dతెలంగాణకు బెంగాలీలలతో అనుబంధం ప్రాచీనమైంది. 18వ శతాబ్దానికి వస్తే ప్రఖ్యాత బెంగాలీ చరిత్రకారుడు రాయ్‌చౌదురి,విద్యావేత్త హైదరాబాద్‌లో ఆరంగాన్ని అభివృద్ధి చేసిన అఘోరనాథ్‌ చటోపాధ్యాయ,ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రజాజీవనంపై వేసిన ముద్రతో బెంగాల్‌ తెలంగాణ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలోనే నోబెల్‌ బహుమతి పొందిన తొలి భారతీయ మహాకవి రవీంద్రనాథ్‌ టాగూరుకు స్థానిక సమాజంతో అనుబంధమేర్పడిరది.ఇందుకు దాఖలా ఆయన వెల్లడిరచిన అభిప్రాయాలే, చేసిన రచనలే.

తెలంగాణను రెండు సార్లు సందర్శించిన రవీంద్రుడు

తెలంగాణ సమాజంతో రవీంద్రుని సంబంధం సాంస్కృతికమైంది. చరిత్రాత్మక మైంది. హైదరాబాద్‌ దక్కనీ సంస్కృతిపై గొప్ప కథ రాయడమే గాక రెండు కవితలు రాశారు. బహుషా దక్కన్‌ రాళ్ల గుట్టల సౌందర్యంపై తొలి కవిత రాసిన తొలి మహాకవులలో ఆయన ఒకరు. మరొక కవిత అర్పిత (సరెండర్‌) పేరుతో రాసి హైదరాబాద్‌ పొయెట్రీ సొసైటీకి సమర్పించారు. మరోరకంగా చెప్పాలంటే తన రచనలతో ఆయన ఇక్కడి సమాజానికి చిరపరిచితుడు. 1900లలో తన రచన లతో ఉర్దూ, తెలంగాణ తెలుగు కవులను ఎంతగానో ప్రభావితం చేసిన మహా రచయిత. ఆకాలాన ఆనాటి తెలంగాణకు పరి చయమైన ఉర్దూయేతర భారతీయ రచయితలలో
ఆయనే మొదటి వారు. హైదరాబాద్‌నగరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో 1861లో ఏర్పడిన తొలి ఆంగ్లో పర్షియన్‌ పాఠశాల (సిటీ హై స్కూల్‌ నేటి సిటీ కళాశాల) కు,నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ పదవిని చేపట్టి ఆనాటి తెలంగాణ వికాస ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ బెంగాలీ శాస్త్రవేత్త డాక్టర్‌ అఘోరనాథ్‌చటోపాధ్యాయకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. బ్రహ్మసమాజ మార్గానుయాయులైన వారు ఒకరకంగా పరస్పరం కుటుంబస్నేహితులు.పైగా వారిద్దరి మధ్య 1880ల నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ (ఆనాటికి హైదరాబాద్‌ రాష్ట్రం) రాష్ట్ర సందర్శన కొనసాగింది.ఆయన పర్యటన ఆనాటి తెలంగాణ, హైదరాబాద్‌ ప్రముఖుల సహా విద్యార్థులను, వ్యాపార ప్రముఖులను విశేషంగా ఆకట్టుకున్నది. ఇందుకు దాఖలా ఆయన పర్యటనకు ఆనాటి ప్రముఖ పత్రికలైన గోల్కొండ, క్రానికల్‌, రహబార్‌ ఏ దక్కన్‌లు ప్రచురించిన వార్తలే. మొత్తం హైదరాబాద్‌ నగరాన్ని రవీంద్రుడు గతశతాబ్దపు రెండు మూడు దశకాలలో రెండు సార్లు సందర్శించారు. ఆయన కలకత్తాలో స్థాపించిన శాంతినకేతన్‌కు నిధులు సేకరించడానికి ఇక్కడికి వచ్చారు. మొదటిసారి వచ్చింది 1928లో.దక్షిణాది పర్యటనలో భాగంగా రెండవసారి 1933, డిసెంబరు 12న ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. అప్పటికే హైదరాబాద్‌ నగరంపై రష్యన్‌ బోల్షివిక్‌ విప్లవ ప్రభావం, యూరో పియన్‌ అనార్కిస్టుల ప్రభావం పడిరది. జంటనగరాలలో అనేక సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సంస్థలు పుట్టుకొచ్చిన కాలమది.తెలంగాణసహా ఆనాటి దక్షిణ భారతదేశపు తెలుగు వారి రాకపోకలకు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం కేంద్రంగా రూపుదిద్దుకున్నది.. కోత్వాల్‌ వెంకట్రామారెడ్డి హాస్టల్‌ ఏర్పడి తెలంగాణ గ్రామీణ విద్యార్థుల రాకపోకలకు ఆవాసంగా మారింది..పెద్దలు సురవరం సంపాదకత్వంలో గోల్కొండ పత్రిక అర్థవార పత్రికను తెలంగాణ తెలుగు వారి వికాసం కోసం కోత్వాల్‌ వెంకట్రామారెడ్డి ప్రారంభించారు. ఆంధ్రమహాసభ, సాధన సాహితీ సమితి, అంజుమనే తరక్కీ పసంద్‌, ఆంధ్రమహిళా సభ, కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ అటూ ఇటుగా ఏర్పడ్డాయి. నిజాం జనకేంద్రం, గ్రంథాలయోద్యమం, స్వదేశీ లీగ్‌, భాగ్యరెడ్డివర్మ స్థాపించిన ఆదిహిందూ లీగ్‌ వంటి సంస్థలు చేపట్టిన సంస్కరణ కార్యకలాపాలు పూర్తిగా రాజకీయ, పౌరహక్కుల స్వభావాన్ని సంతరించుకున్నాయి.ఈ నేపథ్యం లో టాగూరు పర్యటన స్థానిక సాహి త్య, సాంస్కృతిక రంగాలకు స్ఫూర్తి దాయకంగా మారింది.

