తెలుగు ప్రజల్లో వివిధ విషయ పరిజ్ఞానం పెంపొందించటానికి, గ్రంథపఠనాసక్తిని వ్యాప్తి చేయటానికి 20 వ శతాబ్ది ప్రారంభం నుంచే అంతటా అనేక గ్రంథమాలలు, ప్రచురణ సంస్థలు ఏర్పాడ్డాయి.తెలంగాణలో నిజాం ప్రభుత్వ పరిపాలనలో తెలుగు భాష నిరాదరణకు గురి అయినా ఇక్కడి ప్రజల్లో భాషా సాహిత్య చైతన్యం వెల్లి విరియటానికి ఎందరో వైతాళికులు గణనీయమైన కృషి చేశారు. అయితే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వారి కృషి, మన గంధ్రమాలల చరిత్ర మరుగున పడిపోయింది.
తెలంగాణా స్వతంత్ర రాష్ట్రం ఏర్పడిన ఈ శుభతరుణంలో అజ్ఞాతంగా ఉన్న చరిత్రను వెలుగులోకి తెచ్చి ఆ చైతన్యమూర్తుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ బంగారు తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. లభిస్తున్న సాక్ష్యాల ఆధారంగా 1901`56 మధ్య నెలకొన్న గ్రంథమాలల విశిష్ట సేవను కాలక్రమాను సారంగా స్మరించుకోవటమే ఈ వ్యాసం లక్ష్యం.
విజ్ఞాన చంద్రికా గ్రంథమాల (1906)
నిజాం రాష్ట్రంలో గ్రంథమాలల స్థాపనకు మార్గదర్శకమైన ప్రాతఃస్మరణీయ సంస్థ, 1906లో ఏర్పడిన విజ్ఞాన చంద్రికా గ్రంథమాల. 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయ స్థాపనకు దోహదం చేసిన వారే ఈ గ్రంథమాలను నెలకొల్పటం గమనించవలసిన అంశం.
కొమర్రాజు లక్ష్మణరావుతో పాటు, మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు, అయ్యదేవర కాళేశ్వరరావు , ఆదిరాజు వీరభద్రరావు ఈ గ్రంథమాల నిర్వహణలో పాల్గొన్నారు. ఈ సంస్థ ప్రచురించిన ప్రసిద్ధ పరిశోధకులైన కొమర్రాజు వారి, హిందూ మహాయుగము, తెలుగులో మొట్టమొదటి ప్రామాణిక చారిత్రక గ్రంథంగా పేర్కొనదగింది. రెండవ భాగమైన ‘మహ్మదీయ మహాయుగం’లో గోలకొండ మంత్రులైన అక్కన్న, మాదన్నల చరిత్ర సవిస్తరంగా ఉంది.
అయితే 1908 లో ఈ గ్రంథమాల కార్యక్షేత్రం మద్రాసుకు మారటంతో దీనికి హైదరాబాదుతో సంబంధం తెగిపోయింది. కాని తెలంగాణ పరిశోధకులకు ఆద్యుడైన ఆదిరాజు వీరభద్రరావు, లక్ష్మణరావు వెంట మద్రాసు వెళ్లి 1908 నుంచి 1914 వరకూ ఆయనకు సహాయకుడుగా ఉన్నాడు. దేశచరిత్రలు, జీవిత చరిత్రలు, స్వీయచరిత్రలు, నవలలు, అర్థశాస్త్రం, విజ్ఞాన శాస్త్రగ్రంథాలు మున్నగుపలు ప్రక్రియా గ్రంథాలను ప్రచురించిన ఈ గ్రంథమాల తెలుగుదేశంలో విజ్ఞాన చంద్రికలను వెదజల్లింది.
