భాగవతమ్ములో భక్తి చిందించిన
పోతన్స వెలసిన పుణ్యభూమి
దుష్టులన్ యుద్ధాన దునిమిన రాణి రు
ద్రమ దేవి యేలిన రాజభూమి
రాజనీతిజ్ఞుడై రాణకెక్కిన యుగం
ధరుడు జన్మించిన ధర్మభూమి
శిల్పకళా తపస్వి యనెడు పేర్గొన్న
రామప్ప నెగడిన రమ్యభూమి
యిన్ని ఔన్నత్య సంపదలకిక్కయైన
యీ తెలంగాణ భూమితో నేవిసాటి?
కనుక భయమేల సోదరా! కంఠమెత్తి
గాన మొనరింపరా! తెలంగాణ ఘనత
– జి. యాదగిరి
1969లో ఉద్యమించిన తెలంగాణ యువతరం ప్రతి వేదికపై ప్రతిధ్వనించిన పలుకుల్లో తెలంగాణా ఘనతకు ఇది పద్యరూపం. తెలుగు నేల వైభవాన్ని వైభోగాన్ని కీర్తించిన నాటి తెలుగు కవుల దృష్టి నుండి తెలంగాణ చాలావరకు తప్పిపోయింది. యీ విస్మృతికి అనేక కారణాలు ఉండవచ్చు కాని, తొలి నాళ్ళనుండి గొప్ప సాహిత్య సాంస్కృతిక నేపథ్యం గలిగి ఉన్న తెలంగాణ నేల వెనకబాటు తనానికి ఎన్నెన్నో కారణాలున్నాయి. ఆ కారణాలే తెలంగాణా ఉద్యమానికి, రాష్ట్ర సాకారానికి ప్రధాన హేతువులయ్యాయి.
ఉత్తుంగ తరంగంలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమజ్వాలల నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ప్రజలు ఉద్యమ సారధిని,ఉద్యమించడానికి ప్రధాన కారణమైన ఉద్యమ పార్టీని విశ్వసించి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని సాగించాలని పట్టం కట్టారు. ఒకసారే కాదు రెండో సారి కూడా మరింత పటిష్ఠంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే రీతిలో తమ విశ్వాసాన్ని ఓట్ల రూపంలో అందించి సహకరించారు. అందుకే బాధ్యతాయుత రీతిలో ఉద్యమ కాలంలో నినదించిన నిధులు, నీళ్ళు, నియామకాలు అన్న వాగ్దానాలను సఫలం చేసే దిశలో కొత్తప్రభుత్వం, మనం ఇష్టపడి ఎన్నుకున్న ప్రభుత్వం పయనించడం తెలంగాణ భాగ్యోదయానికి మొదటిమెట్టు.
మనదంటూ ఒక కొత్త ప్రభుత్వం మనం ఇష్టపడి తెచ్చుకున్నప్పుడు ఆ ప్రజా ప్రభుత్వానికి మన పట్ల అంటే ప్రజల పట్ల బాధ్యత కూడా పెద్దదే అయి ఉండాలి. అప్పుడే మన ప్రభుత మన బాగ్యోదయానికి కొత్త బాటలు వేస్తుంది. ఆ ధ్యేయమే మన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ సారధికి ఉంది కనుక నూత్న రాష్ట్రంగా అవతరించిన తెలంగాణా రాష్ట్రం అనేక రంగాల్లో ముందంజలో ఉండి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ
ఉంది. పాలనలో చిత్తశుద్ధి, గమ్యాన్ని అందుకోవడంలో లక్ష్య శుద్ధి
ఉన్నప్పుడు ఇటువంటి విజయాలు సాధించుకోవడం సాధ్యమవుతుంది. ఆ దిశలోనే మన యేలికలు అడుగులు వేసి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు.
ఉద్యమ విజయం ద్వారా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి అడుగు ఉద్యమ లక్ష్యం దిశగా సాగాలన్న ఆలోచనతో ప్రభుత్వం తన ప్రణాళికలు రచించడం మొదలు పెట్టి విజయ పథంలో దూసుకుపోవడం మొదలు పెట్టింది. ప్రజా దృక్పథాన్ని తనప్రధాన లక్షణంగా నిర్దేశించుకుని ప్రజలే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా మానవీయకోణంలో నుండి సమస్యల్ని పరిష్కరించాలన్న దృష్టితో పాలన సాగించడం ప్రారంభించి రాష్ట్ర ప్రజల హృదయాల్లో తన పీఠాన్ని పదిల పరచుకోవడమే గాక, విశ్వ వ్యాప్తంగా మన్ననలు పొంది ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వంగా స్థిరపడింది.
