చల్లంగ మముచూడు తల్లీ!

తెలంగాణా-రాష్ట్ర-పండుగ--బోనాలుజులై 26వ తేదీ ఆదివారం నాడు అత్యంత వైభవోపేతంగా జగదాంబికామాతకి భక్తితో బోనమెత్తి లక్షలాదిగా తరలివచ్చారు. గోల్కొండ కోట నిండుగా జనులందరూ కిక్కిరిసిపోయారు. గంటల కొద్ది బారులుగా నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు. తొట్టె ఊరేగింపు, పోతరాజు సందడితో, డప్పు చప్పుళ్ళతో గోల్కొండ ప్రాంతమంతా తెలంగాణపై సాంస్కృతిక వైభవాన్ని చాటింది.

– అద్దంకి తిరుమల సుప్రసన్నాచార్య

‘‘కొడుకా మాపటికి జల్దిరా! రేపటినుండి బోనాల పండుగ షురూ! ఇల్లంతా సాపు చేసుకోవాలె! ఆడ బిడ్డను పండ్గకు పిల్చుకోవాలె! మాపటికి పోయి అమ్మను ఘటం ఎదుర్కరావాలె!..’’

తెలంగాణా-రాష్ట్ర-పండుగ--బోనాలుaస్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ సంస్కృతికి కట్టిన పచ్చతోరణం.. బోనాల పండుగ – చెట్టూ పుట్ట, రాళ్ళు రప్పల్లోనూ దైవత్వాన్ని చూసే తెలంగాణా  జీవితంలో బోనాల పండగకు విశిష్టస్థానం ఉంది. ‘బోనం’ అంటే, బువ్వ, భోజనం, అన్నం అని అర్థం. ఈ పండగను తెలంగాణా  అంతా దక్షిణాయన ఆషాఢ శ్రావణ మాసాల్లో తొలకరిలో వచ్చే జల్లుల నుండి ఇంట పుట్టిన పిల్ల పాప, గోదా గొడ్డుకు ఎలాంటి వ్యాధులు రాకుండా చల్లగా కాపాడమని, ఆ తల్లిని అత్తవారింటి నుండి తల్లి వారింటికి తెచ్చి అత్యంత ప్రీతితో తల్లికి నచ్చే భోజన ఫలహారాలను, ఒడిబియ్యం, సారెను నింపి సంతృప్తి పరిచి మళ్ళీ అత్తవారింటికి సాగనంపటంతో ముగిస్తారు.

హైదరాబాదు, సికిందరాబాద్‌ (లష్కర్‌), బోనాలకు దేశీయంగా ప్రసిద్ధి. ఆషాఢ మాసమంతా జంటనగరాల తెలంగాణ గ్రామీణ వాతావరణ శోభను నింపుకుంటాయి. ప్రతి ఆదివారం ఒక్కో గుడిలో జరిగే విధంగా, మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ప్రారంభమై, సికిందరాబాదు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, హైదరాబాదు పాతబస్తీలోని శాలిబండ అక్కన్న, మాదన్న మహాంకాళీ, లాల్‌ దర్వాజ మహాంకాళీ దేవాలయాల్లో మొత్తం 14 ప్రధాన అమ్మవార్ల దేవాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతాయి.

ఈ పండగ నిర్వహణలోని ముఖ్య ఘట్టాలు

ఎదురుకోళ్ళుా ఘటోత్సవం: ‘ఘటం’ అంటే కలశం, కలశంలో అమ్మవారిని ఆవాహనచేసి అత్తవారింటినుండి పుట్టింటికి ఎదురుకొని రావటమే ఘటోత్సవంలోని ప్రధాన భూమిక. పుట్టింటికి మంగళ వాద్యాలతో అమ్మవారికి స్వాగతం పలికి, బోనాల ముందు రోజు వరకు ఉదయ సాయంత్రాలు ప్రతి గడపకు వెళ్ళి వారి వారి పూజలను అందుకుంటుంది. ఇందులో భాగంగా భక్తులు వారి మొక్కులను తీర్చుకుంటూ ఒడి బియ్యం, సారె నింపి అమ్మవారిని సంతృప్తి పరుస్తారు. ఘటోత్సవంతో అంకురార్పణ జరిగినట్టుగా భావిస్తారు.