విజ్ఞాన ప్రచారణీ గ్రంథమాల (1918)
వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామం నుండి తొలి తరం వారపత్రిక ‘తెనుగు’ (1922) ను నడిపిన ఒద్దిరాజు సోదర కవులు (సీతారామచంద్రరావు, రాఘవరంగారావు) అంతకుముందే ‘విజ్ఞాన ప్రచారణీ గ్రంథమాల’ను (బహుశా కొమర్రాజు లక్ష్మణరావు స్ఫూర్తితో) నెలకొల్పారు. 1918లో ఆ గ్రంథమాల పక్షాన సీతారామచంద్రరావు నవల ‘రుద్రమదేవి’ బెజవాడలో అచ్చయిన సందర్భంలో ముద్రణకు సంబంధించిన పనులన్నీ నేర్చుకొని మరుసటి సంవత్సరమే మద్రాసు నుండి ముద్రణా యంత్రాన్ని కొనుగోలు చేసి ‘విజ్ఞాన ప్రచారణీ ముద్రణాలయం’ (1919) ప్రారంభించారు.
వివిధ వృత్తి కళల్లో ఆరితేరిన ఒద్దిరాజు సోదరులు తాము ఆర్జించిన విజ్ఞానాన్ని అందరికీ పంచాలన్న తపనయే ఈ గ్రంథమాల స్థాపనకు ప్రేరకమైంది. అక్కినేపల్లి జానకి రామారావు గ్రంథమాల సంపాదకులుగా వ్యవహరించారు. విజ్ఞాన దాయకమూ, దేశభక్త ప్రబోధకమూ అయిన గ్రంథాలను నెలకొకటైనా ప్రచురించాలన్న ఆశయంతో నెలకొన్న ఈ సంస్థ 1932 వరకూ సుమారు ఇరవైకిపైగా గ్రంథాలు ప్రచురించింది. వీనిలో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ సోదరకవుల వివిధ ప్రక్రియా రచనలు కావటం ప్రశంసార్హం.
చివరిదశలో ఈ గ్రంథా లయాలను రాజవైద్య పింగళి లింబాద్రిరెడ్డి నెమలికొండకు (కరీంనగర్ జిల్లా) తరలిం చినట్లు తెలుస్తున్నది. విజ్ఞాన ప్రచారణీ గ్రంథమాలలో ప్రచురితమైన ప్రసిద్ధ గ్రంథాలలో కొన్ని రుద్రమదేవి, శౌర్యశక్తి, ముక్తలవ, శకుంతల, పావని, హరిశ్చంద్ర, సాంఘిక చరిత్ర, విషచికిత్సలు, తోటలు కాయగూరలు, మొదలగునవి.
అణా గ్రంథమాల (1938)
ప్రజల్లో మాతృభాషాభిమానం కలిగించి భాషా ప్రచారం కావించటం, నిత్యజీవితంలోని వివిధ సమస్యలపై అవగాహన కలిగించటం, మహానీయుల జీవిత చరిత్రల ద్వారా ఉద్యమ స్ఫూర్తికి దోహదం చేయటం మున్నగు ఆశయాలతో కె.సి. గుప్త, వెల్దుర్తి మాణిక్యరావు, గుండవరపు హనుమంతరావుల ఆధ్వర్యంలో 1938లో ‘అణా గ్రంథమాల’ నెలకొల్పబడిరది.4 సంవత్సరాలలో సుమారు 40 పుటల పరిమితిలో 100 గ్రంథాలను ప్రచురించాలన్న నియమాలు పెట్టుకొన్నారు. వ్యాస రూపంలో ఉన్న ఈ చిన్న గ్రంథాలను ఒక అణాకే అందించటం వల్ల దీనికి ‘అణా గ్రంథామాల’ అని పేరు పెట్టారు. ఈ గ్రంథమాల పక్షాన 40 గ్రంథాలు, కథలు, నవలలు, జీవితచరిత్రలు, ప్రజాసమస్యలు మొదలైనవి వెలువడినాయని తెలుస్తున్నది.
