kcrఆచార్య జయశంకర్‌ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత, సామాజిక రాజకీయ విశ్లేషకుడు వి. ప్రకాష్‌ రచించిన ”తెలంగాణ ఉద్యమాల చరిత్ర – రాష్ట్ర ఆవిర్భావం” పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు జనవరి 18న మధ్యాహ్నం అధికార నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహదారు డా. కె.వి.రమణాచారి, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రకాష్‌ సతీమణి స్వరూపరాణి, ఇతర కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

ఈ గ్రంథ రచన ఒక గొప్ప ప్రయత్నమని, ఇంత సమగ్రంగా తెలంగాణ చరిత్రను ఇంత వరకు ఎవరూ కూడా గ్రంథస్థం చేయలేదని, ఉద్యమ కాలంలో జరిగిన అనేక సంఘటనలను రచయిత ప్రకాష్‌ ప్రత్యక్షంగా చూశారని, అధ్యయనం చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకాష్‌ను అభినందించారు. వర్తమాన, భవిష్యత్‌ తరాల వారికి ఈ పుస్తకం చదివితే తెలంగాణ చరిత్ర పరిపూర్ణంగా అవగాహనకు వస్తుందని, ఇది తప్పక చదువవలసిన పుస్తకమని ముఖ్యమంత్రి అన్నారు.

భవిష్యత్‌లో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించబోయే అనేక పోటీ పరీక్షలకు రిఫరెన్స్‌ మెటీరియల్‌గా ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలోని పబ్లిక్‌ ల్కెబ్రరీలతో పాటు కళాశాలలు, ఉన్నత పాఠశాలల గ్రంథాలయాల పాఠకులకు కూడా ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచితే మంచిదని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కలం నుంచి ఇలాంటి మంచి పుస్తకాలు మరెన్నో వెలువడాలని సిఎం ఆకాంక్ష వ్యక్తపరిచారు.

పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రకాష్‌ దంపతులను శాలువా కప్పి జ్ఞాపికను అందించి ముఖ్యమంత్రి దంపతులు ఘనంగా సన్మానించారు. రచయిత ప్రకాష్‌ ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులకు అంకితం ఇచ్చి వారిద్దరిని సన్మానించారు. రచయిత ప్రకాష్‌ చేసిన ప్రయత్నాన్ని కార్యక్రమానికి హాజరయిన పలువురు అభినందించారు.

Other Updates