నింగి అండగా… నేల నిండుగా… జనం దండిగా… తెలంగాణా పండుగ!

ఒక వ్యక్తి పుట్టిన రోజు…
ఆ కుటుంబానికి మాత్రమే గొప్ప రోజు!
ఒక సంస్థ పుట్టిన రోజు ఆ సంస్థ మనుషులకు మాత్రమే మరిచిపోలేని రోజు!!
కానీ, ఒక రాష్ట్రం అవతరించిన రోజు…
ఖచ్చితంగా ఆ జాతి మొత్తం సంతోషపడే రోజు!!!
లక్షలాది కుటుంబాలు, సబ్బండ వర్ణాలు సంబరపడే రోజు!!!!
కోట్లాది సకల జనులు కలలు పండి సంబురాలు జరుపుకునే రోజు!!!!

జూన్‌ 2, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా అలాంటి సంబురాన్నే తెచ్చింది. రాష్ట్రంలో, దేశంలో, విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలందరిలో నవోత్సాహాన్ని నింపింది.. ఎన్నెన్నో ఉద్వేగాలను గుర్తు చేసింది… మరెన్నో ఉత్తేజక్షణాలను జ్ఞాపకం చేసింది.. అన్నింటినీ మించి ‘కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని ఇష్టపడి అభివృద్ధి చేసుకోవడానికి,’ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నాయకత్వంలో బంగారు తెలంగాణగా మలచుకోవడానికి కావలసిన స్ఫూర్తిని, కర్తవ్యదీక్షని ప్రజలందరి గుండెలో నింపింది!

రాష్ట్ర అవతరణ ఉత్సవాలు పల్లె నుండి పట్నందాకా, గల్లీ నుండి ఢిల్లీ దాకా కనీవినీ ఎరగని స్థాయిలో అత్యంత వైభవంగా జరిగాయి. ప్రజలంతా తెలంగాణ తొలి పుట్టిన రోజు వేడుకను ఎంతో ఆత్మీయంగా జరుపుకున్నారు. ఆ మాటకొస్తే, స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరగనంత గొప్పగా, ప్రజలందరూ ఆనందంగా జరుపుకున్నారు. దేశంలోకెల్లా అత్యంత ‘యంగ్‌ రాష్ట్రం’ అయినప్పటికీ, అతి గొప్పగా, హుందాగా, పండుగగా, దీపకాంతులతో, జగజ్జగీయమానమైన వెలుగులతో, ఉరకలెత్తిన సాంస్కృతిక వాతావరణంలో, వెల్లువెత్తిన సంగీత, నృత్య ప్రదర్శనలతో, ప్రవహించిన చర్చతో, పల్లవించిన పాటతో, గొంతెత్తిన కవిసమ్మేళనాలతో రాష్ట్రమంతటా ఆవరించిన సంబరాలు అంబరాన్ని అంటాయి…

రాష్ట్ర అవతరణ ఉత్సవం మరొక్కసారి తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది… ఇక్కడి మట్టిబిడ్డ ఔన్నత్యాన్ని వెల్లడించింది… ఇక్కడి ‘గంగా-యమున తెహజీబ్‌’ సంస్కృతిని అందలమెక్కించింది… అంతేగాక,ఈ ఉత్సవం  ‘ట్రెడిషన్‌నీ, ట్రెండ్‌నీ, టెక్నాలజీ’ని కలుపుకొని సకల జనులకు ఓ నవ్యానుభూతిని, అందమైన జ్ఞాపకాన్ని అందించింది. వారం రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవం ఏడు జన్మలకు సరిపడే ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, ఆశయసిద్ధిని ప్రజలకు ప్రసాదించింది!

అమరవీరులకు అంజలి ఘటించి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కరోజులో ఆకాశంలోంచి ఊడిపడ్డ ముచ్చటకాదు. ఆరు దశాబ్దాల పోరాటం… ఆరుగాలాలు అలుపెరగకుండా పడ్డ ఆరాటం… వలసపాలనలో జరుగుతున్న అన్యాయాలను ధిక్కరిస్తూ ఎదురొడ్డి నిలిచిన వీరత్వం… విద్యార్థుల బలిదానం… తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగం… ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, అస్తిత్వమే అలంబనగా ఉవ్వెత్తున ఎగసి రణరంగంలోకి ఉరికిన సకల జనుల సమరోత్సాహం… చెట్టుకొకడు, పుట్టకొకడుగా ఉన్న తెలంగాణ బిడ్డల ఆశని ఒక్కచోటికి తెచ్చి ‘‘తెలంగాణ రాష్ట్రం’’ అనే సింగిల్‌లైన్‌ ఎజెండాతో ముందుకు నడిచి, ఆంధ్ర పాలకుల వలసదారు కుట్రను తిప్పికొట్టిన మేరునగ ధీరత్వం మహానేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మడమ తిప్పని నాయకత్వం. వీటన్నింటి అంతిమ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం!

అందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్ర తొలి అవతరణ ఉత్సవాలను గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద పూలతో నివాళులు అర్పించడంతో ఆరంభించారు. తెలంగాణ కోసం, ప్రజల కోసం, వలస ఆధిపత్యం నుండి రాష్ట్రానికి విముక్తి కోసం అసువులు బాసిన అమరవీరులు, త్యాగధనులను స్మరించుకుని, వారి జీవితాలు చెప్పకనే చెప్పిన సందేశాన్ని తెలంగాణ ప్రజలంతా తమ గుండె నిండా నింపుకుని రాష్ట్ర అవతరణ ఉత్సవ సంరంభం కోసం పెరేడ్‌గ్రౌండ్స్‌ వైపు పరుగులు తీశారు.

పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రభావం:

‘‘తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాభినందనలు, శుభాకాంక్షలు. అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, అనేక ఉద్యమాల ఫలితం… గత సంవత్సరం జూన్‌ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం. ఈ రోజు తొలి వార్షికోత్సవాన్ని సగర్వంగా, సంతోషంగా  జరుపుకుంటున్నాం’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేసిన ప్రసంగంలో ఆయనతోపాటు నాలుగున్నరకోట్ల తెలంగాణ బిడ్డల మనోభీష్టం ప్రతిధ్వనించింది.

పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరణతో మొదలై పోలీసు గౌరవ వందనం తర్వాత, సాంస్కృతిక సారథి కళాకారుల కవాతుతో మైదానమంతా తెలంగాణ ప్రాభవంతో నిండిపోయింది. కోలాటం, ఒగ్గుడోలు, బోనాలు, బతుకమ్మ, యక్షగానం, బంజార నృత్యం, డప్పులాట, పీర్లు, గుస్సాడి నృత్యాలతో సాగిన ఈ ‘కళాకవాతు’కు తెలంగాణ జగమంతా పరవశించిపోయింది.

ఈ వేడుకలలో వివిధ ప్రభుత్వశాఖలు రూపొందించిన 24 అలంకృత శకటాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సాగాయి. కె.సి.ఆర్‌ చెప్పినట్లు, ‘‘దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా 28 వేల కోట్ల రూపాయలను కేవలం ప్రజా సంక్షేమం కోసం వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం… తెలంగాణ’’ అన్న మాటకు సాక్షీభూతంగా ఇవి నడిచాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుంది అనే ప్రచారాన్ని తిప్పికొట్టేలా అనతి కాలంలోనే రాష్ట్రాన్ని ‘‘కరెంటు కోతు లేని రాష్ట్రం’’గా మలచడంలో కె.సి.ఆర్‌ చూపిన దీక్ష, పట్టుదల, సాధించిన ప్రగతికి పరేడ్‌ గ్రౌండ్‌ ఓ వెలుగు చుక్కగా నిలిచింది.

అలాగే, వివిధ రంగాలలో విశేష సేవలందించిన 52 మంది నిష్ణాతులకు పురస్కారాలను అందించడం, తెలంగాణ తల్లి మనసు పులకించిన ఘట్టం అనాలి. ఈ మహనీయులకు సీ.ఎం. కె.సి.ఆర్‌ స్వయంగా చేసిన సన్మానంలో తెలంగాణ తనమే ఉట్టిపడింది. వీరికి అందించిన పోచంపల్లి పట్టుశాలువా, పెంబర్తి జ్ఞాపికలు తెలంగాణ వృత్తికళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఏడు రోజుల ఉత్సవ సంబరానికి తెర తీశాయి.

