ts30

తెలంగాణ ఉద్యమం స్తబ్దతకు గురైందనుకున్న ప్రధాని ఇందిరను హైదరాబాద్‌ గన్‌పార్క్‌, క్లాక్‌టవర్‌ల వద్ద అమరుల స్థూపాల శంకుస్థాపన సందర్భంగా జరిగిన సంఘటనలు ఆందోళనకు గురిచేశాయి. ఢిల్లీలో అందుబాటులోవున్న తెలంగాణ పార్లమెంట్‌ సభ్యులు జి. వెంకటస్వామి, జి.ఎస్‌. మేల్కొటే, జేబీ ముత్యాలరావు, సీతా యధులీర్‌ తదితరులను పిలిపించుకొని హైదరాబాద్‌లో, తెలంగాణలో నెలకొన్న పరిస్థితిపై ఆమె చర్చించారు. ఈసందర్భంగా ”ప్రత్యేక రాష్ట్రం తెలంగాణకు అవసరం” అని ఈ ఎంపీలందరూ ప్రధాని ఇందిరతో అన్నారు.

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ తెలంగాణా విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలను ఎంపీలు ప్రధానికి గుర్తు చేశారు. ”ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కలిసి ఉండడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ప్రాంతీయ సంఘానికి విస్తృతాధికారాలను కల్పించి, ఎక్కువ నిధులు కేటాయించినప్పటికీ ప్రయోజనంలేద”ని తెలంగాణ ఎంపీలు ప్రధానికి స్పష్టం చేశారు.

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే అఖిలభారత స్థాయిలో చిక్కులు రాగలవని శ్రీమతి గాంధీ స్పష్టం చేసినట్లు పత్రికలు కథనాలను ప్రచురించాయి. ”వీలైనంత త్వరగా తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనాల”ని ఎంపీలు శ్రీమతి గాంధీని కోరినారు.

తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలపై…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులకు సర్వీసు నిబంధనల అమల్లో తీవ్రమైన అన్యాయాలు జరిగినవనే తెలంగాణ రీజినల్‌ కమిటీ తీర్మాణాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం అలహాబాద్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ నసీరుల్లా బేగ్‌తో ఉన్నతాధికార సంఘాన్ని నియమించింది. శాసనసభలో 1970 ఫిబ్రవరి 27న ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు జిన్న మల్లారెడ్డి, బి. నిరంజనరావు, ఆర్‌. మహానంద, ప్రతిపక్షనేత నూకల రామచంద్రారెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి సమాధానాలిచ్చారు. వాటి సారాంశం ఇది.

”తెలంగాణ ఉద్యోగుల సాధకబాధకాల గురించి దర్యాప్తుకు నియమించబడిన ఉన్నతాధికార సంఘం సిఫార్సులను శీఘ్రంగా అమలు జరుపుతాము.తెలంగాణ ఉద్యోగుల సర్వీసు విషయాలకు సంబంధించిన హైకోర్టు తీర్పులన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేస్తాము.

ఉన్నతాధికార సంఘానికి తెలంగాణా ఉద్యోగుల సహకారం లభిస్తున్నది. ఈ సంఘానికి ఇంతవరకు (27 ఫిబ్రవరి 1970) 2100 దరఖాస్తులు అందినవి.

ఈ సంఘం తన సిఫార్సులను నివేదించడానికి కాలపరిమితి నిర్దేశించినదా? అనే సభ్యుని (జిన్న మల్లారెడ్డి) ప్రశ్నకు సమాధానమిస్తూ… ముఖ్యమంత్రి:- ‘ఆ సంఘంతో సహకరించమని అన్ని శాఖలకు ఆదేశాలు పంపినాము. సాధ్యమైనంత త్వరగా పూర్తి వివరాలు ఆ సంఘానికి అందజేయబడగలవ”ని అన్నారు.

”ఈ సంఘం తెలంగాణ ఉద్యోగుల సర్వీసు నిబంధనల రక్షణకై, ఉద్యోగుల పంపిణీ, నియామకం, ప్రమోషన్ల విషయంలో భారత ప్రభుత్వ ఆదేశాలను అమలు జరుపకపోవడానికి సంబంధించిన వాటిని విచారించాల”ని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రభుత్వం ఈ సంఘం సిఫార్సులకు తగు గౌరవం ఇవ్వగలదు. ఈ సంఘానికి దరఖాస్తులు అందవలసిన గడువు తేదీని ఫిబ్రవరి 25నుంచి మార్చి 5 వరకు పొడిగించడం జరిగింది. ఆ తర్వాత ఈ దరఖాస్తులను ఉన్నతాధికార సంఘం పరిశీలనకు నివేదిస్తాం.ts29