ప్రజలే ప్రమాణంగా తన పాలనను ప్రారంభించిన మన ప్రభుత్వం ముందుగా పేదల జీవన ప్రమాణాన్ని మెరుగు పరచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం తన మొదటి లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ అనేక కార్యక్రమాలను ఆచరణలో పెట్టింది. ముందుగా వాళ్ళ ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు పూర్తిస్థాయిలో మెఱుగు పరచింది. ప్రభుత్వ ఆసుపత్రులకు కావలసిన పరికరాలను సమకూర్చి రోగులకు అవసరమైన సేవలను సులభతరం చేసింది. ప్రస్తుతానికి దాదాపు 40 ఆస్పత్రుల్లో ఉచిత డయాలసిస్ సౌకర్యం, ఎం.ఆర్.ఐ. సిటీ స్కాన్ సౌకర్యం, డిజిటల్ రేడియాలజీ సౌకర్యం, టూ-డి-ఎకో సౌకర్యం వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను పేదలైన వారికి అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి అయిన తల్లులకు ”కెసిఆర్ కిట్” అందించి మాతా శిశువులకు మరింత చేరువైంది. ఈ పథకం దేశ స్థాయిలో ఒక ఆదర్శ పథకంగా నిలబడటం గొప్పవిషయం. మనిషిని కేంద్రం చేసుకొని ప్రాథమిక అవసరంగా వైద్యాన్ని గుర్తించి దాన్ని పథకాల రూపంలోకి తెచ్చి ఆచరణలో పెట్టిన మన ప్రభుత్వం ఇక్కడి ప్రజల భాగ్యోదయానికి కొత్త బాటలు వేసింది.
పేదల కోసం పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో పిల్లల కడుపులు నింపాలన్న గొప్ప ఆలోచనను ఆచరణలో పెట్టిన కారణంగా లక్షలాది సామాన్యుల సంతానానికి సంతృప్తిని మిగిల్చింది. ఇదొక అపూర్వ విజయం. రేషన్ షాపుల ద్వారా ప్రతి కుటుంబంలో ఉండే ఒక్కో వ్యక్తికీ ఆరు కిలోల చొప్పున రేషన్ ఇవ్వడమనేది సామాన్యుని ముంగిట్లో ధాన్యలక్ష్మి తాండవమాడినట్లైంది. ఇది పేదల పాలిట కల్పతరువుగా నిలిచింది. మన రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు కూడా చక్కని తిండి తినగలిగే రీతిలో ప్రారంభించిన ఈ పథకాల వెనకవున్న ప్రభుత్వపు ఉద్దేశ్యం విజయవంతమై రాష్ట్రాన్ని సుభిక్షంగా నిలబెట్టడానికి దోహదం చేసింది.
ఏవ్యక్తికైనా కూడు, గుడ్డ, గుడిసె అనేవి ప్రాముఖ్యం కలిగిన అంశాలు. ఆ దృష్టితోనే ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణానికి నడుంకటింది. ఆ మార్గంలో వస్తున్న అడ్డంకులను క్రమంగా తొలగించుకుంటూ పురోగమిస్తున్నది. ఈ పథకాన్ని సామాన్యునికి నీడకల్పిస్తున్న అసాధారణ పథకంగా జాతి కీర్తించింది. సామాన్యుణ్ణి మాన్యునిగా మార్చింది.
