villenamతెలంగాణ ప్రజా సమితికి కొత్త కార్యవర్గాన్ని, ఉపసంఘాలను 1970 జనవరి 17న డా|| చెన్నారెడ్డి ప్రకటించారు. ప్రజా సమితి ఉపాధ్యక్షులుగా శాసనసభ్యులు కె. అచ్యుతరెడ్డి, ఎస్‌.బి.గిరి, ఎ. మదన్‌మోహన్‌, శాసనసభ్యులు టి. అంజయ్య, ఎం.పి. బాకర్‌ అలీఖాన్‌లు, ప్రధాన కార్యదర్శులుగా టి. హయగ్రీవాచారి, ఎమ్మెల్యేలు పోల్సాని నరసింగారావు, జి. రాజారాం, ఎస్‌. వెంకారెడ్డి (ఎమ్మెల్సీ), బి. సత్యనారాయణరెడ్డి, కోశాధికారిగా రాంకిషన్‌ ధూత్‌లను డా|| చెన్నారెడ్డి నియమించారు.

పత్రికలు, ప్రచారసంఘ అధ్యక్షులుగా నూకల నరోత్తమరెడ్డిని, కన్వీనర్‌గా సంతపురి రఘువీర్‌రావును, న్యాయసలహాసంఘాధ్యక్షులుగా ఎల్‌.హెచ్‌.గుప్తా, తెలంగాణవారి ఇబ్బందుల పరిశీలన సంఘానికి కన్వీనర్‌గా డా|| బి.కె. నాయక్‌ను, ఆర్థికసంఘ కన్వీనర్‌గా రాంకిషన్‌ధూత్‌లను నియమించారు. ప్రజాసమితి జిల్లాల అధ్యక్షులు, పార్లమెంట్‌ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ప్రత్యేకాహ్వానితులుగా వస్తారని డా|| చెన్నారెడ్డి ప్రకటించారు.

ప్రధానికి కొండా లక్ష్మణ్‌ హెచ్చరిక:

ఫిబ్రవరి 5లోగా తెలంగాణ సమస్యను తేల్చకపోతే ప్రధానికి మద్దతును ఉపసంహరించుకుంటామని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సంఘం అధ్యక్షులు కొండా లక్ష్మణ్‌ హెచ్చరించారు. పోటీ పీసీసీ సర్వసభ్య సమావేశాన్ని ఫిబ్రవరి 5న గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన కార్య దర్శులు కె. రామచంద్రారెడ్డి, జి. రాజారాం ప్రకటించారు. ‘తెలంగాణ కాంగ్రె స్‌ సంఘం’పేరుతో ఒక స్వతంత్ర రాజకీయ పార్టీని పెట్టుకోవాలన్న భావం తెలంగాణ కాంగ్రెస్‌ వాదులలో బలంగా ఉన్నదని వారు తెలిపారు. తమ సంస్థను గుర్తించవలసిందిగా జూన్‌ ఒకటిన తెలంగాణ పీసీసీ ఏర్పడిన నాటినుండి జాతీయ కాంగ్రెస్‌ను కోరుతూనే ఉన్నామని, పాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప దీనికి అంగీకరించినా, కొత్త కాంగ్రెస్‌ తమ సంస్థను గుర్తించడంలేదన్నారు. ఉభయ కాంగ్రెస్‌ పక్షాలపట్ల తమ వైఖరిని సర్వసభ్య సమావేశం నిర్ణయించి కాంగ్రెస్‌ వాదుల కొత్తపార్టీ ఏర్పాటును పరిశీలింవచవలసి ఉందని వారన్నారు.

