”తెలంగాణ ఉద్యమాన్ని త్వరలో తమ సంస్థ తిరిగి ప్రారంభించగలద”ని పోటీ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 1970 నవంబర్‌ 15న హైదరాబాద్‌లో పత్రికా గోష్ఠిలో వివరించారు.

తాజా పరిణామాలను గురించి సమీక్షించి సభ్యులను చేర్చుకొనడం ప్రారంభించడం, సంస్థ నియమావళిలో అవసరమైన మార్పులను చేయడం మున్నగు విషయాల గురించి పరిశీలించే నిమిత్తం నవంబర్‌ 19 (1970)వ తేదీన తెలంగాణ పిసిసి కార్యవర్గ సమావేశం జరగగలదని బాపూజీ తెలిపారు.

ఉభయ కాంగ్రెస్‌లలో దేనితో నిమిత్తం లేకుండా స్వతంత్ర తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీగా సంస్థ పేరును మార్పు చేసే విషయాన్ని కూడా కార్యవర్గం పరిశీలించగలదని బాపూజీ అన్నారు. షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, ఇతర బలహీన వర్గాల వారికి పార్టీలో సభ్యత్వం విషయంలో కొన్ని సౌకర్యాలను తమ పార్టీ కల్పించగలదనీ, తమ పార్టీ త్వరలోనే ప్రజా బాహుళ్య సంస్థగా అభివృద్ధి చెందగలదని కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలిపారు.

పార్టీలో కార్యవర్గ పదవులలోను, ఇతర పదవులలోను ఎస్‌.సి. ఎస్‌.టి., బిసిల వారికి కొన్నింటిని ప్రత్యేకించడం జరగగలదని, 1972 ఎన్నికలకు అసెంబ్లీకి, పార్లమెంటుకు అభ్యర్థుల ఎన్నిక విషయంలో కూడా పై తరగతుల వారికి ప్రాధాన్యత వుండగలదని బాపూజీ ప్రకటించారు.

1972 సాధారణ ఎన్నికలలో పోటీ చేయడానికి తమ పార్టీ సమాయత్తం కావడం ప్రారంభించిందని ఆయన తెలిపారు. తెలంగాణలో అన్ని సీట్లకు తమ పార్టీ పోటీ చేయడం సాధ్యపడగలదన్న ఆశాభావాన్ని బాపూజీ వ్యక్తం చేశారు.

పార్టీలో సభ్యులను చేర్చే కార్యక్రమం 1970 డిసెంబర్‌ నుంచి ప్రారంభమై, పార్టీ ఎన్నికలకు పూర్వమే 1971 ఫిబ్రవరి నెలాఖరుకల్లా పరిసమాప్తం కాగలదని ఆయన చెప్పారు. తెలంగాణ పిసిసి కార్యవర్గం గైకొన్న నిర్ణయాలను ముసాయిదాల రూపంలో నవంబర్‌ 28, 29 తేదీల్లో జరుగనున్న ప్రత్యేక రాష్ట్ర వాదుల సదస్సులో పంపిణీ చేస్తామని బాపూజీ తెలిపారు.

సిద్ధిపేట ఫలితంపై నేతల స్పందన: ఫలితం విస్మయం కల్గించలేదు – సిఎం

సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ప్రజాసమితి విజయం పై ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి వ్యాఖ్యానిస్తూ ”ఎన్నిక ఫలితం నాకేమాత్రం ఆశ్చర్యం కల్గించలేదు. మితవాద కమ్యూనిస్టు పార్టీ మూడవ అభ్యర్థిని నిలబెట్టడంతో సమైక్యతా వాదుల వోట్లలో చీలిక సంభవించింది” అని అన్నారు.”ప్రజా సమితి సాగించిన నిందా పూరితమైన ప్రచారం, తూలనాడుతూ చేసిన ప్రసంగాలు ఓటర్లను భయపెట్టడం, దొంగ ఓట్లు వేయించడం, చట్ట వ్యతిరేకమైన పనులను ఎన్నికలలో చేయడం సరైన పద్ధతి కాదని’ ముఖ్యమంత్రి అన్నారు.

చొక్కారావు వ్యాఖ్య: సిద్ధిపేట శాసన సభ

ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పి.వి. రాజేశ్వర రావు (నరసింహా రావు కుమారుడు కాదు) ఓటమికి పార్టీలోని ముఠా తగాదాలే కారణమని తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు చొక్కారావు వ్యాఖ్యానించారు. ”తెలంగాణా సమస్యను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కారం చేస్తుందన్న విశ్వాసం ప్రజలకు కలుగకపోవడం కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమికి దారితీసింద”ని ఆయన అన్నారు.