నీళ్ళు మనిషి ప్రాథమికావసరాల్లో ఒకటి. దీన్ని గుర్తించిన మన ప్రభుత్వం తన పథకాల్లో మొదటి స్థానంలోనే చేర్చి తాగు నీటికి, సాగునీటికి ఇబ్బందులు పడకూడదన్న దృఢసంకల్పంతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనే రెండు విశిష్టమైన పథకాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. కాకతీయుల కాలం నుండే తెలంగాణాలో చెరువుల నిర్వహణ ఒక విశిష్ఠతను సంతరించుకుని ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రధాన అంశంగా కనిపిస్తున్నది. ఆ కారణమే గొలుసుకట్టు చెఱువుల రూపంలో మనకు కనిపిస్తున్నది. రామప్ప చెఱువు, పాకాల చెఱువు, లక్నవరం చెరువు మొదలైన నీటి వనరులే నేటికీ లక్షలాది ఎకరాలకు ఆధారాలై నిలుస్తున్నాయనడం తిరుగులేని సత్యం. కాని కొన్ని వివక్షపూరిత కారణాల దృష్ట్యా, వలసపాలకుల నిర్లక్ష్యం దృష్ట్యా తెలంగాణా గ్రామాల్లో చెఱువులు అదృశ్యం కావడం మన కళ్ళముందున్న కాదనలేని నిజం. దాన్ని అధిగమించి చెఱువులు జలకళతో వెలిగి పోవాలన్న ఆకాంక్షకు కార్యరూపమే మిషన్ కాకతీయ. ప్రజల దాహార్తిని తీర్చాలన్న దృఢ సంకల్పమే ఇంటింటికి మంచినీళ్ళందించే మిషన్ భగీరథ. ఈ ప్రతిష్ఠాత్మకమైన పథకాల పురోగతి శరవేగంగా సాగుతున్నది. వీటి ప్రయెజన ఫలాలు తెలంగాణా గ్రామాలు అందుకోవడం మొదలైంది. నీటి వసతి నిజం కాబోతున్న యీ తరుణం ఇక్కడి ప్రజల కళ్ళకు కనిపిస్తున్న ఒక సువర్ణ సుందర దృశ్యం. ఈ దృశ్యమే మన కష్టాలను కన్నీళ్ళను దూరంచేసే మనోహర సన్నివేశం. వీటి నిర్వహణ, సంకల్ప శుద్ధి, ప్రణాళికలోనున్న విస్తృత ప్రయోజనాన్ని చూచి తాము ఆచరించాలన్న సంకల్పంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలు, అధికారులు సందర్శిస్తున్నారంటే ఇదెంత గొప్ప పథకమో చెప్పనవసరం లేదు.
‘నీళ్ళు’ అనగానే గుర్తొచ్చేది ప్రాజెక్టులు. విస్తృతంగా తెలంగాణాలో ప్రవహించే గోదావరి కృష్ణమ్మలు ఇక్కడి పంట పొలాలకు ఏవిధంగానూ ఉపయోగపడక పోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉపయోగపడే సరియైన ప్రాజెక్టులు లేకపోవడమే. కారణాలు అన్వేషించి సమయం వృధా చేసుకునే కన్నా స్వరాష్ట్ర సాకారానంతరం దీని గురించిన ఒక సరియైన నిర్ణయం తీసుకోవాలన్న మన ముఖ్యమంత్రి దూరదృష్టే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పాలమూరు, దిండి నీటి పథకం వంటి బృహత్తర పథకాల రూపకల్పన. నిర్లక్ష్యానికి గురైన తెలంగాణా నీటి వసతుల అవసరాలను దూరం చేసి కోటి ఎకరాల మాగాణాన్ని గోదావరీ కృష్ణా జలాలతో తడిపి తెలంగాణా నేలను సస్యశ్యామలం చేయాలన్న మన ముఖ్యమంత్రి ఆలోచన సాకారమయ్యే సమయం సమీపించిందనడానికి కాళేశ్వరం నుండి నిర్వహించిన ‘వెట్‌రన్’ ద్వారా గంగమ్మ పరుగులు పెట్టిన దృశ్యమే ప్రత్యక్ష ప్రమాణం. నీటి ప్రాధాన్యాన్ని ఇంతగా గుర్తించి మన పొలాలగొంతును మన ప్రజల గొంతులను తడిపే క్రమం దేశం యావత్తూ విస్తుపోయే రీతిలో నిర్వహించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్నది నిర్వివాదాంశం.