ఆర్‌. మహానంద అనుబంధ ప్రశ్నకు జవాబిస్తూ ముఖ్యమంత్రి ”ఈ ఉన్నతాధికారసంఘం నియామకంవల్ల ఆంధ్ర ఉద్యోగుల శ్రేయస్సుకు భంగం కలుగరాదన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఈ సందర్భంగా ఆంధ్ర ఉద్యోగులు కూడా ఈ సంఘానికి తమ ఇబ్బందులను నివేదించకొనవచ్చున”ని తెలిపారు.ప్రతిపక్ష నాయకులు నూకల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ”సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లడానికి తగిన వ్యవధికోసం ప్రభుత్వం హైకోర్టు తీర్పుల అమలు విషయంలో జాప్యం చేస్తూ ఎత్తులు వేస్తున్నదని, ఇది న్యాయస్థాన ధిక్కారం క్రిందికి రాగలదని హెచ్చరించారు.

తెలంగాణాకోసం సత్యాగ్రహాలు

తెలంగాణ మృతవీరుల సంస్మరణార్థం 1970 ఫిబ్రవరి 23న మేయర్‌ ఎన్‌. లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ చేతులమీదుగా నెలకొల్పబడిన స్మారక ఫలకాన్ని పోలీసులు తొలగించినందుకు, మేయర్‌ను మరికొందరు ప్రజాసమితి నాయకులను అరెస్టు చేసినందుకు నిరసనగా ఫిబ్రవరి 24నుంచి తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, తెలంగాణావాదులు నిరసన తెలుపుతూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగా ఫిబ్రవరి 27నుంచి సత్యాగ్రహాలు ప్రారంభమైనవి. పోలీసులు ఈ సత్యాగ్రహాలకు అనుమతి నిరాకరించి ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. వరంగల్‌లో విద్యార్థి నాయకులు దుర్గాదాస్‌, చిత్తరంజన్‌లతో సహా ఇతర విద్యార్థులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో కూడా విద్యార్థులను, ఇతర నేతలను అరెస్టు చేశారు. శాసనసభ సమీపంలోని గన్‌పార్క్‌వద్ద 11మంది నాయకులను అరెస్టు చేశారు. వీరిలో కార్పొరేటర్లు స్వామి, అనంతరామిరెడ్డి, ఇతర నేతలు కె. సత్తయ్య, ఏ లక్ష్మయ్య, ఎం.ఆర్‌. వెంకటస్వామి, కృపారావు, బి. కృష్ణారెడ్డి, ఎం. వెంకటనారాయణ, ఆర్‌. నారాయణరెడ్డి, కె. నారాయణన్‌ తదితరులున్నారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌లో తెలంగాణ ఉద్యమకారులకు నాయకత్వం వహిస్తున్న టి. గోవింద్‌సింగ్‌ను ముందస్తు అరెస్టు చేశారు.

ఫిబ్రవరి 28న కూడా రెండోరోజు సత్యాగ్రహాలు చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ నగర కార్పొరేటర్లు బాలయ్య, రంగయ్యలతోబాటు మరో 13మందిని గన్‌పార్క్‌వద్ద అరెస్టు చేశారు. వీరంతా నుదుట కుంకుమతో, పుష్పమాలాంకృతులై రెండు కార్లలో గన్‌పార్క్‌కు రాగా నిషేధాజ్ఞలను ధిక్కరించారనే ఆరోపణతో వీరిని నిర్భంధంలోకి తీసుకున్నారు పోలీసులు. వీరిని జీబుల్లోకి ఎక్కిస్తుండగా ‘జై తెలంగాణా’ నినాదాలు చేశారు.

పోలీసులపై శాసనసభ్యుని ఆరోపణ

సత్యాగ్రహం తొలిరోజైన 27వ తేదీన అరెస్టు కాబడిన నగర పాలక సంఘ సభ్యులను నిబంధనల ప్రకారం 24 గంటలలోపు కోర్టులో హాజరు పరుచవలసి వుండగా వారిని పోలీసులు హాజరు పర్చలేదని, కనీసం భోజన ఏర్పాట్లు కూడా చేయలేదని, ఆకలితోవున్నవారు తమ ఖర్చుతో బయటినుండి భోజనం తెప్పించుకుంటామని అడిగినా అనుమతించలేదని ఫిబ్రవరి 28న శాసనసభ్యుడు పి. నరసింగారావు సభ దృష్టికి తెచ్చారు. శాసనసభలో రక్తపు మరకలతో వున్న అంగీని (షర్ట్‌) సభాపతి బి.వి. సుబ్బారెడ్డికి అందజేశారు. ‘ఇది చాలా దురదృష్టకరమ’ని స్పీకర్‌ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రతిపక్ష నాయకులు నూకల రామచంద్రారెడ్డి సభాపతిని కోరినారు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని సభాపతి బదులిచ్చారు.

Other Updates