32 వేదికలు…  వేలాది మంది కళాకారులు

రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించే బాధ్యతని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భాషా, సాంస్కృతిక శాఖ చేపట్టింది. కె.సి.ఆర్‌ ఆలోచనలకు, ఆదేశాలకు అనుగుణంగా అటు గ్రామ, మండల, జిల్లా కేంద్రాలోనూ, ఇటు హైదరాబాద్‌ రాజధాని నగరం అంతటా విస్తృతంగా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించి, ఏర్పాటు చేసింది. అటు పాతబస్తీ నుండి ఇటు హైటెక్‌ దాకా 32 పైగా వేదికలపై రకరకాల కార్యక్రమాలను నిర్వహించింది. ఎన్నో వేదికలకు రకరకాల సాహితీ, సాంస్కృతిక, కళా ప్రదర్శనలతో నగరాన్ని ఏడు రోజులు ‘కళామయం’ చేశాయి. ఈ కళా ప్రదర్శనలో దాదాపు 5 వేల మందికి పైగా కళాకారులు పాల్గొని ప్రేక్షకులను రంజింప చేయడం విశేషం.

కాగా, నగరంలో ఉన్న ప్రభుత్వ కార్యాయాలు, భవనాలు అన్నీ దగద్ధగలతో ఉత్సవశోభను మరింత పెంచాయి.
మరోవైపున, జిల్లా కేంద్రాలలో కూడా రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లాలకు 30 లక్షల చొప్పున ఈ సంబరాల కోసం సాంస్కృతిక శాఖ, జిల్లా కలెక్టర్లకు నిధులను అందజేసింది. అంతేగాక, సాహితీ, సాంస్కృతిక, కళా ప్రదర్శనలకు సంబంధించి నిరంతరం సలహాలు, సూచనలను అందించడమే కాక అవసరమైన సమన్వయాన్ని సాంస్కృతిక శాఖ నిర్వహించి రాష్ట్రమంతటా వైవిధ్యమైన, విశిష్టమైన సంబరాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించింది.

శాస్త్రీయ సంగీత-నృత్య వైభవం

రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జాజ్వల్యమానం చేసిన కళాప్రదర్శనలలో శాస్త్రీయ సంగీత నృత్యరీతులు ప్రముఖమైనవి. అనూచానంగా, సంప్రదాయంగా వస్తున్న కళా ప్రదర్శనలకు ప్రాధాన్యతనిచ్చే శాస్త్రీయ కళా రీతులు కూడా ఈసారి ‘తెలంగాణ రాష్ట్రం… ఉద్యమం… ప్రజల పోరాటం’ అనే థీమ్‌తో నవ్య తరహాలో నృత్యాలను, నృత్య రూపకల్పనను ప్రదర్శించడం గొప్ప విశేషం అని చెప్పాలి.

ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి దీపికారెడ్డి కూచిపూడి శైలిలో ‘తెలంగాణ వైభవం’ పేరిట నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అలాగే మరో శాస్త్రీయ నర్తకి ఇందిరా పరాశరం ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ పేరుతో శాస్త్రీయ నృత్యాధారిత బ్యాలేను రూపొందించారు. చరిత్రను, సమకాలీన ఉద్యమాన్ని సమన్వయం చేసి ప్రదర్శించిన ఈ బ్యాలే కొత్త ప్రయోగంగా నిలిచింది. అలాగే ‘జయజయహే తెలంగాణ’ డ్యాన్స్‌ డ్రామా, ‘నాటకాన్ని, నృత్యాన్ని, వీడియోని’ కలిపి మంచి ప్రయోగాన్ని చేసింది. ఇక ఉత్తరాది శాస్త్రీయ నృత్యమైన కథక్‌కు దక్షిణాదిలో కేరాఫ్‌ అడ్రస్‌ హైదరాబాద్‌ అనే విషయం తెలిసిందే. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ‘ఉద్యమం-ప్రజాపోరాటం’ను కథక్‌ నృత్యశైలిలో ప్రదర్శించి సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలిగించడం ఈ ఉత్సవంలో విశేషం. అలాగే ‘టెంపుల్స్‌ ఆఫ్‌ తెలంగాణ’ థీమ్‌ తో రూపొందిన శాస్త్రీయ నృత్యం, ‘చేనేత చమక్కు’ కూడా ఈ కోవలోనివే! అలాగే కర్నాటక, హిందుస్థానీ, గాత్ర సంగీత కచేరులు కూడా ఈ ఉత్సవంలో చోటు చేసుకుని సంగీత శోభతో అలరించాయి.