నీళ్ళ విషయానికెంత ప్రాధాన్యమిచ్చిందో, మనకు అన్నం పెట్టే రైతుకు మరింత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చి నవ తెలంగాణాకు నాంది పలికిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కనుకనే ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించి రైతులకు రెండు విడతల పెట్టుబడిని అందించి ఆదుకున్న కారణంగా రైతుల కళ్ళలో ఆనందం చూడగలుగుతున్నాము. దానితో బాటు ప్రారంభించిన రైతు బీమా పథకం రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ముఖాలపై చిరునవ్వులు చిందించింది. అత్యంత మానవతా విలువలతో కూడి ఉన్న ఈ పథకాలు యావత్ప్రపంచం దృష్టినాకర్షించడమే గాక, సాక్షాత్తు మన భారత ప్రధానమంత్రిని సైతం ఆకర్షించి ఇటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వమూ ప్రవేశపెట్టేటట్టు చేసింది. బాగా పరిశీలించి చూస్తే కేంద్ర పథకం కన్నా ఇది మరింత ప్రశస్తమైన పథకంగా మనం గుర్తించొచ్చు.
ఆధునిక మానవ ప్రపంచం తమ ప్రయాణానికి ఐటిని ప్రధానమైన మార్గంగా ఎంచుకుని పయనిస్తూ ఉంది. నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుండి తెలంగాణా రాష్ట్రం కూడా ఆదిశలోనే అడుగులు వేస్తూ యావత్ప్రపంచ దృష్టిని ఆకర్షించి పెట్టుబడులను సాధించి ముందంజలో ఉంది. టిఎస్‌ఐపాస్ ప్రపంచంలో అందరినీ ఆకర్షిస్తున్న పారిశ్రామిక విధానం. ఇంతవరకు ఏ రాష్ట్రమూ రూపొందించని ఈ కొత్త విధానం కారణంగా దేశ విదేశాల నుండి పెట్టుబడుల వెల్లువ మన తెలంగాణా రాష్ట్రంలోకి ప్రవహించింది. 2018-19లో దాదాపు రూ. 74,630 కోట్ల పెట్టుబడులు వచ్చినందువల్ల 2.75 లక్షల మందికి ఉపాధి కల్పించింది. నిరుద్యోగాన్ని తగ్గించే దిశగా ఇది మనకు ఉపయోగపడుతున్నది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రమోషన్ కౌన్సిల్ వారి అంచనా ప్రకారం భారత ఐటి ఎగుమతుల అభివృద్ధి 10శాతంగా ఉంది. కాని మన రాష్ట్రం ఈ భారీ ఎగుమతుల పురోగతిలో 17శాతం వృద్ధి సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరంలో 1,09,219 కోట్ల ఎగుమతులు సాధించి ఉపాధి కల్పనలోనూ 14.2శాతం అభివృద్ధినందుకున్న కారణంగా 5,43,033 మందికి ఉపాధి లభించింది. ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలను ఇక్కడి పారిశ్రామిక విధానం ఆకట్టుకున్న కారణంగా డాటా సెంటర్ ద్వారా తెలంగాణలో తాము ప్రవేశించాలన్న ఆలోచన వల్ల ఇక్కడ తమ సెంటర్లను ఏర్పరిస్తే తమ వినియోగదారులకు మరిన్ని సేవలను అందించవచ్చునన్న నిర్ణయానికి వచ్చాయి. ఇక్కడి ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతి సౌకర్యం వల్ల వీటి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అది పలు ఉద్యోగాల కల్పనకు మార్గం వేసి ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరచింది.