నిజాం ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ సంస్కరణల పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో తొలి ప్రచురణగా వాటిని తెలుగులోకి అనువదించి ‘రాజ్యాంగ సంస్కరణలు’ పేరుతో ప్రకటించారు. పన్నుల భారంతో రుణగ్రస్తులైన రైతుల దీనస్థితిని చిత్రిస్తూ, వెల్దుర్తి మాణిక్యరావు ‘రైతు’ అన్న పొత్తాన్ని వెలువరించారు. మాడపాటి హనుమంతరావు ‘మాలతీగుచ్ఛము’, సురవరం ప్రతాపరెడ్డి ‘మొఘలాయీ కథలు’ 2 భాగాలు (1940), ‘కాళోజీ కథలు’ అణా గ్రంథమాల ప్రచురణలుగా వెలవడినై ఈ గ్రంథమాల ప్రకటించిన మరికొన్ని గ్రంథాలు`
ఆంధ్రవీరులు, స్వామి దయానంద సరస్వతి, సావర్కర్ జీవితం (కె. రంగదాసు), సుభాష్ చంద్రబోస్, పండిత జవహర్‌లాల్ నెహ్రూ, (కె. రంగాదాసు), యం.యన్.రాయ్ (గుండవరము హనుమంతరావు), బమ్మెర పోతన (పంతం ఆంజనేయులు), జాగీర్లు (ఉమ్మెత్తల కేశవరావు, సురవరం ప్రతాపరెడ్డి) సోషలిజం (గొబ్బూరి రామచంద్రరావు).
కాంగ్రెస్ 2 భాగాలు (జానపాటి సత్యనారాయణ) అనువంశికము వాహకులు (బి.వి.రమణారావు) ఖాది వ్యాసములు, రాజకీయ పరిజ్ఞానం, అణాకథలు (1940) ఎల్లోరా అజంతా (అడవిబాపిరాజు) నా కొడుకు (ధనికొండ హనుమంతరావు నవల), ప్రతిఫలం (నందగిరి వెంకటరావు నవల) మణిరేఖల (పులపర్తి కమలాదేవి నవల)
పై గ్రంథ రచయితల్లో కొందరు తెలంగాణేతరులు కూడా ఉన్నారు. హైద్రాబాద్ డిఫెన్స్ రూల్స్ (33`7) క్రింద దేశభక్తి ప్రబోధాత్మకమైన సుభాష్ చంద్రబోస్, (అణా గ్రంథమాల 20వ ప్రచురణం) ను నిజాం ప్రభుత్వం నిషేధించటమే కాక, కె.సి. గుప్త గారిని అరెస్ట్ చేసి జుర్మానాను వసూలు చేయడం జరిగిందంటే అణా గ్రంథమాల ఉద్యమ చైతన్యం అవగతమవుతుంది.
దేశోద్ధారక గ్రంథమాల (1938)
ప్రసిద్ధ పత్రికా సంపాదకులు గ్రంథ ప్రకాశకులు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు పేరిట 1938 లో సికింద్రాబాదులో ‘దేశోద్ధారక గ్రంథమాల’ను నెలకొల్పిన వట్టికోట ఆళ్వారుస్వామి (1915`16) తెలంగాణా రచయితల పెక్కు అమూల్య గ్రంథాలను ప్రకటించి సాహిత్య చైతన్య వ్యాప్తికి నిర్విరామ కృషి సల్పారు. నిజాం నిరంకుశ ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం మూలంగా మధ్యలో జైలు జీవితం గడపటం వల్ల కొంత అవాంతరం ఏర్పడినప్పటికీ 1951 నుంచి 1961లో తుది శ్వాస వదిలే వరకూ ఎందరో రచయితల గ్రంథాలను వెలుగులోకి తెచ్చాడు. ఏ ఊరికి వెళ్ళినా అముద్రిత ప్రతులను సేకరించి వెంటనే వాటి ప్రచురణకు పూనుకొనేవారు. అలా 1938`61 మధ్య విలువైన 33 గ్రంథాలు ముద్రితమైనాయి. కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు మున్నగు ప్రక్రియలకు చెందిన మరో 25 గ్రంథాల ముద్రణ ప్రణాళిక కూడా సిద్ధం చేశారు.