మహా ‘పేరిణి’ నృత్యం

స్థానిక శాస్త్రీయ నృత్యమైన ‘పేరిణి’ ఈ ఉత్సవంలో ప్రత్యేక పాత్ర పోషించింది. కాకతీయుల కాలంలో జాయపసేనానిచే యుద్ధ సన్నాహక నృత్యరీతిగా ఆరంభమైన పేరిణి తర్వాత కనుమరుగై, మళ్ళీ 1980 దశకంలో నటరాజ రామకృష్ణ చే పునరుత్థానం పొందింది. రాష్ట్ర అవతరణ ఉత్సవంలో పేరిణి నృత్యానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందించిన సాంస్కృతిక శాఖ, దాదాపు 100 మంది పేరిణి కళాకారులతో ‘మహాపేరిణి నృత్యాన్ని’ ప్రదర్శించింది. పేరిణిలోని రెండు రీతులైన ‘తాండవం’, ‘లాస్యం’ను భారీగా ప్రదర్శించి తెలంగాణ శాస్త్రీయ నృత్యంలోని విశిష్ఠతను ప్రపంచానికి చాటి చెప్పింది.

గ్రామీణ జానపదాల జోష్‌

గ్రామీణ-జానపదా-జోష్‌తెలంగాణ అనగానే గుర్తొచ్చేది జానపదాలే అనడంలో అతిశయోక్తి లేదు. అద్భుతమైన గ్రామీణ కళారూపాలు, అబ్బురపరిచే జానపద గీతాలు తెలంగాణ సొంతం. అందుకే అవతరణ ఉత్సవంలో గ్రామీణ జానపద కళల ప్రదర్శనను కూడా విస్తృతంగా నిర్వహించడం జరిగింది. ఒగ్గుడోలు విన్యాసం, డప్పు, కోయనృత్యం, చిరుత రామాయణం, జానపదగీతాలు, ఉద్యమపాటలు వంటివి వాటిలో కొన్ని. ఇక ‘మిషన్‌ కాకతీయ’ థీమ్‌తో చేసిన చిందు యక్షగాన ప్రదర్శన, సామాజిక, సమకాలీన అవసరానికి తగిన అనుగుణ్యత జానపద కళలో ఉంటుందనే విషయాన్ని మరోసారి నిరూపించింది.

ఒగ్గుడోలు, డప్పు కళాకారులు తమ కళాప్రదర్శనలో ‘‘హ్యూమన్‌ పిరమిడ్‌’’ను సృష్టించడం ఈ వేడుకలోనే ఓ అద్భుతం!

జాతీయ కళల జాతర

తెలంగాణ – ‘ఉత్తర, దక్షిణ భారతాల మధ్య సంధాన వారధి’! ఇక హైదరాబాద్‌ నగరమైతే ఉత్తరాది ప్రజకు, వారి సంస్కృతికి ‘సెకండ్‌ హోమ్‌’లాంటిదే! అలాగే దక్షిణాది జీవనశైలికి, వారి సంప్రదాయాలకి కూడా ఆహ్వానం పలికే సంస్కారం తెలంగాణ గడ్డది. అందుకే ఉత్తర-దక్షిణ సంస్కృతుల ప్రజలకు కూడా రాష్ట్ర అవతరణ ఉత్సవంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. సిక్కులు సిఖ్‌ ఫెస్టివల్‌లో భాంగ్రా నృత్యాలతో, పంజాబీ జానపద గీతాలతో, గుజరాతీల గర్భా కోలాటాలతో, బెంగాలీలు దుర్గ నృత్యాల, రవీంద్ర సంగీత్‌తో (‘శుభో బంగ’ కార్యక్రమం), మలయాళీలు మోహినీ ఆట్టమ్‌, ఓనమ్‌ ఇతర గానాలతో (‘నమస్తే కైరళి’ కార్యక్రమం), ఒడిస్సీ నృత్యాలతో, మరాఠా ‘సంగీత్‌ సంధ్య’ కార్యక్రమాలతో తమ ఆనందాన్ని ఆడంబరంగా జరుపుకున్నారు.

ఈశాన్య రాష్ట్రాల జానపద కళారూపాల ప్రదర్శన కూడా ఈ ఉత్సవంలో చోటు చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. బిహూ (అసోం), జిక్రా జరీ (అసోం), లేప్చా (సిక్కిం) వంటివి, బదేరి (మధ్యప్రదేశ్‌), మథూరి బజశాల్‌ (ఒడిస్సా), సిద్ధిఢమాల్‌ (గుజరాత్‌), పంథీ నృత్యం (ఛత్తీస్‌గఢ్‌) వంటివి ఈ సంబరాలలో పాల్గొనడంతో అవతరణ ఉత్సవాలకు ‘జాతీయ కళా స్వభావం’ వచ్చింది. హైదరాబాద్‌ నగరం ‘‘కాస్మోపాలిటన్‌ సిటీ’’ అన్నమాటకి, రేపటి ‘‘గ్లోబల్‌ సిటీ’’ అనే లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఉర్రూతలూగించిన ఉర్దూ సాంస్కృతిక రూపాలు

