషన్)తోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే పాలసీని రూపొందించినట్లు వివరించారు. దీనికోసం వెబ్ ఆధారిత ఈ`హెల్ప్‌లైన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థ (టీఎస్‌ఐఐడిసి) అన్ని సేవలను నిర్ధిష్ట కాలవ్యవధి నిర్ణయించి పూర్తి చేస్తుందని తెలిపారు. దీనికోసం సిటిజన్ చార్టర్‌ను అమలుచేస్తున్నామని తెలిపారు. ఇదే కాకుండా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్`ఐపాస్), తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌పెన్యూర్ అడ్వాన్స్‌మెంట్ (టీ`ఐడియా), తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్టిజన్స్ రివైవల్ విత్ టెక్నాలజి(టీ`హార్ట్), తెలంగాణ స్టేట్ యాక్సిలరేటెడ్ ఎస్‌ఎస్‌ఐ స్కిల్స్ ట్రైనింగ్ (టీ`అసిస్ట్) తదితర పథకాల గురించి సమావేశంలో మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో 14రంగాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఏ దేశంలోను లేనంతగా భూమి పరిశ్రమల స్థాపనకు తెలంగాణాలో అందుబాటులో ఉందని ఆయన పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. చాలామంది పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడమే కాకుండా తమ ప్రణాళికలను కూడా కేటీఆర్‌కు వివరించారు.
మంత్రి కేటీఆర్ డిసెంబర్ 15వ తేదీన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిశారు. అందులో అంతర్జాతీయ కంపెనీ లులు ముఖ్యమైనది. ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్‌అలీతో ఆయన చర్చలు జరిపారు. టీఎస్`ఐపాస్ విధానాన్ని యూసుఫ్‌అలీకి సమగ్రంగా వివరించారు. లులు కంపెనీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఏడాదిలోపే రూ. 2500లకు పైగా పెట్టుబడులు పెడతామని లులు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
అనంతరం దుబయోటెక్ కాంప్లెక్స్‌ను కూడా మంత్రి కేటీఆర్ సందర్శించారు. ముచర్లలో నెలకొల్పే ఫార్మాసిటీని అదేస్థాయిలో నిర్మించాలని కేటీఆర్ నిర్ణయించారు. ఈ పర్యటనలో పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎం.డి. జయేష్‌రంజన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ కార్మికులను కలిసిన కేటీఆర్
పొట్టకూటికోసం దుబాయి వచ్చి అక్కడ కష్టాలనుభవిస్తున్న తెలంగాణ కార్మికులతో మంత్రి కేటీఆర్ డిసెంబరు 15న సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వలసలను పూర్తిస్థాయిలో నిరోధించడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణలోనే ఉపాధికల్పనకు కృషిచేస్తామ న్నారు. దీనికోసం త్వరలోనే సమగ్ర కార్యాచరణ రూపొంది స్తామని పేర్కొన్నారు. సోనాపూర్ క్యాంపులో ఆయన కార్మికులతో కలిసి కింద కూర్చుని వారిని ఆప్యాయంగా పలుకరించారు. జైళ్ళలో అక్రమంగా మగ్గిపోతున్న వారిని కూడా విడిపించడానికి ప్రయత్నిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.