మొదటిసారి
హైదరాబాద్‌ నగరాన

ts1910లో మొదలైన దక్కన్‌ బ్రహ్మసమాజం కార్యకలాపాల ద్వారా రవీంద్రుని సాహిత్యంతో తెలంగాణకు, హైదరాబాద్‌కు పరిచయం ఏర్పడిరది. 1920వ దశకంలోనే ఆయన మహాకావ్యం గీతాంజలిని ఆదిపూడి సోమనాథరావు, ప్రసిద్ధ నవల పడవ మునక తెలుగులోకి ఒద్దిరాజు సోదరులు తర్జుమా చేయగా ఉర్దూలోకి ఆప్పుడే తర్జుమా జరిగిన ఆయన కవిత స్థానిక ఉర్దూ కవులను, మహాకవి, దక్కనీ భాషావేత్త అంజద్‌ హైదరాబాదీని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ క్రమంలో టాగూర్‌ 1928లో మొదటిసారి హైదరా బాద్‌ నగరాన్ని సంద ర్శించి స్వల్పకాలం ఇక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత కవికోకిల సరోజినీనాయుడు ఇల్లు గోల్డెన్‌ త్రెషోల్డ్‌ను సందర్శించారు. అప్పుడు ఆయనను కలిసినవారిలో ముస్లిం విద్యావేత్త, సంస్కర్త సుగ్రా హుమాయూన్‌ మీర్జా, మఖ్దూం మోహినుద్దీన్‌, రావి నారాయణ రెడ్డి ఉన్నారు. అక్కడే మఖ్దూం వేసిన ఒక నాటకాన్నిచూసి అబ్బుర పడిన టాగూరు ఆయనను శాంతినికేతన్‌కు వచ్చి చదువుకో వల్సిందిగా ఆహ్వానించారు. అప్పటికే రాజకీయ కార్యకలాపాలలో మునిగిపోయిన మఖ్దూంకు వీలు పడలేదు.అప్పుడే మునగాల రాజా నాయని వెంకట రంగారావు అతిథి గృహంలో స్వల్పకాలం బసచేసి కారణాంతరాలవల్ల వెంటనే తిరిగి వెల్లిపోయారు.