‘‘గంగా యమునా తెహజీబ్‌’’కి అచ్చమైన ఉదాహరణ తెలంగాణ! దాదాపు నాలుగు శతాబ్దాలపాటు తెలంగాణ ప్రాంతం ముస్లిం పాలనలో ఉండటం వల్ల హిందూ ముస్లిం సహజీవన సంస్కృతి మీద చక్కగా విరాజిల్లింది. అలాగే తెలంగాణ జిల్లాలలోని చాలా ప్రాంతాలలో, హైదరాబాద్‌ నగరంలో ఇస్లాం జీవనశైలి అంతర్భాగమైపోయింది. ఇక ఉర్దూ భాష గురించి చెప్పక్కర్లేదు. దీనివల్లే ముస్లిం సోదరులు, కళాకారులు అందరూ పెద్ద ఎత్తున ఈ అవతరణ ఉత్సవంలో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఒక ముస్లిం మిత్రుడు ఈ ఉత్సవాలను చూసి ‘‘రంజాన్‌ మాసం ముందే వచ్చినట్లుగా ఉంది’’ (లగ్‌తాహై రమ్‌జాన్‌ అభీ ఆయా హై) అని వ్యాఖ్యానించడం దీనికి అద్దం పట్టేదే!

ఇక హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ అంతటా నిర్వహించిన ఉర్దూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. గజల్స్‌, ఖవ్వాలీ (తెలంగాణ థీమ్‌తో స్పెషల్‌ ఖవ్వాలీ) ముషాయిరాలు, సూఫీ సంగీత్‌, తమ్‌సిలీ ముషాయిరాలు, మజాయియే ముషాయిరా, ఉర్దూ నాటకాలు, షెహనాయి, నౌబత్‌ వంటి సాంస్కృతిక వాయిద్యాలతో సంగీత కార్యక్రమాలు మతాలకు అతీతంగా అందరిచేతా చప్పట్లు కొట్టించాయి. అలాగే ‘ఖులీ దిలోంకా షెహజాదా’’, ‘దాస్తాన్‌-ఎ-గోల్కొండ’ వంటి చారిత్రక నాటకాలు కూడా గతకాలపు పాలకులకు తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న అనుబంధాన్ని చూడచక్కగా ప్రదర్శించాయి. అలాగే రవీంద్ర భారతి ప్రాంగణంలో ‘తెహజీబ్‌-ఎ-తెలంగాణ’ శీర్షికన జరిగిన కార్యక్రమాలు కూడా!

రవీంద్రభారతిలో ‘రజా’ – చార్మినార్‌ దగ్గర ‘గులామ్‌’

రాష్ట్ర అవతరణ ఉత్సవంలో మరో విశిష్టత చోటు చేసుకుంది. ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు ఇద్దరు రెండు చారిత్రక ప్రదేశాలలో తమ కచేరీని నిర్వహించడమే అది. ప్రముఖ గాయకుడు బడే గులామ్‌ అలీఖాన్‌ (ఈయన హైదరాబాద్‌లోనే మరణించాడు. సమాధి కూడా ఇక్కడే ఉంది) మనుమడు రజా అలీఖాన్‌ తన బృందంతో కలిసి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, ఖయాల్‌, టుమ్రీలను, గజల్స్‌ను ఆలపించి రవీంద్ర భారతిలో సరికొత్త వెలుగులు నింపారు. అలాగే ప్రముఖ అంతర్జాతీయ హిందుస్థానీ గాయకుడు గులామ్‌ ఆలీ ప్రఖ్యాత చార్మినార్‌ దగ్గర అద్భుతమైన తన గాన మాధుర్యంతో కచేరీని నిర్వహించాడు. చార్మినార్‌ దగ్గర ఇలా ఓ సాంస్కృతిక కార్యక్రమం జరగడం గత నాలుగు దశాబ్దాల కాలంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