పారిశ్రామిక,వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ దేశంలోనే మూడవ స్థానంలో నిలిచిన తెలంగాణా రాష్ట్రం, రసాయనాలు ఔషధ ఉత్పత్తుల్లోనూ ప్రముఖ స్థానాన్ని పొందటం మన పాలకుల దూర దృష్టికి సంకేతం. అందుకే ఆహార శుద్ధి పరిశ్రమలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇది ఇక్కడి ప్రజలకు వరదాయినిగా మారి ప్రజా జీవన మార్గంలో అతి ముఖ్యమైన అంశంగా మారుతుంద న్నది తిరుగులేని నిజం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలినాళ్ళ నుండి ఏది ఆలోచించినా ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా అది కేవలం పథకాలు మాత్రమే గాక మానవీయ కోణంలో ఆలోచించి ప్రజా ప్రగతికి బంగారు బాటలు వేసే పథకాలుగా దేశానికే స్ఫూర్తినిచ్చాయి. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, బిసి గురుకుల విద్యాలయాలు, జలసిరులు పొంగించే పథకాలు, కేజీ టు పిజి విద్యా పథకం కావచ్చు ఏదైనా చిత్త
శుద్ధితో అమలు పరిచి మనదైన ముద్రతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయంటేనే దీని అభివృద్ధిని మనం అంచనా వేయవచ్చు. ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు కేంద్ర చట్టాన్ని మించి పరిహారం ప్యాకేజీ ఇస్తునందువల్లే ప్రజలు తెలంగాణా రాష్ట్ర సమితికి మరోసారి తిరగులేని అధికారాన్ని అందించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఇటీవల మల్లన్నసాగర్ నిర్వాసితులు 807 మందికి రూ.85.59 కోట్ల పరిహారం ప్రభుత్వం రైతులకు చెల్లిస్తే ఆనందించిన రైతు సోదరులు మన అధినేతకు పాలాభిషేకాలు చేసి అభినందించారు. ప్రజల ఆనందమే ప్రభుత్వానికి ఆనందం, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమమన్నది మన ముఖ్యమంత్రి ఆలోచన. ఏ ఒక్క రైతూ నష్టపోరాదన్న ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతున్న మన ప్రభుత్వపు ఆలోచనే ఇప్పటికే రైతు బీమా పథకం క్రిందికి వస్తున్న 29.58 లక్షల మంది రైతులకు తోడు మరో లక్షమందికి పైగా కొత్తగా పట్టాదారులైన రైతులు చేరారు. ఈ రైతుబీమా ప్రజల కొక ధీమాగా నిలిచింది. ఇప్పటివరకు సుమారు 500 కోట్ల రూపాయలు ఎల్‌ఐసి చెల్లింపులను గమనిస్తే దీని పురోగతిని మనం తెలుసుకోవచ్చు. ఈ చెల్లింపులు కూడా కేవలం పదిరోజుల్లోనే పూర్తికావడం ప్రభుత్వపు చిత్తశుద్ధికి నిదర్శనం.
ఏప్రాంత పురోగతికైన సరియైన రహదారులు ముఖ్యం. మౌలిక వసతుల్లో ఇది ప్రధానాంశం. ఇది గుర్తించింది కనుకనే మన రాష్ట్రం కూడా మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. 5 సంవత్సరాలలో 155 కి.మీ. రహదారులను సాధించింది. నాడు అతి తక్కువగా రహదారులున్న మన ప్రాంతం నేడు దక్షిణాదిలోనే అగ్రస్థానంలో నిలిచి మనపూనికకు, పట్టుదలకు, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. మరో విశేషం ఇక్కడ చోటుచేసుకోబోతున్నది. త్వరలో రాష్ట్రానికే తలమానికంగా నిలువబోయే 344 కి.మీ.ల రీజనల్ రింగ్ రోడ్డు సిద్ధం కాబోవడం మన ప్రజలకే కాదు, మొత్తం దేశ ప్రజలందరికి ఉపయోగపడే గొప్ప పనిగా నిలుస్తుంది.
సమాఖ్య స్ఫూర్తి, పొరుగు రాష్ట్రాలతో సఖ్యత, వివిధ రాష్ట్రాల మధ్య స్నేహ భావన, ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తున్న దానికి నిదర్శనమే 2.5 టిఎంసిల కృష్ణా జలాలు కర్ణాటక నుంచి మనదాకా రావడం. ప్రకృతి ప్రళయానికి కకావికలైన ఒడిశా రాష్ట్రానికి మనం చేయి అందించడం వంటి ఆదర్శవంతమైన విధానం. అతి కొద్ది కాలంలో అత్యంత వైభవాన్ని సాధించి, తెలంగాణాలోని ప్రతి పౌరుని హృదయంలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం కారణంగా తెలంగాణా భాగ్యోదయం సాధ్యమైందన్నది నిర్వివాదం. చిత్త శుద్ధి, ప్రజల పట్ల శ్రద్ధ, పాలనలో పారదర్శకత, మానవీయ కోణంలో ఆలోచించడం, ప్రతి పనిలోనూ పట్టుదల వంటి ప్రత్యేక లక్షణాలతో పనిచేసే తెలంగాణా ప్రభుత్వమే ఘనమైన ఉదాహరణగా నిలువడం మనందరికీ ఆనంద దాయకం.
గన్నమరాజు గిరిజామనోహర బాబు