రెండవసారి

శాంతినికేతన్‌కు నిధుల సేకరణకై ఆయన 1933, డిసెం బర్‌ 14న ఆయన హైదరాబాద్‌ను సందర్శించారు. ఆయనతో పాటు బెంగాల్‌ గ్రామీణ వికాసం కోసం ప్రారంభమైన శ్రీనికేతన్‌ బాధ్యుడు కాళీమోహన్‌ ఘోష్‌ కూడా ఉన్నారు. ఇప్పటి నాంపల్లి రైల్వేస్టేషన్‌ (ఆనాడు హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌)కు ఆయన ఆరోజు ఉదయం చేరుకోగానే అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అక్కడ రవీంద్రునికి స్వాగతం చెప్పిన వారిలో ఉన్నతాధికారి లండన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హైదరాబాద్‌నుంచి ప్రాతినిథ్యం వహించిన సర్‌ అక్బర్‌ హైదరీ, ఉస్మానియా ట్రైనింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సయ్యద్‌ మిర్జా , ఈఈ స్పయిట్‌, సయ్యద్‌ మహ్మద్‌ మెహదీ, పద్మజా నాయుడు, లీలామణినాయుడు, ప్రఖ్యాత ఆంగ్ల కవయిత్రి ఇందిరా దన్‌రాజ్‌గిరి తండ్రి ధన్‌రాజ్‌ గిరి, వామన్‌ నాయక్‌ స్వాగతం పలికారు. అటు తర్వాత టౌన్‌ హాల్‌ ( నేటి అసెంబ్లీ) సమీపంలోగల గార్డెన్‌లో ఆయనకు ప్రభుత్వం పరంగా ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్‌ అక్బర్‌ హైదరీసహా ఆనాటి హైదరాబాద్‌ రాష్ట్ర ముస్లిం ప్రముఖులు, ఆనాటి నిజాం సలహా దారు కొత్వాల్‌ వెంకట్రామారెడ్డి, రాజ శ్యామరాజ బహుదుర్‌, న్యాయవాది ఆరుముద అయ్యంగారు, రాజబహుదుర్‌, గిరిరావు తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాగూరు స్థాపించిన శ్రీనికేతన్‌ బాధ్యుడు కాళీ మోహన్‌ ఘోష్‌ కొత్వాల్‌ వెంకట్రామా రెడ్డితో వెళ్లి మెదక్‌జిల్లాలోని గ్రామాలను సందర్శించారు. ఆనాటి హైదరా బాద్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మ కంగా కొన్ని గ్రామాలలో విద్యుదీకరణ చేపట్టింది. దానిని చూడడానికి వారు ఆ గ్రామాలకు వెళ్లారు.

మరుసటిరోజు టాగూరుతో నగర పౌరుల పరిచయ కార్యక్ర మం జరిగింది. ఇప్పటి అసెంబ్లీహాలు (అప్పటి టౌనుహాలు)లో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సర్‌ మహారాజ కిషన్‌ ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. 16వ తేదీడిసెంబరు ఉదయం నిజాం కాలేజిని సందర్శించారు. ఆయనకు అక్కడ సర్‌ అక్బర్‌ హైదరి ఘనస్వాగతం పలికారు. నిజాం కళాశాలలోని సాలార్జంగ్‌ హాలులో ఆరున్నర గంటలకు జరిగిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈసమావేశంలో పాల్గొన్నవారిలో ఈనాటి తెలంగాణ ప్రముఖులు మఖ్దూం మొహినుద్దీన్‌,రావి నారాయణ రెడ్డి, ఏగురువారెడ్డి, కాళోజీ నారాయణ రావు, ఎమ్మెస్‌ రాజలింగం సహా రెడ్డి హాస్టల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.ఈ విషయాలను ఎమ్మెస్‌ రాజలింగం, ఏగురువారెడ్డి, కాళోజీకి సన్నిహితుడు విఆర్‌ విద్యార్థి స్వయంగా నాకు వెల్లడిరచారు. ఈ సమావేశంలో తాను కూడా పాల్గొన్నట్టు ఆనాటి నిజాం కాలేజీ విద్యార్థి 96 ఏళ్ల వృద్ధుడు ఎం.బి. గౌతమ్‌ వెల్లడిరచారు. ఉపన్యాసం గురించి తెలిసి నిజాం ఒక ప్రతిని తెప్పించుకుని చదివారు. అది నచ్చి టాగూరును తన దర్భారుకు ఆహ్వానించారు. ఈ సమావేశం తరువాత మరో లక్ష విశ్వభారతికి విరాళంగా ప్రకటించారు. డిసెంబరు 14న టాగూరు గౌరవార్థం కిషన్‌ప్రసాద్‌ విందు ఏర్పాటు చేశారు. ఇందులో అప్పటి బ్రిటిషు రెసిడెంటు ఆయన సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్‌ పొయెట్రీ సొసైటీ సమావేశంలో టాగూరు పాల్గొన్నారు.ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సరెండర్‌ పేరుతో ఒక కవిత రాసి పోయెట్రీ సొసైటీకి బహుకరించాడు. గొప్పగాయకుడైన ఆయన అనేక పాటలు పాడారు.. కిషన్‌ప్రసాద్‌ గజల్స్‌ వినిపించారు. ఈ సమావేశంలో సరోజినీనాయుడు, నగరానికి చెందిన ప్రఖ్యాత ఇంగ్లీషు కవి నిజామత్‌జంగ్‌ పాల్గొన్నారు. 15వ తేదీన అక్బర్‌ హైదరీ తన నివాసగృహంలో లంచ్‌ ఏర్పాటు చేశారు.ఇంతేకాకుండా పోయెట్రీ సోసైటీ గౌరవ సభ్యత్వం తీసుకున్నారు.