అధికార శక్తులపై ప్రజా విజయం – వి.బి. రాజు

అధికార ముఠా అన్నిరకాల కుయుక్తులను ప్రయోగించి అన్ని మార్గాలను అనుసరించిందని, గ్రామ పెద్దలూ, స్వార్ధ శక్తులూ అధికార పక్షానికి అండగా నిలవగా, సామాన్య ప్రజలు ముఖ్యంగా యువజనులు ప్రజా సమితి అభ్యర్థిని బలపర్చారని, కొత్తగా ప్రారంభమైన ఈ పద్ధతి భవిష్యత్తులో కూడా కొనసాగ గలదని వి.బి.రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈశ్వరీభాయి వ్యాఖ్య : ”తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారని సమైక్యతా వాదులు, కేంద్రం ఇప్పటికైనా గుర్తించాల”ని రిపబ్లికన్‌ పార్టీ కార్యదర్శి ఈశ్వరీభాయి అన్నారు.

తెలంగాణ అనివార్యం – చెన్నారెడ్డి

”సిద్ధిపేటలో ప్రజా సమితికి ఘన విజయం లభించడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అనివార్యం అయినద”ని డా|| చెన్నారెడ్డి అన్నారు.

”తెలంగాణలోని ప్రజా బాహుళ్యం ప్రత్యేక తెలంగాణ కొరకే అభ్యర్థిస్తున్నట్లు అయిదు నెలల క్రితం ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో కూడా సమితి గెలుపు నిరూపించింది. ఇప్పుడు సిద్ధిపేటలో కూడా మరోసారి ప్రజాభిప్రాయం వెల్లడైంది. ఇటు పట్టణవాసులు అటు గ్రామీణులు కూడా తెలంగాణ రాష్ట్రం కోరుతున్నారు” అని డా|| చెన్నారెడ్డి అన్నారు. ”తెలంగాణలో భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నిక ఫలితాలు ఇలానే ఉంటాయి. 1972 జనరల్‌ ఎన్నికలలో ప్రజా సమితికి నూటికి నూరు శాతం లేదా కొంచెం తక్కువ శాతం విజయం లభిస్తుంది” అని డా|| రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

1972 ఎన్నికల తర్వాత ఏర్పడే తెలంగాణ ప్రాంతీయ కమిటీలో మెజారిటీతో సమితి ఎం.ఎల్‌.ఏలు తమ స్వంత ఛైర్మన్‌ను ఎన్నుకోగలరని, వారు తమ కమిటీకి వచ్చే ప్రతి బిల్లును ప్రతిఘటిస్తారని ఆయన అన్నారు.

ప్రాంతీయ సంఘం బిల్లును వ్యతిరేకిస్తే అసెంబ్లీ ఆ బిల్లును పరిశీలించడం అసాధ్యం అవుతుందని డాక్టర్‌ చెన్నారెడ్డి అన్నారు. ఇలాంటి ప్రతిష్టంభన నుండి బయటపడేందుకు మార్గం ప్రత్యేక రాష్ట్రం అవతరణేనని ఆయన అన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ వ్యాఖ్య :

సిద్ధిపేట ఉప ఎన్నిక విజయానికి అర్థం తెలంగాణా ప్రజలు ప్రజా సమితిని, దాని చెడ్డ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని కాదని, ప్రత్యేక రాష్ట్ర వాంఛ పట్ల వున్న ప్రగాఢ అభిప్రాయాలను వారు అలా వ్యక్తం చేశారని కొండా లక్ష్మణ్‌ బాపూజీ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో ప్రజా సమితి విజయోత్సవం :

సిద్ధిపేట ఉప ఎన్నికలో ప్రజా సమితి భారీ విజయాన్ని సాధించడంతో సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ వద్ద గల మృతవీరుల స్మారక చిహ్నం నుండి హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌ వరకు మూడు గంటలకు పైగా భారీ ఊరేగింపు నిర్వహించారు. మృతవీరుల స్మారక చిహ్నానికి డా|| చెన్నారెడ్డి, మదన్‌మోహన్‌, జి. వెంకటస్వామి, జి. రాజారామ్‌ తదితరులు నివాళులర్పించిన తర్వాత ఊరేగింపు మొదలైంది.

ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ప్రజా సమితి గెలుపు

1969 జనవరిలో విద్యార్థులచే ప్రారంభమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రధాని నిర్లక్ష్యం వలన హింసాయుతంగా మారి మే 22న డా|| చెన్నారెడ్డి సారధ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థిరమైన పునాదులపై ముందుకు సాగింది. 1969 జూలై చివరి మాసంలో ప్రభుత్వం డా|| చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీతో సహా ఉద్యమ నేతల్లో 90 శాతం నాయకులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపడం, ఏడు నెలల ఉద్యమంలో మూడు వందలకు పైగా విద్యార్థులు, యువకులు పోలీసు కాల్పుల్లో మరణించడం, విద్యార్థులు పరీక్షలు రాయక ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోవడం, ఉద్యమ నాయకుల మధ్య మనస్పర్ధలు, విభేదాలు, ప్రధాని, కేంద్ర నాయకుల మొండి వైఖరి తదిత కారణాల వలన క్రమ క్రమంగా ఉద్యమం తగ్గుముఖం పట్టింది.