రిపబ్లిక్‌డే అధికారిక ఉత్సవాల బహిష్కరణకై ప్రజాసమితి పిలుపు

ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష అయిన తెలంగాణ సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని రిపబ్లిక్‌ డే ఉత్సవాలను ప్రజలు బహిష్కరించాలని, ప్రజాసమితి ఏర్పాటు చేసే సభల్లో జాతీయ పతాకంతోబాటు తెలంగాణ పతాకాన్ని ఎగురవేయాలని డా||చెన్నారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జనవరి 26న ప్రజా సమితి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో డా||చెన్నారెడ్డి ప్రసంగిస్తూ ‘లక్ష్యాన్ని సాధించే వరకు ప్రజలు నిర్విరామంగా పోరాడాల’న్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పనిచేస్తున్న వారి మధ్య సమైక్యత అవసరం. ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభ మయ్యే ఉద్యమంలో ఒక లక్షమంది సత్యాగ్రహులు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సభలో విద్యార్థి నాయకుడు మల్లికార్జున్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్న శాసనసభ్యులపైన ప్రజలు ఒత్తిడి తేవాలన్నారు. ఈసారి ప్రారంభమయ్యే ఉద్యమం శాంతియుతమైన మార్గంలో సాగుతుందన్నారు.

తెలంగాణ విద్యార్థులకు మళ్లీ ముల్కీ సర్టిఫికెట్లు

1969 మార్చి 28న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లవని తీర్పునివ్వడంతో ప్రభుత్వం ముల్కీ సర్టిఫికెట్ల జారీని నిలిపివేసింది. యూనివర్సిటీ అధికారులు కోరడం, విద్యార్థులు ఆందోళన చేయడంతో మళ్లీ ముల్కీ సర్టి ఫికెట్లను తెలంగాణ విద్యార్థులకు జారీ చేయాలని జనవరి చివరివారంలో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

ఫిబ్రవరి 7న ‘చలో అసెంబ్లీ’కి పోటీ ప్రజాసమితి పిలుపు

శ్రీమతి సదాలక్ష్మి ఆధ్వర్యంలోని ‘తెలంగాణ ప్రజాసమితి’ తెలంగాణ సాధనోద్యమంలో భాగంగా ఫిబ్రవరి 7న ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చింది. సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో ఫిబ్రవరి ఒకటిన బహిరంగసభ ఏర్పాటైంది. దీనికి ముఖ్య అతిథిగా డా|| చెన్నారెడ్డితో విభేదించిన ప్రముఖనేత కొండా లక్ష్మణ్‌ హాజరై ‘ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు శాసనసభ సిఫార్సు చేయాల’ని శాసనసభ్యులను కోరినారు. ఈ సభలో సదాలక్ష్మి, జి.ఎం. అంజయ్య, ఉపాధ్యక్షులు ప్రతాప్‌కిశోర్‌ తదితరులు ప్రసంగించారు.

స్మారక చిహ్నాల ఏర్పాటు అడ్డుకున్న ప్రభుత్వం

తెలంగాణ ఉద్యమంలో 1969 జనవరి 24నుండి మరణించిన మూడువందలకుపైగా మృతవీరులను స్మరించుకోవడానికి హైదరాబాద్‌లో శాసనసభ ముందున్న గన్‌పార్క్‌లో ఒకటి, సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ పార్క్‌లో మరొకటి స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలని మునిసిపల్‌కార్పొరేషన్‌ జనవరి 16న తీర్మానించింది. దీనిపై బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ ‘ఈ తీర్మాణం అమలును ఎందుకు నిలిపివేయరాదో సంజాయిషీ ఇవ్వాల’ని నగర కార్పొరేషన్‌కు ఫిబ్రవరి 4న నోటీసు జారీ చేసింది. 30 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని గడువు పెట్టింది. కార్పొరేషన్‌ నిర్ణయం దానికి ఉన్న అధికారాలకు లోబడిలేదని ప్రభుత్వం నోటీసులో పేర్కొన్నది. కార్పొరేషన్‌ స్థాపించబోతున్న స్మారకచిహ్నాలు జాతీయ నాయకుల సంస్మరణార్థం స్థాపిస్తున్నవి కాకపోవడమేగాక, వాటి స్థాపన వల్ల శాంతికి భంగం వాటిల్లవచ్చునని ప్రభుత్వం వెల్లడించింది. పైగా వాటి స్థాపనకు ఎంపిక చేసిన స్థలాలు కార్పొరేషన్‌కు చెందినవి కావని కూడా తెలిపింది.