శాంతినికేతన్‌కు భారీ విరాళాన్ని ఇచ్చిన
నిజాం పాలకుడు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌

ఆనాటి వలస పాలనకాలంలో దేశంలో గల అనేక విశ్వవిద్యాల యాలకు మద్ధతుగా ఆర్థికంగా భారీ ఎత్తున విరాళాలు నిజాం అందజేసినట్టే శాంతినికేతన్‌ నిర్మాణానికి కూడా ఇచ్చారు. 1928లో మొదటి సారి రవీంద్రుడు హైదరాబాద్‌ నగరాన్ని సందర్శించారు. ఆసందర్భంగా నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఒక లక్ష రూపాయలను, రెండవ సారి 1933 డిసెంబర్‌ నెలలో సందర్శించినప్పుడు రెండులక్షల రూపాయ లిచ్చి ఇస్లామిక్‌ స్టడీస్‌కు సంబంధించిన పీఠాన్ని ఏర్పాటు చేయవలిసిందిగా ప్రత్యేకంగా కోరారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంతో…

telటాగూరుకి అలనాటి హైదరాబాద్‌ విద్యావేత్తలతో సత్సంబంధాలున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన సందర్భంగా టాగూర్‌ను అప్పటి హైదరాబాద్‌ ప్రభుత్వం సంప్రదించింది. 1918లో ఇంగ్లీషును కాదని భారతీయ భాషైన ఉర్దూ మాద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపితమైంది. ఆ నిర్ణయాన్ని హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ తొలినాళ్లలోనే టాగూరు లేఖ రాశారు. అందులో ఆయన అప్పటి హైదరాబాద్‌ ప్రధాని సర్‌ అక్బర్‌ హైదరి ప్రయత్నాలను కొనియాడారు. కొత్తగా స్థాపించే విశ్వవిద్యాలయంలో ఏదైనా ఒక దేశభాషలో ఆధునిక విద్య నేర్పాలని సూచించారు. భారతీయ భాషలలో విద్యార్థులు చదువుకోకపోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టాగూరు సలహా వల్లే భారతదేశ భాషలో ఆధునిక చదువు చెప్పిన తొలి విశ్వవిద్యా లయంగా ఉస్మానియా ప్రఖ్యాతి గాంచింది. ఇప్పుడున్న ఆడిటోరియానికి టాగూరు పేరు పెట్టడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం.

