ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థి యువకుల త్యాగాలను భవిష్యత్ తరాలు స్మరించుకోవడానికి అమరవీరుల స్మారక చిహ్నాలను నిర్మించాలన్న తెలంగాణ ప్రజాసమితి ఆకాంక్షను, హైదరాబాద్ నగర మునిసి పల్ కార్పొరేషన్ నిర్ణయాన్ని అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో 1969 ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఏం జరుగబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఆ రెండు రోజులూ తరగతులను బహిష్కరించి తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాల శంకుస్థాపనోత్సవాలకు హాజరుకావలసిందిగా తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఫిబ్రవరి 20న విద్యార్థులకు విజ్ఞప్తి చేసింది.
నగర మేయర్ లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 23న, డిప్యూటీ మేయర్ రామచంద్రయ్య, ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌లో స్మారక చిహ్నాలకు శంకుస్థాపనోత్సవాలు జరపాలని మునిసిపల్ కార్పొరేషన్ తీర్మానించింది.
గన్‌పార్క్ అమరవీరుల స్థూపానికి ఫిబ్రవరి 23న శంకుస్థాపన జరుగుతుందనగా 22వ తేదీ రాత్రి 11 గంటల తర్వాత తెలంగాణ ఉద్యమ కారుడు ప్రముఖ జర్నలిస్టు ప్రతాప్‌కిశోర్ తన సహచరుడైన విలియమ్స్‌తో కలిసి పోలీసుల కన్నుగప్పి గన్‌పార్క్‌కు చేరుకున్నారు. అంతకుముందే విలియమ్స్ అమరుల కుటుంబ సభ్యులను కలిసి ఉద్యమంలో మరణించిన విద్యార్థులు వాడిన పెన్నులు, పుస్తకాలు, వారి దుస్తులు, సర్టిఫికెట్లు మొదలైనవి సేకరించి తనతో గన్‌పార్కుకు తెచ్చారు. శంకుస్థాపన జరుగబోయే స్థలంలో గుంతతీసి అమరుల వస్తువులను దానిలో పెట్టి మట్టికప్పినారు. ఇదంతా చీకటిమాటున ఎవరికీ తెలియకుండా జరిగిపోయింది. ఈ సంగతి మరునాడు శంకుస్థాపన చేసిన వారికి కూడా తెలియదు. చాలా ఏళ్లు రహస్యంగా వుంచబడిన ఈ సమాచారాన్ని ‘ది మ్యాన్ హూ సోవ్డ్ ది సీడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ పుస్తకంగా ప్రతాప్‌కిశోర్ కూతురు నీరా కిశోర్ వెల్లడించారు.
పోలీసుల స్వాధీనంలో గన్‌పార్క్
ఫిబ్రవరి 22 అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నగర పోలీసులు అసెంబ్లీ భవనం ముందున్న గన్‌పార్క్ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చు కున్నారు. వేకువ ఝామునుండే పెద్ద సంఖ్యలో పోలీసులు వలయాకారంలో ఏర్పడి ఈ ప్రాంతానికి ఏ వ్యక్తిని కూడా రానీయకుండా పహారా కాశారు. గన్‌పార్క్‌కు చేరే అన్ని రోడ్లపై అడ్డంగా తారుపీపాలు, చెత్తకుండీలు, రాళ్లువేసి తాత్కాలిక బారికేడ్లు నిర్మించారు.
ఉదయం పదిన్నర కావస్తున్నది. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. జంటనగరాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి గన్‌పార్క్ వైపు రాబోతుంటే పోలీసులు అడ్డుకుని పలుచోట్ల లాఠీచార్జీ చేశారు. బ్యారికేడ్లకు వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు చేరినారు.