జైలు నుంచి ఆగస్టు చివరి వారంలో నాయకులు విడుదలైన తర్వాత తిరిగి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి డా|| చెన్నారెడ్డి, ప్రజా సమితి నాయకత్వం ఎంత ప్రయత్నించినా, సదాలక్ష్మి విద్యార్థులను నిరోధించడానికి నాటు బాంబులు వేయించినా (ఆమె స్టేట్‌మెంట్‌లో నుంచి) విద్యార్థులు ఉద్యమ బాట పట్టలేదు. తల్లిదండ్రుల ఒత్తిడికిలోనై విద్యా సంస్థలకు హాజరవుతూ వచ్చారు. అదే సమయంలో డా|| చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీని ప్రధాని పిలిచి తానెదుర్కొంటున్న పార్టీ సంక్షోభం, బంగ్లాదేశ్‌ యుద్ధం తదితర సాకులను ముందుపెట్టి ‘తెలంగాణ సమస్యను తాను పరిష్కరిస్తాన’ని కొంతకాలంపాటు ఉద్యమాన్ని వాయిదా వేయాలని కోరడంతో సెప్టెంబర్‌ – డిసెంబర్‌ మధ్య కాలంలో పూర్తిగా స్తబ్ధత నెలకొన్నది. ఇదే సమయంలో ప్రజా సమితి నుండి కొండా లక్ష్మణ్‌ బాపూజీ, టి. సదాలక్ష్మీ, ప్రముఖ జర్నలిస్టులైన సంతపుద్ది రఘువీర్‌రావు, ప్రతాప్‌ కిశోర్‌ తదితరులు వేరుపడి తమ స్వంత కార్యాచరణను చేపట్టినారు.

1970 ప్రారంభంలో రెండు, మూడు నెలలు డా|| చెన్నారెడ్డి, ప్రజా సమితి నాయకత్వం, విద్యార్థి కార్యాచరణ కమిటీ నేతలైన మల్లికార్జున్‌ తదితర నేతలు ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వందల సంఖ్యలోనే కార్యకర్తలు పాల్గొనడం నిరాశను మిగిల్చింది.

ఈ పరిస్థితిని అధిగమించి తెలంగాణ ఆకాంక్షను పదిలంగా ఉంచడానికి, నినాదాన్ని సజీవంగా ఉంచడానికి డా|| చెన్నారెడ్డికి కలిసి వచ్చిన అవకాశం, బి.వి. గురుమూర్తి మృతి వలన ఉత్పన్నమైన ఖైరతాబాద్‌ శాసనసభ ఉపఎన్నిక. ఈ ఎన్నికల్లో ప్రజా సమితికి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ప్రజా సమితికి ఒక దారి దొరికింది. రాజకీయ పార్టీగా ప్రజా సమితిని మార్చాలనే నిర్ణయం వెలువడింది. సిద్ధిపేట శాసనసభ్యుడు వి.బి. రాజు రాజ్యసభకు ఎన్నిక కావడంతో అనివార్యమైన సిద్ధిపేట ఉప ఎన్నిక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆకాంక్షలను పరీక్షించడానికి ప్రజా సమితికి కలిసి వచ్చిన మరో అవకాశం. ”గెలవకపోతే ప్రజా సమితి దుకాణాన్ని మూసివేస్తాన”ని డా|| చెన్నారెడ్డి ప్రజలకు అల్టిమేటం ఇచ్చారు. సిద్ధిపేట ప్రజలు ప్రజా సమితికి బ్రహ్మరథం పట్టారు.

అటు పట్టణ ప్రాంతం, ఇటు గ్రామీణ ప్రాంతం ఈ రెండింటిలోనూ తెలంగాణ సాధన పట్ల ప్రజాభిప్రాయం ప్రస్ఫుటంగా వెల్లడైంది. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 57 శాతం ప్రజా సమితికి రాగా, సిద్ధిపేటలో 71 శాతం వచ్చాయి. ఇంత భారీ స్థాయిలో ఓట్లు లభించడం ప్రజల్లో తిరిగి తెలంగాణ పట్ల ఆశలను చిగురింప చేశాయి. ప్రజా సమితి పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఏర్పడక ముందే ఇంత అనూహ్య స్పందన రావడంతో డా|| చెన్నారెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ”1972లో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని 90 శాతం సీట్లు ప్రజా సమితికి లభిస్తాయన”ని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఒక క్రొత్త అధ్యాయానికి సిద్ధిపేట ఉప ఎన్నిక తెరతీసింది.

(ప్రధానికి ఏడుగురు ఎం.పి.ల లేఖ.. వచ్చేసంచికలో)

వి.ప్రకాశ్‌

Other Updates