ఛందోబద్ధముగా మదీయము మనస్తాపంబు నీ ముందు నీ
చందానన్‌ వెలికుచ్చెగాని, కవితా సౌందర్యమున్‌ జూపి నీ
డెందంబున్‌ హరియించు పూన్కి యని పాటింపంగ రా దిందిరా
నందాలంబన! నీకు నామినుకు లెంతల్‌! వేణుగోపాలకా!

అంటూ ఎటువంటి భేషజాలు, అహంకారాలు లేకుండా తన ఆర్తిని ఛందోమయం చేసి గొప్పగా చెప్పిన తెలంగాణా తాత్త్విక కవి గార్లపాటి రాఘవరెడ్డి. ప్రచారం పై నిరాసక్తత, కీర్తి కండూతి లేని వ్యక్త్తిత్వం, నిత్యం సత్యాన్వేషణాసక్తత రాఘవరెడ్డిని ఒక గొప్ప తాత్త్విక కవిగా నిలిపింది. విస్తృత సాహిత్యాధ్యయనం, తెలుగులో మాత్రమేగాక హిందీ వంటి ఇతరత్రా భాషాసాహిత్యాలతో గాఢమైన పరిచయం వారిలోని పరిణత ప్రజ్ఞకు కారణమై నిలిచాయి.

‘అయ్యగారు’గా అందరితో సంభావింపబడే రెడ్డి తొలిరోజుల్లో చిత్రవిచిత్ర, కాకతీయ వంటి పత్రికల్లో తమరచనల్ని ప్రచురించారు. వారిపై హిందీ కవయిత్రి ‘మహాదేవి వర్మ’ ప్రభావం ఉంది. హిందీలోని ‘మార్మిక ఛాయావాద” ప్రభావం కూడా వారిపై ఉన్నది. 1940-1950ల మధ్యలో ‘కాకతీయ’ పత్రికల్లో వారి రచనలు చాలా వచ్చాయి. నాటి పత్రికల ద్వారా వారు కవితలే గాక, కథలు, వచనం వంటివీ సమాంతరంగా తమ రచనల్ని వెలువరించారు. కవితలు కూడా పద్యం, గేయం వంటి రూపాల్లో రచించారు.

అపురూప ప్రతిభా సమన్వితులైన గార్లపాటి రాఘవ రెడ్డి అనాసక్తత కారణం, తమ రచనలను కేవలం పత్రికలకే పరిమితం చేశారు తప్ప, ప్రత్యేక గ్రంథాలుగా అందించలేదు. వారి రచనలపై అమితాసక్తి కలిగిన ఆత్మీయ మిత్రులైన పి.వి. నరసింహారావు, ఇటిక్యాల మధుసూధన రావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, చెలమచర్ల రంగాచార్యులు, బిరుదరాజు రామరాజు, కాళోజీ సోదర కవులు పూనుకొని 1962 జూలైలో వారి షష్టిపూర్తి సందర్భంగా ”గార్లపాటి రచనలు” పేర కొన్ని వారి రచనలను సేకరించి ప్రత్యేక గ్రంథంగా ముద్రించారు. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య దానికి విలువైన పీఠికను సంతరించారు. కాళోజీ నారాయణ రావు గురువుగా సంభావించే ఏకైక వ్యక్తియైన గార్లపాటి రచనలలో సావిత్రి (ఖండకావ్యం) రతి విలాపం (ఖండకావ్యం), గోపికా వల్లభ (అసంపూర్ణ శతకము), పరిదేవనము (శతకం) ఇందులో పొందుపరుచబడి ఉన్నాయి.