పోలీసు వలయాన్ని ఛేదించిన నేతలు
ఉదయం పదిన్నరకు హఠాత్తుగా, ఎంతో వేగంగా మూడుకార్లు గన్‌పార్క్ వద్దకు దూసుకొని వచ్చాయి. నగర మేయర్ లక్ష్మీనారాయణ, మాజీ మేయర్ కుముద్‌నాయక్, మునిసిపల్ కార్పొరేషన్‌లో ప్రత్యేక రాష్ట్ర వాదుల నాయకుడు టి. గోవింద్‌సింగ్, ప్రజాసమితి నాయ కుడు డా|| ఎం. చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్, డా|| బి.జె. నాయక్ తదితరులు ఈ కార్లలో వున్నారు. పోలీసులు ఈ కార్లను ఆపడానికి ముందుకు వస్తూ ఉండగానే క్షణాల్లో కార్లువచ్చి గన్‌పార్క్ వద్ద నిలిచినవి. రెప్పపాటు కాలంలోనే మేయర్ లక్ష్మీనారాయణ, టి. గోవింద్‌సింగ్ తదితరులు శిలా ఫలకాన్ని, తాపీ పని ముట్లను వెంట తీసుకుని కార్లలోనుండి దూకి గన్‌పార్క్ లోకి పరిగెత్తారు. వారితో వచ్చిన నేతలు పోలీసులను ప్రతిఘటించారు. రెండు నిమిషాల్లో స్మారక చిహ్నం శంకుస్థాపన జరిగిపోయింది. గన్‌పార్క్‌కు కొద్ది గజాల దూరంలోని పోలీసు కంట్రోల్ రూంవద్ద దారికాస్తున్న ఉన్నతాధికారులు పరిగెత్తుతూ వచ్చి మేయర్ లక్ష్మీనారా యణను, శాసనసభ్యులు మాణిక్‌రావునూ, ఇతర నేతలనూ అరెస్టు చేసి పోలీసు కంట్రోల్ రూంకు తీసుకుపోయారు. పోలీసులు అడ్డుకోవడంతో కారులోనే ఉండిపోయిన డా|| చెన్నారెడ్డిని, కుముద్‌నాయక్‌ను, మదన్‌మోహన్ తదితరులను కారులోనుంచి క్రిందకు దించి కంట్రోల్ రూంకు తీసికెళ్ళారు. కొందరు పోలీసు అధికారులు దౌర్జ న్యంగా గన్‌పార్క్‌లోకి వెళ్ళి శిలాఫలకాన్ని తొలగించారు. దీనితో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసు కంట్రోల్‌రూంపై రాళ్ళవర్షం కురిపించారు. ప్రజలను చెదరగొట్టడానికి పోలీసుల భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ప్రయోజనం లేకపోగా లాఠీచార్జీ చేశారు. కోపోద్రిక్తులైన ప్రజలు ఆ తర్వాత నగరంలో అనేకచోట్ల ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వ వాహనాలపై రాళ్ళు రువ్వి వాటిని ధ్వంసం చేశారు. రెండు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల రికార్డులను తగుటబెట్టారు. హైదర్‌గూడాలోని బయోలాజికల్ ఇండియా శాఖ కార్యాలయంపై దాడిచేసి రికార్డులను బయటికి తెచ్చి దగ్దం చేశారు. కంపెనీల రిజిస్ట్రార్ కార్యాలయంనుండి డూప్లికేట్ యంత్రాలు బయటకు లాగి దగ్దం చేశారు. చిరాగ్‌అలీ లేన్‌లో గల ఎలక్ట్రిసిటీ బోర్డు సబ్ ఆఫీస్‌లోని పత్రాలకు కూడా ఇదే గతి పట్టింది. బషీర్‌బాగ్‌లో ఒక కానిస్టేబుల్‌పై జనం దాడి చేశారు. జనం విసిరిన రాళ్ళ వలన బస్సులో ప్రయాణిస్తున్న కొందరికి గాయాలైనవి. ఒక డిప్యూటీ పోలీస్ కమిషనర్ సహా పలువురు పోలీసు అధికారులకు రాళ్ళ దాడివలన గాయాలైనవి. మేయర్ అరెస్టు వార్త తెలియగానే కార్పొరేషన్ సిబ్బంది పనులు మానివేసి బయటకు వచ్చారు. గౌలిగూడాలో ప్రజలను చెదరగొడుతున్న పోలీసులను పాల సీసాలతో ఎదుర్కొన్నారు. బొల్లారంలో ఒక లోకల్ ట్రైన్‌పై, ఖాండ్వా ప్యాసింజర్ రైలుపై ప్రజలు రాళ్ళ వర్షం కురిపించారు. శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌పై జనం దాడిచేసి ఆస్తిని ధ్వంసం చేశారు. వరంగల్‌లో కూడా విద్యార్థులు పెద్దఎత్తున తరగతులను బహిష్కరించి వీధుల్లోకి రాగా పోలీసులు పలు ప్రదేశాల్లో లాఠీఛార్జీ చేేశారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలవద్ద పోలీసులకు, విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురు విద్యార్థులు, ఒక సబ్ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్ గాయపడినారు. మల్టీపర్పస్, లష్కర్‌బజార్ స్కూళ్ళవద్దకూడా పోలీసులు లాఠీఛార్జీచేసి విద్యార్థులను చెదరగొట్టినారు. కోపోద్రిక్తులైన విద్యార్థులు ఆర్టీసీ బస్సులపై రాళ్ళు రువ్వినారు. ఖమ్మం పట్టణంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. శిలాఫలకం తొలగింపుకు, నాయకుల అరెస్టుకు నిరసనగా ఫిబ్రవరి 24న తెలంగాణ బంద్ జరుపాలని ప్రజాసమితి పిలుపునిచ్చింది. అరెస్టు చేసిన నేతలను సాయంత్రానికి విడిచిపెట్టారు పోలీసులు.
శాసనసభలో మేయర్ అరెస్ట్‌పై వాయిదా తీర్మానం:
గన్‌పార్క్‌వద్ద మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ తదితరులు అరెస్ట్‌పై తెలంగాణ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫిబ్రవరి 24న సభలో ఈ విషయమై వాయిదా తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. మాజీ మంత్రి వి.బి.రాజు ఈ తీర్మాణంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ‘బలప్రయోగం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కల్ల’అని అన్నారు. ‘బల ప్రయోగం ద్వారా ఉద్యమాలను అణచాలని చూడడం పాతకాలపు ఆలోచన. చరిత్ర ఏమిటో మన కళ్ళ ముందే ఉన్నది’ అని రాజు అన్నారు. ‘అమరుల స్మారక చిహ్నాల నిర్మాణాన్ని మునిసిపల్ కార్పొరేషన్ కొనసాగించ కుండా నిలుపుదల చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాల’ని వి.బి.రాజు ప్రభుత్వాన్ని కోరినారు.
‘ఈ విషయమై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అక్రమం, నీతి బాహ్యమైన చర్య’ అని బద్రీ విశాల్ పిట్టీ అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించు కోవాలని కమ్యూనిస్టు సభ్యుడు తీగల సత్యనారాయణ కోరారు. శిలాఫలకాన్ని వాపసు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యను సర్దార్ గౌతు లచ్చన్న తప్పుబడుతూ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకో వాలన్నారు. నూకల రామచంద్రారెడ్డి ప్రశ్నోత్తరాల సమ యంలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ‘గన్‌పార్క్ మునిసిపల్ కార్పొరేషన్ ఆస్తి అనే విషయం అందరికీ తెలిసిందే. కవ్వింపు చర్య ఏదీ లేకున్నా ఆ పార్కును పోలీసులు స్వాధీనం చేసుకుని లాఠీఛార్జీ చేసి భాష్పవాయువు ప్రయోగించింది ప్రభుత్వం. 300మంది మృతవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మాణాన్ని అడ్డగించి ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనస్సులను నొప్పించింద’ని ఆయన అన్నారు.
(వచ్చే సంచికలో… క్లాక్‌టవర్ స్మారక చిహ్నానికి శంకుస్థాపన)