గ్రంథ ప్రచురణలో దేశోద్ధారక గ్రంథమాల విశిష్టతను నిరూపించటా నికి కింద పేర్కొనబడిన రచనలే సాక్ష్యం.
సురవరం ప్రతాపరెడ్డి ‘హైందవవీరులు’ ఈ గ్రంథమాల తొలి ప్రచురణ కాగా, ఆయన ‘ప్రాథమిక స్వత్త్వములు’ (1938) గ్రంథాల యోద్యమము (1940) కూడా తర్వాత అచ్చయినాయి.
శ్రీ కాళోజీ ‘నా గొడవ’ (1953) ` ఆలంపూరులో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవ సభలలో విడుదలయింది.
శ్రీ జైలులో సహవాసిగా ఉండి మైత్రీ బంధంపెనవేసుకు పోయిన దాశరథి గేయసంపుటి ‘పునర్నవం’ (1956).
శ్రీ వట్టికోట స్వీయరచనలైన ‘ప్రజల మనిషి’ నవల, ‘జైలులోపల’ కథల సంపుటి.
శ్రీ 34 మంది రచయితల కథల సంపుటి ‘పరిసరాలు’ రెండు భాగాలు (1956)
శ్రీ ‘తెలంగాణ’ వ్యాససంపుటి మొదటిభాగం (1956) ` ఇందులో ఆదిరాజు వీరభద్రరావు, వానమామలై వరదాచార్యులు, కొండపల్లి శేషగిరి రావు మొదలైన వారి 19 వ్యాసాలు చోటుచేసుకున్నాయి.
శ్రీ ‘తెలంగాణ’ రెండోభాగం (రావినారాయణరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు మున్నగు వారి 13 వ్యాసాల సంపుటి).
శ్రీ ‘జీవన రంగం’ రెండుభాగాలు (15 గురు రచయితల 15 ఏకాంక నాటికల సంకలనాలు).
శ్రీ నేదునూరు గంగాధరం సంకలనం చేసిన జానపద గేయాల సంపుటి ‘సెలయేరు’
శ్రీ ఆదిరాజు వీరభద్రరావు ‘తెలంగాణం’ (3వ భాగం) వ్యాస సంపుటి
శ్రీ కె.ఎల్. నరసింహారావు నాటికలు ( కళా సౌధము)
శ్రీ వానమామలై వరదాచార్యుల ‘ఆహ్వానము’ (గేయాలు)
శ్రీ హీరాలాల్ మోరియా కథా సంపుటి ‘బ్రతుకుబాటలు’
శ్రీ పొట్లపల్లి రామారావు గేయాలు (ఆత్మవేదన)
శ్రీ ఖండవల్లి బాలేందు శేఖరం `
కమాల్ పాషా జీవితం (2 భాగాలు)
శ్రీ విష్ణు చక్రం గారి ‘గాంధీ మహాత్ముడు (2 భాగాలు)
శ్రీ సంస్థాన ప్రజల సమస్యలు (డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య)
శ్రీ కాంగ్రెసు `సంస్థానాలు
శ్రీ ఔంధు సంస్థానము (పులిగడ్డ వెంకట సుబ్బారావు)
శ్రీ ప్రజలు ` ప్రభుత్వం (లియోటాల్‌స్టాయ్ రచనకు అనువాదం)
శ్రీ నా భారతదేశమాత (హెచ్.ఎన్. బ్రెయిల్స్ ఫర్డ్ గ్రంథానికి కాళోజీ అనువాదం)
శ్రీ ప్రభాస ( 3 ఉపన్యాసాల సంపుటి) ` 1958
ఈ సంపుటి చివర పైన పేర్కొన్న ముద్రిత గ్రంథాలతోపాటు రాబోవు ప్రచురణలుగా 25 గ్రంథాల పేర్లను ప్రకటించటం జరిగింది. అయితే వీటిలో ఎన్ని అచ్చయినాయో సరైనా వివరాలు తెలియటం లేదు. ఏమైనా తెలంగాణా సాహిత్యోద్యమంలో దేశోద్ధారక గ్రంథమాల గణనీయమైన పాత్ర వహించిందనటం అతిశయోక్తి కాదు.