సావిత్రి ఖండకావ్యానికి భారతం మూలం. ఇది ఒక లఘు కావ్యం. 46 పద్యాలకే పరిమితమైన ఈ కావ్యంలో భావ కవిత్వ ధోరణులు విస్తృతంగా దర్శనమిస్తాయి. సావిత్రి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది ఆమె స్థిత ప్రజ్ఞత కలిగిన గొప్పనాయికగా రెెడ్డి చిత్రించారు. వినూత్న ధోరణిలో కొనసాగిన ఈ ఖండిక నాటకీయ శైలిలో నడిచింది. ఆమె సంభాషణలే ఆమె స్థిరచిత్తతకు ప్రమాణాలుగా కనిపిస్తాయి. శీలవంతుడైన భాగస్వామిని ఎన్నుకోవడంలో స్త్రీకి స్వాతంత్య్రం ఉండాలన్న సందేశాన్ని రెడ్డి ఈ పాత్ర ద్వారా అందించారు. నారదుని ముఖతః సత్యవంతుడు అల్పాయుష్కుడని తెలిసినా సావిత్రి అతనినే వివాహమాడతానన్న ఆమెలోని ధీరత్వం, ఆమెతత్త్వం యమునితో ఆమె చేసిన సంవాదం ద్వారా గుర్తించగలం. ప్రేమించిన వానితో ఎన్నికష్టాలనైనా ఎట్టి బాధలనైనా ఎదుర్కొనవచ్చునన్న భావాన్ని ఈ ఖండిక తెలుపుతున్నది. ఆమె వాదనలో ఎంతటి తర్కం ఉందో ఈ చిన్న పద్యమే తెలుపుతున్నది.

అడిగినది తప్ప నింకేమియైన నిత్తు
ననుట, మిముబోంట్లకిది ధర్మమగునె? తండ్రి !
దప్పి గొనువాడు శీతలోదకము గాక
ఘృతము గోరునే? దాన సంతృప్తి గనునె?

మృత్యువునైనా ఎదిరించి నిలిచే శక్తి స్త్రీలకుందన్న నిజాన్ని ఈ కవిత నిరూపించిందన్న రీతిలో సావిత్రిని చిత్రించి రెడ్డి చక్కని ఖండకావ్యాన్ని మనకందించారు.
గార్లపాటి రచించిన మరో ఖండకావ్యం ‘రతివిలాపం’. ఇది కూడా సావిత్రి వలెనే పూర్వ రచనల్లో నుండి కథను గ్రహించి కేవలం 45 పద్యాల్లో రచించిన లఘు పద్య కావ్యమే. రతీ మన్మథుల కథ సుప్రసిద్ధమైనది. శివుని కంటి మంటలో మన్మథుడు దహింపబడిన తర్వాత రతీదేవి విలపించే ఈ కథలో రెడ్డి ఇందులో కొన్ని విశేషాలు చెప్పే ప్రయత్నం చేశారు. శివుడు ప్రత్యక్షమై రతీదేవికి దుఃఖోపశమనం చేసే యత్నమే ఇందులో ప్రధానాంశం. ఈ కావ్యం చదివిన పిదప కవి కేవలం దీనికొరకే ఇది రచించారేమోనన్నంతగా పద్యరచన కొనసాగింది. ఇందులో చాలా పద్యాల్లో రతీదేవితోనే పరమేశ్వరుని ఔన్నత్యాన్ని చెప్పిస్తూనే, అంతటి వానిలోనూ కోపం, ప్రేమ వంటి సాధారణ విషయాలు తగవు అని కూడా చెప్పించడం రెడ్డి అంతరంగానికి తార్కాణం. అంతటితో ఆగక తపస్సు చేసుకునే వారికి దృఢచిత్తం ఉండాలి కాని ఈ విధమైన ద్వేషాది భావాలకు లోనుకారాదని కూడా పలికించారు. చిత్రించిన ప్రతి సన్నివేశమూ రసభరితమై నిలిచిన ఈ కావ్యంలోనూ భర్తకు దూరమైన భార్య దుఃఖం గురించే చెప్పే యత్నం చేశారు గార్లపాటి. రతీదేవి తాను తన భర్తతో బాటు మరణిస్తానని కూడా చెప్పించడం కవికి స్త్రీల దుఃఖం పట్లనున్న సానుభూతిని తెలియజేస్తున్నది. కావ్యం చిన్నదే అయినా ప్రతి పద్యంలోనూ రసావిష్కరణ జరగడం ఈ ఖండకావ్యానికి ఒక ప్రత్యేకతను తెచ్చి పెట్టింది.