అమ్మవారి సోదరుడు పోతరాజు: పోతరాజు వేషం బోనాల పండగలో ప్రత్యేకంగా ఉంటుంది. ఒంటి నిండా పసుపు నింపుకొని, ఎర్రటి ధోవతిని మోకాళ్ళపైకి కట్టుకొని, చేతిలో పసుపుతాడుతో చేసిన కొరడా ధరించి, కాళ్ళకు గజ్జెలు, మెడలో పూలదండ, నిమ్మకాయలహారం, నడుంచుట్టూ వేప మండలు కట్టుకొని, కళ్ళకు కాటుక, నుదురు నిండా పసుపుపై పెద్ద కుంకుమ బొట్టు ధరిస్తూ తెలంగాణ బోనాల పాటలకు చిందు వేస్తూ డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ బోనాల ముందు కదిలివస్తాడు పోతరాజు. అమ్మవారి సోదరుడుగా గ్రామ సంరక్షణలో తోడుగా ఉంటాడని నమ్మకం.

సాక సమర్పణ: వేపాకు ఉంచిన పసుపు నీటిని అమ్మవారి ముందు అడ్డంగా పోసి తమను చల్లగా చూడమని కోరుతారు. పూర్వం ఈ ఆచారం తాటికల్లుతో ఉండేది. దీనినే ‘సాక ఇవ్వడం’ అంటారు.

తొట్టె సమర్పణ: ఇంటి ఆడపడచు అమ్మవారిని తొట్టెలో ఊగించి లాలించేందుకు తొట్టెను సమర్పిస్తారు. ఈ తొట్టె సమర్పణతో బాలారిష్టాలు పోతాయని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. ఈ తొట్టెను అమ్మవారితో వారి ఇంటికి పంపుతారు. శక్తిని బట్టి తొట్టె అంతరాలు ఉంటాయి.

రంగం భవిష్యవాణి : బోనాల పండుగ తరువాత రోజు ఉదయం అమ్మవారిని ఆవహించిన అవివాహిత స్త్రీ మాతంగి పచ్చికుండపై నిలబడి భవిష్యవాణిని వినిపిస్తుంది. భవిష్యత్తులో జరిగే కష్టసుఖాలను అమ్మవారి మాటగా వినిపిస్తుంది. ఈ మాతంగులు ప్రతి దేవాలయానికి ఒక్కరు ఉంటారు. లేదా కొన్ని ఆలయాలకు ఒక మాతంగి ఉండవచ్చు. మొత్తం బోనాల్లో ఈ రంగం భవిష్యవాణి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

కొలువు పోతరాజు బలి: కొలువు పోతరాజు బలిగా పూర్వం జంతుబలి జరిగేది. ఆ జంతువు తలను ఒక్క దెబ్బతో కత్తిరించి తలపై పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ సోమవారం ఉదయాన్నే మంగళవాద్యాలతో నృత్యం చేస్తూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నివేదన చేసేవారు. ఇప్పుడు అది కూష్మాండ బలి (గుమ్మడికాయ,సోరకాయ)గా మారి తన నోటితో తుంపి గావుపట్టడం చేస్తున్నారు.

ఫలహారపు బండ్లు: ఇంటి ఆడపడుచు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇండ్లలో తయారుచేసుకొని బోనాలరోజు సాయంత్రం, గొర్రెలు, ఒంటె సాయంతో బండ్లలో పెట్టుకొని వచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, నివేదన చేసి ప్రసాదంగా అందరూ స్వీకరిస్తారు.

సాగనంపటం: కోలువు పోతరాజు బలి తరువాత అమ్మవారిని మంగళవాయిద్యాలతో అన్ని వీధుల గుండా ఊరేగిస్తూ ఆమెను సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు. తెలంగాణలో బోనాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిలో ఆ తల్లిని పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మరీడమ్మ, మహంకాళమ్మలుగా పూజిస్తారు. రూపం ఏదైనా భావమొక్కటే ‘సల్లంగ మమ్ము సూడు తల్లి’ అని నిండు మనసుతో పూజిస్తారు. బోనాలు ఈనాడు తెలంగాణ రాష్ట్ర పండగ. తెలంగాణ జీవితంలోని మాధుర్యాన్ని చవిచూపించే సాంస్కృతిక వేడుక ఈ బోనాల పండుగ.

Other Updates