ఆంధ్ర చంద్రికా గ్రంథమాల (1945)
1945లో ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు పష్టిపూర్తి ఉత్సవ సందర్భంలో ప్రజలు బహూకరించిన 6400 రూపాయలతో ఆయన ఈ గ్రంథమాలను నెలకొల్పడం జరిగింది. గ్రంథాల అమ్మకంపై వచ్చిన ధనాన్ని బ్యాంకులో జమచేయగా అది రూ. 20,000లకు పెరిగినపుడు మాడపాటివారు ఆ మొత్తాన్ని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల స్థాపనకోసం విరాళంగా ఇచ్చి గ్రంథమాలను ఆపివేశారు. ఈ గ్రంథమాల పక్షాన ప్రకటితమైన కొన్ని గ్రంథాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
1. మాడపాటి వారి స్వీయ రచన ‘ఆంధ్రోద్యమము’ రెండు భాగాలు.
2. ఖండవల్లి లక్ష్మీరంజనం ‘ఆంధ్రసాహిత్యచరిత్ర సంగ్రహము’
3. ఖండవల్లి బాలేందుశేఖరం ‘విస్మృత సామ్రాజ్యములు’
4. ఆదిరాజు వీరభద్రరావు ‘ప్రాచీనాంధ్ర నగరములు’
5. బి.వి. రమణారావు ‘వైజ్ఞానికుల జీవితములు’
6. రాంపల్లి విశ్వేశ్వరరావు ‘పౌర ధర్మములు’
పైన పేర్కొన్న ప్రసిద్ధ గ్రంథమాలలతో పాటు వరంగల్‌లో మరి రెండు గ్రంథమాలలు స్థాపితమైనట్లు తెలుస్తున్నది. కాని వాటి కాలం గురించి వివరాలు అలభ్యం.
కాకతీయ గ్రంథమాల
ఓరుగల్లులో తూము వరదరాజులు గారు దీనిని స్థాపించి ప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు శేషాద్రి రమణ కవుల సంపాదకత్వంలో కింది గ్రంథాలను ముద్రింపజేశారు.
` ఆంధ్రమంత్రుల చరిత్ర, ఆంధ్ర పద నిదనము, దాసభోద, విక్రమోర్వశీయము, వసుంధర మొదలగునవి.
విశ్వేశ్వర గ్రంథమాల
వరంగల్‌లో విశ్వేశ్వరాలయాన్ని నిర్మించిన సంపన్నులు ఆకారపు నరసింగం గుప్త విశ్వేశ్వర గ్రంథమాలను స్థాపించి సుమారు 20 శైవ మత సంబంధ గ్రంథాలను ప్రకటించారు.
పై గ్రంథమాలలే కాక, తెలంగాణ సాంస్కృతికోద్యమంలో సాహిత్య సంస్థలు కూడా ప్రశంసనీయ పాత్ర వహించి గ్రంథ ప్రచురణలు చేసినవి.
ఆధారాలు:
1. బి. రామరాజు వ్యాసం (ఆంధ్ర సారస్వత పరిషత్తు)
2. బండారు సుజాత శేఖర్ వ్యాసం (నేటి నిజం దినపత్రిక స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక సంచిక ` 2001)
3. బి. దామోదరరావు వ్యాసం (బతుకమ్మ` 26`8`2012)
4. ప్రభాస (వ్యాస సంపుటి ` 1958)