పాత, కొత్త కాంగ్రెస్‌లతో తెగతెంపులు-తెలంగాణ పీసీసీ నిర్ణయం

ఫిబ్రవరి 5న గాంధీభవన్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ అధ్యక్షతన సమావేశ మైన తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రెండు తీర్మాణాలను ఆమోదించింది. ఒకటి: తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ వాదులందరూ ఈ పార్టీలో చేరాలి. రెండు: తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఆయా ప్రభుత్వాలకు మద్దతును ఉపసంహరించి ప్రతిపక్షంలో కూర్చోవాలి. కాంగ్రెస్‌ పార్టీలో చీలికవచ్చిన తర్వాత ఏర్పడిన రెండు కాంగ్రెస్‌ పార్టీలలో ఏదీ కూడా తెలంగాణ కోరికపట్ల సానుభూతి చూపడంలేదు గనుక తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆ రెండింటితో దేనితోనూ సంబంధాలు పెట్టుకోక స్వతంత్రంగా వ్యవహరించాలని, మున్ముందు పరిస్థితిలో ఏవైనా మార్పులు వస్తే అప్పుడు ఈ నిర్ణయాన్ని పున: పరిశీలించుకోవచ్చు నని మొదటి తీర్మాణం పేర్కొన్నది.

మొదట రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే మద్దతును ఉపసంహరించాలని తీర్మాణంలో ఉన్నది. కానీ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి (ఎమ్మెల్యే) పార్లమెంట్‌సభ్యులు కూడా ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రతిపాదించిన సవరణను సమావేశం ఆమోదించింది.

ప్రత్యేక తెలంగాణను లేదా జనవాక్య సేకరణ ప్రతిపాదనను బలపరుస్తున్న కాంగ్రెస్‌ శాసనసభ్యులు 28మంది ఉన్నారని, మరో 14మంది ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా వారితో ఉన్నారని టీపీసీసీ ప్రతినిధి పేర్కొన్నారు.

తెలంగాణపై ప్రధానితో చొక్కారావు చర్చలు

ఫిబ్రవరి 4,5 తేదీల్లో ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణ సమస్యపై చొక్కారావుతో చర్చలు జరిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఫిబ్రవరి 5లోగా తెలంగాణ సమస్యను తేల్చాలని అల్టిమేటం ఇవ్వడం, జాతీయపార్టీతో తెగతెంపులు చేసుకోవాలని ప్రయత్నిస్తుండడం, ఫిబ్రవరి 7న ‘చలో అసెంబ్లీ’ పిలుపు, మరోప్రక్క డా|| చెన్నారెడ్డి, మల్లికార్జున్‌తో తెలంగాణ ఉద్యమ పునర్నిర్మాణానికై సన్నాహాలు చేయడంవంటివి ప్రధానిని కలవరపెట్టినవి.

తెలంగాణ నాయకులలో చొక్కారావునే ఎక్కువగా ప్రధాని నమ్మడానికి కారణం ఆయన తెలంగాణ రీజినల్‌ కమిటీ ఛైర్మన్‌గా వుంటూ పాత, కొత్త కాంగ్రెస్‌లు, జన సంఘం, పీఎస్పీ, ఎస్‌ఎస్‌పీ, కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్ట్‌ పార్టీ, మజ్లిస్‌ సభ్యులతో కూడుకున్న ప్రాంతీయ సంఘంచేత అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా ఆమోదింప చేయడమే. ఇతర తెలంగాణ నాయకుల వలె కాకుండా తెలంగాణపై తటస్థంగా ఉంటూ ఇందిరాగాంధీ ఆదేశాల ప్రకారం చొక్కారావు వ్యవహరించడం మరో కారణం.

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడి జాతీయపార్టీనుండి చీలిపోకుండా చూడాలని ప్రధాని చొక్కారావును కోరినారు. చొక్కారావు ఢిల్లీనుండి హైదరాబాద్‌ రాకముందే హైదరాబాద్‌లో టీపీసీసీ జాతీయ కాంగ్రెస్‌నుండి వైదొలిగింది.

శాసనసభలో ప్రతిపక్షంగా తెలంగాణ ఐక్య సంఘటన

(వచ్చే సంచికలో..)

Other Updates