స్వచ్ఛ భారత్‌లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించినందుకు గాను జాతీయ స్వచ్ఛ విద్యాలయం 2016 పురస్కారాలకు తెలంగాణ రాష్ట్రంలో 14 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 172 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. 2016-17 విద్యా సంవత్సరంలో వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి అంశాల్లో చర్యలు చేపట్టినందుకుగాను రాష్ట్ర స్థాయిలో 40 పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయపురస్కారానికి విద్యాశాఖ ఎంపిక చేసింది. వీటిని సర్వశిక్ష అభియాన్‌ అధికారులు మానవ వనరులశాఖకు పంపించారు. వీటిలో జాతీయస్థాయికి 14 పాఠశాలలను మానవ వనరుల అభివృద్ధిశాఖ ఎంపిక చేసింది. ఎంపికైన పాఠశాలకు రూ.50 వేల చొప్పున నగదు బహుమతి అందజేయనుంది. సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితోపాటు, సర్టిఫికెట్లను ఇవ్వనున్నట్లు సర్వశిక్షా అభియాన్‌ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ప్రత్యేక అవార్డులకు ఎంపికయ్యాయని చెప్పారు. ఆయా పాఠశాలలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభినందనలు తెలిపారు.

పురస్కారానికి ఎంపికైన పాఠశాలలు ఇవే…

ఆదిలాబాద్‌ జిల్లాలో యూపీఎస్‌ బండల్‌ నాగపూర్‌, మంచిర్యాల జిల్లాలో సాంఘీక సంక్షేమ బాలుర పాఠశాల బెల్లంపల్లి, జగిత్యాల జిల్లా నుంచి జెడ్పీహెచ్‌ఎస్‌ అంబారీపేట, కరీంనగర్‌ జిల్లాలో టీఎస్‌ఎంఎస్‌ గంగాధర, ఎంపీయూపీఎస్‌ కొత్తపల్లి (పీఎన్‌), సిద్ధిపేట జిల్లాలో ఎంపీయూపీఎస్‌ ఇబ్రహీంపూర్‌, వికారాబాద్‌ జిల్లాలో ఎంపీపీఎస్‌ బుద్ధారం, మహబూబ్‌నగర్‌ ఎంపీపీఎస్‌ చౌటగడ్డతండ, సూర్యాపేట జిల్లాలోజెడ్పీహెచ్‌ఎస్‌ అనంతారం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోజెడ్పీహెచ్‌ఎస్‌ తిమ్మాపేట్‌, ఖమ్మం జిల్లాలో టీఎస్‌ఎంఎస్‌ కారేపల్లి, ఎంపీపీఎస్‌ మల్లారం, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ సింగారెడ్డి పాలెం, ఎంపీయూపీఎస్‌ గండగలపాడు పాఠశాలలు ఉన్నాయి.

Other Updates