సెమినార్ – సాహితీ చర్చలు

రాష్ట్ర అవతరణ ఉత్సవం కేవలం సంగీత-నృత్య-కళా ప్రదర్శనకు మాత్రమే కాక ఎన్నెన్నో మేధోపరమైన చర్చలకీ, సాహితీ గోష్టులకి, తెలంగాణ ఉద్యమ విజయ సమీక్షకి, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలకు కూడా పెద్ద పీట వేసింది. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం పోషించిన పాత్రపై, ఉద్యమంలో మహిళల నాయకత్వంపై, రాష్ట్ర సాధనలోని విజయపాఠాలపై, తెలంగాణ సాహిత్యంలో అనువాదాల ఆవశ్యకతపై ఎన్నో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చలు జరిగాయి. అలాగే తెలంగాణలో ఉర్దూ భాష, సాహిత్యాల ప్రభావంపై, తెలంగాణ నృత్యరీతులపై, తెలంగాణ చరిత్ర – సంస్కృతిలోని వినూత్న అంశాలపై, ‘బంగారు తెలంగాణ’ సాధనపై కూడా మేధోమథనం జరిగింది. పద్యం, అవధానంపై జరిగిన చర్చలు, అవధాన కళాప్రదర్శన తెలుగు సాహితీ వైభవాన్ని చాటి చెప్పాయి. ఇక తెలంగాణ  ఉద్యమ కాలంలో పత్రికల్లో కార్టూనిస్టులు పోషించిన పాత్రపై చర్చ మాత్రమే కాక, కార్టూన్‌ ఎగ్జిబిషన్‌ కూడా ప్రదర్శితమై సందర్శకులను ఆలోచింపచేసింది.

సినిమా ప్రదర్శనలు

రాష్ట్ర అవతరణ ఉత్సవం కొన్ని మరుగున పడ్డ అంశాలను కూడా మళ్ళీ వెలుగులోకి తీసుకువచ్చింది. వాటిలో లలిత కళాతోరణంలో సినిమా ప్రదర్శనలను చేయడం ఒకటి. 1980 దశకంలో ‘ఫిల్మోత్సవ్‌’ కోసం నిర్మించిన ఈ తోరణంలో, ఆ తర్వాత కొన్ని ఎంపిక చేసిన సినిమా ప్రదర్శనలు జరిగేది. మళ్ళీ చాన్నళ్ళ తర్వాత లలిత కళా తోరణంలో ఆరు రోజుల పాటు తెలంగాణ జీవితానికి, సంస్కృతికి అద్దం పట్టే సినిమాలు ప్రదర్శనకు నోచుకున్నాయి. తొలి తెలంగాణ సినిమా ‘‘అంకుర్‌’’ (శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వం), మాభూమి (గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వం), కొమరం భీమ్‌ (అల్లాణి శ్రీధర్‌ దర్శకత్వం), జై బోలో తెలంగాణ (యన్‌. శంకర్‌ దర్శకత్వం) వంటి సినిమాలు ఈ ఉత్సవంలో భాగంగా ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి. మరో వైపున ‘‘తెలంగాణ సినిమా – నిన్న, నేడు, రేపు’’ అనే అంశంపై తెలంగాణ సినీ పరిశ్రమల పెద్దలతో ఓ అర్థవంతమైన చర్చ జరిగింది. అలాగే ఇటీవలి కాలంలో విజృంభించిన షార్ట్‌ ఫిలింస్‌, డాక్యుమెంటరీలపై భవిష్యత్‌ లో వాటి గమనం, తెలంగాణ నవయువదర్శకుల రేపటి చూపు వంటి అంశాలపై ప్రదర్శనలతో కూడిన విశ్లేషణలు జరిగి, తెలంగాణ పునర్‌నిర్మాణంలో ప్రభావవంతమైన సినిమా వంటి నవ్య సాంకేతిక కళారూపాల భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై దృష్టి సారించడం జరిగింది.

400 మందితో కవి సమ్మేళనం

400-మందితో-కవి-సమ్మేళనంఅపుడెప్పుడో ఓ ఆంధ్ర కవి ‘‘తెలంగాణలో కవులు ఉన్నారా?’’ అని అహంకారంతో వేసిన ప్రశ్నకు సమాధానంగా, ఆనాడు సురవరం ప్రతాపరెడ్డి ‘‘గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక’’లో 354 మంది కవుల కవితలను ప్రచురించి తెలంగాణ గడ్డ దేనిలోనూ తక్కువ కాదు అని నిరూపించారు. ఆ తర్వాత దాదాపు ఆరు దశాబ్దాల కాలం నుంచి అంత విస్తృత స్థాయిలో తెలుగు సాహితీ ప్రపంచంలో మరే ఇతర కవితా సంకలనం కానీ, కవి సమ్మేళనం కానీ జరుగలేదు.
కానీ, రాష్ట్ర అవతరణ తొలి వార్షికోత్సవం ఈ రికార్డును బ్రేక్‌ చేసింది. రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ నేతృత్వంలో జరిగిన కవి సమ్మేళనం దాదాపు నాలుగు వందల మందికి పైగా తెలంగాణ కవులు తమ కవితల్ని గానం చేసే వేదికని ఏర్పరిచింది. తెలంగాణ ఇచ్చిన ఆనందోద్వేగం, ఉత్సాహో త్తేజం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఇక, ఉగాది కవి సమ్మేళనంలోని కవితతో సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘కొత్తసాలు’ కవితా సంకలనం ఈ కార్యక్రమంలో ఆవిష్కరించడం అవతరణ ఉత్సవాలకి నిండుదనాన్ని తెచ్చింది.

