assemblyశాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు 18 రోజుల పాటు జరిగి రికార్డు సృష్టించాయి. డిసెంబరు 16న ప్రారంభమైన సమావేశాలు జనవరి 18వ తేదీ వరకు నడిచాయి. మొత్తంగా సెలవులు పోను 18 రోజుల పాటు శాసనసభ, శాసనమండలి కొనసాగాయి. విపక్షాలు అడిగిన ప్రతి విషయానికి కూలంకషంగా జవాబులిచ్చి ప్రభుత్వం ఇరు సభలలో శభాష్‌ అనిపించుకుంది.

జాతీయ స్థాయిలో సభల నిర్వహణకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. సభానాయకుడి గా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తన హుందాతనాన్ని చాటుకున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీష్‌రావు సంయమనంతో వ్యవహరించి అన్ని పక్షాల సభ్యులను సమన్వయ పరుస్తూ సభ సజావుగా సాగేలా కృషిచేశారు. సమయంతో నిమిత్తం లేకుండా చర్చలు అర్ధవంతంగా జరిగాయి. సభ్యులు అడిగిన దాంట్లో న్యాయమైన వాటికి స్వ, పర భేదాలు లేకుండా కేసీఆర్‌ అంగీకారం తెలపడంతో విపక్షాల సభ్యులే ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ పాలనను, పాలసీలను ప్రశంసించక తప్పలేదు. విపక్షాలు అడిగిన అన్ని అంశాల పై చర్చకు అవకాశం ఇచ్చారు. 15 అంశాల పై స్వల్ప కాలిక చర్చ జరిగింది.

సభలో విధాన పరమైన ప్రకటనలు చేసి సీఎం కేసీఆర్‌ సభ హుందా తనం పెంచారు.

హౌజింగ్‌ పై చర్చ సందర్భంగా 3600 కోట్ల రూపాయల బకాయిలు మాఫీ చేస్తున్నట్లు సభలో ప్రకటించిన కేసీఆర్‌ ప్రశంసలు అందుకున్నారు. ఆ బకాయలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని తాను డిమాండ్‌ చేద్దామనుకున్నానని, కానీ తాను డిమాండ్‌ చేసే అవకాశం రాకుండానే కేసీఆర్‌ బకాయలు మాఫీ చేశారని జానారెడ్డి సభలోనే ప్రకటించారు. ఇది కేసీఆర్‌ సమర్థ పాలనకు, సమయస్పూర్తికి మచ్చుతునకగా నిలిచింది. మొదటి సారి మత్స్య కారుల గురించి ఇరు సభలలో చర్చించి వారికి భరోసా కల్పించారు.

ఇరు సభలలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న విపక్షాలకు చివరికి ప్రభుత్వాన్ని అభినందించక తప్పలేదు. సభలో ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులు అడిగిన అన్ని సమస్యలపై ధీటుగా సమాధానం చెప్పగలిగింది. ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల గురించి చర్చించిన చివరిరోజు ఎంఐఎంతో సహా అన్ని పక్షాలు ప్రభుత్వాన్ని ప్రశంసించాయి. 12శాతం మైనారిటీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అమలుచేసి తీరుతామని సీఎం విస్పష్టంగా ప్రకటించి దానిపై ఉన్న సందేహాలను పటాపంచలు చేశారు.

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిపై కూడా మంత్రి కేటీఆర్‌ సుదీర్ఘమైన ప్రసంగం చేయడంతో పాటు మంచినీరు, పారిశుద్యం, ట్రాఫిక్‌ విషయంలో తాము చేపడుతున్న ప్రణాళికలు, వాటికి అయ్యే వ్యయాన్ని తెలిపారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, భారీ ప్రాజెక్టులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు భూపంపిణీ, షాదీముభారక్‌, కళ్యాణలక్ష్మీ, శాంతిభద్రతలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వైద్య విధానం, విద్యార్థులకు ఫీజుల బకాయల చెల్లింపు తదితర అంశాలపై లఘుచర్చ జరిగింది. మొత్తంగా ఈ సభలో 16 బిల్లులు ఆమోదించారు.

శాసనసభలో ఆయా పార్టీలు మాట్లాడిన సమయాలు

సభా నాయకుడిగా సీఎం కేసీఆర్‌ మొత్తం 9.17 గంటలు మాట్లాడారు.

ఇక సభలో మాట్లాడిన పార్టీల విషయంలో పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్‌ మొదటి స్థానంలో నిలిచింది.

కాంగ్రెస్‌ సభ్యులు మొత్తం 19.13 గంటలపాటు మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ 17.21 గంటలు

బీజేపీ 10.10 గంటలు

ఎంఐఎం 6.54 గంటలు

టీడీపీ 6.05 గంటలు

సీపీఎం 1.42 గంటలు

మొత్తంగా శాసనసభ సమావేశాలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

15 అంశాలపై స్వల్ప కాలిక చర్చ

1. రైతులకు రుణమాఫీ

2. మిషన్‌ భగీరథ

3. మిషన్‌ కాకతీయ

4. భారీ ప్రాజెక్టులు

5. విద్యుత్‌

6. దళితులకు భూపంపిణీ

7. షాదీముభారక్‌, కళ్యాణలక్ష్మీ

8. హరితహారం

9. శాంతిభద్రతలు

9. కేజీ టూ పీజీ ఉచిత విద్య

10. బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం

11. ఎస్టీ సంక్షేమం

12. మైనారిటీ సంక్షేమం

13. వైద్య విధానం

14. విద్యార్థులకు ఫీజుల బకాయల చెల్లింపు

15. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

Other Updates