క్రమ క్రమంగా గార్లపాటి హృదయం తాత్త్విక భావాల దిశగా ప్రస్థానం ప్రారంభించింది. 77 పద్యాల అసంపూర్ణ శతకం ‘గోపికావల్లభా’లో వారి అంతరంగంలోని భావాలు మనకు పూర్తిగా అవగతమవుతాయి. తన మనసులోని విషయం స్వామికి విన్నవించే క్రమంలో

ఎటులో వ్రాసితి నీయసంపూర్ణ శతకం బెన్నేనియున్‌ దప్పులుం
డుట సామాన్యమే, బాలభాషితములందున్‌ తప్పులే తండ్రులే
రుట యన్‌ చూడముగాన దీని గురుకారుణ్యమునన్‌ స్వీకరిం
చుట యోగ్యంబగు, దాన నీ యశము హెచ్చున్‌ గోపికావల్లభా

అంటూ తన రచనలో దోషాలు వెతకొద్దంటూ, దానివల్ల స్వామికే కీర్తి లభిస్తుందంటూ ఒక గడుసుమాట చెప్పడం రెడ్డి ప్రతిభకు నిదర్శనం. తన శతకం అసంపూర్ణం కావడానికి కూడా కారణాన్ని చెప్పుకొన్న గార్లపాటి చదువరులే తన రచనల గుణ దోష నిర్ణేతలుగా భావించాడు. వారి అధ్యయనం అపారం. తాము చదివిన అనేక గ్రంథాలలోని భావాలు ఈ రచనలో పలుచోట్ల చోటు చేసుకున్నాయి. శంకరభగవత్పాదుల వారి ”బాలస్తావత్‌ క్రీడా సక్తః…” అన్న శ్లోకభావం స్ఫురించే రీతిలో

బాల్యంబాటల తోడనేగు దరుణీ వ్యాసక్తి దారుణ్య శై
థిల్యంబొందును, వార్థకంబు బహుళార్తిన్‌ జిక్కి జీర్ణించు గై
వల్యాధీశ్వరు నిన్నుగొల్చి నరుడే ప్రాయమ్మునన్‌ ముక్త లై
కల్యుండౌనొ తలంపజాల! జలదాంగా! గోపికావల్లభా

అంటూ పద్యం చెప్పారు. అంతేకాదు బ్రహ్మరుద్రాదులకైనా ఆ పరమేశ్వర తత్త్వము అంత సులభంగా బోధపడదంటూ

క్షణ పూర్వస్థిత రూపమిప్పుడుగనంగా రాక యీ యుత్తర
క్షణమందీగతి దాల్చునంచు దెలియంగా రాక యెందున్‌ క్షణ
క్షణ నూత్నాకృతి బొల్చునీగతి రహస్య ప్రౌఢి వందారు ర
క్షణ బ్రహ్మాదులెఱుంగ లేరు పరమేశా! గోపికావల్లభా!

అని చెప్పడం పరమేశ్వర తత్త్వం క్షణ క్షణ నూత్నత్వం కలిగిన మహాశక్తిగా గుర్తించి స్తుతించడమే నన్నది కవి భావన. భగవంతుడు కోర్కెలు తీర్చువాడేకదా! అని వరుస కోరికలతో స్వామిని బాధించనంటూ ”ధనమిమ్మంచున బాధ పెట్టను…” అని చెబుతూ స్వామి సాక్షాత్కారమే వేయిరెట్లు గొప్పదన్న విషయం ప్రకటించడమే గాక, దానిముందు అధికారం, ధనం వంటివి అల్ప విషయాలేనని స్పష్టపరచారు గార్లపాటి. అంతేకాక స్వామితో సన్నిహిత సంబంధాలున్న బ్రహ్మ, ఆదిశేషుడు, చంద్రుడు, గరుడుడు వారంతా ఒక్కొక్కరూ ఒక్కో విషయంలో నిష్ణాతులు, అటువంటి మహామహులతో కలిసి వెలిగే స్వామికి రసహీనమైన నా పద్యాలు నచ్చుతాయో లేదోనని వినయంగా విన్నవించారు. అందుకే…

కవితల్‌ వ్రాయుట దొడ్డయన్‌ తలపు చేకాదర్థ మర్జింపగా
దు, విశేషంబగు కీర్తికాసపడి యెందున్‌ గోరలేదింత శై
శవ మాదిన్‌ గొనలెత్తి చిత్తమున కాంక్షల్‌, గానగారాదు హే
తువు – నీవే కలిగించినావని దలంతున్‌ గోపికా వల్లభా !