పౌరసన్మానం

రెండవ సందర్శనను పురస్కరించుకుని హైదరాబాదు నగరంలో పౌర సన్మానం ఏర్పాటయింది. ఆ తరువాత సికిందరాబాద్‌లోని టివోలి థియేటర్‌లో పౌరసమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశం సికింద్రాబాద్‌ పౌరులను బాగా ఆకట్టుకున్నది. ఆయన మాట్లాడిన సభ ప్రముఖులతోపాటు సామాన్య ప్రజలతో కిక్కిరిసిపోయింది. విశ్వభారతికి ఆర్థిక సహాయం చేయడానికి టికెట్లు పెట్టారు. ఆరోజు టాగూరు ఇచ్చిన ఉపన్యాసం పేరు ‘‘ఐడియాస్‌ ఆఫ్‌ ఏన్‌ ఈస్టర్న్‌ యునివర్సిటీ. ఆయన పాల్గొన్న ప్రతిసమావేశంలో విశ్వభారతి ఆదర్శాలను ఆచరణలో పెట్టడానికి ఉదారంగా సహాయం చేయ వలసిందిగా విన్నతించారు.వాటిని సేకరించడానికి రావుబహుదూర్‌ పద్మారావు మొదిలియార్‌ ఆధ్వర్యాన ఒక కమిటీ ఏర్పడిరది. ఇది మొదలు ఆయన హైదరాబాద్‌లోని అనేక మంది ప్రముఖుల ఇళ్లను, కళాశాలలను సందర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌కళాశాలతోపాటు, సిటీ కళాశాల, సికింద్రా బాద్‌లోని మహబూబియా కళాశాలను ఆయన సందర్శించిన వాటిలో ఉన్నాయి. రాజా ధన్‌రాజ్‌గిరిజీ, మహా రాజ శివరాజ బహుదుర్‌ ఇళ్లను కూడా సందర్శించారు. ఆయన మహబూబ్‌కళాశాల సందర్శన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ ప్రముఖులైన సామల వెంకటరెడ్డి, ముత్యాల వెంకటరంగయ్య, డాక్టర్‌ లక్ష్మీనర్సు, ఫతుల్లాఖాన్‌ తదితరులు పాల్గొనగా లక్ష్మయ్య అనేవిద్యార్థి ఆయన చిత్రపటాన్ని గీసి బహుకరించారు. సరోజినీ నాయుడు భర్త మేజర్‌ డాక్టర్‌ ఎంజీ నాయుడు, ఆమె మార్తె పద్మజానాయుడు తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాదీల సహాయం..

మొత్తం టాగూరు పర్యటనలో విశ్వభారతికి ఉదారంగా సహాయం చేసిన వారిలో ఆనాటి తెలంగాణ, హైదరాబాద్‌ ప్రముఖులు అనేక మంది ఉన్నారు.ఇంతేకాదు నాయని వెంకటరంగారావు గురించి ఇక్కడ కొంత మాట్లాడుకోవాలి. ఆయన వరంగల్‌జిల్లా తొర్రూరులో జన్మించి మునగాల సంస్థానానికి దత్తత వెళ్లారు. మునగాల సంస్థానానికి చెందిన గ్రామాలు ఆనాటి హైదరాబాద్‌ రాష్ట్రంలో,మరి కొన్ని గ్రామాలు బ్రిటీషు ఇండియాలో ఉండేవి. ఆయనకు అటు బ్రిటీషు పాలకులకు, ఇటు నిజాం పాలకులకు దగ్గరి సంబంధాలు ఉండేవి ఆయన కార్యకలాపాలకు ప్రధాన వేదిక హైదరాబాద్‌ నగరమే. 1906లో బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమంలో పాల్గొన్న నాయని వారికి టాగూరుతో ప్రత్యక్ష సంబంధాలుండేవి. ఆయన అటు ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రంలో గల అనేక సంస్థలకు ఆయన ధన సహాయం చేసినట్టుగానే శాంతి నికేతన్‌కు ధన సహాయం చేశారు. సొమ్ముతో సహా వివరాలు : రాజా దన్‌రాజ్‌గిరి`15,000, మార్వాడి సమితి ` 1,750, సికిందరాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ` 1,000, టీచర్స్‌ అసోసియేషన్‌ ` 1,000, పబ్లిక్‌ ఆఫ్‌ సికిందరాబాద్‌ ` 750.

భారతదేశ సాంసృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన రవీంద్రుడు 81 ఏళ్ల వయస్సు లో 1941 ఆగస్టు 1న కాలం చేయడంతో ఆనాటి హైదరాబాద్‌,తెలంగాణ సమాజం శోకసముద్రంలో మునిగి పోయింది. అనేక సంతాప సభలు జరిగాయి.ఆనాటి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రత్యేకంగా నివాళి అర్పించి తనను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాటి లేడీ హైదరీ క్లబ్‌లో సంతాప సభ జరిగింది ఆనాటి ఆసభలో ప్రిన్సెస్‌ నీలోఫర్‌తోపాటు, వనపర్తిరాణి కుముదునీ దేవి సహా స్థానిక మహిళా ప్రముఖులు పొల్గొన్నారు.

Other Updates