‘సాంస్కృతిక సారథి జైత్రయాత్ర’

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ‘సాంస్కృతిక సారథి’! కళాకారులకు ప్రభుత్వోద్యోగాలు ఇవ్వడం అనే నవ్య సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఈ వ్యవస్థ, రాష్ట్ర అవతరణ సంబరాలను ‘జైత్రయాత్ర’ పేరిట జరిపి, రాష్ట్ర అవతరణ సందేశాన్ని జిల్లాలన్నింటా ప్రదర్శించింది. 500మందికి పైగా కళాకారులతో జిల్లా కేంద్రాలలో ఉద్యమగీతాలను, ప్రభుత్వ పథకాల పాటలను పాడి ఉత్సవ వాతావరణాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది.

మరెన్నో విశేషాలు

భారతదేశ చరిత్రలోనే మరే రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరగనంత భారీగా, ఆధునికంగా, సంప్రదాయంగా, శాస్త్రీయంగా, సాంకేతికంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవం జరిగిందనడంలో అతిశయోక్తి లేదు. దక్షిణాదిలో మొట్టమొదటి సారిగా ‘‘3-డి మ్యాపింగ్‌’’ టెక్నాలజీతో నగరంలో క్లాక్‌ టవర్‌, కాచిగూడ రైల్వే స్టేషన్‌, బుద్ధ విగ్రహం కొత్త అందాలతో అలరించాయి. అలాగే నగరంలోని అన్ని హోటల్స్‌ ‘తెలంగాణ ఫుడ్‌ ఫెస్టివల్‌’ని ప్రత్యేకాకర్షణగా నిర్వహించాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ప్రభుత్వ అధికార ప్రతినిధి, డా॥ వేణుగోపాలాచారి నాయకత్వంలో తెలంగాణ భవన్‌లో అవతరణ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

అన్ని దారూలూ ట్యాంక్‌ బండ్‌ వైపే..

రాష్ట్ర అవతరణ ఉత్సవ ప్రారంభ వేడుకలు ఎంత హుందాగా, ఉదాత్తంగా జరిగాయో, ముగింపు వేడుకలు అంతే ఆర్భాటంగా, అట్టహాసంగా, ఓ జీవిత కాలపు అనుభూతిగా మిగిలిపోయేంత గొప్పగా జరిగాయి. ఈ ఉత్సవాలకి వేదిక అయిన ట్యాంక్‌బండ్‌ లక్షలాది మందితో జన సముద్రమైంది. ట్యాంక్‌బండ్‌ పక్కన మాత్రమే కాదు, మీద కూడా ఓ కదిలే మానవ హుస్సేన్‌సాగర్‌ సాక్షాత్కరించింది. ప్రథమపౌరుడు గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ముఖ్య మంత్రి కేసీఆర్‌ దంపతులతోపాటు మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు ఇతర ప్రముఖులెందరో ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకించారు.

ముగింపు వేడుకలకి ఆరంభసూచికగా ఆవిష్కరించిన ‘రోబోకైట్స్‌’, మిరుమిట్లు గొలిపిన లేజర్‌షో, అరగంటపాటు సాగిన పటాకులు, అవి ఆకాశంలోకి ఎగిసి విరజిమ్మిన వెలుగులు చూపరులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి. మరో వైపున, ఈ ఉత్సవంలో పాల్గొనడానికి జిల్లాకు ఐదు వందల మంది చొప్పున దాదాపు ఐదు వేల మంది కళాకారులతో ఊరేగింపుగా ప్రదర్శనను నిర్వహించడం, అందులో చిందు, ఒగ్గుడోలు, కోలాటం, పీరీలు, పోతురాజు, డప్పుదరువు, కోయదొరు, గుస్సాడీ,లంబాడీలు, కాటిపాపు, చిరుత రామాయణం, బోనాలు, బతుకమ్మ పెద్ద ఎత్తున తరలి రావడం ఈ వేడుకలకు అదనపు ఆకర్షణలు అయ్యాయి. క్రీడాకారుల ర్యాలీ, పోలీసు కవాతు, పారిశుధ్య కార్మికులు, మహిళా సంఘాల యాత్ర ప్రజాభాగస్వామ్యానికి నిదర్శనంగా నిలిచాయి.