అంటూ తమలోని నిర్మమకారత్వాన్ని తెలియజేస్తూ స్వామిని వేడుకోవడం ఇందులో కనిపిస్తున్నది. పద్యాన్ని పండించి పంచిన యీ శతకం మనిషిలోని పరిణతికి దర్పణంగా నిలుస్తుందనడంలో ఎట్టి సందేహానికీ ఆస్కారం లేదు. గార్లపాటి రాఘవరెడ్డి రచనలలో శిఖరాయమాన మైనది. వారి హృదయ తత్త్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించినది ”పరిదేవనము”గా ప్రసిద్ధికెక్కిన వేణుగోపాల శతకము. ఇది వారి సంపూర్ణ మానసిక పరిణతికి ప్రతీక. ఈ శతకంలోని ప్రతి పద్యమూ వారి మానసిక పరిపక్వతను తెలిపే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇంతేలా ఇక నేను నీవగుమునీవేనై చిదానందనై
రం తర్యాకృతి సర్వమంగళ కర ప్రారంభ సంరంభ సం
క్రాంత స్వాంతుడనై ప్రపంచము సుఖాక్రాంతంబు ప్రోద్యత్కశా
వంతంబున్‌ బొనరింతు విశ్వమయరూపా! వేణుగోపాలకా

అన్న పద్యం గమనిస్తే వారు స్వామి తాదాత్మ్యతా భావంలో ఎంతగా మునిగిపోయారో అర్థమవుతుంది.
ఈ రచనలో భాగవతచ్ఛాయలున్న పద్యాలు చాలా కనిపిస్తాయి. జీవునికి దేవునికి అద్వైత భావం ఉన్న కారణంగా మనిషిని ఆ స్వామికి సమీపంగా తీసుకువెళ్ళిన తీరులో సాగిన శతకం కనుకనే ”నాకీ లోకము భిన్నమా? మఱి యభిన్నంబా?” అన్న విచికత్సకు చోటు కల్పించింది. ”బలి సామ్రాజ్యము వజ్రికిచ్చితివి, మున్‌ పాంచాలి కై గోపకాంతల పుట్టంబులు కొల్లగొట్టితివి” అంటూ భగ వల్లీలలోని చిత్రాతి చిత్రాలను చూపించారు. అంతేకాదు, ఎవరిని స్వామి ఎప్పుడు ఎలా రక్షిస్తాడో, అనుగ్రహిస్తాడో, ఏ ఆపన్నుడు ఎప్పుడు ఎందుకు స్వామికృపకు పాత్రుడ వుతాడో కూడా తెలియదని వ్యక్తపరిచాడు. ఈ సృష్టి స్వామి చిద్విలాసాలలో ఒకటి. అందుకే ”సృజియింపన్‌ బని యేమి లోకమెవడర్ధించెన్‌ నినున్‌, చిద్విలాన! జన్మమృత్యు జరారుజాది దురవస్థా గుంఠితంబు…” అంటూ ఆ స్వామినే నిలదీస్తాడు. అయితే స్వామి సృష్టించిన యీ విశ్వరహస్యం తెలుసుకోవాలంటే మాత్రం మనిషి తొలుత తనను తాను తెలుసుకోవాలన్న భావాన్ని రెడ్డి వెలిబు చ్చారు. దానివల్లనే మనిషి స్వీయౌన్నత్యాన్ని సాధించి స్వామికి సమీపస్థుడౌతాడని నిశ్చయంగా చెప్పి ఒప్పించారు.

విశ్వనాథ సత్యనారాయణ వంటి మహాకవుల ప్రశంసలనందుకోగలిగిన స్థాయి కల గార్లపాటి రాఘవరెడ్డి విలక్షణ శైలి, పద్యనిర్మాణ దక్షత, లోతైన అవగాహనా శక్తి, అపూర్వ భావ ప్రకటనా సమర్ధత, ఆత్మనివేదనాత్మక దృక్పథం, నిర్మమకారమైన వ్యక్తిత్వం వారినొక విశిష్ట వ్యక్తిగా నిలబెట్టాయి.

జీవితమంతా ఆత్మాన్వేషణలో గడిపిన రెడ్డి 1966లో కాలధర్మం చెందే వరకూ అతి నిరాడంబర జీవితం గడిపిన ఆదర్శ తాత్త్విక కవిగా కీర్తిగడించారు.
గన్నమరాజు గిరిజా మనోహర్‌ బాబు

Other Updates