వెలుగుహారాన్ని, మెరుపు దీపాలను అలంకరించుకొన్న హుస్సేన్‌సాగర్‌ ఈ వేడుక సంబరాన్ని చూసి ఖచ్చితంగా మురిసిపోయి ఉంటుంది ! తెలంగాణ తల్లి గుండె ఆనందంతో తబ్బిబ్బయిపోయి ఉంటుంది ! ఎక్కడో పల్లెటూళ్ళో టీవీలో ఈ వేడుకను చూస్తున్న తెలంగాణ బిడ్డ కళ్ళలో కొత్తకాంతి వెలిగి ఉంటుంది ! కొత్త ఆశ చిగురించి ఉంటుంది ! ‘‘నా నేల… నా కష్టం… నా తెలంగాణ… నా పాలన ఇది’’ అని అనుకుంటూ బిగించిన పిడికిలి ఆకాశంలోకి లేచి ఉంటుంది…! నోరు తెరుచుకొని గొంతులోంచి ఒక్క పొలికేక పొగలివచ్చి ఉంటుంది. ‘‘జై తెలంగాణ… జై కేసీఆర్‌!’’ అని.

ప్రజా విజయానికి సలామ్‌

3జూన్‌ 2 నుండి 7 వరకు ‘నభూతో…’ అనే రేంజ్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ ఉత్సవం కనీవినీ ఎరగని విజయాన్ని సాధించడం వెనుక ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ఆలోచలు ఆదేశాలు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి మార్గ దర్శకత్వం, ప్రభుత్వ కార్యదర్శి బి.పి. ఆచార్య ప్లానింగ్‌, మంత్రివర్యులు చందూలాల్‌ నాయకత్వం, ‘సాంస్కృతిక సారథి’ రసమయి బాలకిషన్‌ సారథ్యం, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ ప్రత్యేక కమీషనర్‌ ఉమర్‌ జలీల్‌ సహకారం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నిర్వహణ, సమన్వయం, దోహదపడ్డాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు.

మొత్తం మీద, రాష్ట్ర అవతరణ ఉత్సవం తెలంగాణ ప్రజల విజయాన్ని మరోసారి గుర్తు చేసింది. ప్రజా విజయానికి సలామ్‌ చేసేలా, తెలంగాణ బిడ్డల ప్రగతికి పునరంకితం కావాల్సిన ఆవశ్యకతని ఇంకోసారి కర్తవ్య బోధ చేసింది. ముఖ్యమంత్రి కేె.సి.ఆర్‌ చెప్పినట్లు, ‘‘ప్రజల సంఘటిత శక్తిలో’’ ఉండే పవర్‌ ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఉత్సవం మరోసారి నిరూపించింది..!

నూతన ఒరవడికి శ్రీకారం
రాష్ట్ర అవతరణ పురస్కారం !

kతెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పేరు తీసుకొచ్చిన అంశాలు రెండున్నాయి. ఒకటేమో – ఏడు రోజు పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కళాసాంస్కృతిక సంబురాలు, రెండోదేమో – వివిధ రంగాలలో లబ్దప్రతిష్టులైన ప్రముఖులకు ప్రదానం చేసిన అవార్డు! తెలంగాణ రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిని తెచ్చిన  ప్రముఖులు, తెంగాణ రాష్ట్ర వికాసానికి, ఉద్యమానికి సేవ చేసిన ప్రముఖులను గౌరవించడం కోసం ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డు దేశ చరిత్రలోనే అపూర్వంగా నిలిచాయి. కొత్త రాష్ట్రంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయి. రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాలకు చెందిన 52 మంది ప్రముఖులకు ఈ అవార్డును ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేతుల మీదుగా అందించారు. ప్రభుత్వం ఈ అవార్డులను కేవలం రాష్ట్రస్థాయిలోనే కాక, మండల, జిల్లా, మునిసిపల్‌ కార్పొ­రేషన్‌, మునిసిపాలిటీ స్థాయిలలో కూడా అందించాలని నిర్ణయించడం ఓ ప్రత్యేకత. 68 ఏళ్ళ స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇంత భారీగా, అవార్డులను అందించిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే కావడం గర్వకారణం!

Other Updates